వరూధిని- ఓ ప్రవరాఖ్యుడు !

వరూధిని- ఓ ప్రవరాఖ్యుడు !

-

'ఎక్కడివాఁడొ! యక్షుతనయేందు జయంత వసంత కంతులన్‌

జక్కఁదనంబునన్‌ గెలువఁ జాలెడు వాఁడు, మహీసురాన్వయం

బెక్కడ? యీతనూవిభవమెక్కడ? యేలని బంటుగా మరున్‌

డక్కఁగొనంగరాదె యకటా! నను వీఁడు పరిగ్రహించినన్‌.!

-

అర్థములు: 

యక్షతనయుడు = యక్షులకు రాజైన కుబేరుని పుత్రుడగు నలకూబరుడు; ఇందుడు = చంద్రుడు; జయంతుడు = ఇంద్రుని కుమారుడు; వసంతుడు = వసంతఋతు పురుషుడు; కంతుడు = మన్మథుడు; మహీసురాన్వయంబు = బ్రాహ్మణకులము; తనూవిభవము = శరీరసంపత్తి; ఏలని బంటు = జీతం బత్తెం లేకుండా ఉచితముగా చాకిరీ చేయు సేవకుడు; మరున్ = మదనుణ్ణి; డక్కఁగొనంగరాదె = లోబరచుకొనరాదా; పరిగ్రహించినన్ = చేకొన్నచో.


భావము: 

ప్రవరుని సౌందర్యాతిశయమును చూసిన ఆ సురకాంత ఇలా అనుకొంటున్నది. 

' ఆహా! ఈ పురుషుడు ఎక్కడివాడై ఉంటాడు! అందములో పేరెన్నికగన్న నలకూబరుడు, చంద్రుడు, జయంతుడు, వసంతుడు, మన్మథుడు మొదలైనవారందరినీ తన రూపవైభవముతో త్రోసిరాజంటున్నాడు కదా! పరిశీలనగా గమనిస్తే విప్రుడేమోనని తోస్తున్నది. కాని, బ్రాహ్మణకులములో ఇంతటి శారీరకసంపత్తి కలవారు ఉంటారని ఎన్నడూ వినలేదు! అబ్బా! ఈతడు నన్ను పరిగ్రహించిన యెడల, ఆ కామదేవునితోనే వెట్టిచాకిరీ చేయించుకోనా! ' అని తలపోస్తున్నది ఆ దివ్యభామిని.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!