అరుంధతీదేవి కథ .!

అరుంధతీదేవి కథ పురాణ ప్రసిద్ధమైనదని  చెప్పుతారు.

.

అయితే, పురాణాల్లో ముఖ్యంగా శ్రీదేవీ భాగవతం, శివపురాణం, భాగవతం, భారతం తదితర పురాణేతిహాసాల్లో వసిష్ఠుని గురించి చెప్పే కథా సందర్భంలో ఆయన ధర్మపత్నిగా అరుంధతీదేవి ప్రస్తావన వస్తుంది..

.

అరుంధతీదేవి ఒక అనార్య యువతి. వసిష్ఠుడు ఆర్య జాతీయుడు. వేదవనంలో తపస్సు చేసుకొంటున్న వసిష్ఠుడికి ఒకనాడు మధురమైన గీతం వినిపిస్తుంది. ఆ గీతం అతని మనసుని ఆకర్షిస్తుంది. పాడిందెవరని చుట్టూ పరికించి చూస్తాడు. సంధ్య అనే అమ్మాయి పాడిందా పాట. ఆమె అరుంధతీదేవికి సోదరి. ఆ పాట ద్వారా సంధ్యని, ఆమె ద్వారా అరుంధతీదేవినీ వసిష్ఠుడు కలుసుకొని, అప్రయత్నంగా సరస్సులో పడిపోయిన అరుంధతీదేవిని రక్షించడం ద్వారా అరుంధతీదేవి నివాసం ఉండే ఆశ్రమానికి చేరతాడు. ఇద్దరి మనసులు ఏకమవుతాయి..

.

అరుంధతీదేవి - వసిష్ఠుల ప్రణయం విషయం వసిష్ఠుడిని చిన్ననాటి నుండీ పెంచి పోషించిన ప్రాచీనుడికి తెలుస్తుంది. మొదట ప్రాచీనుడు ఆ ఇద్దరినీ చూసి పార్వతీ పరమేశ్వరులేమో అని భావిస్తాడు. తాము వసిష్ఠుడు - అరుంధతులమని వసిష్ఠుడు ప్రాచీనుడికి వివరిస్తాడు. అరుంధతీదేవి గురించి చెప్తాడు. ఆమె ఒక తాపస కన్య అనీ, ఈ పరిసర ఆశ్రమంలోనే ఉంటుందనీ వసిష్ఠుడు చెప్తాడు. ఆమె పేరు “అరుంధతీదేవి” అని చెప్పగానే, ప్రాచీనుడు “హరి హరీ! అంటరాని, చూడరాని, చెప్పరాని చండాల కన్య!” అనుకొంటూ తిరిగి వెళ్ళిపోతాడు. 

.

తనకు వర్ణభేదం లేదనీ తన హృదయపు తలపులు మూసుకోలేదనీ అరుంధతీదేవి తన హృదయంలో ఉండి సర్వత్రా ఆమె ప్రతిబింబమే కనిపిస్తుందని తనలో తాను సమాధానం చెప్పుకుంటాడు వసిష్ఠుడు. అంతలో వసిష్ఠుని దగ్గరకొచ్చిన సంధ్యతో తాను క్షణంలో వచ్చేస్తాననీ, ఆమెను అరుంధతీదేవి దగ్గరకు వెళ్ళమని చెప్తాడు. “ఆర్య, అనార్య భేద భావాల్ని తునాతునకలు చేసి, ప్రాచీనుడి నోరు మూయించి, ఈ పారతంత్ర్య వాతావరణం నుంచి బైటికి దూకి వచ్చేస్తానని, తాను పొరపాటు చేసి, ఆమెను వదిలి వచ్చేశాననీ” పశ్చాత్తాప పడుతుంటాడు. 

అంతలో మళ్ళీ ప్రాచీనుడు వస్తాడు.


అతడు వసిష్ఠుడిది స్త్రీ వాంఛ అని నిందిస్తాడు. 

తనది స్త్రీ వాంఛ కాదనీ, తన జీవితం ప్రేమ యజ్ఞంలో బలయిపోయిందంటాడు.


ఇక, తపస్సు మానేసి గృహస్థాశ్రమానికి చేరమనీ, అప్పుడు గానీ కామం చల్లారందంటాడు ప్రాచీనుడు. 

తనది కామం కాదంటాడు వసిష్ఠుడు. తపస్సు మానవలసిన పనిలేదనీ అంటాడు.


అయినా ఇప్పటికే మహా తపస్వివి. యౌవనస్థుడవు. కనుక ఇప్పటికైనా గృహస్థుడివి కమ్మంటాడు ప్రాచీనుడు. తగిన తేజోవతిని వివాహమాడి రాజయోగినిగా మారమని చెప్తాడు ప్రాచీనుడు. 

అరుంధతీదేవి కంటే ప్రపంచంలో తేజోవతి లేదంటాడు వసిష్ఠుడు.

.

వసిష్ఠుడు అరుంధతీదేవినే తలచుకొంటూ, మానసిక సంఘర్షణకు గురవుతుంటాడు.



ఆనాటి నుండీ అరుంధతీదేవి ఉండే వేదవనంలోని ఆశ్రమం తప్ప, మిగిలిన ఆశ్రమాలన్నీ కరువు కాటకాల పాలవుతాయి. ప్రజలు ఆకలికి తట్టుకోలేక మునులు కుక్కలను కూడా వదలరు. వాటితోనే తమ ఆకలి తీర్చుకుంటుంటారు.



ఈ పరిస్థితిని గమనించిన ప్రాచీనుడు తన శిష్యుడు కులగిరిని పంపి త్రిమూర్తుల దగ్గరకెళ్ళి సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోమంటాడు. బ్రహ్మ, విష్ణువు తమ చేతుల్లో లేదనీ పరమేశ్వరుడి దగ్గరకెళ్ళమంటారు. అప్పటికే ఈశ్వరుడు అరుంధతీదేవి ఆశ్రమానికి బయలుదేరతాడు.



అరుంధతీదేవినే తలచుకుంటూ వసిష్ఠుడు తాను తప్పు చేశాననీ, ఇక శాశ్వతంగా అరుంధతీదేవికి దూరమవ్వాలని అనుకుంటుంటాడు. తన తపస్సు వ్యర్థమనుకుంటాడు. అది ఇసుక తుఫానులో చేసిన తపస్సులాంటిదని అనుకుంటాడు. తనకి మరణమే శరణ్యమనుకుంటాడు.



ఆ సమయంలోనే సాధారణ మానవుడిలాగే ఈశ్వరుడు అతడికి ప్రత్యక్షమవుతాడు.



ఆ స్థితిలో వసిష్ఠుడు ఈశ్వరుడిని గుర్తించలేడు. తన ప్రేమ సఫలం కానందుకు మరణించాలనుకుంటున్న వసిష్ఠుడిని శివుడే పలకరిస్తాడు. చైతన్యంతో జీవించడంలోనే నిజమైన పురోగతి దాగి ఉందని ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోవాలనుకున్న వసిష్ఠుణ్ణి తన చేతితో స్పర్శిస్తాడు శివుడు. ఆ స్పర్శతో అతడు నూతన చైతన్యం పొందుతాడు. అయినా తన దారిని తనని పోనిమ్మంటాడు. అయితే అతనిదేదో భగ్న హృదయంలా ఉందనుకుంటాడు శివుడు. ఆ పూర్వాపరాలను అడగకుండానే, అతణ్ణి అంత కఠినంగా హింసించిన ఆ ప్రియురాలెవరని మాత్రం అడుగుతాడు. ఆమె మృదు స్వభావురాలేననీ, తానే కఠినాత్ముడిననీ వసిష్ఠుడు వివరిస్తాడు. తనది ఆర్యజాతి అనీ అనార్య జాతి కన్యను ప్రేమించాననీ చెప్తాడు వసిష్ఠుడు.



దానితో శివుడు అసలు భారతదేశంలో అలాంటి భేద భావమే లేదనీ ద్రావిడులు ఆర్యులు ఒకే జాతివారనీ స్పష్టం చేస్తాడు. భారతీయులదంతా దితి, అదితుల సంతానమే కదా అనీ చెప్తాడు. వెంటనే మళ్ళీ అది కూడా కేవలం “పెరుగుదలలో పరిసరాల ప్రాబల్యం మినహాహిస్తే, మానవ జాతి అంతా ఒక్కటే కదా?” అంటాడు..

.

దీనితో తన అజ్ఞానం క్షమార్హం కాదని తపిస్తుంటాడు వసిష్ఠుడు. పొరపాటు చెయ్యడం మానవ లక్షణమనీ దాన్ని సరిదిద్దుకోవడానికి పశ్చాత్తాపమే సరైన మార్గమని వివరిస్తాడు శివుడు. తన తప్పుని సరిదిద్దుకుంటానని వసిష్ఠుడు శివుడికి చెప్పి వెంటనే శివుణ్ణి వదిలేసి అరుంధతీదేవి దగ్గరకు వెళ్ళిపోతాడు. ధన్యుడవయ్యావంటూ శివుడు వసిష్ఠుణ్ణి దీవిస్తూ నిలబడతాడు.



ఇంతలో సంధ్య శివుడి దగ్గరకొచ్చి లోకాలన్నీ తమరినే వెతుకుతున్నాయని అంటుంది. శివుడిని సంధ్య తన అక్క అరుంధతీదేవి తపస్సు చేసుకుంటున్న ఆశ్రమానికి తీసుకొని వెళుతుంది.



మార్గ మధ్యలో ప్రజలు, గోష్పాదం, కుంభోదరం, మునులు కనిపిస్తారు. తాము ఆకలితో అల్లాడుతున్నామనీ కరువుని తీర్చమనీ అంటారు. శివుడితో వస్తున్న సంధ్యను వాళ్ళు మొదట పార్వతీదేవి అనుకుంటారు. తర్వాత కులగిరి గుర్తిస్తాడు. మాదిగ పిల్లను శివుడు ముట్టుకుంటున్నాడంటాడు. శివుడు మైల పడిపోతున్నాడని గోష్పాదం, కుంభోదరం అతని మాటకు జత కలుపుతారు. చావనైనా చస్తాంగానీ మైలపడిన చేత్తో తమకేమిచ్చినా తీసుకోమంటారు.



మరొక వైపు ప్రజలు ఆకలీ… ఆకలీ అని అరుస్తుంటారు.



“ప్రజలారా! మీరెంతకాలం కుల మత వర్గ విభేదాలతో అజ్ఞానులై ప్రవర్తిస్తారో అంతకాలం మీకీ అరిష్టాలు తప్పవు. ఇక ప్రస్తుతానికి మిమ్మల్ని ఈ విపత్తునుంచి రక్షించగలవారు ఒక్క పతివ్రతలు మాత్రమే. మీరు పోయి పతివ్రతలను ఆశ్రయించండి. మీకింత భిక్ష పెట్టగలర”ని అంటాడు శివుడు.



అక్కడే దూరంగా ఉన్న ప్రాచీనుడు వర్ణాధిక్యతతో ఈశ్వరుడిని కూడా గుర్తించలేని స్థితిలో ఉంటాడు. “మాదిగ పిల్ల తపస్సు చేయడం! ఉత్పాతాలు సంభవించడం! ఎంత విపరీతంగా వుంది. ఇక ఆర్య జాతి అడుక్కు తిన్నట్టే!” అనుకుంటుంటాడు.



కొంచెం దూరం వెళ్ళిన తరువాత సంధ్యా పరమశివులను చూస్తాడు. కానీ వాళ్ళిద్దరినీ అరుంధతీదేవి వసిష్ఠులనుకుంటాడు. తన మాట వినకుండా వశిష్ఠుడు మాదిగ పిల్లనే చేరాడనుకుంటాడు. అందువల్లనే ధర్మ గ్లాని ఏర్పడిందనుకుంటాడు. ఈ ఘోరకలిని చూడలేననుకుని ముఖం తిప్పుకుంటాడు. ఈ స్థితిలో వస్తున్న పరమశివుడే ప్రాచీనుడికి అభివాదం చేస్తాడు. ప్రాచీనుడు పరీక్షగా చూసి తమర్ని గుర్తుపట్టలేదంటాడు. తనని పరిచయం చేసుకుంటాడు. ప్రాచీనుడు అప్పుడు పరమ శివుడికి నమస్కరించి ఆ పక్కనున్న సంధ్యను పార్వతీదేవేనా అని అడుగుతాడు. తాను పార్వతీదేవిని కాదనీ, అరుంధతీదేవి తన అక్క అనీ శివుడు తనకు తాత అవుతాడని సంధ్య ప్రాచీనుడికి వివరిస్తుంది.



ఆ సంభాషణకీ, సంబంధానికీ ఆశ్చర్యపోయి వాటి పూర్వాపరాలను అడుగుతాడు ప్రాచీనుడు.



తమది ఆద్యార్య సంబంధమనీ, అరుంధతీదేవి మాతంగ కన్య అయినట్లే, కాటికాపరి అయిన పరమేశ్వరుడు కూడ మాతంగుడేననీ చెబుతుంది.



తమతో వేళాకోళమాడుతున్నారేమోననే సందేహాన్ని వ్యక్తం చేస్తాడు ప్రాచీనుడు.



ఇది వేళాకోళం కాదనీ సత్యమేననీ చెప్తాడు శివుడు. “అధికారం కోసం ఆర్య ద్రావిడుల మధ్య జరిగిన అనేక యుద్ధాల పర్యవసానంగా సమాజంలో హెచ్చుతగ్గులేర్పడ్డాయి. గుణాలను అనుసరించి వృత్తులు పుట్టాయి. వృత్తులను అనుసరించి వర్ణాలేర్పడ్డాయి. అవే కులాలైనాయి. మతంగ మహర్షి సంతానం మాల మాదిగలు. మతంగుడు ఆర్య ద్రావిడ సమైక్యతా మూర్తి. ఆర్య ద్రావిడులు మూలార్య జాతి శాఖలు. అన్నదమ్ములు. ఈ భేదాలు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం సంఘ సముద్రంలో పుడుతూ పోతూ వుండే అలల వంటివని తెలిసికూడా, మీ వంటి పెద్దలు వీటిని పాటించబూనడం కడుం గడు శోచనీయం” అని స్పష్టంగా వివరిస్తాడు.



ఈ భేద భావాలు స్వార్థం కోసం మానవులు సృష్టించుకున్నవనే కనీస జ్ఞానం తనకు కలగనందుకు సిగ్గుపడుతూ మౌనంగా ఉండిపోతాడు ప్రాచీనుడు.



ఆకాశం తెల్లని మేఘాలతో పొగలు వ్యాపించి ఉంటుంది. అదంతా అరుంధతీదేవి తపస్సు వల్ల కలిగిన పొగలుగానే ప్రజలు భావిస్తుంటారు.



అరుంధతీదేవి - వసిష్ఠుల పునఃసంయోగం


అరుంధతీదేవి తపస్సు తీవ్రమై, ఆ తపోవహ్నిలో భగ్నమవుతుందేమోనని, ఆమె తమ్ముడు శివోహం ఒక పాత్రతో నీళ్ళు పట్టుకొని ఆమె చుట్టూ తిరుగుతుంటాడు.



వసిష్ఠుడు ఆకాశంలో కనిపిస్తున్న దివ్యజ్యోతిని చూసి ఆశ్చర్యపోతూ ఆందోళన పడుతుంటాడు. “తపోవహ్నిలో భస్మమైపోతున్నావా అరుంధతీదేవీ” అంటూ విలపిస్తూ తానూ యోగవహ్నిలో చితాభస్మమైపోతానని అతడు యోగ ముద్ర ధరిస్తాడు. శరీరంలో నుండి మంటలు బయలుదేరతాయి. భస్మం వాసన గుప్పుమంటుంది.



పరమశివుడు ప్రవేశించి ఈ మహా చరిత్ర విషాదాంతం కారాదని, తన దగ్గరున్న కమండలంలోని తీర్థం తీసి ఇద్దరి మీదా చల్లుతాడు.



తపోవహ్ని చల్లారిపోతుంది.



కన్నులు తెరచిన అరుంధతీదేవి, పక్కనే ఉన్న వసిష్ఠుణ్ణి చూసి పాదాభివందనం చేస్తుంది.



ఆ తరువాత పరమశివుణ్ణి చూసి భక్తి భావంతో నమస్కరిస్తుంది. తానెంత అదృష్టవంతుణ్ణో కదా అని వసిష్ఠుడు మురిసిపోతాడు.



“కల్యాణ మస్తు” అని ఇరువురినీ పరమశివుడు దీవిస్తాడు. అరుంధతీదేవి తన పక్కనే ఉన్న ప్రాచీనుడికి నమస్కరించి, ఆశీర్వాదాలు కోరుతుంది.



అతడూ ఆమెను దీవిస్తాడు.



నమస్కరించిన వసిష్ఠుడినీ ప్రాచీనుడు దీవిస్తాడు.



పరమశివుని అనుగ్రహంతో జ్ఞానినైయ్యానని చెప్పి వెళ్ళిపోతాడు.



అప్పుడు వసిష్ఠుడు పరమశివుని పాదాలపై పడతాడు. ఏదైనా వరం కోరుకోమన్న శివుడితో తనకు అరుంధతీదేవిని అగ్ని సాక్షిగా వివాహం చేయమంటాడు వసిష్ఠుడు.



ఇద్దరినీ దగ్గరకు చేరదీసి ఒకటి చేస్తాడు శివుడు.



ఇంతలో ప్రజలు, మునులు, ముని శిష్యులు కొన ఊపిరితో వస్తారు. “ఆకలి తీర్చే వాళ్ళే దొరకలేదా” అని పరమశివుడు అడుగుతాడు. దానితో వాళ్ళు ఆకలి తీర్చేవాళ్ళే దొరకలేదని, ఈ పాపాత్ములకు అన్నపూర్ణ ఎక్కడ కనపడుతుందని పశ్చాత్తాప్పడతారు.



అరుంధతీదేవి “ఈ ప్రజలింత దీనావస్థలో ఉండటానికి కారణం ఏమిట” ని పరమశివుణ్ణి అడుగుతుంది.



అదంతా అరుంధతీదేవికి జరిగిన పరాభవ ఫలితమేననీ, ప్రజల్ని రక్షించమని పరమశివుడు అరుంధతీదేవికి చెప్తాడు.



ప్రజలంతా మాదిగల అన్నం తింటారా? అని సంధ్య అడిగితే, “తింటాం తింటాం” అంటారు.



“దేవీ! నీవే ఈ ప్రజల్ని రక్షించగలవ”ని వసిష్ఠుడు కూడా చెప్తాడు.



అప్పుడు వసిష్ఠుడి పాదధూళిని తీసుకొని తాను పతిభక్తి గలదాన్నయితే, అన్నపూర్ణమ్మకు నా పట్ల దయ ఉంటే కొండ రాళ్ళన్నీ పిండి వంటలుగా మారాలనీ, చెట్లన్నీ ఫలించాలనీ, చెరువులన్నీ మంచినీళ్ళతో నిండాలని కోరుకుంటుంది.



అలాగే జరుగుతుంది



ప్రజలంతా ఆనందిస్తారు


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!