వివేకచూడామణి (1) .

వివేకచూడామణి (1) .

-

శ్రీ ఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు. 

-

దృశ్యప్రపంచం :

మనకందరకి పుట్టినప్పటినుంచి చనిపోయేవరకు – అన్ని వేళలలో, ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులపై ఒక నిర్దిష్ట జ్ఞానం ఉంటుంది. కనబడే ప్రతి వస్తువునకు ఒక రూపం, ఒక పేరు ఉంటుంది. పేరు తెలిస్తే రూపం ఊహించవచ్చు. రూపం చూసినప్పుడు పేరు జ్ఞాపకం వస్తుంది. ఏ రూపానికైనా పేరు లేకపోతే, ఏదో ఒక పేరు పెట్టి, ఆ పేరుతో దాని గురించి చెప్తాం. ఈ సూత్రం, కనిపించే వస్తువులేకే కాక, వినిపించే శబ్దాలకు, నాలుకకు తెలిసే రుచులకు, ముక్కుకు తెలిసే వాసనలకు, శరీరానికి తగిలే స్పర్శలకు వర్తిస్తుంది. పంచేంద్రియాలకు అనుభవమయ్యే వివిధ గుణాలకు (స్పర్శలకు) ఆ గుణాలు గల వస్తువులకు వేరు వేరు పేర్లు పెట్టి వ్యవహరిస్తుంటాం. ఆ పేరుతో ఆ గుణాలుగల వస్తువును నిర్దేశించగలుగుతాం.

‘కుర్చీ కుడి పక్కన ఉన్న బల్ల మీద ఉన్న ఎర్రని పుస్తకం తీసుకురా’, అని చెప్పినప్పుడు, ఆ గదిలో ఎన్ని వస్తువులు ఉన్నా, ఎంతటి చిన్నపిల్లవాడైనా ఆ పుస్తకాన్ని తెచ్చి ఇవ్వగలుగుతాడు. కుర్చీ వేరు, బల్ల వేరు, కుడి వేరు, ఎడమ వేరు, ఎరుపు వేరు, పుస్తకం వేరు, తేవటం వేరు, ఇవ్వటం వేరు- కాని ఈ పేర్లేవీ వస్తువుల మీద వ్రాసి లేవు. అవి చిన్నప్పటి నుంచి, పెద్దవారి నుంచి వినటంవల్ల, ఆ వస్తువుకు, ఆ పేరుకు ఒక అవినాభావ సంబంధం మన మనసులో ఏర్పడింది.


అందువల్ల ఒకరి మనసులో ఏర్పరచుకున్న రూపాలను నామాలద్వారా వేరొకరికి చెప్పటం జరుగుతున్నది. అప్పుడు ఈ రెండవవాడు, తన మనసులో ఏర్పరచుకున్న రూప, నామ, సమన్వయాన్ని బట్టి ఒక భావం ఏర్పరచుకుంటాడు. ఆ భావానికి అనుగుణంగా తాను ప్రవర్తిస్తాడు.

ఈ వివిధత్వాలన్నింటినీ సమన్వయపరచి, ఒకే వాక్యంలో ఇమిడ్చి, మన మనసులోగల భావాన్ని పరులకు వ్యక్తపరచటానికి ఒక భాషను వాడుతున్నాము, మాటలను వాడుతున్నాం. మాట – వాక్కు అంటే ఏంటి? ఒక శబ్దమో, కొన్ని శబ్దాల కలయికో ఒక మాట అవుతున్నది. ఆ మాటకు ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం వెనక ఒక భావం ఉంటుంది. ఆ భాషకు ఒక ‘లిపి’ ని కూడా జోడిస్తే, ఆ మాటను చూడగలం, వినగలం. ‘పుస్తకం’ అని వ్రాస్తే, దానిని వాచకంగా, ‘పుస్తకం’ అని అంటాం. దాని అర్థం అందరు చదువుకోవటానికి ఉపయోగపడి కాగితాలతో కుట్టి, అచ్చు వేయబడ్డ వస్తువు అని అర్థం చేసుకోగలం. ఆ అర్థం ద్వారా ఎదుటి మనిషి మనసులో ఉన్న ‘పుస్తకం’ అనే భావాన్ని మనసులో ఏర్పరచుకోగలం. ఒక భావాన్ని ఒక మనసు నుంచి మరొకరి మనసులోకి ప్రవేశించేటట్లు చేయటానికి ఈ ప్రక్రియలన్నీ అవసరం. వ్రాయటంలో లోపమున్నా, ఉచ్చరించటంలో లోపమున్నా, వినటంలో లోపమున్నా, అర్థం చేసుకోవటంలో లోపమున్నా, భావ ప్రసారం దెబ్బతింటుంది. ఒకరి మనసులో ఉన్న రూపం ఒకటి, ఇంకొకరు తన మనసులో ఏర్పరచుకున్న చిత్రం వేరొకటి కావచ్చు.

ఇది ఒకరి భావాలను ఇంకొకరు అర్థం చేసుకోవటంలో లోపమే కాక, తనంతట తాను స్వయంగా చూసిన వాటిలో కూడా వేరు వేరు వ్యక్తులు వేరు వేరు భావాలను ఏర్పరచుకోవచ్చు. ఒక పోలీసు అధికారి దొంగలకు భయంకరమైన వ్యక్తిగా, కన్నకొడుకుకు ఆదర్శవంతమైన మహాపురుషుడిగా, భార్యకు కొరకరాని కొయ్యగా, తల్లికి పనిలో సతమమవుతూ భోజనం కూడా మరచిపోతున్న చిన్న పిల్లవాడిలాగా, క్రింది అధికారులకు కఠోరమైనవాడిగా, పై అధికారులకు అత్యాశకు పోయే డాంభికుడిగా కనపడవచ్చు. వారి వారి మనసులోని భావాలను అనుసరించి, అతని రూపం కూడా వారికి ఆ విధంగా కనపడుతుంది.


ఈ దృశ్య ప్రపంచాన్ని ఎవరూ యథా తథంగా చూడటంలేదు. ఇంద్రియాలు అందజేసే వార్తలను మనసు, తన మనోభావాలకు అనుగుణంగా, (ఈ దృశ్యప్రపంచం) తనలో ఒక భావనాప్రపంచంగా ఏర్పరచుకుంటుంది. ప్రతి వ్యక్తి తన మనసులో ఏర్పడిన ఈ భావనాప్రపంచాన్నే చూస్తుంటాడు. తాను మనసులో ఏర్పరచుకున్న భావనాప్రపంచమే నిజమైన ప్రపంచమని అనుకుంటుంటాడు.

మనం ఈ దృశ్యప్రపంచాన్ని చూడటమే కాక, ఇందులో ప్రవర్తిస్తూ ఉంటాం. కాళ్ళతో నడవటం, చేతులతో పనులు చేయటం, నోటితో మాట్లాడటం, ఇవన్నీ బాహ్యప్రపంచంలో మనం చేసే పనులు. మనసుతో ఆలోచించటం, బుద్ధితో విమర్శించటం ఇవి అంతఃప్రపంచంలో చేసే పనులు. ఈ పనులన్నీ మనం ఇష్టపూర్వకంగా చేస్తుంటాం. కొన్ని పనులు మన ఇష్టం లేకుండానే జరుగుతుంటాయి. ఊపిరి పీల్చటం, గుండె కొట్టుకోవటం, రక్తప్రసారం, అన్నం జీర్ణమవ్వటం మొదలైనవి. మనం ఇష్టపూర్వకంగా చేయగలిగే పనులకు ఉపయోగపడే అవయవాలనే కర్మేంద్రియాలు అంటారు. అవి కాలు, చేయి, నోరు మొదలైనవి. అదే విధంగా ఐదు జ్ఞానేంద్రియాలు – కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. మనకు బాహ్య ప్రపంచంతో సంబంధం కలుగ చేసేవి ఈ పది ఇంద్రియాలు మాత్రమే. ఈ దశేంద్రియాల వెనుక (శరీర, మనోబుద్ధుల వెనుక కూడా) ఒక ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తి వల్లనే ఈ ఇంద్రియాలన్నీ పని చేస్తుంటాయి. మన శరీరంలో జరిగే మిగిలిన అయిష్ట పూర్వకమైన పనులు కూడా ప్రాణశక్తి వల్లనే జరుగుతాయి. ఆ చైతన్యాన్ని ఆధారం చేసుకుని ఈ జగత్తులో సృష్టి జరుగుతున్నది.

ప్రకృతిలో మరి కొన్ని శక్తులు ఉన్నాయి. గాలి వీచటం, వర్షం కురవటం, నదులు ప్రవహించటం, తుఫానులు, భూకంపాలు ఇటువంటివన్నీ ప్రకృతి శక్తులు.


ఇంకా వుంది .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!