పాటల రామన్న! (- రచన : తనికెళ్ళ భరణి. )

పాటల రామన్న!

(- రచన : తనికెళ్ళ భరణి. )



నవ విధ భక్తులలో కీర్తనం ఒకటి.

అంటే పరమేశ్వరుని గుణగానం చెయ్యడం..

అలా నాదోపాసన చేసి ఆత్మసాక్షాత్కారం పొందిన మహానుభావులు ఎంతో మంది..

గద్వాల సంస్థానానికి ‘విద్వద్గద్వాల’ అన్న పేరుందని మనం గతంలో చెప్పుకున్నాం.

అదిగో ఆ గద్వాలకి చెందినవాడే రామన్న (1900-1950)

రామన్న తండ్రి రాఘవయ్య...తల్లి కిష్టమ్మ ‘వైద్యం’ రాఘవయ్య గారు వైద్యం చేసేవారు. గనుక ఇంటిపేరు ‘వైద్యం’ గా స్థిరపడిపోయింది.


రాజావారి ప్రాపకం ఉండడం మూలంగా...రామన్న బాల్యం వైభవంగానే గడిచింది.. 

కానీ పదవయేట అకస్మాత్తుగా తండ్రిగారు కాలధర్మం చెందడం..

ఆ బెంగతో కొన్నాళ్ళకి తల్లి కన్నుమూయడం..

రామన్న ఏకాకైపోయాడు


అప్పుడు రామన్న మేనమామ పాగ నర్సప్ప గారు రామన్నని గద్వాల సంస్థానాధీశుడైన సీతారామ భూపాలుని కొలువులో చేర్పించాడు.


రాజుల కొలువు!

కత్తిమీద సాము!

నెత్తిమీద పాము!

పైగా పట్టుమని పదేళ్ళు లేవు. రాజా వారికి ఆంతరంగికుడుగా పనిచెయ్యాలి.

చెప్పినపని చెప్పినట్టు చెయ్యాలి.

బాగాచేస్తే బహుమానం..

తేడాలొస్తే శిరఛ్ఛేదనం..

ఎవరెల్లా ఏడ్చినా రాజు ఉత్తముడు, సంస్కారి..సంగీత - సారస్వత ప్రియుడు యథారాజా తథాప్రజా..అంచేత నిత్యం సంగీత కచేరీలు సాహితీ సభలు..వగైరా నిర్వహించబడుతూ ఉండేవి.


మెల్లిగా రామన్నకి రుచి తెలుస్తోంది.

సంగీత - సాహిత్యాల పట్ల ఇష్టం కలుగుతోంది.

పగలల్లా సభలో జరిగిన సంగతుల్ని - రాత్రి పడుకునే ముందు వల్లె వేసేవాడు! మొత్తానికి కవిత్వం అంటుకుంది.


ఆశువుగా కవిత్వం చెప్పడం అబ్బింది..

పెద్దపెద్ద ఉద్దండ పండితుల మధ్య చిన్నకుర్రాడు రామన్న..

సింహాల మధ్య ..చిట్టెలుకలాగా..

గంఢభేరుండాల మధ్య రామచిలుకలాగ..

కర్పూరపు తాంబూలం మధ్య - వక్క పలుకులాగ..

చిన్నకుర్రాడు సన్నగొంతుతో..అప్పటికప్పుడు ఆశుకవిత్వం చెప్తోంటె సీతారామ భూపాలుడు మహా ముచ్చట పడిపోయేవాడు.


వెంటనే ఏ ముత్యాల హారమో..వజ్రపుటుంగరమో వరహాలో ఏవో ఒకటి బహుమతిగా ఇచ్చేవాడు..

ప్రోత్సహించే ప్రభువులే ఉండాలి గానీ.. కళ వర్ధిల్లదూ.?

యుక్త వయస్సురాగానే మంచి పిల్లని చూసి దగ్గరుండి స్వయంగా పెళ్ళి జరిపించాడు సీతారామ భూపాలుడు.

సంగీత సాహిత్యాల వల్ల మృదువైపోయిన హృదయంలో పుత్రవాత్సల్యం పొంగడం విశేషం కాదుగా...

రాజావారిచ్చిన ప్రోత్సాహంలో పండగలప్పుడూ..ఉత్సవాలల్లో సంస్థానంలో వేసే సంస్కృత నాటకాల్లో వేషాలు కూడా వేసి శభాష్ అనిపించుకున్నాడు రామన్న.

సంగీత - సాహిత్యాల సమాహారమైన సంస్కృత నాటకాల్ని జోరుగా ఆడుతున్నరోజుల్లో..

పిడుగులాంటి వార్త!


సీతారామభూపాలుడు స్వర్గస్థులైనారు!

జివిత నాటకరంగ స్థలం మీద నించి పాత్ర పక్కకెళ్ళిపోయింది.

తెరజారిపోయింది..

సంస్థానం ‘కళా’ విహీనమైంది.

రామన్న కుప్పకూలిపోయాడు..

ఎందుకో ‘ఆత్మ’ లేని సంస్థానంలో కొలువు చెయ్యాలనిపించలేదు.

మానేసాడు.. ఆత్మతృప్తికోసం ఇంట్లోనే సంగీత సాధన చేస్తూ ఉండేవాడు..

పులిమీద పుట్ర.. విధి చేసిన కుట్ర..!!

ఉన్నట్టుండి భార్యపోయింది..

ఒక కన్ను పోతే ఎలాగో తడుముకుంటూ జీవితాన్ని గెంటుకొస్తున్నాడు.

రెండో కన్ను పోతే! గాఢాంధకారం!!

పెదాల మీద వెర్రి చిరునవ్వు విరిసింది!!


వైరాగ్యం ఆవరించింది. ఏదీ రుచించట్లా.. చప్పబడిపోయింది బతుకు.

..బతుకు బండిని ఈడవాల్సి వస్తోంది.. రోజుల్ని వెళ్ళదీయాల్సి వస్తోంది..

గుండెల్లో జ్యోతి వెలిగింది!

లీలా మానుష విగ్రహుడి మనోహర మురళీ నాదానికి నెత్తురు పొంగీ యమునైంది. ఉత్సాహమ్ పరవళ్ళు తొక్కింది!!

వేదనంతా..నాదమై పోయీ..గానమైపోయింది.. కళ్ళు మూసుకుంటే నవ్వు రాజిల్లెడు మోమువాడు..

కృష్ణుని స్తుతిస్తూ పాటలు పాడ్డం మొదలెట్టాడు.

నల్లని వాడూ..పద్మ నయనమ్ముల వాడు..

అంతే..వైద్యం రామన్న కాస్తా..పాటల రామన్నైపోయాడు.

కీర్తిశేషులు సీతారామభూపాలుని అర్ధాంగి మహారాణీ ఆదిలక్ష్మీ దేవమ్మగారు పాటల రామన్నకి లక్ష్మమ్మ అనే యువతితో మళ్ళీ పెళ్ళి చేశారు.

కృష్ణభక్తికి నిదర్శనంగా..

వాళ్ళకి పుట్టిన పిల్లవాడికి ‘కుచేలుడు’ అని పేరెట్టుకున్నాడు పాటల రామన్న.

రాజా వారు వెళ్ళిపోయాక ఆస్థాన వ్యవహారాన్నీ రాణీవారే చూస్తూ ఉండేవారు. రాచవ్యవహారాల్లో తలమునకలై పోయిన ఆదిలక్ష్మీ దేవమ్మ గారు అప్పుడప్పుదు పాటల రామన్నని పిల్చీ మనశ్శాంతి కోసం పాటలు పాడించుకునేవారు. రాణీగారికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి వరలక్ష్మీదేవికి వివాహమైనది కానీ సంతానం లేదు!!

అప్పుడు పాటల రామన్న ఒక సలహా ఇచ్చాడు! శ్రీకృష్ణమందిరం’ అనే భజన మండలి ఒకటి స్థాపించండి.. దానివల్ల మేరు జరగొచ్చూ అని. 1930 లో ‘శ్రీ కృష్ణమందిరం’ స్థాపన జరిగింది. సూగప్ప వైద్యగారింట్లో! అక్కణ్ణుంచి ప్రతీ ఆషాడమాసం శుక్ల సప్తమి నుంచి పౌర్ణమి దాకా నవరాత్రి ఉత్సవాలూ - ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున రథోత్సవం జరిపేవారు. అన్ని రోజులూ పాటల రామన్న గారి పాటలు ఉండాల్సిందే!


కృష్ణుడికి కృప కలిగింది.

అదే సంవత్సరం ఆదిలక్ష్మీ దేవమ్మగారికి మనవడు పుట్టాడు.

ఆ పిల్లాడికి ‘శ్రీ కృష్ణరామభూపాలుడ’ని పేరు పెట్టారు.

సంతానం కలిగినందుకు పరమానంద పడిపోయిన రాణీగారు శ్రీకృష్ణమందిరం సభ్యులందర్నీ తమ ఖర్చులతో పండరీపురం పంపించారు.

రాణీగారు శ్రీకృష్ణమందిరానికి ధన సహాయమే కాకుండా రాజలాంఛనాలూ ఏనుగులూ, గుర్రాలు, సైన్యం, సైనిక వందనం కూడా సమర్పించుకున్నారు.


సంస్థానాలన్నీ ప్రభుత్వంలో విలీనం అయ్యేవరకు..శ్రీకృష్ణమందిరం పరమ వైభవ స్థితిలో ఉండేది. దీనికి ప్రధాన కారకుడు పాటల రామన్న.

పాటల రామన్న మాణిక్యగర్ ఖండేరావ్ (మరాఠా) మహారాజావారి ఆస్థానానికి వెళ్ళి..


దయాకరో హమ్ పర్ తుమారే

గురూజీ మాణిక్య ప్రభూ కృపాకర్..


అనే కీర్తనని ఆశువుగా పాడి రాజావారి చేత సన్మానం అందుకున్నారు.

పాటల రామన్నగారికి చదువు పెద్దగా అబ్బలేదు గానీ ఎవరైనా సరే పాటల రాయమంటె చాలు..

అప్పటికప్పుడు ఏ చిత్తు కాగితం దొరికినా ఒక్కసారి కృష్ణ పరమాత్మని తల్చుకుని ఆశువుగా పాట రాసేసేవాడు.

రామన్నగారు ఉపయోగించిన రాగాలు హిందుస్తానీ, భైరవి, యమన్ కళ్యాణి, దర్బార్, కానడ, శుద్ధ కళ్యాణ్, కాఫీ, శ్యామ, తిలకామోద్, ధన్యాసి, మోహన, తోడి, పీలు, బేహాగ్, భీంప్లాస్, మాండ్, శ్రీరాగాలు.


మోహనరాగంలో రామన్న రాసిన పాట.


నిను కనుగొనగలమా కృష్ణా

ఘనమగు దొంగలలో ఘనదొంగవు


1. అణువుకంటె అతి సూక్ష్మరూపుడవు

ఘనముకంటె మహాఘనరూపుడవూ


2. ఎనబది నాలుగు లక్ష జీవులెడ

అనయింబుగ నెడబాయ కుందువట


3. వేదవిద్య వేదాంతము లెరుగము

నామదాస దాసానుదాసులము


4. భేదరహిత నీవుండగ మాకు

వేదాంతంబుల వాదము లేల


5. నీ పాదములే గతి పాండురంగ

ప్రహ్లాద వరద - కృష్ణమందిర నిలయ..


పాటల రామన్నగారు రాసిన పాటలు ‘శ్రీ కృష్ణ మందిర సంకీర్తనలు’ అన్న పేరుతో ప్రకాశకులు పాటల పండరీనాథ్ (రామన్న గారి మేనల్లుడు) 1957 లో ప్రచురించారట.


రచయిత జీవించి ఉండగా ఇది ప్రచురించబడలేఉద్..కళాకారులకు ఇదో శాపం!

పాతల రామన్న కృష్ణునిలో ఐక్యమైపోయినా..

ఆయన పాటలు మాత్రం జీవించే ఉంటాయి..

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!