యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!

(ఎక్కడ స్త్రీలు పూజింప బడతరో,అక్కడ దేవతలు నివసిస్తారు. )

-

స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం.

 ప్రహ్లాదుడు  కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృ భావము జొచ్చి మరలువాడు అని పోతన వివరిస్తాడు.

 సీతని పరాభవించి రావణుడు, ద్రౌపదిని అవమానపరచి  కౌరవులు ఎలా నాశానమయ్యారో మనకి తెలుసు. ఇన్ని తెలిసినా, ప్రగతి పథంలో పయనించే ఈ ఆధునిక యుగంలో నవ నాగరిక సమాజంలో  కార్యాలయాల్లో,కళాశాలల్లో, అన్నిచోట్లా స్త్రీలు వేదింపబడటం శోచనీయం. 


చాటింగులు, డేటింగులతో, సెల్ ఫోను సంభాషణలతో యువత విచ్చలవిడిగా సంచరిస్తూ,లేత వయస్సు లోనే విషయవాంఛలకు లోబడి జీవితాలను నాశనం చేసుకోడం చూస్తూనే ఉన్నాం. స్త్రీలపై యాసిడ్ దాడులు, గొంతులు కోయడాలు, అత్యాచారాలు ఇలా ఎన్నోదురాగాతాలు సమాజంలో జరగడానికి కారణం క్రమశిక్షణా లోపమే. 


  


ఎంత చదువు చదివినా,ఎంత విజ్ఞానం సంపాదించినా, అరణ్యరోదనన్యాయంలా”పనికి రాకుండా పోతోంది. అసమానతలు తొలగి, ఆభిజాత్యాలు మరచి, అందరు సుఖశాంతులతో జీవించాలన్నా,సమతా,మమతా, మానవతలు సమాజంలో వెల్లివిరియాలన్న- ఒక్కటే మార్గం.అది మన సంప్రదాయాలని పాటిస్తూ, పెద్దలుచేప్పిన మార్గంలో పయనించడమే. 


యత్ర నార్యస్తు పూజ్యంతే/ రమంతే తత్ర దేవతాః/


యత్రైతాస్తు నపూజ్యంతే/సర్వాస్తత్రాఫలాక్రియః.


ఎక్కడ స్త్రీలు పూజింప బడతరో,అక్కడ దేవతలు నివసిస్తారని, ఎక్కడ పూజింప బడరో అక్కడ కార్యాలన్నీ నిష్ఫలాలని తెల్పి, స్త్రియః శ్రియశ్చ గేహేషు./ నవిశేషోస్తి కశ్చన. స్త్రీలు గృహంలో గృహలక్ష్ములే,ఇంతకన్నా వేరే విశేషపదం లేదని స్త్రీని కీర్తిస్తాడు. అందుకనే వివాహ సమయంలో కన్యాదాత “లక్ష్మీ నామ్నీం కన్యాం లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ దదాతి. అనిచెప్పి కన్యాదానం చేస్తారు. తమ ఇంటబుట్టిన ఆడపిల్లని తండ్రి,సోదరులు బాగా చూసుకోవాలని,అమ్మాయికి కావలసినవి సమకూర్చాలని మనువు ఎంతో విపులంగా వివరిస్తాడు.


              పితృభి: భ్రాత్రుభిశ్చైతాః పతిభిర్దేవరైస్తథా:/


పూజ్యా భూషయితవ్యాశ్చ/ బహు కళ్యాణమీప్సుభి:  అనగా తండ్రి, భర్త,సోదరులు అందరు స్త్రీలని  గౌరవించాలని, వారుకోరిన భూషణాలు,వస్త్రాలు ఇచ్చి సంతృప్తి పరచాలని చక్కగా వివరిస్తాడు. స్త్రీకి పురుషుడు సదా  అండగా ఉండాలని మనుధర్మ శాస్త్రం బోధిస్తుంది. ఇదే అర్థంలో


పితారక్షతి కౌమారే/ భర్తారక్షతి యౌవ్వనే / రక్షంతి


వార్ధకే పుత్రా: / నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి. చిన్నతనంలో తండ్రి, యౌవ్వనంలో భర్త, వార్ధక్యంలో పిల్లలు రక్షణ కల్పించాలి అని, రక్షణ లేకుండా ఉంచకూడదని మనువు స్త్రీలకి అధిక ప్రాధాన్యతనిస్తే, మనువుని, ప్రాచీన సంప్రదాయాలని ఇష్టపడని ఆధునిక వితండవాదులు కొందరు పైశ్లోకం మొత్తం గ్రహించకుండా చివరి పాదం నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి అన్నది మాత్రం గ్రహించి,  మనువు స్త్రీలకి వ్యతిరేకి, స్త్రీలకి స్వేఛ్చ లేదన్నాడని వాదిస్తారు. అట్టి వారికి ఎంత నచ్చ చెప్పినా మహాబధిర శంఖారావ న్యాయంలా వినరు, తమ ప్రవర్తన మార్చుకోరు. అస్తు. వారిని అలాగే వదిలేద్దాం.


వినేవారికే మనం కొన్ని మంచిమాటలు చెప్దాం. బాల్యంనుండే మంచిఅలవాట్లు, సత్ సంప్రదాయాలు నేర్పిస్తే, భావితరాలైనా బాగుపడతాయి. ( అదే ఈ వ్యాసకర్త కోరిక! మన్నిస్తారుకదూ.) స్త్రీలని గూర్చి మనువు ఇంకా ఇలా చెప్తాడు.


  శోచంతి జామయోయత్ర/ వినశ్వత్యాశు తత్కులం/


    నశోచంతితు యత్రైతా/వర్ధతే తద్ధిసర్వదా అనగా ఆడపడుచులు


ఏయింట సోదరులచే ఆదరించ బడతారో ఆయింట వంశం వర్ధిల్లుతుంది. లేదా నశిస్తుంది.అనితెలిపి,


  తస్మానేతాన్సదా పూజ్యాః/ భూషనాచ్చాదనాశనై


    భూతికామైర్నరైర్నిత్యం/ సత్కారేషూత్సవేషుచ.


తమ ఇంట పండుగలు శుభకార్యాలు జరుపుకోనేటప్పుడు, ఆడపడుచులను పిలచి మంచి భోజనం పెట్టి, వస్త్రాలు, భూషణాదులనిచ్చి సంతృప్తి  పరచాలని చాలా విపులంగా, చక్కగా మనుస్మృతి వివరిస్తుంది. కనుకనే పండగ రోజులలో కూతుళ్ళని, అల్లుళ్ళని పిలచి, ఉన్నంతలో వారికి కట్నకానుకలిచ్చి సంతృప్తి పరచే సంప్రదాయం మనం పాటిస్తున్నాం. ఇలా శృతి,స్మృతి,పురాణాలలో, వేదాలలో, ఉపనిషత్తులలో  స్త్రీకి ఎంతో ఉన్నత స్థానంకల్పించ బడింది. 


ఇక భార్యాభర్తల సంబంధంగూర్చి ఎంతగోప్పగా చెప్పారో చూడండి.—వివాహ సమయంలో సప్తపది అనే తంతులో చదివే మంత్రాలలో ఒకమంత్రం ఇలా తెలపుతుంది.


 సఖా సప్త పదాభవ, సఖావౌ సప్త పదా బభూవః,


  సఖ్యంతే గమేయం, సఖాత్తేమాయోషం,


సఖ్యాన్మేమాయోష్టా: అనగా ఈ ఏడడుగుల బంధంతో భార్య,భర్తలమైన మనం ఇకపై స్నేహితులగా ఉంటూ, పరస్పరం స్నేహ భావాన్ని విడవకుండా పయనిద్దాం. ఎంత ఉదాత్తమైనభావన! ఆపత్సు మిత్రం జానీమః కష్టాలలో ఆదుకొను వాడే మిత్రుడు. అట్టిమిత్రభావంతో భార్యాభర్తలు ఉంటే, వారిమధ్య కలతలు, కార్పణ్యాలు, ఆవేశకావేశాలు, అసమానతలకు తావు లేకుండా నిత్య వసంతంలా వారి జీవితం సాగిపోతుంది.

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.