దాశరథీ శతకము ! -

దాశరథీ శతకము !

-


దాశరథీ శతకము శ్రీరాముని ప్రస్తుతిస్తూ కంచర్ల గోపన్న 17వ శతాబ్దంలో రచించిన 

భక్తి శతకము. ఈ శతకానికి దాశరథీ కరుణాపయోనిధీ అనే మకుటం అన్ని పద్యాలలో చివరగా వస్తుంది. దాశరథీ అనగా దశరథుని పుత్రుడైన శ్రీరాముడు. గోపన్న ఆత్రేయస గోత్రుడు . కాంమాంబ యాతని తల్లి, తండి... లింగన మంత్రి.


దాశరథీ శతకం లోని పద్యాలు . అమృతపు తునకలు , 

పాల తారికలు , పూతరేకులు పనసతొనలు వంటి 

ఈ పద్యాల మాధుర్యం తెలిసిన ఈ వయసు లో ఆ నాటి చేష్టలు పసితనపు తప్పిదాలు కాక మరేమిటి అనిపిస్తుందిప్పుడు.


1. శ్రీ రఘురామ ! చారు తులసీదళదామ ! శమక్షమాదిశృం

గారగుణాభిరామ ! త్రిజగన్నుత శౌర్యరమాలలామ ! దు

ర్వార కబంధరాక్షసవిరామ ! జగజ్జన కల్మషార్ణవో

త్తారక నామ ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిధీ!


ఓ రామచంద్రా ! దయాసముద్రుడా ! అందమైన తులసీదళమాలలను ధరించినవాడా ! శాంతి , ఓర్పు మొదలైన సద్గుణముతో శోభించువాడా !. ముల్లోకములచేత కొనియాడబడెడి శౌర్యలక్ష్మీ సమేతుడా ! దుర్వారపరాక్రముడైన కబంధాసురుని పరిమార్చినవాడా ! లోకములందలి సమస్త జనులను పాపసముద్రమునుండి తరింపచేయు తారకనాముడా ! భద్రగిరి యందు కొలువుతీరిన దశరధకుమారా ! జయము.


2. రామ! విశాలవిక్రమ పరాజిత భార్గవరామ! సద్గుణ

స్తోమ ! పరాంగనా విముఖ సువ్రత కామ! వినీలనీరద

శ్యామ ! కకుత్థ్స వంశ కలశాంబుధిసోమ ! సురారిదోర్బలో

ద్దామ విరామ ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిధీ !


ఓ రామచంద్రా ! గొప్పపరాక్రమ శాలియైన పరశురాముని ఓడించిన వాడవు. సుగుణ రాశివి. పరస్ర్తీలను కామించని వ్రతము గలవాడవు. నీల నీరదశ్యాముడవు. కకుత్థ్స వంశమనెడి పాలసముద్రమునందు పుట్టిన చంద్రుడవు. రాక్షస పరాక్రమమును అణచినవాడవు నైన ఓ భద్రగిరి రామా !


3.అగణిత సత్యభాష ! శరణాగతపోష ! దయాలసజ్ఝరీ

విగతసమస్తదోష ! పృధివీసురతోష ! త్రిలోకపూతకృ

ద్గనధురీ మరంద పదకంజ విశేష మణిప్రభాధగ

ద్దగితవిభూష ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిధీ !


శ్రీ రామచంద్రా ! అగణిత సత్యవాక్యపరిపాలకుడా !శరణాగత రక్షకుడా ! దయచే సమస్త పాపములను పోగొట్టెడి వాడవు. పృధివీసురలకు ఆనందము కల్గించువాడా ! ముల్లోకములను పవిత్రము చేయు ఆకాశగంగ నీ పదాబ్జములందు ఆవిర్భవించినది. విశేషమైన మణిమయకాంతులతో ప్రకాశించెడి ఆభరణములను ధరించినవాడా. నీవే మాకు రక్ష.


4.రంగదరాతిభంగ ! ఖగరాజతురంగ ! విపత్పరంపరో

త్తుంగ తమ:పతంగ ! పరితోషితరంగ ! దయాంతరంగ ! స

త్సంగ ! ధరాత్మజాహృదయ సారసభృంగ ! నిశాచరాబ్జమా

తంగ ! శుభాంగ ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిధీ !


శ్రీరామచంద్రా ! చెలరేగెడి శత్రువులను సంహరించువాడా ! గరుడవాహనా.! ఆపద లనెడి భయంకరమైన కారుచీకట్లను పారద్రోలెడి సూర్యుని వంటివాడా ! సంతోషపెట్టబడిన భూమండలము కలవాడా ! మంచివారిని అభిమానించెడి వాడా ! దయాంతరంగుడవు. జానకీదేవి యొక్క హృదయకమలమునకు తుమ్మెద వంటివాడా ! రాక్షసులనెడి పద్మములకు మత్త మాతంగము వంటివాడా ! భువనమోహనమైన రూపముకలవాడా !


5. శ్రీద ! సనందనాది మునిసేవితపాద ! దిగంతకీర్తి సం

పాద ! సమస్త భూతపరిపాలవినోద ! విషాదవల్లికా

చ్ఛేద ! ధరాధినాథ కులసింధు సుధామయపాద ! నృత్తగీ

తాది వినోద ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిథీ !


శ్రీదాశరథీ ! సమస్త సంపదలను ఇచ్చువాడా ! సనకసనందనాది మునులచేత సేవించబడు పాదములు కలవాడా ! దిగంతవ్యాప్తమైన కీర్తి కలవాడా ! సమస్త భూతరాశిని కాపాడుట యందు ఆనందమును పొందెడివాడా ! దు:ఖములను తొలగించువాడా ! రాజవంశమనెడి సముద్రము నందు ఆవిర్భవించిన చందమామా ! నృత్తగీతాది వినోదా ! శ్రీ రామచంద్రా ! శరణు !

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!