‘లక్ష్మణదేవర నవ్వు’!
‘లక్ష్మణదేవర నవ్వు’!
_రచన: వెల్చేరు నారాయణరావు!
నవ్వు నాలుగందాల చేటన్నారు. అంటే నాలుగు విధాల అని అర్థం. ఈ నాలుగూ ఏమిటో
నాకు తెలీవు. కాని పాత కుటుంబాలలో ఆడవాళ్ళు నవ్వడం తప్పుగా భావించేవారు.
ముఖ్యంగా మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆడవాళ్ళు నవ్వితే వాటికి వెంటనే తప్పు
అర్థాలు వస్తాయని పెద్దవాళ్ళు ఆడపిల్లల్ని వారించేవారు. ఆమాటకొస్తే నవ్వడం
విషయంలో మొగవాళ్ళక్కూడా ఈ అదుపులు ఉన్నాయని సుమతీశతకం చదివితే తెలుస్తుంది.
నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లిదండ్రి నాథులతోడన్
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ
మొగవాళ్ళనుద్దేశించిన ఈ మాటకీ, ఆడవాళ్ళు నవ్వకూడదనే ఆ మాటకీ చిన్న తేడా
ఉన్నట్టు కనిపిస్తుంది. ఆడవాళ్ళు నవ్వడం తప్పు. తప్పు అంటే ఆడవాళ్లుగా
వాళ్ల శీలానికి కలిగే మచ్చ. మగవాళ్ళు నవ్వకపోవడం నీతి. నీతి అంటే లౌకిక
వ్యవహారాల్లో ఇబ్బందులు తెచ్చుకోకుండా తెలివితేటలుగా వ్యవహరించే పద్ధతి.
అంటే లౌక్యం.
నవ్వు చాలా రకాలు: ఎవరితోనైనా కలిసి నవ్వడం,
ఎవరినైనా చూసి స్నేహపూర్వకంగా నవ్వడం, వాళ్లపట్ల ఆకర్షితులై ఆ సంగతి
సూచిస్తూ నవ్వడం, వాళ్ళని సంతోషపరచడానికి నవ్వడం, ఊరికే సరదాగా నవ్వడం, ఏదో
చమత్కారమైన సందర్భం గుర్తువచ్చి నవ్వడం – ఇవన్నీ ఉత్సాహాన్నీ,
మంచితనాన్నీ, ఆకర్షణనీ, అంతరంగాన్నీ తెలిపే నవ్వులు. ఇంకో రకం నవ్వు అవహేళన
చేసే నవ్వు. ఈ రెంటికీ మధ్యనున్న తేడా చెరిగిపోయిన సందర్భాన్ని విస్తారంగా
చెప్పే పాట స్త్రీల రామాయణపు పాటల్లో లక్ష్మణదేవర నవ్వు అనేది.
ఈ
పాట ఎక్కువ ప్రచారంలో ఉన్నట్టు కనిపించదు. మా అమ్మో, బామ్మో ఈ పాట పాడేది
అని చెప్పిన ఆడవాళ్ళెవరూ నాకు తారసపడలేదు. ఈ పాటకి నాకున్న ఆధారం అల్లా
ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు ప్రచురించిన స్త్రీల రామాయణపు పాటలు అనే
పుస్తకంలో ఉన్న పాఠమే. ఎన్. వి. గోపాల్&కో వాళ్ళు వాళ్ళ ప్రచురణలో
ఇది చేర్చలేదు. ఆంధ్ర సారస్వత పరిషత్తు వారి పాఠం చాలా తప్పులతో
అన్వయించుకోవడం కష్టమయ్యే అపపాఠాలతో గందరగోళంగా ఉంది. దాని సవరించడానికి
కానీ పరిష్కరించడానికి గానీ ఇంకా కొన్ని ఇతర పాఠాలు దొరికితే తప్ప సాధ్యం
కాదు. ధైర్యం చేసి దిద్దబోతే స్వతంత్రించి పాటపాడిన కవయిత్రి భాషని ఇష్టం
వచ్చినట్టు దిద్దినట్టౌతుంది. అంచేత ఉన్న పాఠం ఆధారంగానే ఈ వ్యాసం
రాస్తున్నాను.
ఈ పాట పేరే చాలా కొత్తరకంగా ఉంది. దేవర అనే మాట
తెలుగులో వాడుకలో లేని మాట కాదు. ఉదాహరణకి మనుచరిత్రలో ప్రవరుడి
తల్లిదండ్రులను వర్ణిస్తూ, ‘దేవియుందేవరవోలె’ అన్నాడు పెద్దన, అంటే
పార్వతీపరమేశ్వరులలాగా అని అర్థం. కాని, ఇక్కడ దేవర అంటే దేవుడు అనే అర్థం
కాదు. దేవరన్యాయం అని మీకు తెలిసిందే ఇంకో మాట ఉంది. భర్త వల్ల సంతానం
కలగకపోతే అతని తోబుట్టువు ద్వారా సంతానం కనే న్యాయం మహాభారతకథ
తెలిసినవాళ్ళకి పరిచితమే. ఇక్కడ దేవర అనే మాటకి మహాభారతంలో లాగా భర్త
తోబుట్టువు అని అర్థం. లక్ష్మణుడికి ఈ మాట వాడటం స్త్రీల పాటల్లోనే వుంది.
మొత్తంమీద స్త్రీల పాటలు లక్ష్మణుడికి చాలా ఆప్యాయమైన ప్రాధాన్యం ఇచ్చాయని
ఇంకోసారి మనకి జ్ఞాపకం వస్తుంది, ఈ పాటవల్ల.
ఇంతకీ ఈ పాట ఏమిటి?
లక్ష్మణుడు తన అన్నతో, అన్న భార్యతో అడవికి వెళ్ళేటప్పుడు ఊర్మిళా తానూ ఒక
ఒప్పందం చేసుకున్నారని మనకు తెలుసు. ఆ ఒప్పందానికి సంబంధించిన ఊర్మిళ కథ
మనం ఊర్మిళాదేవి నిద్ర పాటలో విన్నాం. ఈ లక్ష్మణదేవర నవ్వు ఆ ఒప్పందానికి
సంబంధించిన లక్ష్మణుడి కథ.
శ్రీరాముడు రావణవధ అనంతరం అయోధ్యకు
చేరుకోవడంతో కథ మొదలౌతుంది. ఆరుబయట వెన్నెల్లో అఖిలాండ కోటిబ్రహ్మాండ
నాయకుడు, రాముడు కొలువు తీరతాడు. వేల సంఖ్యలో గద్దెలు ఏర్పాటు చేస్తారు. ఆ
గద్దెల మీద విభీషణుడు మొదలైన లంకావాసులు, సుగ్రీవుడు మొదలైన
కిష్కింధాపురవాసులు, ఈశ్వరుడు, ఇంద్రాదులైన దేవతలు, వారితో పాటు
అయోధ్యాపురప్రముఖులు అందరూ కూర్చున్నారు. సభ అంతా నిండుగా గంభీరంగా ఉన్న
సమయంలో అకస్మాత్తుగా లక్ష్మణుడు కిలకిల నవ్వుతాడు. లక్ష్మణుడు అలా
నవ్వేసరికి అందరూ విస్తుపోతారు. ఎవరి మటుకి వారు ఆ నవ్వుకి వాళ్ళకి తోచిన
అర్థం చెప్పుకుంటారు. జాలరివాళ్ళ అమ్మాయిని, గంగని పెళ్ళిచేసుకుని
నెత్తిమీద పెట్టుకున్నానని లక్ష్మణుడు తనను చూసే నవ్వుతున్నాడనుకొని శివుడు
తల వంచుకుంటాడు. ఈశ్వరుడి పెళ్ళికి అందరితో పాటు తనూ వెళ్ళగా కాలు మడత పడి
క్రింద పడినప్పుడు నడుము విరిగి, ఆ వొంగిన నడుముతోటే ఈ సభకి చక్కా
వచ్చినందుకు తన్నే చూసి నవ్వుతున్నాడు అని జాంబవంతుడనుకుంటాడు. అలా అనుకుని
తల వంచుకుంటాడు. ఆ సభలో ఆదిశేషుడు కూడా ఉన్నాడు. ఆయన శ్రీమహావిష్ణువుకి
సముద్రంలో శయ్యగా ఉండి సేవ చేసినవాడు. కాని ఇప్పుడు అతనికి పగవాడైన
శివునికి సేవకుడిగా ఈ సభకి వచ్చాడు. తనని చూసే లక్ష్మణుడు నవ్వుతున్నాడు
అని అవమానభారంతో ఆదిశేషుడు తల వంచుకుంటాడు.
ఆ సభలో ఉన్న ఇంకొకడు
నీలుడు. నీలుడంటే సముద్రం మీద వారధి కట్టడంలో శ్రీరాముడికి తోడ్పడిన ప్రధాన
నిర్మాత. అయితే ఈ నీలుడి గురించి తెలుగుదేశంలో ఒక కథ ఉంది. అతడు
చిన్నవాడుగా ఉండగా ఇంట్లో ఉన్న అన్ని వస్తువులూ తీసుకెళ్ళి నీళ్ళల్లో
పారేసేవాడట. అవి మునిగిపోతే వెతికి తెచ్చుకోవడానికి ఇంట్లో వాళ్ళు నానా
తాపత్రయాలూ పడేవారట. ఒకరోజున ఈ అబ్బాయి తన తండ్రి పూజాసామగ్రిని తీసుకెళ్ళి
నీళ్ళల్లో పారేశాడట. దాంతో ఆ తండ్రి ఇకనుంచి నీవు నీళ్ళల్లో పారవేసిన ఏ
వస్తువైనా మునగకుండా తేలుగాక అని వరం ఇచ్చాడట. శ్రీరాముడు వారధి కట్టించే
సమయంలో కోతులు కొండలనన్నీ పట్టుకువచ్చి సముద్రంలో పడేస్తూంటే అవి
మునిగిపొయేవి. ఏంచెయ్యాలో తోచక అందరూ అయోమయంలో ఉంటే నీలుడు వొచ్చి తండ్రి
తనకిచ్చిన వరం ఈ అవసరానికి పనికొస్తుందనీ, తన చేతుల మీదుగా రాళ్లని
సముద్రంలో వేస్తే అవి మునగవనీ, తేలతాయనీ ఆ రకంగా వారధి తేలికగా కట్టొచ్చనీ
ఉపాయం చెప్తాడు. ఆ తరవాత వరసగా కోతులు కొండరాళ్ళు పట్టుకురావడం,
నీలుడికివ్వడం, నీలుడు వాటిని సముద్రంలో వేసి వారధి కట్టడం జరుగుతుంది.
అయితే స్త్రీల పాటల్లో ఈ కథకి ఇంకో చిన్న మెలిక ఉంది. నీలుడు తండ్రి
పూజాద్రవ్యాలని నీళ్ళలో పడేసి, అవి తేలకుండా నీళ్ళల్లో నొక్కి పట్టేవాడట.
అందుకని తండ్రికి కోపం వచ్చి, నువ్వు నీళ్ళల్లో పడేసే ఏ వస్తువూ కూడా ఇక
మునగకుండా ఉండుగాక అని శపిస్తాడు. ఆ మాట నీలుడు రాముడికి చెప్పలేదు. తండ్రి
ఇచ్చిన శాపాన్ని వరంగా మార్చి అబద్ధం చెప్పాడు నీలుడు. ఆ సంగతి తెలిసి
లక్ష్మణుడు నవ్వుతున్నాడని అవమానపడి నీలుడు తలవంచుకుంటాడు. ఆ సభలో ఉన్న
అంగదుడు, లక్ష్మణుడు తనని చూసే నవ్వుతున్నాడనుకుంటాడు. తన తండ్రిని చంపిన
రామునికి తాను ఈవేళ సేవకుడయ్యాడు అది ఎంత అవమానం. అలాగే సుగ్రీవుడు కూడా.
తన అన్న వాలిని అన్యాయంగా రాముని చేత చంపించి, ఆ అన్న భార్యని తన భార్యగా
చేసుకుని కన్నూ మిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నాడీ సుగ్రీవుడని తనని చూసే
లక్ష్మణుడు నవ్వుతున్నాడని తల వంచుకుంటాడు. విభీషణుడు దాచుకున్న రహస్యం
కూడా ఒకటుంది. తన అన్న ఆయువుపట్లు రహస్యంగా రాముడికి చెబుతాడు విభీషణుడు. ఆ
రకంగా తన అన్నని చంపించి లంకారాజ్యానికి తాను రాజైనానని లక్ష్మణుడికి
తెలుసు. ఇక హనుమంతుడున్నాడు. అంత బలవంతుడు, గొప్పవాడు, ఒక చిన్నవాడు
ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి దొరికిపోయాడు. ఆ అవమానపు కథ
లక్ష్మణుడికి తెలుసు. అంచేత తన్ను చూసే లక్ష్మణుడు నవ్వుతున్నాడని తల
వంచుకుంటాడు.
ఇకపోతే సీత, లక్ష్మణుడు తనని గురించే నవ్వుతున్నాడనుకునే సందర్భంలో ఈ కింది చరణాలు కొంచెం తికమకగా ఉన్నాయి.
కారడవిలో దశకంఠునిచేత | పట్టుబడ్డట్టి యో సతి తొడలమీద ||
పెట్టుకొనియున్నాడు సృష్టీశ్వరుడనుచు | అతివ యారునెలలు బాసి యీ రాజు ||
ప్రాణములు యెట్లుండెయో కోమలాంగీ | ఆడరాని మాటలాడి తివనుచూ ||
ఆడవారీ మాట నమ్మరాదనుచు | తలచి లక్ష్మణ నేడు తానవ్వెననుచు ||
ధాత్రిసుత కొలువులో తలవంచుకొనెను |
ఈ చరణాలని –
‘కారడవిలో దశకంఠునిచేత పట్టుబడ్డట్టి ఒక సతి(ని) తొడలమీద
పెట్టుకొనియున్నాడు సృష్టీశ్వరుడనుచు,
ఆరునెలలు యీ రాజు(ని) బాసి అతివ (నీ) ప్రాణములు యెట్లుండె(ను?)
ఓ కోమలాంగీ, ఆడరాని మాటలాడితివి అనుచూ
ఆడవారి మాట నమ్మరాదనుచు తలచి లక్ష్మణుడు నేడు తానవ్వెననుచు
ధాత్రిసుత కొలువులో తలవంచుకొనెను’
అని సవరించుకుని చదివితే వొచ్చే తాత్పర్యార్థం ఇది:
కారడవిలో రావణాసురుని చేత పట్టుపడిన నిన్ను తొడలమీద పెట్టుకొని ఉన్నాడు
రాముడు. ఆయన ఒక క్షణం నీ దగ్గిర లేకపోతే నీకు ప్రాణాలు నిలవవని అన్నావు
గుర్తుందా, అప్పుడే నన్ను అనరాని మాటలు అన్నావు కదా, మరి ఇప్పుడు ఆరునెలలు
రాముడు లేకుండా ప్రాణాలు నీకు ఎలా నిలిచాయి? ఆడవాళ్ల మాటలు నమ్మకూడదు.
ఈ రకమైన వూహలు మనస్సులో పెట్టుకుని, తనని చూసే లక్ష్మణుడు నవ్వుతున్నాడనుకుంది సీత.
సీత తలవంచుకోవడం చూసి రాముడు కూడా చిన్నబోతాడు. ఇంతకాలంగా ఈ రాజ్యాన్ని
ఏలుతున్నాను, అయినా ఈవేళ ఈ విపరీతమేమిటి అని, లక్ష్మణుడు సభలో నవ్వినందుకు
అతని తల తెగవేస్తానని రాముడు కత్తి ఎత్తుతాడు. సభలోని వాళ్ళంతా ఆయన్ని
అడ్డుకుంటారు. మహారాజా, లక్ష్మణుడు చిన్నవాడు, అతని తల నరకడం న్యాయం కాదు
అని రాముణ్ణి ఆపుతారు. అప్పుడు రాముడు లక్ష్మణుణ్ణి అడుగుతాడు, ‘ఓ వీరుడా,
శూరుడా, తమ్ముడా, సభలో ఎందుకు నవ్వావు చెప్పు’ అని.
ఇక్కడ కొన్ని
చరణాలు గజిబిజిగా కలిసిపోయి ఉన్నాయి. అయినా సమన్వయించుకొని చదివితే,
లక్ష్మణుడు ఇలా అంటాడు. “మనం అడవులకు పోయినప్పుడు, ఆ పర్ణశాలలో మీకు నేను
సేవ చేస్తూండగా, రాత్రి రెండు ఝాముల వేళ నిద్రాదేవి ఏడుస్తూ వచ్చింది.
సతిరూపంలో వచ్చిన ఆవిడని నేనడిగాను, ‘నీవెవ్వరవు, ఎందుకేడుస్తున్నావు?’
అని. అప్పుడు నిద్రాదేవి తాను నిద్రాదేవిననీ, తాను అష్టదిగ్గజాలలోనూ,
ఆదిఋషులలోనూ, వైకుంఠనాథునిలోనూ ఉంటాననీ. మానవులెవ్వరూ తన్ను గెలవలేరు కానీ
నేను తనని నాదగ్గిరికి రానివ్వడం లేదనీ అంది. ఆమె ఆజ్ఞను తప్పించుకోవడం
సాధ్యం కాదని గమనించి, ఆమెకు ముమ్మారు ప్రక్షిణం చేసి ‘నేను మా అన్నకి,
వదినకి ఈ పర్ణశాలలో కాపలా ఉండాలి. అక్కడ అయోధ్యలో నన్ను వదిలి నా భార్య
ఒక్కత్తే ఉన్నది. ఆవిడ రాత్రీపగలూ లేవకుండా ఆవిడని ఆవహించు. మళ్ళా మేం
తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు, రాముడూ, ఆయన సేనలూ మంత్రులూ కొలువై ఉంటారు.
అప్పుడు నన్ను ఆవహించు’ అని ఆమెకు విన్నవించాను. ఆమాట ప్రకారం, ఒక్క క్షణం
కూడా ఆలస్యం చేయకుండా నిద్రాదేవి నన్ను ఈ సభలో ఆవహించినందుకు నాకు
నవ్వొచ్చింది” అని లక్ష్మణుడు సమాధానం చెబుతాడు. తాను చేసిన పాపానికి
పరిహారమేమిటని రాముడు విచారిస్తూండగా, వశిష్టుడు ఆయనతో, “అయ్యా, మీరు చేసిన
పని మంచి పని కాదు. దానికి పరిహారంగా లక్ష్మణుడికి మీరు కాళ్లు పట్టాలి,”
అంటాడు. రాముడు ఆ మాటకి సంతోషించి, సేవకులని పిలిచి లక్ష్మణుడికి పక్క
ఏర్పాటు చేయమని ఆజ్ఞాపిస్తాడు.
ఆ తరవాత దాదాపు పదహారు చరణాలు ఆ
పక్క వర్ణన. ఆ పక్కమీద మల్లెలూ, చామంతులూ, పారిజాతాలూ, కనకరత్నాలు,
కలవపువ్వులూ, జాజిపువ్వులూ అన్ని పరిచి, మొగలిపూరేకుల తలగడలు పెట్టి అందంగా
ఏర్పాటు చేస్తారు. అంగదుడూ, హనుమంతుడూ, సుగ్రీవుడూ ఆ పక్క చూసి, ఆ సొంపు
చూడడానికి రెండుకళ్ళు చాలవని ఆశ్చర్యపోతారు. తన పాదాల వద్ద అలిసిపోయి పడి
ఉన్న లక్ష్మణుణ్ణి రాముడు ఎత్తి పక్కమీద పడుకోబెడతాడు. ఊర్మిళాదేవి
తలంటుపోసుకుని, పీతాంబరం కట్టి, నగలు పెట్టుకుని, పైట జారుతూండగా వారచూపులు
చూస్తూ భర్త దగ్గిరికి వస్తుంది. లక్ష్మణుడు ఆమెను వారించి, నువ్వు
రావడానికి ఇది సమయం కాదు అంటాడు. తరవాత లక్ష్మణుడు నిద్రపోతాడు. అలా
చాలాసేపు నిద్రపోతూంటే, ఏమిటి తమ్ముడు ఇంతసేపు నిద్రపోతున్నాడని, రాముడు
హనుమంతుణ్ణి పంపుతాడు: ఊర్మిళతో సరసాలాడుతున్నాడా, జలక్రీడలాడుతున్నాడా
చూసి చెప్పమని. హనుమంతుడు వెళ్ళి వచ్చి, లక్ష్మణుడు నిద్ర పోతున్నాడు, తన
దగ్గిర ఎవ్వరూ లేరు అని చెబుతాడు. అప్పుడు రాముడు, శతృఘ్నునితో సహా
లక్ష్మణుడి పడకగదిలోకి వచ్చి పక్క మీద కూర్చుని, తమ్ముడి పాదాలు తన తొడమీద
పెట్టుకుని కాళ్ళు పట్టడం ప్రారంభిస్తాడు. నిద్రలో ఉన్న లక్ష్మణుడు
కలగంటున్నా ననుకుంటాడు. తీరా కళ్ళు తెరిచి అది కల కాదు నిజమే, ఆ కాళ్ళు
పట్టేవాడు శ్రీరాముడని చూసి, లేచి ఆయన పాదాలమీద పడతాడు. “నేను మీ పాదాలు
వొత్తవలసిన వయసు వాణ్ణి. సమస్తదేవతలూ మీ పాదాలు పట్టుకుంటారు. అహల్యను
పవిత్రురాలిని చేసిన పాదాలు మీవి. బలి శిరస్సు మీదనున్న పాదాలు మీవి. నా
పాదాలు మీరు పట్టడం తగదు.” అంటాడు లక్ష్మణుడు. తన పాదాలమీది పడిన
లక్ష్మణుణ్ణి రాముడు లేవనెత్తి కనక సింహాసనం మీద కూర్చోబెట్టి,
చంద్రుడు లేని రాత్రి యెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు ||
దీపమ్ము లేనిల్లు యెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు ||
పతిలేని సతి యెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు ||
ఉదకమ్ములేని కలశ మెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు ||
చిలుకలేని పంజర మెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు ||
అని లక్ష్మణుడిని సభకు తీసుకొనివచ్చి, ముత్యాలగద్దె మీద కూర్చుండబెట్టి తాను రత్నసింహాసనం మీద కూర్చుంటాడు.
ఇక్కడితో ఈ పాట అయిపోయింది. కానీ అచ్చుపుస్తకంలో ఈ పాట ఇంకో పాటతో కలిసిపోయి ఇంకా దీర్ఘంగా సాగుతుంది.
ఇంతకీ ఈ పాటవల్ల మనకి తెలిసేదేమిటి? ఇందులో భాష, మాటల వాడుక, చరణాలు
కూర్చే తీరు ఇవన్నీ చూస్తూంటే, ఇది స్త్రీలు పాడుకునే పాటే కాకుండా, ఎవరో
స్త్రీ రాసిన పాట కూడా అని తెలుస్తుంది దురదృష్టవశాత్తూ, రకరకాల అనాదరణలు
కారణంగా అచ్చులో గజిబిజిగా వచ్చింది. అయినా, పాటలో అర్థం బోధపరచుకోడానికీ
అది పెద్ద అడ్డంకి కాదు. అందుకని, ఈ పాట ఉద్దేశించిన సంగతుల్ని
బోధపరచుకోవడానికి ప్రయత్నిద్దాం.
నవ్వు నాలుగందాల చేటు అనే మాట
వల్ల ఎక్కువగా తమ సంతోషాలని అణగదొక్కుకుని లోపలుండే నవ్వుల్ని పెదవుల అంచుల
దగ్గరే ఆపేసి ఉంచుకోవలసిన ఆడవాళ్ళు నవ్వు గురించి రకరకాలుగా ఊహించిన పాట
ఇది. దాంతో పాటు పైకి ఎంతో గంభీరంగా కనిపించే ప్రపంచంలో చాలామంది నవ్వుని
ఎందుకు వెంటనే అపార్థం చేసుకుంటారో మనకి నవ్వొచ్చేలా చెప్పే పాట ఇది.
ఇంకొంచెం ముందుకెళితే ప్రపంచంలో అందరూ, దేవుళ్ళ దగ్గరి నించీ మామూలు మనుషుల
దాకా పైకి నిబ్బరంగా కనిపించే వాళ్ళే కానీ, లోపల ప్రతి వాళ్ళకీ ఏదో ఒక
లొసుగు ఉంది. ఆ లొసుగు, ఎవరికీ తెలీదనుకుని బతికేస్తూంటారు కానీ, అది
తెలిసిపోయిందనే అనుమానం వస్తే వాళ్ళు గాలి తీసిన బుడగల్లా ముడుచుకుపోతారు. ఈ
ప్రపంచపు తరహా అది. ఈ సంగతి ఈ ప్రపంచంలో ఆడవాళ్ళకే ఎక్కువ తెలుసు అని
చెప్పే పాట కూడా ఇది. వాళ్ళని నవ్వకుండా చేసే ఈ ప్రపంచం ఎందుకు నవ్వకుండా
చేసిందో వాళ్ళ కర్థమయిందని మరీమరీ చెప్పే పాట ఇది.
ఈ పాట మొత్తం
మీద లక్ష్మణుడి నవ్వు వల్ల తలవంచుకోనివాడు రాముడొక్కడే. కానీ ఆ రాముడే
అందరికన్నా ఎక్కువగా తలవంచుకోవాల్సిన తీవ్రమైన కోపాన్ని ప్రదర్శించి
చివరికి తమ్ముడి కాళ్ళు పట్టుకోవలసిన శిక్షకి గురి అవుతాడు.
నామాట
విని నవ్వండి, నవ్వు వల్ల ఏ చేటూ రాదు, ఎవరి నవ్వూ ఎవరి లోపాన్నీ
చూపించదు, మీరు రకరకాల అర్థాలు చెప్పుకోకుండా మీరూ నవ్వండి. నవ్వితే అందరూ
సంతోషంగా అందంగా ఉంటారు, అని చెప్పే చక్కని పాట ఇది.
మరిది లక్ష్మణుడు ఆడవాళ్ళందరికీ దగ్గిరవాడు. అతను నవ్వితే లోకమంతా నవ్వుతుంది.
_రచన: వెల్చేరు నారాయణరావు!
నవ్వు నాలుగందాల చేటన్నారు. అంటే నాలుగు విధాల అని అర్థం. ఈ నాలుగూ ఏమిటో నాకు తెలీవు. కాని పాత కుటుంబాలలో ఆడవాళ్ళు నవ్వడం తప్పుగా భావించేవారు. ముఖ్యంగా మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆడవాళ్ళు నవ్వితే వాటికి వెంటనే తప్పు అర్థాలు వస్తాయని పెద్దవాళ్ళు ఆడపిల్లల్ని వారించేవారు. ఆమాటకొస్తే నవ్వడం విషయంలో మొగవాళ్ళక్కూడా ఈ అదుపులు ఉన్నాయని సుమతీశతకం చదివితే తెలుస్తుంది.
నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లిదండ్రి నాథులతోడన్
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ
మొగవాళ్ళనుద్దేశించిన ఈ మాటకీ, ఆడవాళ్ళు నవ్వకూడదనే ఆ మాటకీ చిన్న తేడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆడవాళ్ళు నవ్వడం తప్పు. తప్పు అంటే ఆడవాళ్లుగా వాళ్ల శీలానికి కలిగే మచ్చ. మగవాళ్ళు నవ్వకపోవడం నీతి. నీతి అంటే లౌకిక వ్యవహారాల్లో ఇబ్బందులు తెచ్చుకోకుండా తెలివితేటలుగా వ్యవహరించే పద్ధతి. అంటే లౌక్యం.
నవ్వు చాలా రకాలు: ఎవరితోనైనా కలిసి నవ్వడం, ఎవరినైనా చూసి స్నేహపూర్వకంగా నవ్వడం, వాళ్లపట్ల ఆకర్షితులై ఆ సంగతి సూచిస్తూ నవ్వడం, వాళ్ళని సంతోషపరచడానికి నవ్వడం, ఊరికే సరదాగా నవ్వడం, ఏదో చమత్కారమైన సందర్భం గుర్తువచ్చి నవ్వడం – ఇవన్నీ ఉత్సాహాన్నీ, మంచితనాన్నీ, ఆకర్షణనీ, అంతరంగాన్నీ తెలిపే నవ్వులు. ఇంకో రకం నవ్వు అవహేళన చేసే నవ్వు. ఈ రెంటికీ మధ్యనున్న తేడా చెరిగిపోయిన సందర్భాన్ని విస్తారంగా చెప్పే పాట స్త్రీల రామాయణపు పాటల్లో లక్ష్మణదేవర నవ్వు అనేది.
ఈ పాట ఎక్కువ ప్రచారంలో ఉన్నట్టు కనిపించదు. మా అమ్మో, బామ్మో ఈ పాట పాడేది అని చెప్పిన ఆడవాళ్ళెవరూ నాకు తారసపడలేదు. ఈ పాటకి నాకున్న ఆధారం అల్లా ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు ప్రచురించిన స్త్రీల రామాయణపు పాటలు అనే పుస్తకంలో ఉన్న పాఠమే. ఎన్. వి. గోపాల్&కో వాళ్ళు వాళ్ళ ప్రచురణలో ఇది చేర్చలేదు. ఆంధ్ర సారస్వత పరిషత్తు వారి పాఠం చాలా తప్పులతో అన్వయించుకోవడం కష్టమయ్యే అపపాఠాలతో గందరగోళంగా ఉంది. దాని సవరించడానికి కానీ పరిష్కరించడానికి గానీ ఇంకా కొన్ని ఇతర పాఠాలు దొరికితే తప్ప సాధ్యం కాదు. ధైర్యం చేసి దిద్దబోతే స్వతంత్రించి పాటపాడిన కవయిత్రి భాషని ఇష్టం వచ్చినట్టు దిద్దినట్టౌతుంది. అంచేత ఉన్న పాఠం ఆధారంగానే ఈ వ్యాసం రాస్తున్నాను.
ఈ పాట పేరే చాలా కొత్తరకంగా ఉంది. దేవర అనే మాట తెలుగులో వాడుకలో లేని మాట కాదు. ఉదాహరణకి మనుచరిత్రలో ప్రవరుడి తల్లిదండ్రులను వర్ణిస్తూ, ‘దేవియుందేవరవోలె’ అన్నాడు పెద్దన, అంటే పార్వతీపరమేశ్వరులలాగా అని అర్థం. కాని, ఇక్కడ దేవర అంటే దేవుడు అనే అర్థం కాదు. దేవరన్యాయం అని మీకు తెలిసిందే ఇంకో మాట ఉంది. భర్త వల్ల సంతానం కలగకపోతే అతని తోబుట్టువు ద్వారా సంతానం కనే న్యాయం మహాభారతకథ తెలిసినవాళ్ళకి పరిచితమే. ఇక్కడ దేవర అనే మాటకి మహాభారతంలో లాగా భర్త తోబుట్టువు అని అర్థం. లక్ష్మణుడికి ఈ మాట వాడటం స్త్రీల పాటల్లోనే వుంది. మొత్తంమీద స్త్రీల పాటలు లక్ష్మణుడికి చాలా ఆప్యాయమైన ప్రాధాన్యం ఇచ్చాయని ఇంకోసారి మనకి జ్ఞాపకం వస్తుంది, ఈ పాటవల్ల.
ఇంతకీ ఈ పాట ఏమిటి? లక్ష్మణుడు తన అన్నతో, అన్న భార్యతో అడవికి వెళ్ళేటప్పుడు ఊర్మిళా తానూ ఒక ఒప్పందం చేసుకున్నారని మనకు తెలుసు. ఆ ఒప్పందానికి సంబంధించిన ఊర్మిళ కథ మనం ఊర్మిళాదేవి నిద్ర పాటలో విన్నాం. ఈ లక్ష్మణదేవర నవ్వు ఆ ఒప్పందానికి సంబంధించిన లక్ష్మణుడి కథ.
శ్రీరాముడు రావణవధ అనంతరం అయోధ్యకు చేరుకోవడంతో కథ మొదలౌతుంది. ఆరుబయట వెన్నెల్లో అఖిలాండ కోటిబ్రహ్మాండ నాయకుడు, రాముడు కొలువు తీరతాడు. వేల సంఖ్యలో గద్దెలు ఏర్పాటు చేస్తారు. ఆ గద్దెల మీద విభీషణుడు మొదలైన లంకావాసులు, సుగ్రీవుడు మొదలైన కిష్కింధాపురవాసులు, ఈశ్వరుడు, ఇంద్రాదులైన దేవతలు, వారితో పాటు అయోధ్యాపురప్రముఖులు అందరూ కూర్చున్నారు. సభ అంతా నిండుగా గంభీరంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా లక్ష్మణుడు కిలకిల నవ్వుతాడు. లక్ష్మణుడు అలా నవ్వేసరికి అందరూ విస్తుపోతారు. ఎవరి మటుకి వారు ఆ నవ్వుకి వాళ్ళకి తోచిన అర్థం చెప్పుకుంటారు. జాలరివాళ్ళ అమ్మాయిని, గంగని పెళ్ళిచేసుకుని నెత్తిమీద పెట్టుకున్నానని లక్ష్మణుడు తనను చూసే నవ్వుతున్నాడనుకొని శివుడు తల వంచుకుంటాడు. ఈశ్వరుడి పెళ్ళికి అందరితో పాటు తనూ వెళ్ళగా కాలు మడత పడి క్రింద పడినప్పుడు నడుము విరిగి, ఆ వొంగిన నడుముతోటే ఈ సభకి చక్కా వచ్చినందుకు తన్నే చూసి నవ్వుతున్నాడు అని జాంబవంతుడనుకుంటాడు. అలా అనుకుని తల వంచుకుంటాడు. ఆ సభలో ఆదిశేషుడు కూడా ఉన్నాడు. ఆయన శ్రీమహావిష్ణువుకి సముద్రంలో శయ్యగా ఉండి సేవ చేసినవాడు. కాని ఇప్పుడు అతనికి పగవాడైన శివునికి సేవకుడిగా ఈ సభకి వచ్చాడు. తనని చూసే లక్ష్మణుడు నవ్వుతున్నాడు అని అవమానభారంతో ఆదిశేషుడు తల వంచుకుంటాడు.
ఆ సభలో ఉన్న ఇంకొకడు నీలుడు. నీలుడంటే సముద్రం మీద వారధి కట్టడంలో శ్రీరాముడికి తోడ్పడిన ప్రధాన నిర్మాత. అయితే ఈ నీలుడి గురించి తెలుగుదేశంలో ఒక కథ ఉంది. అతడు చిన్నవాడుగా ఉండగా ఇంట్లో ఉన్న అన్ని వస్తువులూ తీసుకెళ్ళి నీళ్ళల్లో పారేసేవాడట. అవి మునిగిపోతే వెతికి తెచ్చుకోవడానికి ఇంట్లో వాళ్ళు నానా తాపత్రయాలూ పడేవారట. ఒకరోజున ఈ అబ్బాయి తన తండ్రి పూజాసామగ్రిని తీసుకెళ్ళి నీళ్ళల్లో పారేశాడట. దాంతో ఆ తండ్రి ఇకనుంచి నీవు నీళ్ళల్లో పారవేసిన ఏ వస్తువైనా మునగకుండా తేలుగాక అని వరం ఇచ్చాడట. శ్రీరాముడు వారధి కట్టించే సమయంలో కోతులు కొండలనన్నీ పట్టుకువచ్చి సముద్రంలో పడేస్తూంటే అవి మునిగిపొయేవి. ఏంచెయ్యాలో తోచక అందరూ అయోమయంలో ఉంటే నీలుడు వొచ్చి తండ్రి తనకిచ్చిన వరం ఈ అవసరానికి పనికొస్తుందనీ, తన చేతుల మీదుగా రాళ్లని సముద్రంలో వేస్తే అవి మునగవనీ, తేలతాయనీ ఆ రకంగా వారధి తేలికగా కట్టొచ్చనీ ఉపాయం చెప్తాడు. ఆ తరవాత వరసగా కోతులు కొండరాళ్ళు పట్టుకురావడం, నీలుడికివ్వడం, నీలుడు వాటిని సముద్రంలో వేసి వారధి కట్టడం జరుగుతుంది.
అయితే స్త్రీల పాటల్లో ఈ కథకి ఇంకో చిన్న మెలిక ఉంది. నీలుడు తండ్రి పూజాద్రవ్యాలని నీళ్ళలో పడేసి, అవి తేలకుండా నీళ్ళల్లో నొక్కి పట్టేవాడట. అందుకని తండ్రికి కోపం వచ్చి, నువ్వు నీళ్ళల్లో పడేసే ఏ వస్తువూ కూడా ఇక మునగకుండా ఉండుగాక అని శపిస్తాడు. ఆ మాట నీలుడు రాముడికి చెప్పలేదు. తండ్రి ఇచ్చిన శాపాన్ని వరంగా మార్చి అబద్ధం చెప్పాడు నీలుడు. ఆ సంగతి తెలిసి లక్ష్మణుడు నవ్వుతున్నాడని అవమానపడి నీలుడు తలవంచుకుంటాడు. ఆ సభలో ఉన్న అంగదుడు, లక్ష్మణుడు తనని చూసే నవ్వుతున్నాడనుకుంటాడు. తన తండ్రిని చంపిన రామునికి తాను ఈవేళ సేవకుడయ్యాడు అది ఎంత అవమానం. అలాగే సుగ్రీవుడు కూడా. తన అన్న వాలిని అన్యాయంగా రాముని చేత చంపించి, ఆ అన్న భార్యని తన భార్యగా చేసుకుని కన్నూ మిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నాడీ సుగ్రీవుడని తనని చూసే లక్ష్మణుడు నవ్వుతున్నాడని తల వంచుకుంటాడు. విభీషణుడు దాచుకున్న రహస్యం కూడా ఒకటుంది. తన అన్న ఆయువుపట్లు రహస్యంగా రాముడికి చెబుతాడు విభీషణుడు. ఆ రకంగా తన అన్నని చంపించి లంకారాజ్యానికి తాను రాజైనానని లక్ష్మణుడికి తెలుసు. ఇక హనుమంతుడున్నాడు. అంత బలవంతుడు, గొప్పవాడు, ఒక చిన్నవాడు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి దొరికిపోయాడు. ఆ అవమానపు కథ లక్ష్మణుడికి తెలుసు. అంచేత తన్ను చూసే లక్ష్మణుడు నవ్వుతున్నాడని తల వంచుకుంటాడు.
ఇకపోతే సీత, లక్ష్మణుడు తనని గురించే నవ్వుతున్నాడనుకునే సందర్భంలో ఈ కింది చరణాలు కొంచెం తికమకగా ఉన్నాయి.
కారడవిలో దశకంఠునిచేత | పట్టుబడ్డట్టి యో సతి తొడలమీద ||
పెట్టుకొనియున్నాడు సృష్టీశ్వరుడనుచు | అతివ యారునెలలు బాసి యీ రాజు ||
ప్రాణములు యెట్లుండెయో కోమలాంగీ | ఆడరాని మాటలాడి తివనుచూ ||
ఆడవారీ మాట నమ్మరాదనుచు | తలచి లక్ష్మణ నేడు తానవ్వెననుచు ||
ధాత్రిసుత కొలువులో తలవంచుకొనెను |
ఈ చరణాలని –
‘కారడవిలో దశకంఠునిచేత పట్టుబడ్డట్టి ఒక సతి(ని) తొడలమీద
పెట్టుకొనియున్నాడు సృష్టీశ్వరుడనుచు,
ఆరునెలలు యీ రాజు(ని) బాసి అతివ (నీ) ప్రాణములు యెట్లుండె(ను?)
ఓ కోమలాంగీ, ఆడరాని మాటలాడితివి అనుచూ
ఆడవారి మాట నమ్మరాదనుచు తలచి లక్ష్మణుడు నేడు తానవ్వెననుచు
ధాత్రిసుత కొలువులో తలవంచుకొనెను’
అని సవరించుకుని చదివితే వొచ్చే తాత్పర్యార్థం ఇది:
కారడవిలో రావణాసురుని చేత పట్టుపడిన నిన్ను తొడలమీద పెట్టుకొని ఉన్నాడు రాముడు. ఆయన ఒక క్షణం నీ దగ్గిర లేకపోతే నీకు ప్రాణాలు నిలవవని అన్నావు గుర్తుందా, అప్పుడే నన్ను అనరాని మాటలు అన్నావు కదా, మరి ఇప్పుడు ఆరునెలలు రాముడు లేకుండా ప్రాణాలు నీకు ఎలా నిలిచాయి? ఆడవాళ్ల మాటలు నమ్మకూడదు.
ఈ రకమైన వూహలు మనస్సులో పెట్టుకుని, తనని చూసే లక్ష్మణుడు నవ్వుతున్నాడనుకుంది సీత.
సీత తలవంచుకోవడం చూసి రాముడు కూడా చిన్నబోతాడు. ఇంతకాలంగా ఈ రాజ్యాన్ని ఏలుతున్నాను, అయినా ఈవేళ ఈ విపరీతమేమిటి అని, లక్ష్మణుడు సభలో నవ్వినందుకు అతని తల తెగవేస్తానని రాముడు కత్తి ఎత్తుతాడు. సభలోని వాళ్ళంతా ఆయన్ని అడ్డుకుంటారు. మహారాజా, లక్ష్మణుడు చిన్నవాడు, అతని తల నరకడం న్యాయం కాదు అని రాముణ్ణి ఆపుతారు. అప్పుడు రాముడు లక్ష్మణుణ్ణి అడుగుతాడు, ‘ఓ వీరుడా, శూరుడా, తమ్ముడా, సభలో ఎందుకు నవ్వావు చెప్పు’ అని.
ఇక్కడ కొన్ని చరణాలు గజిబిజిగా కలిసిపోయి ఉన్నాయి. అయినా సమన్వయించుకొని చదివితే, లక్ష్మణుడు ఇలా అంటాడు. “మనం అడవులకు పోయినప్పుడు, ఆ పర్ణశాలలో మీకు నేను సేవ చేస్తూండగా, రాత్రి రెండు ఝాముల వేళ నిద్రాదేవి ఏడుస్తూ వచ్చింది. సతిరూపంలో వచ్చిన ఆవిడని నేనడిగాను, ‘నీవెవ్వరవు, ఎందుకేడుస్తున్నావు?’ అని. అప్పుడు నిద్రాదేవి తాను నిద్రాదేవిననీ, తాను అష్టదిగ్గజాలలోనూ, ఆదిఋషులలోనూ, వైకుంఠనాథునిలోనూ ఉంటాననీ. మానవులెవ్వరూ తన్ను గెలవలేరు కానీ నేను తనని నాదగ్గిరికి రానివ్వడం లేదనీ అంది. ఆమె ఆజ్ఞను తప్పించుకోవడం సాధ్యం కాదని గమనించి, ఆమెకు ముమ్మారు ప్రక్షిణం చేసి ‘నేను మా అన్నకి, వదినకి ఈ పర్ణశాలలో కాపలా ఉండాలి. అక్కడ అయోధ్యలో నన్ను వదిలి నా భార్య ఒక్కత్తే ఉన్నది. ఆవిడ రాత్రీపగలూ లేవకుండా ఆవిడని ఆవహించు. మళ్ళా మేం తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు, రాముడూ, ఆయన సేనలూ మంత్రులూ కొలువై ఉంటారు. అప్పుడు నన్ను ఆవహించు’ అని ఆమెకు విన్నవించాను. ఆమాట ప్రకారం, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిద్రాదేవి నన్ను ఈ సభలో ఆవహించినందుకు నాకు నవ్వొచ్చింది” అని లక్ష్మణుడు సమాధానం చెబుతాడు. తాను చేసిన పాపానికి పరిహారమేమిటని రాముడు విచారిస్తూండగా, వశిష్టుడు ఆయనతో, “అయ్యా, మీరు చేసిన పని మంచి పని కాదు. దానికి పరిహారంగా లక్ష్మణుడికి మీరు కాళ్లు పట్టాలి,” అంటాడు. రాముడు ఆ మాటకి సంతోషించి, సేవకులని పిలిచి లక్ష్మణుడికి పక్క ఏర్పాటు చేయమని ఆజ్ఞాపిస్తాడు.
ఆ తరవాత దాదాపు పదహారు చరణాలు ఆ పక్క వర్ణన. ఆ పక్కమీద మల్లెలూ, చామంతులూ, పారిజాతాలూ, కనకరత్నాలు, కలవపువ్వులూ, జాజిపువ్వులూ అన్ని పరిచి, మొగలిపూరేకుల తలగడలు పెట్టి అందంగా ఏర్పాటు చేస్తారు. అంగదుడూ, హనుమంతుడూ, సుగ్రీవుడూ ఆ పక్క చూసి, ఆ సొంపు చూడడానికి రెండుకళ్ళు చాలవని ఆశ్చర్యపోతారు. తన పాదాల వద్ద అలిసిపోయి పడి ఉన్న లక్ష్మణుణ్ణి రాముడు ఎత్తి పక్కమీద పడుకోబెడతాడు. ఊర్మిళాదేవి తలంటుపోసుకుని, పీతాంబరం కట్టి, నగలు పెట్టుకుని, పైట జారుతూండగా వారచూపులు చూస్తూ భర్త దగ్గిరికి వస్తుంది. లక్ష్మణుడు ఆమెను వారించి, నువ్వు రావడానికి ఇది సమయం కాదు అంటాడు. తరవాత లక్ష్మణుడు నిద్రపోతాడు. అలా చాలాసేపు నిద్రపోతూంటే, ఏమిటి తమ్ముడు ఇంతసేపు నిద్రపోతున్నాడని, రాముడు హనుమంతుణ్ణి పంపుతాడు: ఊర్మిళతో సరసాలాడుతున్నాడా, జలక్రీడలాడుతున్నాడా చూసి చెప్పమని. హనుమంతుడు వెళ్ళి వచ్చి, లక్ష్మణుడు నిద్ర పోతున్నాడు, తన దగ్గిర ఎవ్వరూ లేరు అని చెబుతాడు. అప్పుడు రాముడు, శతృఘ్నునితో సహా లక్ష్మణుడి పడకగదిలోకి వచ్చి పక్క మీద కూర్చుని, తమ్ముడి పాదాలు తన తొడమీద పెట్టుకుని కాళ్ళు పట్టడం ప్రారంభిస్తాడు. నిద్రలో ఉన్న లక్ష్మణుడు కలగంటున్నా ననుకుంటాడు. తీరా కళ్ళు తెరిచి అది కల కాదు నిజమే, ఆ కాళ్ళు పట్టేవాడు శ్రీరాముడని చూసి, లేచి ఆయన పాదాలమీద పడతాడు. “నేను మీ పాదాలు వొత్తవలసిన వయసు వాణ్ణి. సమస్తదేవతలూ మీ పాదాలు పట్టుకుంటారు. అహల్యను పవిత్రురాలిని చేసిన పాదాలు మీవి. బలి శిరస్సు మీదనున్న పాదాలు మీవి. నా పాదాలు మీరు పట్టడం తగదు.” అంటాడు లక్ష్మణుడు. తన పాదాలమీది పడిన లక్ష్మణుణ్ణి రాముడు లేవనెత్తి కనక సింహాసనం మీద కూర్చోబెట్టి,
చంద్రుడు లేని రాత్రి యెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు ||
దీపమ్ము లేనిల్లు యెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు ||
పతిలేని సతి యెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు ||
ఉదకమ్ములేని కలశ మెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు ||
చిలుకలేని పంజర మెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు ||
అని లక్ష్మణుడిని సభకు తీసుకొనివచ్చి, ముత్యాలగద్దె మీద కూర్చుండబెట్టి తాను రత్నసింహాసనం మీద కూర్చుంటాడు.
ఇక్కడితో ఈ పాట అయిపోయింది. కానీ అచ్చుపుస్తకంలో ఈ పాట ఇంకో పాటతో కలిసిపోయి ఇంకా దీర్ఘంగా సాగుతుంది.
ఇంతకీ ఈ పాటవల్ల మనకి తెలిసేదేమిటి? ఇందులో భాష, మాటల వాడుక, చరణాలు కూర్చే తీరు ఇవన్నీ చూస్తూంటే, ఇది స్త్రీలు పాడుకునే పాటే కాకుండా, ఎవరో స్త్రీ రాసిన పాట కూడా అని తెలుస్తుంది దురదృష్టవశాత్తూ, రకరకాల అనాదరణలు కారణంగా అచ్చులో గజిబిజిగా వచ్చింది. అయినా, పాటలో అర్థం బోధపరచుకోడానికీ అది పెద్ద అడ్డంకి కాదు. అందుకని, ఈ పాట ఉద్దేశించిన సంగతుల్ని బోధపరచుకోవడానికి ప్రయత్నిద్దాం.
నవ్వు నాలుగందాల చేటు అనే మాట వల్ల ఎక్కువగా తమ సంతోషాలని అణగదొక్కుకుని లోపలుండే నవ్వుల్ని పెదవుల అంచుల దగ్గరే ఆపేసి ఉంచుకోవలసిన ఆడవాళ్ళు నవ్వు గురించి రకరకాలుగా ఊహించిన పాట ఇది. దాంతో పాటు పైకి ఎంతో గంభీరంగా కనిపించే ప్రపంచంలో చాలామంది నవ్వుని ఎందుకు వెంటనే అపార్థం చేసుకుంటారో మనకి నవ్వొచ్చేలా చెప్పే పాట ఇది. ఇంకొంచెం ముందుకెళితే ప్రపంచంలో అందరూ, దేవుళ్ళ దగ్గరి నించీ మామూలు మనుషుల దాకా పైకి నిబ్బరంగా కనిపించే వాళ్ళే కానీ, లోపల ప్రతి వాళ్ళకీ ఏదో ఒక లొసుగు ఉంది. ఆ లొసుగు, ఎవరికీ తెలీదనుకుని బతికేస్తూంటారు కానీ, అది తెలిసిపోయిందనే అనుమానం వస్తే వాళ్ళు గాలి తీసిన బుడగల్లా ముడుచుకుపోతారు. ఈ ప్రపంచపు తరహా అది. ఈ సంగతి ఈ ప్రపంచంలో ఆడవాళ్ళకే ఎక్కువ తెలుసు అని చెప్పే పాట కూడా ఇది. వాళ్ళని నవ్వకుండా చేసే ఈ ప్రపంచం ఎందుకు నవ్వకుండా చేసిందో వాళ్ళ కర్థమయిందని మరీమరీ చెప్పే పాట ఇది.
ఈ పాట మొత్తం మీద లక్ష్మణుడి నవ్వు వల్ల తలవంచుకోనివాడు రాముడొక్కడే. కానీ ఆ రాముడే అందరికన్నా ఎక్కువగా తలవంచుకోవాల్సిన తీవ్రమైన కోపాన్ని ప్రదర్శించి చివరికి తమ్ముడి కాళ్ళు పట్టుకోవలసిన శిక్షకి గురి అవుతాడు.
నామాట విని నవ్వండి, నవ్వు వల్ల ఏ చేటూ రాదు, ఎవరి నవ్వూ ఎవరి లోపాన్నీ చూపించదు, మీరు రకరకాల అర్థాలు చెప్పుకోకుండా మీరూ నవ్వండి. నవ్వితే అందరూ సంతోషంగా అందంగా ఉంటారు, అని చెప్పే చక్కని పాట ఇది.
మరిది లక్ష్మణుడు ఆడవాళ్ళందరికీ దగ్గిరవాడు. అతను నవ్వితే లోకమంతా నవ్వుతుంది.
Comments
Post a Comment