ధృతరాషు్ట్ర కౌగిలి !

 ధృతరాషు్ట్ర కౌగిలి !
.
 పదివేల మదపుటేనుగుల బలముగలవాడు, పుట్టు గ్రుడ్డి, బ్రజ్ఞాచక్షుడు (బుద్ధియే కన్నుగా గలవాడు).
లోకము నందు జనులకు నెల్ల అవయవములలో శిరస్సు ప్రధానము.
 అట్టి శిరస్సులో గన్నులే ప్రధానములు. ధృతరాషు్ట్రనికి అట్టి కన్నులే లేవు, గాని గుణములచేత అతడు ఉత్తముడే యని పిల్ల (గాంధారి) నిచ్చి పెండ్లి చేసారని నన్నయ గారు వ్రాసారు.

ఆంధ్రదేశంలో ధృతరాషు్ట్ర కౌగిలి గురించి తెలియని తెలుగువాడుండడు అంటే అతిశయోక్తి కానేకాదు. కౌగిలి వల్ల కలిగే భావన ఏ సామాన్యునకైన ఒకటే, అదే సుఖప్రాప్తి. దీనిని కవులు వివిధ సందర్భాల్లో కవితల్లో, అనేక కావ్యాలలో వర్ణించి ఉన్నారు. ప్రియురాలి కౌగిలిలో కలిగే సుఖం, లేదా తల్లిదండ్రుల కౌగిలిలో కన్నబిడ్డలు పొందే సుఖానుభవం వర్ణనాతీతం.

శకుంతల నిండు సభలో దుష్యంతునకు కుమారుడైన భరతుని చూపిస్తూ, ఈ కుమారుడి కౌగిలి వలన కలిగే సుఖాన్ననుభవింపుము రాజా, ముత్యాలహారాలు, పచ్చకర్పూరపు దట్టమైన పొడి ప్రసారం, మంచి గంధము, వెన్నెలయూ జీవులకు పుత్రుని కౌగిలి వలె మనసుకు సుఖాన్ని, చల్లదనాన్ని కల్గించలేవు అంటుంది.

మరి ఈ ధృతరాషు్ట్ర కౌగిలి ప్రత్యేకత ఏమిటి? ఈ కౌగిలి వల్ల సుఖప్రాప్తి మాటెలా ఉన్నా అవతలివాడు బ్రతికి బట్ట కట్టలేడంటే అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఇప్పుడు మనం తెలుసుకోవలసింది ఈ కౌగిలి బలం ఎంత అని మాత్రమే.



 ఈ కౌగిలి రహస్యం, బలం తెలుసుకున్న ఒకే ఒక వ్యక్తి శ్రీకృష్ణుడు అంటే ఆశ్చర్యకరంగా లేదూ?



తుదకు దుర్యోధనుడు తొడలు విరిగి పడుటతో ధృతరాషు్ట్రని ఆశాతంతువు తెగిపోయినది. దుఃఖాతిశయంతో "చావరు నొవ్వరు పాండవు లేవురునని నీవు చెప్ప నిప్పలుకులు దుఃఖావేశకరములై చేతోవృత్తి దహింపజొచ్చె దుర్భరభంగిన్" - పాండవులు అయిదుగురు మరణించలేదు. ఏ విధమైన బాధను పొందలేదు. అని నీవు చెప్పిన మాటలు భరించరాని దుఃఖంతో నా గుండెను మండింపజేస్తున్నాయి.



తన కొడుకులెంత దుర్మార్గులైనను వారందరినీ హతమార్చిన వ్యక్తిని ఏ తండ్రి క్షమించగలడు? ఎవ్వరెంత ఓదార్చినను తన కొడుకుల తప్పు తనకెంత తెలిసినను రణరంగస్మశానంలో అడుగు పెట్టుసరికి ధృతరాషు్ట్రని హృదయమున పుత్రశోకము, భీముని మీది కోపము పొంగులు వారినది. తన నూరుమంది కుమారులను హతమార్చినది భీముడే!

భీముడి పేరు వినేసరికి ఆ గుడ్డిరాజు మొగంలో భయంకరమైన క్రోధం ప్రకోపించింది. త్రికాలజ్ఞుడైన శ్రీకృష్ణుడు, భీముడిని అతడి వద్దకు పంపకుండా అంతకుముందే అమర్చి ఉన్న ఒక ఇనుప భీమవిగ్రహాన్ని ధృతరాషు్ట్రడి ముందు ఉంచాడు. దాన్ని నిజభీముడని భావించి గుడ్డిరాజు తన వేయి ఏనుగుల బలాన్ని కూడగట్టుకొని కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలి బిగువులో భీముడి ఉక్కు విగ్రహం ముక్కలైంది. రాజు రొమ్ము చిట్లింది. ముఖరంధ్రాలన్నింటి నుండి రక్తం కారనారంభించింది. అతడు మూర్ఛపోయాడు. ఆ మూర్ఛలో, ఈనాటికి భీముడిని చంపగలిగాను, నా కొడుకు దుర్యోధనునికి ఈనాడే మోక్షం కలుగుతుంది - అని పలవరించాడు.
మూర్ఛ తేరిన తర్వాత తాను లోలోన సంతోషిస్తూనే ఎవరేమనుకొంటారో అని భీముడి పేరు ఉచ్ఛరిస్తూ పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు.

శ్రీకృష్ణుడా కపటనాటకాన్ని చూచి నవ్వి, భీముడు బ్రతికి ఉన్నాడని చెప్పి ధృతరాషు్ట్రని దుర్బుద్ధిని బయటపెట్టి, పాండవులను చంపినా, చనిపోయిన కౌరవులు తిరిగి వస్తారా? ఇప్పటి చర్య వలన చెరగని మచ్చవంటి పాపం చేశావని, ఇకనైన పాండవులను సామరస్యంతో చూచి విజ్ఞతను ప్రకటించుమని హెచ్చరించాడు.

శ్రీకృష్ణుడి మాటలు విని, ధృతరాషు్ట్రడు పరితప్తుడై పాండవులను సొంతకొడుకులుగా చూచుకొంటానని మాట ఇచ్చాడు.

మితిమీరిన పుత్రమమకారంతో తగిన తరుణమున తనయుల దండింపక, తరువాత దండింప గలిగినా శక్తి చాలక, సుతుల మరణమునకు, సంఘనాశనమునకు పరోక్షకారకుడై పుత్రశోకములో అపకీర్తి పాలైన తండ్రి తత్త్వమును, మహాభారతము ధ్రుతరాషు్ట్రనిలో చిత్రించింది.



Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!