ముద్ద బంతి పూవు లో మూగ కళ్ళ ఊసులకు యాభయ్యేళ్ళు !!

ముద్ద బంతి పూవు లో మూగ కళ్ళ ఊసులకు యాభయ్యేళ్ళు !!

-

(31-1-1964న విడుదలై నేటికీ తెలుగు వారి హృదయాల్లో ఆడుతోంది) ఆ తరానికి చెందిన ప్రేక్షకుల్ని అడగండి 'మూగమనసులు' గురించి ఎన్నో చెబుతారు. మధురమైన జ్ఞాపకాల్ని పంచుకొంటారు.

ఆ జ్ఞాపకాల్లో గోదావరి గట్టు .. ఆ గట్టు మీద చెట్టు ..చెట్టు కొమ్మన పిట్ట.. పిసరంత పిట్టమనసులో దాగున్న మొత్తం ప్రపంచం ఇవన్నీ మనకి కనిపిస్తాయి. 

అల్లరి పిల్ల గౌరి. అమ్మాయిగారు రాధ, పదవ నడిపే గోపి - ఈ ముగ్గురూ మూగమనసులతో చెప్పే ఊసులూ, బాసలూ మన హృదయాలు వినిపిస్తాయి.

గోపి మరి జన్మ ఎత్తి , తన తో పాటు మళ్ళీ జన్మించిన రాధను ప్రేమించి పెళ్లి చేసుకొని , హనీ మూన్ కోసం గోదావరి మీద లాంచీ లో ప్రయాణిస్తూ "ఈ నాటి ఈ బంధమేనాటిదో .." అని పాట అందుకుంటే ప్రేక్షకులు సైతం మరో జన్మ ఎత్తిన ఫీల్ తో ఆ పాటను ఎంజాయ్ చేసారు. 

గత జన్మలో సుడిగుండం లో తమ పడవ మునిగి పోయిన సంఘటన గుర్తుకొచ్చిగోపి కలవర పడితే హాల్లో జనం ఆత్రుత పడ్డారు. పడవ నడుపుతూ అమ్మాయి గారికి గోపి పాట నేర్పినప్పుడు సావిత్రి తో పాటు ప్రేక్షకులంతా మూకుమ్మడి గా "నా పాట నీ నోట పలకాల సిలకా "అంటూ శ్రుతి కలిపారు. ఏయన్నార్ ని ఆట పట్టిస్తూ జమున "నీ ముక్కు మీద కోపం .." అని పాడినప్పుడు , 

"గౌరమ్మా నీ మొగుడెవరమ్మా " అని ఏయన్నార్ జమునని ఆట పట్టించినప్పుడు జనం బలే బలే అనుకొన్నారు. అమ్మాయి గారిని మనసులోనే మౌనం గా ఆరాధించిన గోపి ఆమెకు అంపకాలు పెట్టె వేళ -"ముద్ద బంతి పూవులో" అని ఏయన్నార్ పాట అందుకుంటే 'అయ్యో వెర్రివాడా' అని జనం జాలి పడ్డారు. భర్తను కోల్పోయి పుట్టింటికి రాధమ్మ తిరిగొస్తే -"పాడుతా తీయగా ..' అని గోపి పాడిన జోల పాట 50సంవత్సరాలు గడిచినా నేటి కీ ఆ తరం ప్రేక్షకుల హృదయాల్ని జొగొడు తూనే ఉంది. చిత్రం ఏమిటంటే రెండు జన్మల కథ అయిన మూగమనసులకు తెర వెనుక పునాదులైన ఆదుర్తి లేరు .. ఆత్రేయ లేరు .. ముళ్ళపూడి లేరు .. దాశరథి, కొసరాజు లేరు .. మహదేవన్ లేరు .. తెర మీద మూల స్తంభాలైన సావిత్రి, అక్కినేని లేరు. జమున మాత్రమె మిగిలారు.

'పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు .. ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు " అనుకొంటూ , ఆ సినిమా లో లాగే ఏయన్నార్, సావిత్రి , ఆదుర్తి, ఆత్రేయ, మహదేవన్ లాంటి వాళ్ళు మళ్ళీ జన్మించాలని ఆ తరం ప్రేక్షకులు కోరుకొంటున్నారు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!