రుక్మిణీ కళ్యాణం.! (పోతనామాత్యుడు...... రాజలోక పలాయనంబు.)

రుక్మిణీ కళ్యాణం.!

(పోతనామాత్యుడు...... రాజలోక పలాయనంబు.)

.

"మగిడి చలించి పాఱుచును మాగధ ముఖ్యులు గూడి యొక్కచో

వగచుచు నాలిఁ గోల్పడినవాని క్రియం గడు వెచ్చనూర్చుచున్

మొగమునఁ దప్పిదేరఁ దమ ముందటఁ బొక్కుచునున్న చైద్యుతోఁ

"బగతుర చేతిలోఁ బడక ప్రాణముతోడుత నున్నవాఁడవే."

.

భావము:

కష్ణుని యాదవసేనచేతిలో ఓడి, వెనుదిరిగి పారిపోతున్న జరాసంధుడు మొదలైన వారు ఒకచోట కలిసారు. పెళ్ళం పోయిన వాడిలా ఏడుస్తూ వేడి నిట్టూర్పులు నిట్టూరుస్తూ వడలిన ముఖంతో తమ ముందు వెక్కుతున్న శశిపాలుడిని చూచారు. “పోన్లే; శత్రువు చేతిలో చావకుండా బతికే ఉన్నావు కదా” అని ఓదార్చేరు.

.

కష్ణుని యాదవసేనచేతిలో ఓడి, వెనుదిరిగి పారిపోతున్న జరాసంధుడు మొదలైన వారు అతనిని ఓదారుస్తూ,

.

"బ్రతుకవచ్చు నొడలఁ బ్రాణంబు లుండినఁ; 

బ్రతుకు గలిగెనేని భార్య గలదు; 

బ్రతికితీవు; భార్యపట్టు దైవమెఱుంగు; 

వగవ వలదు చైద్య! వలదు వలదు."

భావము:

ఇంకా ఇలా చెప్పసాగారు “నాయనా చేదిరాజ! శశిపాలా! దుఃఖించకు. ఒంట్లో ప్రాణలుంటే ఎలాగైనా బతకొచ్చు. బతికుంటేనే కదా భార్య ఉండేది. పెళ్ళాం మాట దేవుడెరుగు నువ్వు బతికున్నావు. వద్దు. ఇంక అసలు దుఃఖించొద్దు.

.

ఇంకా విను. పురుషుడు స్వతంత్రుడు కాడు. కీలు బొమ్మలాడించే వాడిచేతిలోని కీలుబొమ్మ లాగ ఈశ్వర మాయకు లోనై సుఖదుఃఖాలలో నర్తిస్తుంటాడు. ఇంతకు ముందు నేను మథుర మీద పదిహేడు సార్లు దండెత్తాను. పదిహేడు సార్లు మాధవుని చేతిలో ఓడి బలాల్ని నష్టపోయాను. బలరాముడి చేతికి చిక్కి కృష్ణుడు దయచూపి విడిపించాడు. పద్దెనిమిదో సారి ఇరవైమూడు అక్షౌహిణుల సేనతో దాడి చేసి శత్రువులని పారదోలి విజయం సాధించా. ఇలాంటి గెలుపోటములకు ఎప్పుడు మోదఖేదములు చెందను. ఇవాళ కనక రుద్రుణ్ణి కూడగొట్టుకొని మన రాజు లందరం పోరాడినా కృష్ణుణ్ణి గెలవలేము. ఇది ఇంతే. కాల మహిమని బట్టే లోకం నడుస్తుంటుంది.

.

అంతేకాక

.

తమకుం గాలము మంచిదైన మనలం ద్రైలోక్య విఖ్యాతి వి

క్రములన్ గెల్చిరి యాదవుల్ హరి భుజాగర్వంబునన్ నేడు; కా

లము మేలై చనుదెంచెనేని మనమున్ లక్షించి విద్వేషులన్

సమరక్షోణి జయింత; మింతపనికై శంకింప నీ కేటికిన్."

భావము:

ఇవాళ వారికి కాలం అనుకూలమైంది. ముల్లోకాలలో ప్రసిద్దికెక్కిన మనల్ని కృష్ణుడి అండతో యాదవులు జయించారు. కాలం కలిసొస్తే మనం కూడ పగవారిని యుద్దం లో పడగొడతాం. ఇంతోటి దానికి విచారించడం ఎందుకు.”

.

.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!