నరకాసురుడు ఎందుకు ఓడిపోయాడు!

నరకాసురుడు ఎందుకు ఓడిపోయాడు!

నరకాసురుడు అనే రాక్షసుని వధించినదానికి వేడుకగా దీపావళి చేసుకుంటారన్న విషయం తెలిసింది! కానీ నరకాసురుని తరచి చూస్తే… వ్యక్తిత్వానికి సంబంధించిన చాలా సూచనలు కనిపిస్తాయి.

అసురుడు ఎందుకంటే…

నరకాసురుడు ఎవరో కాదు… విష్ణుమూర్తి అవతారమైన వరాహస్వామికీ, భూదేవికీ కలిగిన సంతానమే! నరకాసురునికి బీజం సంధ్య వేళలో ఏర్పడిందట. పగలు- వెలుతురు, వేడి, జ్ఞానం, శక్తి… వంటి గొప్ప లక్షణాలకు ప్రతీక. ఇక రాత్రేమో- చీకటి, నిద్ర, అజ్ఞానం, కామం… వంటి దుర్లక్షణాలకు ప్రతినిధి. మంచి లక్షణాలు ఎన్ని ఉన్నా కూడా, ఒక్క దుర్లక్షణం ఉంటే చాలు… ఆ మనిషి నాశనం అయిపోతాడు. రావణాసురుడు జ్ఞాని అయినప్పటికీ అహంకారంతో ఓడిపోయాడు. మహిషాసురుడు బలవంతుడు అయినప్పటికీ మదం వల్ల నశించిపోయాడు. నరకాసురునిలో కూడా మంచిని తుంచే చెడు లక్షణాలు ఉన్నాయని సూచించడానికి అతను సంధ్యవేళలో రూపాన్ని ధరించాడు అని చెబుతారు.

దేవుని కుమారుడు అయినప్పటికీ…

తమ కుమారుడైనప్పటికీ నరకాసురునిలో అసుర లక్షణాలు ఉన్నాయని గ్రహించారు ఆ దంపతులు. లోక కళ్యాణం కోసం అలాంటివాడిని సాక్షాత్తూ విష్ణుమూర్తే చంపేస్తాడని భయపడింది భూదేవి. ఆ భయానికి ఆమెలోని తల్లిమనసు తల్లడిల్లింది. దాంతో `ఏ ఒక్కరివల్లా తన కొడుకు చనిపోకూడ`దన్న వరాన్ని వరాహమూర్తి దగ్గరనుంచి కోరుకుంది భూదేవి. విష్ణుమూర్తి ఒక్క క్షణం ఆలోచించాడు. `నీ చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ అతను మరణించడం సాధ్యం కాదు` అన్న వరాన్ని అందించాడు. ఆ మాటలకు మురిసిపోయింది భూదేవి. చూస్తూ చూస్తూ తన కన్నబిడ్డను తానే చంపుకోదు కదా అన్నది ఆమె నమ్మకం! కానీ నరకుని అకృత్యాలు మీరిపోవడంతో సత్యభామ అవతారాన్ని ధరించి తానే అతని గుండెలను చీల్చాల్సి వచ్చింది. నడవడి సరిగా ఉంటే ప్రపంచమే తన నెత్తిన పెట్టుకుంటుంది. కానీ అదే నడవడి దారి తప్పితే, సాక్షాత్తూ భగవంతుడే తన తండ్రి అయినా నాశనం తప్పదు అని సూచిస్తున్నాడు నరకాసురుడు.

చెడు స్నేహం:

నరకాసురునిలో అసురలక్షణాలు ఉన్నప్పటికీ అవి చాలారోజుల వరకూ నిద్రాణంగానే ఉండేవి. కానీ బాణాసురుడు అనే రాక్షసునితో స్నేహం మొదలైన తరువాతే అతనిలో రాక్షసప్రవృత్తి ప్రబలిందని కొన్ని గాథలు చెబుతున్నాయి. స్నేహితుడు చెడ్డవాడైతే మనలో నిద్రాణంగా ఉన్న బలహీనతలకు బలం చేకూరుతుందని ఇది సూచిస్తోంది. నరకాసురుడు ఇక లోకం మీదకి విజృంభించసాగాడు. క్రోధంతో మునులను పీడిచసాగాడు, మదంతో దేవతల తల్లి అయిన అదితి కుండలాలను లాక్కొని అవమానించాడు, కామంతో 16,000 మంది రాకుమార్తెలను చెరపట్టాడు. ప్రాగ్జ్యోతిషాపురం అనే గొప్ప రాజ్యానికి రాజైనప్పటికీ ప్రపంచాన్నే జయించాలని అత్యాశ పడ్డాడు. దాంతో నరకాసురుని వధ తప్పలేదు.

కోరి తెచ్చుకున్న అంతం:

తన మానాన తను చక్కగా రాజ్యాన్ని పాలిస్తే నరకాసురుడికీ ఎప్పటికీ ముప్పు ఉండేది కాదు. కానీ అరిషడ్వార్గాలన్నింటినీ అరువు తెచ్చుకున్న నరకాసురుడు, చావుని కొనితెచ్చుకున్నాడు. ఓరిమికి మారుపేరైన భూదేవే… సత్యభామ రూపంలో అతడిని సంహరింపక తప్పలేదు. ప్రహ్లాదుడు రాక్షసుని కడుపున పుట్టినా దేవునిగా మారాడు. నరకాసురుడు భగవంతుని కడుపున పుట్టినా రాక్షసునిగా అంతమొందాడు. నరకాసురుని చావు పండుగగా మారిందంటే అతని జీవితం ఎంత గొప్ప గుణపాఠమో కదా!



Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!