మిడతంభట్టు జ్యోతిష్యము.! (శ్రీ చిలకమర్తి వారి 'వినోదములు' నుండి సేకరణ)

మిడతంభట్టు జ్యోతిష్యము.!

(శ్రీ చిలకమర్తి వారి 'వినోదములు' నుండి సేకరణ)

-

చదువుసంధ్యలు రాక, పనిపాటా లేనివాడై అత్తవారింటనే ఉంటున్నాడు ఒక బ్రాహ్మణుడు. ఇల్లరికం అల్లుడు లోకువే కదా! అల్లుడు బయటకు వెళ్లిన

సమయములో అత్తగారు గారెలు వండుతున్నది.కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన అల్లుడు వాసనాబలముతో 

ఇంట్లో తనకు తెలియకుండా పిండివంటలు చేయుచున్నారని గ్రహించి వారికి తెలియకుండా వంటయింటి వెనుక చూరు క్రిందకూర్చుని గమనించసాగెను.

పిండి నూనెలో పడగానే చుయ్యిమని చప్పుడగుచున్నది. దానిని బట్టి ఎన్నిమారులు చుయ్యిమని చప్పుడైనదో

అన్ని గారెలు వండబడినట్లు తెల్సికొని

ఏమీ ఎరుగనివానివలే భోజనమునకు

కూర్చుండెను. గారెలు తప్ప అన్నియు

వడ్డించబడగా "గారెలు వడ్డించినారుకాదే

యని అడుగగా"గారెలెవరు వండినారని"

అత్తగారు బుకాయించబోగా ఈ అల్లుడు

"మీరు నూట ముప్పది గారెలు వండినార

ని నాకుతెలియును"అనగాగత్యంతరము లేక అత్తగారు గారెలు వడ్డించి "నీకెట్లు తెలిసెను? అనగా "ఏదో పూర్వపుణ్యము

వలన తెలిసినది" అని గొప్పగా చెప్పెను.

ఆశ్చర్యంతో అత్తావదినెలు చుట్టుప్రక్కల వారితో ఇతడు గొప్ప జ్యోతిశ్శాస్త్రజ్ఞుడని

ప్రచారము చేసిరి. ఈ మాట గ్రామమంత

యు వ్యాపించెను.

ఇట్లుండ ఒక చాకలివాడు వచ్చి తన గాడిద తప్పిపోయెనని,అది ఏమైనదీ తెలుపమని ఇతనిని అడిగెను. వచ్చిన

ప్రతిష్ట నశించునని ఏదో ఆలోచించునట్లు గా ఆకాశమువంక చూసి ఓరీ చాకలీ!రేపు ఉదయమే చెప్పెదను,రమ్మని పంపి

వేసెను. తన ప్రతిష్ట నిలబెట్టుకొనుటకై ఆ రాత్రి నిద్ర మానుకుని గాడిదను వెదకుటకై బయటకుపోయి చెట్లు, పుట్టలు తిరిగి చివరకు జాడ తెల్సుకుని

దానిని ఒక తాటిచెట్టుకు కట్టి ఇంటికి వచ్చెను. మరునాడు చాకలితో "నీగాడిదను చెరువు ప్రక్క తాటిచెట్టుకు

ఎవరో కట్టివేసినారని చెప్పగా వాడు వెళ్లి

ఆనందముతో తిరిగి వచ్చి నాలుగణాలు

ఇచ్చివెళ్లెను. దీనితో ఇతని కీర్తి రాజు గారి

వరకు ప్రాకినది.

ఒకసారి రాజుగారింట కొన్ని నగలు పోయినవి. వెంటనే రాజు ఇతడిని

పిలిపించి "ఒకవారములోపున చోరులె

వరో చెప్పవలెనని,లేనియెడల ముక్కు

చెవులు కోసెదనని" ఉత్తర్వు ఇచ్చెను. ఏమిచేయుటకు తోచక నిద్రాహారములు

మాని రేయింబవళ్లు ముక్కో చెవో అని స్మరణ చేయుచూ దిగులుగా ఉండెను.

నిజముగా ఈ దొంగతనం చేసినవారు రాజుగారివద్ధనున్న ఇద్దరు పనికత్తెలు. వారు అక్కాచెల్లెళ్లు. ఒకరికి ముక్కు మరొకరికి చెవి అని వారి పేర్లు. పుట్టిన పిల్లలందరు చనిపోతుండడంతో వారి తల్లిదండ్రులు మంచి పేర్లేమీ పెట్టక ముక్కు చెవి అని పెట్టినారట. మన బ్రాహ్మణుడు గొప్ప జ్యోతిష్కుడు కావున తమ గుట్టు తప్పక బయటపడునని

వారు భయపడుతూ అసలు ఆయన 

ఏమి చేయుచున్నాడో తెల్సికొందమని 

ఈయనఇంటివద్ద తచ్చాడుచుండిరి.

ఆ రాత్రి ఈ బ్రాహ్మణుడు "ముక్కూ చెవి, ముక్కూ చెవి" అని స్మరణ చేయుట విని తమ గుట్టు తెలిసిపోయెనని భయంతో ఆ ఇద్దరు పనికత్తెలు ఇతడి

వద్దకు వచ్చి తమ నేరం ఒప్పుకుని పోయిన నగలు అందజేెసి రాజుగార్కి చెప్పవద్దని కోరిరి. వెంటనే మన బ్రాహ్మణుడు ఈ నగలమూటను చెరువు గట్టుమీద గల నేరేడుచెట్టుక్రింద పాతి ఏమీ తెలియని వానివలె రాజుగారి

వద్దకు పోయి " స్వామీ!తెల్సినది. ఎవరో దొంగలు నేరేడు చెట్టుక్రింద నగలమూట 

పాతిపెట్టినారని చెప్పగా రాజు సేవకులచే 

త్రవ్వించగా నగలమూట బయటపడెను. 

దాంతో రాజుగార్కి గురి కుదిరి ఇతడిని తనతోనే ఉంచుకొనెను.

ఒకరోజు రాజుగారు వేటలోవుండగా

చేతిలో ఒక మిడత వచ్చి పడెను. రాజుకు సరదా పుట్టి , గుప్పిట చేెతిలో మూసి మన బ్రాహ్మణుడి వంక చూసి తన చేతిలో ఎమివున్నదీ--చెప్పమనెను. వెంటనే ఇతనికి గుండెలో రాయి పడినట్లాయెను. మనసులో "ఇక నా పని 

అయిపోయినదిరాజుచేతిలోశిరచ్ఛేదము 

తప్పదు. తప్పు ఒప్పుకొనెదని అని నిశ్చయించుకుని --

"చుయ్యిచుయ్యి అప్పచ్చి దృష్టం;కష్టపడి తిరిగె గార్దభం దృష్టం;

ముక్కోచెవో భూషణందృష్టం; మిడతంభట్టు చెయ్యిచిక్కె" అనిచదివెను

"చుయ్యిచుయ్యి యను చప్పుడు వలన అప్పచ్చుల లెక్క తెల్సినది. రాత్రి అంతయు కష్టపడి తిరిగినందువలన గాడిద కనపడినది. ముక్కోచెవో అనుకొనుట వలన నగలు దొరికినవి. నేడు ఉపాయము తోచక మిడుతవలె

మీ చేతిలో పడితిని రాజా" అని అర్థము. 

అయితే రాజు --మనవాడు ఏదో మంత్రం చదువుచున్నట్లుగా ఆఖరున "మిడతంభట్టు చెయ్యి చిక్కె" అనడం విని తన చేతిలో మిడతపడిన సంగతి 

తెల్సుకున్నాడని భావించి కౌగిలించుకుని

"మీ వంటి జ్యోతిష్కుడు శాస్త్రకారులలో

లేడని మెచ్చి మన బ్రాహ్మణునకు ఒక అగ్రహారమిచ్చి గౌరవించెను.

(శ్రీ చిలకమర్తి వారి 'వినోదములు' నుండి సేకరణ)


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!