సురస : -
---------
సుగ్రీవుడు వానరరాజు. శ్రీ రామునికి సహాయం
చేస్తానని తాను ఇచ్చిన మాట ప్రకారం ఆయన వానర సైన్యాన్ని సీతామాత జాడ
కనుగొనడం కోసం పంపాడు. తన సైన్యాన్ని నాలుగు భాగాలుగా చేసి ఒక్కో భాగాన్ని
ఒక్కో దిక్కుకు పొమ్మన్నాడు. అలా దక్షిణం దిక్కున వెతికేందుకు వెళ్లిన
సేనలో హనుమంతుడొకడు.
హనుమంతుడు బలశాలి, తెలివైన వాడూ, అంకితభావం
కలవాడు కూడానూ. అందరూ అనుకున్నారు ముందుగానే - సీతమ్మను హనుమంతుడే వెతికి
పట్టుకుంటాడని. శ్రీ రాముడైతే తన ఉంగరాన్ని సీతమ్మకు గుర్తుగా చూపమని
ముందుగానే హనుమంతుని చేతిలో పెట్టాడు.
చివరికి హనుమంతుడు దక్షిణం దిక్కున సముద్రాన్ని ఎగిరి దాటి, నూరు యోజనాల
అవతల ఉన్న లంకలో సీతమ్మను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆకాశంలో
దేవతలంతా ఆయన్ని గమనిస్తున్నారు 'హనుమంతుడు పనిని సాధించగల్గుతాడా? దానికి
కావలిసిన పట్టుదలా, చాతుర్యము, బుద్ధికుశలతా, శారీరక శక్తీ ఉన్నాయా,
అతనికి? పరీక్షించాల్సిందే' అనుకున్నారు దేవతలు.
నాగుల తల్లి 'సురస' ను పిలిపించారు వాళ్లు. ఆమెను కొండంత పెద్దగా, కోరలతో -
భయంకరమైన రాక్షసి మాదిరి కౄరంగా తయారవమన్నారు. ఆమె అకస్మాత్తుగా
సముద్రంలోంచి పైకి లేవాలి. హనుమంతుడి ఎదురుగా నిలబడి అతని శక్తి యుక్తుల్ని
పరీక్షించాలి.
సరేనన్నది సురస. భయంకరంగా తయారై, హనుమంతుడి మార్గ
మధ్యంలో లేచి నిలబడింది. "నా అంగీకారం లేకుండా నువ్వు నన్ను దాటిపోలేవు,
హనుమాన్! నా నోటిలోకి పోవాల్సిందే, తప్పదు. నేను మళ్లీ నోరు మూసేసే లోపల
నువ్వు బయటికి రాగలిగావనుకో, అప్పుడు బ్రతికిపోతావు. లేదా, నీముందు
వేలాదిమందికిలాగే నీ జీవితమూ నా పాలౌతుంది!" అన్నది.హనుమంతుడు సురస నుండి
తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అన్నాడు 'నాకు చాలా అత్యవసరమైన పని ఉన్నది.
సీతమ్మ జాడ కనుక్కోవాలి, కాపాడాలి. నా పని పూర్తవ్వగానే నేను తిరిగివచ్చి
నీ నోటిలో ప్రవేశిస్తాను. నిజం నన్ను నమ్ము" అని.
"కుదరదు" అన్నది
సురస. "నీకెంత పని ఉన్నా సరే, లేకున్నా సరే. నువ్వు ఇప్పుడే నా నోటిలో
ప్రవేశించాలి. నేను నిన్ను ముందుకు పోనివ్వను" అన్నది.
హనుమాన్ కి
ఏం చెయ్యాలో అర్థమైంది. "సరే, నీ నోరు తెరు, బాగా" అన్నాడు. సురస రెండు
కిలోమీటర్ల బారున నోరు తెరిచింది. హనుమంతుడు నాలుగు కిలోమీటర్ల ఎత్తుకు
పెరిగాడు. పోటీగా సురస ఐదు కిలోమీటర్ల వెడల్పున నోరు తెరిచింది. హనుమంతుడు
ఇంకో నాలుగు కిలోమీటర్లు పెరిగాడు. సురసకూడ పోటీగా తన నోటిని
పదికిలోమీటర్లు చేసింది. మరు క్షణంలో హనుమంతుడు దోమంత చిన్నగా మారిపోయి,
సురస నోట్లోకి దూరాడు. పది కిలోమీటర్లున్న నోరు మూత పడేలోగా తిరిగి బయటకు
వచ్చి నిలబడ్డాడు!
సురస నవ్వి హనుమంతుడిని ఆశీర్వదించింది. "నాకు
నిన్ను చూస్తుంటే సంతోషం కలుగుతోంది హనుమాన్! నువ్వు నేను పెట్టిన పరీక్షలో
నెగ్గావు. నువ్వు నీ బుద్ధిని ఇంత సునిశితంగా ఉంచుకున్నావంటే నువ్వు తప్పక
సీతను కనుగొని, కాపాడగలవు. నీ అన్వేషణ తప్పక ఫలిస్తుంది. వెళ్లిరా నాయనా"
అని పంపింది.
సురస ఎవరో కాదు, మన అహంకారమే. అహంకారం ఎంతగానైనా
విస్తరించగలదు. అనంతంగా విస్తరించినా దానికి అంతు ఉండదు. ఒకసారి
పెరిగిందంటే, దాన్ని తిరిగి తగ్గించటం కష్టం! మన చుట్టూ ఉన్న వాళ్ల అహంకారం
పెరిగిపోయినప్పుడు, మనం ఇంకా ఒదగాలి. అలా చెయ్యకపోతే ఆ వైరుధ్యాలు మనల్ని
మింగేస్తాయి. కానీ హనుమంతుని మాదిరి, మన మనసూ సూక్ష్మంగా అవుతే, మనల్ని మనం
కాపాడుకోవటమే కాదు - అహంకారంతో ఉబ్బిపోయి ఊపిరాడకుండా ఉన్న వారికీ సాయం
చేయగలుగుతాం.
అహంకారాన్ని విమర్శించి ఏమీ ప్రయోజనం లేదు - ఎందుకంటే
'పొగరు' అనేది దాని మూల తత్వమే. అహంకారానికి సరైన మందు అణకువే. ఎంతగా
విస్తరించిన అహంకారమైనా అణకువ ముందు తల వంచక తప్పదు.
Comments
Post a Comment