తెలుగులో తెలుగు నేతిబీరకాయలో నెయ్యంత?

తెలుగులో తెలుగు నేతిబీరకాయలో నెయ్యంత?

.

‘నేను, చెట్టు, కన్ను, మొదలు, మన్ను, అమ్మ, చదువు, నేల, ఆకు’, ఇవి అచ్చమైన, కల్తీలేని తెలుగు పదాలు.

ఇక్కడ నాకు ఆనందం కల్గించిన విషయం ఏమిటంటే, ‘అమ్మ’,

ఈ పదం సంపూర్ణంగా మనది, మన తెలుగు పదం. కనీసం ‘అమ్మ’పైన ఎవరి ప్రభావం లేదు. కాకపోతే కాలానుగుణంగా ఆ పదం కూడా కల్తీ అయి ‘మమ్మీ’ అయిందన్న బాధ లేకపోలేదు.

.

ఇక్కడ "అచ్చ తెలుగంటే" ఏమిటి అన్న సందేహం కలుగకపోదు. 

సంస్కృత సమానం కాని పదాలను, భాషను అచ్చ తెలుగు అంటారు.

ఉదాహరణకు, ‘రాజు’ ఈ పదానికి అచ్చ తెలుగు పదాలు ఏలిక, ఎకిమీడు, దొర, పుడమిఱేడు. అలాగే ‘మేఘం’ – నీరుతాలుపు, మబ్బు, మొగిలు. 

మనం రోజువారి తెలుగు అనుకొని ఉపయోగించే అనేక పదాలు సంస్కృత పదాలే. 

ఉదాహరణకు, సుఖదుఃఖాలు, కంఠం, రథం, ఆజ్ఞ, శ్రీవారి బ్రహ్మోత్సవాలు.

చివరికి తెలుగు డిక్షనరీ, క్షమించాలి, నిఘంటువు లేక పదకోశం ఇవేవి తెలుగు పదాలు కావు, సంస్కృతం..

.

అనుకరణ వల్ల కావచ్చు, చమత్కారం కోసం కావచ్చు, ఉచ్చరణా సౌకర్యం కోసం కావచ్చు, వ్యావహారిక అనుకూలత, సద్దుబాటు వల్ల కావచ్చు, అన్యభాషా పదాలు తెలుగు పదాల్లాగే మన భాషలో చెలామణీ అయిపోతున్నాయి.

కిటికీ, కుర్చీ, స్టూలు, ఫ్యాన్, దర్వాజా, వరండా, రేడియో, టెప్ రికార్డర్,

అంకుల్, ఆంటీ, ఫ్రెండ్, దోస్తు, కారు, క్యాబ్, జల్దీ ఇలా చెప్పుకుంటూ పోతే సగం భాష మనది 

కాని మన భాష. స్పీడ్ పెరుగుతున్నట్టే భాషలో మార్పు కూడా అతి వేగంగా పెరుగుతోంది. 

.

కొన్నిసార్లు రాయడానికి వీలుగా భాషని మార్చేస్తాం. కొన్నిసార్లు పలకడానికి అనువుగా భాషని కుదించేస్తాం. 

ఈ పదాలు చూడండి: ముఖము ఇది మొగము, మొగం నుంచి నేటి మొహంగా మారింది. అలాగే, తేనియు – తేనే,

చిలుక – చిల్క,

కొలది – కొద్ది, 

చలిది – చద్ది, 

తరుగు – తగ్గు,

వంగకాయ – వంకాయ,

రాతి చిప్ప – రాచిప్ప,

ఫలకము – పలక, 

పీఠము – పీట. 

ఈ సద్దుబాటు కేవలం ఒక్కభాషకి పరిమితం కాదు. ఇవి చూడండి: కాగజ్ – కాగితం, కరార్ – ఖరారు, జప్త్ – జప్తు, ఖబర్ – కబురు, ఖండియా – కండువా, పహ్ర హుషార్ – పారా హుషార్, దుకాన్ – దుకాణం, జమీన్ దార్ – జమీందారు, రైల్ – రైలు, టికెట్ – టికెట్టు, కాలేజ్ – కాలేజీ, స్విచ్ – స్విచ్చు, క్లబ్ – క్లబ్బు. అకార, ఉకార, ఇకారాలను అనువుగా కలుపుకొని, ప్రతి భాషను మనదిగా చేసుకోవడం మన తెలుగు భాషకు మాత్రమే చెల్లిందేమో!


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!