ఆచార్య పింగళి లక్ష్మీ కాంత దర్శనం!

ఆచార్య పింగళి లక్ష్మీ కాంత దర్శనం!


మూర్తిమత్వం:-


‘’ నీతల యూపు ,నీనడక ,నీ నుడికారము ,ఠీవి,యే మహీ నేతకు గల్గు ?తెల్గునం గదగల్గె నేటి విఖ్యాతి


కవీన్ద్రులన్ మలచి నట్టి కవీశ్వర సాహితీ పరంజ్యోతివి నీవు పింగళి మహోదయ విశ్వ కళా జగద్గురూ ‘’


అని శ్రీ నండూరి రామ కృష్ణమాచార్యుల వారు వర్ణించిన మూర్తి .

.


‘’ఎగ దువ్వగా వంగక ఎగయు పట్టు తురాయి వలే నిల్చు తెలి కేశముల బెడంగు


నిడుడైన నొసటి పై నిలువుగా దిద్ది తీర్చిన యెర్ర చాదు వాసనల సౌరు


మడత పెట్టిన బెట్టు మాయని ,నును పట్టు బంగారు పొడవు జుబ్బా పసందు


చలువ చేసిన సన్న తెలినూలు పొందూరు మడుగు దోవతి ,పింజె మడుగుల తీరు


నయనముల తాలుచు సులోచానముల మెరపు –కంఠమున వ్రేలు గ్రైవేయకమ్ము


వేదికను నిల్చి నటి యించు విగ్రహమ్ము –గురులకు గురుండోమారు శ్రీ వరుడో యనగా ‘’’


అంటూ ఆయన కట్టూ బొట్టూ ,వస్త్రధారణ లను వివరించారు

శ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు గారు – 

-

మాటల్లో గాంభీర్యం చూపులో గాంభీర్యం ,ముఖ భంగిమల్లో గాంభీర్యం ,నడక లో గాంభీర్యం తో రాజ ఠీవి ఉండేవి అందుకే ఆయన తో చాలా మంది చనువుగా ఉండటానికి జంకే వారు .

.

జీవిత చిత్రం


పింగళి లక్ష్మీకాంతం 1894 జనవరి 10 న కృష్ణా జిల్లా ఆర్తమూరులో జన్మించాడు. ఈయన స్వగ్రామం చిట్టూర్పు. వీరి తల్లిదండ్రులు వెంకటరత్నం, కుటుంబమ్మ. ప్రాథమిక విద్యాభ్యాసం రేపల్లెలో పొందిన తరువాత మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాల మరియు నోబుల్ కళాశాలలో చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. పట్టా పొందారు. తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికి శుశ్రూష చేసి, సంస్కృతాంధ్రాలలో బాగా పఠించి వారి శిష్యులలో అగ్రగణ్యులయ్యారు.


నోబుల్ కళాశాలకు చెందిన పాఠశాలలో ఆంధ్ర పండితుడిగా పనిచేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలోని ప్రాచ్య పరిశోధన విభాగంలో కొంతకాలం పరిశోధన చేశారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్తులోను మరియు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోను ఆంధ్రాచార్యులుగా అధ్యక్షులుగా పనిచేసారు.


కాటూరి వెంకటేశ్వరరావు తో కలసి వీరు ఆంజనేయస్వామిపై ఒక శతకం చెప్పారు. వీరిద్దరు జంటకవులుగా ముదునురు, తోట్లవల్లూరు, నెల్లూరు మొదలగు చోట్ల శతావధానాలు చేశారు.


వీరు పాండవోద్యోగ విజయములు, ముద్రా రాక్షసము నాటకాలలో ధర్మరాజు, రాక్షస మంత్రిగా పాత్రలు చక్కగా పోషించి పేరుపొందారు. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యులుగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వీరికి విశిష్ట సభ్యత్వం ఇచ్చి సత్కరించింది.


వీరు 1972 సంవత్సరం జనవరి 10 తేదీన పరమపదించారు.


నిర్వహించిన పదవులు


* బందరు నోబుల్ హైస్కూలులో తెలుగు పండితుడు

* మద్రాసు ఓరియెంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో పరిశోధకుడు

* 1931 - ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొట్టమొదటిసారిగా బి.ఏ, ఆనర్స్ కోర్సు ప్రాంభించిన సమయంలో అక్కడ లెక్చరర్‌గా చేరాడు. క్రొత్త కోర్సులకు రూపకల్పన చేశాడు. 18 సంవత్సరాల సర్వీసు అనంతరం 1949లో పదవి విరమించాడు. ఇతను చేసిన పాఠ్య ప్రణాళికలే ఇతర సంస్థలకు మార్గదర్శకాలయ్యాయి. ఇతని బోధనల నోట్సులే సాహిత్య చరిత్ర, విమర్శలకు ప్రామాణికాలయ్యాయి.

* 1954 - 1961 - విజయవాడ ఆకాశవాణి కేంద్రం సలహాదారు.

* 1961 - 1965 - శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యుడు.


రచనలు


1. ఆంధ్ర సాహిత్య చరిత్ర

2. సాహిత్య శిల్ప సమీక్ష

3. మధుర పండిత రాజము

4. సంస్కృత కుమార వ్యాకరణము

5. గంగాలహరి

6. తేజోలహరి

7. ఆత్మాలహరి

8. ఆంధ్ర వాజ్మయ చరిత్ర

9. గౌతమ వ్యాసాలు

10. గౌతమ నిఘంటువు (ఇంగ్లీష్ - తెలుగు)

11. నా రేడియో ప్రసంగాలు

12. మానవులందరు సోదరులు (మహాత్మా గాంధీ ప్రవచనాలకు అనువాదం)

13. తొలకరి

14. సౌందర నందము (1932) - పింగళి కాటూరి కవుల జంట కృతి


"పల్నాటి వీర చరిత్ర" ను పరిష్కరించాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!