విభీషణ.. శరణాగతి! .


విభీషణ.. శరణాగతి!
.
[ఆణిముత్యాలు..శ్రీ రాముని మాటలు.
సుగ్రీవ! ప్రపంచంలో భరతుడులాంటి సోదరుడు ఉండడు
(కోరి వచ్చిన రాజ్యాన్ని వదిలాడు కనుక),
 నాలాంటి కొడుకు ఉండడు
(తండ్రి ప్రేమని అంతలా పొందాడు కనుక) ,
నీలాంటి మిత్రుడు ఉండడు. అందుకని అన్నీ ఆ కోణంలొ పోల్చి చూడకు. వాడు దుష్టుడు కాని, మంచివాడు కాని, నా దెగ్గరికి వచ్చి శరణాగతి చేశాడు కనుక ఆయనకి శరణు ఇచ్చేస్తాను. ]
.
విభీషణుడు, మిగతా నలుగురు రాక్షసులు ఉత్తర దిక్కున రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి చేరి ఆకాశంలో నిలబడ్డారు. ఆకాశంలో ఉన్న విభీషణుడిని చూడగానే అక్కడున్న వానరాలు " రాక్షసుడు వచ్చాడు, కొట్టెయ్యండి " అని అక్కడున్న చెట్లని, పర్వతాలని పెకలించేశారు.

ఆ సమయంలో విభీషణుడు బెదరకుండా " నేను లంకని పాలించే రావణాసురుడి తమ్ముడిని, నన్ను విభీషణుడు అని పిలుస్తారు. మా అన్నగారు సీతమ్మని అపహరించి లంకలో పెట్టాడు. సీతమ్మని అపహరించేటప్పుడు ఆమెని రక్షించాలని ప్రయత్నించిన జటాయువుని నిగ్రహించి చంపాడు. దురాత్ముడైన రావణుడిని నేను ఎన్నో మంచి మాటలు చెప్పాను. కాని ఆయన నా మాటలు వినలేదు. ఆయనయందు అధర్మము ఉంది కనుక నేను ఆయనని విడిచిపెట్టి రాముడిని శరణు వేడడానికి వచ్చాను. రాముడు నాకే కాదు ఈ లోకములన్నిటికి శరణు ఇవ్వగలిగినవాడు. నేను మీకు శత్రువుని కాదు " అన్నాడు.

వెంటనే సుగ్రీవుడు పరుగు పరుగున రాముడి దెగ్గరికి వెళ్ళి " వచ్చినవాడు మనకి పరమ శత్రువైన రావణుడి తమ్ముడు. ఆయన ఒక రాక్షసుడు. ఈ యుద్ధ సమయంలో మనం యుద్ధాన్ని ప్రారంభించేముందు వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు. ఈయనకి అభయమిచ్చి కిందకి దింపావంటె మన సైన్యంలో ఎటువంటి లోపాలున్నాయో కనిపెడతాడు. ఈయన రావణుడి గూఢచారి. ఇక్కడి రహస్యాలన్నీ కనిపెట్టి మనలో మనకి బేధాలు కలపిస్తాడు. అందుకని రామ, నువ్వు ఆయనకి శరణాగతి ఇవ్వకు. మాకు అనుమతి ఇవ్వు, వాళ్ళని సంహరిస్తాము. ఒక్కసారి గుడ్లగూబని కాని కాకులు తమ గూటిలోకి రానిస్తే, కాకి పిల్లలని ఆ గుడ్లగూబ తినేస్తుంది. ఈ విభీషణుడు కూడా అదే పని చేస్తాడు. " అన్నాడు.

అప్పుడు రాముడన్నాడు " నాయందు నీకున్న ప్రీతి ఎటువంటిదో నాకు తెలుసు సుగ్రీవ. నువ్వు మాట్లాడిన మాటల వెనుక ఉన్న ఆదుర్తాని కూడా నేను కనిపెట్టగలను. నీకున్న అనుభవం చేత చక్కని ఉదాహరణలను చెప్పి బాగా మాట్లాడావు. ఈ విషయంలో నాకు సలహా ఇవ్వాలని మీలో ఎవరన్నా అనుకుంటున్నారా " అని అడిగాడు.

అంగదుడు లేచి అన్నాడు " మనం విభీషణుడిని పరీక్ష చేసి ఆయనలో సద్గుణాలు కనపడితే స్వీకరిద్దాము. ఒకవేళ దుర్గుణాలు ఎక్కువగా కనపడితే ఆయనని విడిచిపెట్టేద్దాము " అన్నాడు.

రాముడు హనుమ వంక ' నువ్వేమి చెప్పవా, హనుమ! ' అన్నట్టు చూశాడు. అప్పుడు హనుమంతుడు లేచి అన్నాడు " మహానుభావ! మూడు లోకములలో జెరిగే సమస్త విషయాలని తెలుసుకోగలిగే ప్రాజ్ఞుడవి నువ్వు, నీకు వేరొకరు చెప్పవలసిన అవసరం లేదు. నేను ఈ విషయం చెప్పేటప్పుడు వాదించడానికి చెబుతున్నాననో, తర్కం చెయ్యడానికి చెబుతున్నాననో, వేరొకరు చెప్పిన అభిప్రాయాలని ఖండించి సంఘర్షణ పడాలనుకొని చెబుతున్నాననో మీరు మాత్రం భావించకూడదు. మీరు నాయందు గౌరవముంచి అడిగారు, నేను మీయందు గౌరవముంచి నాకు యుక్తము అనిపించిన మాటలు చెబుతాను. మీరు ఆలోచన చేసి నిర్ణయించుకోండి.

ఇవతలవారికి అపకారము చేద్దామనే బుద్ధితో వచ్చి ఆకాశంలో నిలబడినవాడైతే ఆయన ముఖం అంత తేజోవంతంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉండదు, అంత ధైర్యంగా నిలబడలేడు. ఆయన ముఖంలో ఏ విధమైన దోషం కాని, శఠుడికి ఉండే బుద్ధికాని నాకు కనపడడంలేదు. ఆయన మాట్లాడిన మాటలలో దోషం పట్టుకోడానికి నాకు ఏమి కనపడలేదు. ఇటువంటప్పుడు మనం ఆయన యందు వేరొక భావనని ఆపాదించి శరణు ఇవ్వకుండా ఉండవలసిన అగత్యం ఉన్నది అని నేను అనుకోవడం లేదు. నేను మాత్రం నా బుద్ధి చేత ఒక నిర్ణయానికి వచ్చాను. విభీషణుడికి మీ పౌరుష పరాక్రమాల గురించి, మీ ధర్మము గురించి తెలుసు, ఆయనకి రావణుడు పౌరుషము తెలుసు, మీ పౌరుషం ముందు రావణుడి పౌరుషం నిలబడదు అని విభీషణుడు నిర్ణయానికి వచ్చాడు. అలాగే, మీరు వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసిన విషయాన్ని విభీషణుడు విన్నాడు, అధర్మాత్ముడిని సంహరించి ధర్మాత్ముడికి పట్టాభిషేకం చేస్తారు అని నమ్మి ఇక్కడికి వచ్చాడు. మీరు ఆయనకి శరణు ఇవ్వవచ్చు అని నేను అనుకుంటున్నాను " అన్నాడు.

అప్పుడు రాముడు " ఇప్పటిదాకా మీరందరూ, దోషములు ఉన్నాయా, దోషములు లేవ, తీసుకోవచ్చా, తీసుకోకూడదా అని పలు మాటలు చెప్పారు, నేను ఒక మాట చెబుతున్నాను వినండి. నా దెగ్గరికి వచ్చి భూమి మీద పడి ' రామ! నేను నీవాడనయ్యా, నువ్వు నన్ను రక్షించు ' అనినవాడియందు నేను గుణదోష విచారణ చెయ్యను.

సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే
అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ

వచ్చినవాడు విభీషణుడే కాని, రావణుడే కాని, నన్ను శరణు కోరినవాడు ఎవడైనా సరె రక్షిస్తాను. యదార్ధమునకు ఇటువంటి యుద్ధం జెరుగుతున్నప్పుడు పక్క రాజ్యం మీద ఇద్దరికి ఆశ ఉంటుంది. అదే కులంలో జన్మించినవాడు ఎవడు ఉంటాడొ వాడికి రాజ్యాధికారం మీద ఆశ ఉంటుంది, అలాగే పక్కనున్న రాజుకి ఆశ ఉంటుంది. అందుకని ఈ రెండిటి విషయంలో మనం తటస్థులము, కాని ఈ రెండు కారణములు తన వైపు ఉన్నాయి కాబట్టి విభీషణుడు వచ్చి శరణాగతి అడిగాడు.

సుగ్రీవ! ప్రపంచంలో భరతుడులాంటి సోదరుడు ఉండడు(కోరి వచ్చిన రాజ్యాన్ని వదిలాడు కనుక), నాలాంటి కొడుకు ఉండడు(తండ్రి ప్రేమని అంతలా పొందాడు కనుక) , నీలాంటి మిత్రుడు ఉండడు. అందుకని అన్నీ ఆ కోణంలొ పోల్చి చూడకు. వాడు దుష్టుడు కాని, మంచివాడు కాని, నా దెగ్గరికి వచ్చి శరణాగతి చేశాడు కనుక ఆయనకి శరణు ఇచ్చేస్తాను. ఈ బ్రహ్మాండములో ఉన్న పిశాచములు, దానవులు, యక్షులు, ఈ సమస్త పృధ్విలో ఉన్న భూతములు కలిసి నా మీదకి యుద్ధానికి వస్తే, నేను నా చిటికిన వేలి గోటితో చంపేస్తాను.

అప్పుడు సుగ్రీవుడు అన్నాడు " రామ! నీకు తప్ప ఇలా మాట్లాడడం ఎవరికి చేతనవుతుంది. నీ ప్రాజ్ఞతకి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను " అన్నాడు.

రాముడి మాటలకు సంతోషించిన విభీషణుడు ఆయన దెగ్గరికి వచ్చాడు. ఆయన భూమి మీదకి దిగుతూనే ' ఇది రాముడు నిలబడిన భూమి ' అని, ఆ భూమికి నమస్కరించి అన్నాడు
" రామచంద్ర! నేను రావణుడి తమ్ముడిని, నన్ను విభీషణుడు అంటారు. నేను లంకా పట్టణాన్ని విడిచిపెట్టి నీ దెగ్గరికి వచ్చేశాను. నా ఐశ్వర్యాన్ని, భార్యని, బిడ్డలని వదిలేసి నువ్వే నా సర్వస్వం అని నమ్మి వచ్చేశాను. నా శిరస్సుని నీ పాదాలకి తగల్చి శరణాగతి చేస్తున్నాను. నా యోగక్షేమములను నువ్వే వహించాలి " అన్నాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!