బాక్సా? భార్యా? (స్కెచ్ ).

బాక్సా? భార్యా? (స్కెచ్ ).

.

(By - Sri.Virabhadra Sastri Kalanadhabhatta.)

.

అరోజు మహిళామండలి వార్షికోత్సవం. ఈ సారి సెలిబ్రేషన్ లో ప్రత్యేకత ఏమిటంటే, సభ్యురాండ్రతోబాటు వారి భర్తలు కూడా ఆహ్వానింపబడడం. భార్యలపోరు పడలేక చాలమంది భర్తలుకూడా హాజరవడంతో హాలు కిక్కిరిసి వుంది. 

సభాప్రారంభ సూచనంగా కార్యదర్శిని అధ్యక్షురాలిని, ఇతర వక్తలను వేదికమీదకు ఆహ్వానించారు. అధ్యక్షురాలు శ్రీమతి రాధాభాయమ్మగారు వేదికమీదకు వస్తూవుంటే చప్పట్లతో హాలు మారుమ్రోగింది. ఆమె వచ్చికూర్చోగానే ఒక చిన్నపాప వచ్చి ఆమె మెడలో గులాబీల దండవేసింది. 

రాధాభాయమ్మగారు లేచి సభకు నమస్కరించి మైకు దగ్గరకు వచ్చి సుతారంగా వ్రేలితో మైకును మీటి అది పనిచేస్తోందని నిర్ధారించుకొని, కళ్ళజోడు సవరించుకొని తమ వుపన్యాసం ప్రారంభించారు. 

సభకు నమస్కారం. ఈరోజు సుదినం పర్వదినం సభ నేత్రానందకరంగావుంది. కారణం వేరే చెప్పనక్కరలేదనుక్కుంటాను. మన మహిళా మండలి సభ్యురాళ్లతోబాటు వారి భర్తలు కూడా రావడం ఎంతోముదావహం మరియు శ్లాఘనీయం (చివరముక్క ఆమె తప్పకుండా తమ వుపన్యాసంలో వుపయోగిస్తారు) 

సరే విషయంలోకి డైరెక్ట్ గా వచ్చేస్తా. ఇక్కడకు వచ్చిన మగవారికి ఒక చిన్న ప్రశ్న. మీరూ మీభార్య లక్షరూపాయలున్న ఒక బ్రీఫ్ కేసు తో ఒకనదిలో చిన్న పడవమీద వ్యాహాళికి వెళ్తున్నారనుకోండి. అహ! ఉదాహరణకు. మీరే నావకు తెడ్డువేస్తున్నారు మాయాబజారు సినిమాలో ఎ ఎన్ ఆర్ లాగ. ఇంతలో విధిబలీయమైనది. (ఇది కూడా వారు వాడే పడికట్టు మాటే) మీనావ తిరగబడి మీరు మీభార్య బ్రీఫ్ కేసుతో సహా నదిలో పడ్డారనుకోండి పాపం శమించుగాక. ఇది కేవలం వూహ మాత్రమే. అలాంటప్పుడు మీరు మీభార్యను రక్షిస్తారా లేక లక్షరూపాయలున్న మీబ్రీఫ్ కేసుకోసం తాపత్రయపడతారా? భార్యను రక్షిస్తామనే వారు దయచేసి చేతులు ఎత్తండి.

.

హాలులో వున్న మగవారందరూ చేతులెత్తారు ఒక్క రామారావు తక్క. 

అంతా అతనికేసి పురుగును చూసినట్టు చూసారు . 

రాధాభాయమ్మగారు అతనికేసి చూసి తమపేరు అని అతివినయంగా వ్యంగ్యంగా అడిగారు. 

రామారావు 

ఆపేరా!! అందుకనేనా బాబూ భార్యను వదలి వెధవడబ్బుకోసం వెంపరలాడడం ? 

వెధవ డబ్బా? లక్షరూపాయలంటే సామాన్యమాండి?? 

అయితే ఆలక్షరూపాయలకోసం అలనాటి రాముడిలా భార్యను ఆమె మానాన్న ఆమెను వదిలేస్తారా? ఆమే మునిగిపోతూవుంటే చూస్తూ వూరుకుంటారా? అని క్రోధంగా అడిగారు రాధాబాయమ్మ గారు 

షేం షేం అని సభలో కేకలు 

నాభార్య ఎందుకు మునిగిపోతుంది?? ఆమెకు ఈత బాగావచ్చు. చక్కగా ఈదుకుంటూ వస్తుంది. 

సభలో పిన్ డ్రాప్ సైలెంట్ 

ముదితల్ నేర్వగరాని విద్యకలదే ముందేల సందేహముల్??

 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!