బాధ్యతలను తెలిపే 'వాలి సుగ్రీవుల కథ (కృతజ్ఞతలు ..జాజి శర్మగారికి.)


బాధ్యతలను తెలిపే 'వాలి సుగ్రీవుల కథ
(కృతజ్ఞతలు ..జాజి శర్మగారికి.)

రాముడు చెట్టు చాటునుండి వాలిని కొట్టాడు. దాన్ని ఆనాడు అందరూ ధర్మం అని ఒప్పుకున్నారు. కానీ ఈనాటికి కొందరికి అది జీర్ణం కాని విషయం. వాలి రామునితో నీవు ధర్మాత్ముడవని విన్నాను, కానీ నన్ను ఇలా చాటు నుండి చంపి నీ వంశానికి మచ్చ తెచ్చుకున్నావు అని అన్నాడు. అదికూడా ఏమి చేతకాని నా తమ్ముడిని రక్షించావు, నన్నే కనక నీవు సహాయం అడిగి ఉంటే రావణాసురుడిని నీ కాళ్ళ
ముందర పడేసేవాడిని, నా శక్తి గురించి తెలియదా. పరిపాలకునికి ఉండాల్సిన నియమాలు నీకు తెలియవు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అంటాడు.ఈ భూమంతా ఈక్ష్వాకు వంశానికి చెందినది. ఆ ఈక్ష్వాకు రాజుకు ప్రతినిదిగా వచ్చాము. ఇక్కడి వ్యవస్తను చక్కబెట్టడానికి వచ్చాం. నీవు చేసిన దోషానికి ఫలం వధించడమే. ఎట్లా శిక్షించాలి అనేది సంబంధం లేని విషయం. ఇక సహాయం విషయానికి వస్తే ఒకరి సహాయం తీసుకోవడం అనేది రామచంద్రునికి అవసరం లేదు అని చెప్పాడు. ఈ విషయం సుగ్రీవునికి కూడా చెప్పాడు విభీషణున్ని రక్షించే సమయంలో. అట్లా చేయాలని అనుకోవడంలేదు, నీకు గౌరవం కట్ట బెట్టాలనేది నా కోరిక. అట్లా వాలితో నీ సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. చక్రవర్తి వద్ద నుండి వచ్చిన ప్రతినిదులం, సుగ్రీవుడు వచ్చి తన బాధ్యతని చూపించాడు. మమ్మల్ని వచ్చి స్వాగతించే బాధ్యత తెలియని నీకు పరిపాలించే అర్హత లేదు అని చెప్పాడు రాముడు.

అప్పుడు వాలి అడిగాడు, రామా మేము జంతువులం. తిన తగని జంతువులం, అట్లాంటి నన్ను చాటు నుండి సంహరించావు ఇది న్యాయమేనా అని, నన్ను ఎందుకు హతమార్చావు, నీకు నాకు ఏమైనా శత్రుత్వం ఉందా అని వాలి శ్రీరాముడిని అడిగాడు. అందుకు శ్రీరాముడు నేను వైరం ఉంది అని చేయట్లేదు, నీవు చేసింది అధర్మం కనక దాన్ని సరి దిద్దడాని కోసం చేసాను. జంతువును కదా అట్లా నన్ను వెనకనుండి చంపవచ్చా, ఇదేమైనా న్యాయమా అని అడిగాడు. జంతువువు కనుకనే అట్లా చంపాను, ఏదైనా జంతువును వేటాడాలంటే ఒక జంతువును ఎరగా పెట్టాలి, అట్లా నేను సుగ్రీవుడిని పెట్టి నిన్ను చంపాను. నీవు ఇక్కడి వ్యవస్తను పాటించలేదు కనక ఇట్లా చేయాల్సి వచ్చింది అని చెప్పాడు. అందుకు వాలి అంగీకరించాడు. తమ్ముడు అంటే కొడుకు సమానం, అతడి భార్య బిడ్డతో సమానం అట్లాంటి తమ్ముడి భార్యను బంధించడం తప్పు అని చెప్పాడు. ఇది ఘోరమైన అపరాదం మా రాజ్యం ప్రకారం. అందుకు వాలి తన తప్పుని అంగీకరించాడు, తన కుమారుడైన అంగదుడిని మంచిగా చూసుకోవాలని కోరుకున్నాడు. అట్లా సుగ్రీవుడితో సఖ్యం చేసుకున్నాడు కనక సుగ్రీవుడిని కాపాడాడు. సుగ్రీవునికి ఏది అనుకూలమో అది చేసాడు. అందుకే వాలిని సంహరించడం అనేది రామునికి దొషము లేదు. ఆయన ధర్మాత్ముడని సమాజం గుర్తించింది. నింద వచ్చినా పరిపాలకుడు ఎవరిని వారి వారి హద్దులలో ఉంచాలి అని తెలిసినవాడు శ్రీరామచంద్రుడు. అందుకే ఆయన మూర్తీభవించిన ధర్మం అని చెబుతారు. ఇది చేయాలా వద్దా ? తగునా కాదా ? అని ఇలా మనకు జీవితంలో ఎన్నో విషయాలు ఎదురవుతుంటాయి. శ్రీరామచంద్రుడు వాలితో ఒక మాట అన్నాడు, నిన్ను చంపినందుకు నాకు మనస్సులో అయ్యో పాపం అని కొంత కూడా అనిపించడం లేదు. ఇదే మొదటి ప్రమాణం అని చెప్పాడు. ఏదైనా చేయాలంటే అది మనకు నచ్చినదైతే మన మనస్సు చెప్పినదాన్ని ఒప్పుకుంటాం, కానీ చాలా చోట్ల మన మనస్సు చెప్పినదాన్ని ఒప్పుకోం. ఇది మన ప్రవృత్తి. ఆమనస్సును మనం ధర్మానికి కట్టుబడేలా చేసుకోవాలి. శ్రీరాముని చరిత్రను మన ముందు పెట్టుకోగలిగితే మనం ఏది తగినదిగా స్వీకరించాలి, దేన్ని తగనిదిగా వదలాలి అనేది తెలుస్తుంది. రాముడు వాలిని సంహరించాక వానరుల రాజ్యాన్ని తాను తీసుకోలేదు, అందుకే సుగ్రీవుడు రామునికి దాసుడైపోయాడు. రావణాసురుడిని సంహరించాక ఆరాజ్యాన్ని విభీషణునికి ఉచ్చాడు, అలా అందించినందుకు విభీషణుడు దాసుడై పోయాడు. అట్లా రామ రాజ్యం అయ్యింది. ఒకరిని అణిచివేయకూడదు. సమాజం అన్నాక అన్ని రకాల జాతులు ఉంటాయి. ఎన్నో మతాలు, కులాలు ఉంటాయి. ఎవరు వారి ధర్మాన్ని పాటించుకోవాలి. ఇతర ధర్మాలను గౌరవించాలి. అందుకే మనం చేసే వైధిక కార్యాలు లోకం మొత్తం బాగుకోసం. అట్లా మన మనస్సును మనం సంస్కరించుకోవాలి.

సుగ్రీవునికి రాజ్యం అప్పగించాక, వర్షాకాలం అయ్యేసరికి నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. ఆతరువాత సీతకోసం వెతకడానికి బయలుదేరుదాం అని చెప్పాడు. వనవాస నియమం ప్రకారం రాముడు కొండగుహల్లో గడిపాడు. కనీసం ఒక్క సారి వెళ్ళి పలకరించలేదు సుగ్రీవుడు. తన బాధ్యతలను పూర్తిగా మరచిపోయాడు. అప్పుడు రాముడు తిరిగి బాధ్యతలను గుర్తుచేయాల్సి వచ్చింది. సుగ్రీవా! వాలి వెళ్ళిన దారి ఇంకా మూసివేయలేదు, తెరిచి అట్లే పెట్టాను, నిన్ను ముందు వెనక కొందరిని కలిపి మర్యాదగా పంపాల్సి ఉంటుంది జాగ్రత్త అని హెచ్చరించాడు. హనుమంతుడు, అంగదుడు, లక్ష్మణుడు వెళ్ళి చెప్పాక సుగ్రీవుడు తన బాధ్యత గుర్తించాడు.

లోకంలో మనం ప్రవర్తించేప్పుడు మన హక్కుకు ముందు మన బాధ్యత ఎమిటో తెలుసుకోవాలి. వాలి, సుగ్రీవులు ఇద్దరూ వారి వారి హక్కు ఏమిటో తెలుసుకున్నారు కానీబాధ్యత ఏమిటో తెలుసుకోలేదు. రామచంద్రుడు విభీషణుడిని ఎట్లా రక్షించాలో అని అడిగితే, రక్షించాలా వద్దా అని తన సలహా చెప్పాడు సుగ్రీవుడు. అందుకే చివర హనుమంతుడిని అడిగితే, నేను గొప్ప చదుకుకున్నవాడినని కాదు, నేను మీకు చెప్పగలిగిన వాడిని కాదు, కానీ మీరు అడిగినప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉంది కనక చెబుతున్నా అని చెప్పాడు. అశ్రయించినవాడిని తప్పక రక్షించి తీరాలి అని చెప్పాడు. వాడు శత్రువైనా సరే, మన ప్రాణాలకు హాని అయినా సరే రక్షించి తీరాలి. ఇది బాధ్యత అంటే. హక్కులు తరువాత విషయం. బాధ్యతలు సవ్యంగా నెరవేర్చుకోవడం కోసం హక్కులు తెలియాలి. మానవుడిగా మనకు కొన్నిబాధ్యతలు ఉన్నాయి, మన చుట్టూ ఉన్నవారిని గౌరవించాలి, ప్రకృతిని గౌరవించాలి. ఇది మన బాధ్యత. వాలి తన బాధ్యత విస్మరించాడు కనుక దండన పొందాడు. సుగ్రీవుడు తన బాధ్యత విస్మరించాడు కనుక దండన పొందాడు. హనుమంతుడు తన బాధ్యత గుర్తించాడు కనక రాముని విశ్వాస పాత్రుడైనాడు. మనిషి అట్లా బాధ్యతని గుర్తించి బ్రతికితే సరియైన రక్షణకి యోగ్యుడవుతాడు. కిష్కింద కాండలో వాలి సుగ్రీవుల కథలో రాముడు నిరూపించాడు.

తన సైన్యాన్ని నాలుగు దిక్కులకి పంపిం రామ కార్యానికి ఉద్యుక్తుడు అయ్యాడు. సీతమ్మను అన్వేషించడానికి సుగ్రీవుడు తన సైన్యాన్ని నాలుడు భాగాలు చేసి, నాలుగు దిక్కులకి ఎంతవరకు వెళ్ళవచ్చు, ఆ వెళ్ళే మార్గంలో ఏమేమి ఉంటాయి, అక్కడ ఎట్లా ప్రవర్తించాలి అనే విషయాలని చెప్పి పంపాడు. ముఖ్యంగా దక్షిణ దిక్కుకి వెళ్ళే హనుమంతునికి శ్రీరామ చంద్రుడు తన నామంతో ఉండే అంగుళికాన్ని ఇచ్చి, నీవల్ల ఈ పని జరుగుతుంది అని ఆశీర్వదించి పంపాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళినవారు సముద్రం వరకు చేరుతారు. అంతవరకు కిష్కింద కాండ.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!