కోహం రండే?

కోహం రండే?

-

కాళిదాసు గురించి తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి


కాదేమో. ఉపమాలంకార ప్రయోగంలో ఆయనకి ఆయనే సాటి. అందుకే


ఆయన గురించి చెప్పేటప్పుడు "ఉపమా కాళిదాసః" అంటారు.


కాళిదాసు గురించి ఎన్నో కధలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన


విక్రమాదిత్యుని నవరత్నాలలో ఒకడని కొంతమందీ, భోజ రాజు


ఆస్థానంలో ఉండేవాడని కొంతమందీ అంటారు.


భోజ రాజు ఆస్థానంలో కాళిదాసు తో పాటు భవభూతి, దండి అని


ఇద్దరు కవులు ఉండేవారు. ఈ ముగ్గురూ ఎవరికి వారే సాటి. అలాంటిది


ఒకసారి వాళ్ళ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే చర్చ బయల్దేరింది,


విషయం చినికి చినికి గాలి వానై భోజ రాజు దగ్గరకు వెళ్ళింది. ఆయన


కూడా ఈ విషయంలో ఓ నిర్ణయానికి రాలేక చేతులెత్తేసాడు. ఇక మనం


ఆ కాళీ మాతనే అడిగి తెలుసుకుందాం అని ముగ్గురూ కాళీ మాత


ఆలయానికి బయలుదేరారు,కాళిదాసు నాలుక పై బీజాక్షరాలు వ్రాసి


ఆయని కవిగా తీర్చిదిద్దింది సాక్షాత్తూ ఆ కాళీ మాతే. తప్పకుండా నేనే


గొప్ప కవి అని తీర్పు చెప్తుంది అని మనసులో అనుకుంటూ


ఆనందపడసాగాడు కాళిదాసు. ముగ్గురూ ఆలయానికి చేరుకుని తమ


వివాదాన్ని నివేదించి అమ్మ ఏం చెప్తుందో అని ఆసక్తిగా ఎదురు


చూస్తున్నారు.


ఇంతలో అమ్మవారి విగ్రహం నుండి మాటలు వెలువడ్డాయి


"కవిర్దండీ కవిర్డండీ భవభూతీ పండితః" అని ఆగింది కాళీ మాత


అంటే దండి కవి, భవభూతి పండితుడూ అని వాళ్ళ ఇద్దరి గురించీ


చెప్పింది కానీ కాళిదాసు గురించి అస్సలు చెప్పలేదు. ఒకపక్క దండీ,


భవభూతీ మురిసిపోతుంటే కాళిదాసు మాత్రం నిశ్చేష్టుడయ్యాడు.


తనని కవిని చేసి ఆశీర్వదించిన అమ్మ ఇలా అవమానిస్తుందని


ఊహించని కాళిదాసు పట్టరాని కోపంతో


"కోహం రండే?" అని గట్టిగా కాళీ మాతనే అడిగాడు.


(అంటే నేనెవరినే ...(రండ అనేది ఒక బూతు మాట) )


కాళిదాసు ఇలా అనేసరికి దండీ, భవభూతీ నిశ్చేష్టులై అలాగే నిలబడి


పోయారు.


వెంటనే కాళీ మాత "త్వమేవాహం త్వమేవాహం కాళిదాసో


త్వమేవాహం" (అంటే నువ్వే నేను, ఓ కాళిదాసా) అని బదులిచ్చింది.


తను చేసిన తప్పు గుర్తించిన కాళిదాసు ఎంతో సిగ్గుపడి తనని


క్షమించమని వేడుకుంటూ కాళికా దేవిని ఎన్నో రకాలుగా కీర్తించాడు.


అయినా పిల్లవాడు తప్పు చేస్తే ఏ తల్లైనా కోపం తెచ్చుకుంటుందా?


సాక్షాత్తూ అమ్మవారే కాళిదాసు గొప్పతనం గురించి చెప్పటంతో


మిగిలిన ఇద్దరికీ అది ఒప్పుకోక తప్పలేదు,


ఇదండీ ఈ రోజు కధ.


-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!