బుక్కులందు ఫేసు బుక్కు తీరే వేరు!

బుక్కులందు ఫేసు బుక్కు తీరే వేరు!


రచన: జగన్నాథ రావ్ఎల్.

వ్యసనపల్లి సుబ్బాయమ్మ @ జీమెయిలు డాట్ కాం నుండి :

వీరందరికీ : ( గుడ్డి కార్బను కాపీలో )

నాకు ఈ మధ్య ఈ వ్యసనం బాగా ముదిరిపోయింది.

75 ఏళ్ళ ఈ వయస్సులో ఈ వ్యసనాన్ని ఎలా వదిలించుకోవాలా అని ప్రయత్నిస్తూ బెంగళూరులో ఇందిరా నగరిలో విఠల్ మాల్యా ముఖ్య రస్తలో వున్న ధూమపాన హళ్ళికి చేరుకున్నాను. దాన్ని ఇప్పుడు ధూపన హళ్ళి అని అంటున్నారు లెండి.

అందులో చాలా విభాగాలున్నాయి. పొగ వ్య.వ.స్థ. దాని తర్వాత మద్యం వ్య.వ.స్థ. ఆ తర్వాత మత్తు మందు వ్య.వ.స్థ. అలాంటివి.

వ్య.వ.స్థ. అంటే వ్యసనం వదిలించే స్థలం అని అర్థం. చివరగా కనబడింది నేను వెదికే వ్య.వ.స్థ. అదే ఫేసు బుక్కు వ్యసనం వదిలించే స్థలం. ఈ విభాగంలో చాలా మంది రోగులే కాచుకుని వున్నారు. వారందరు కూడా వారి వారి ఐ ప్యాడు, బ్లాక్ బెర్రీ, అండ్రాయిడు లలో తలదూర్చి ఏదో వెతుక్కుంటున్నారు.

ఒకతను తన జుత్తు పీక్కుంటున్నాడు. అతని పక్క నున్నావిడ, అతని భార్య కాబోలు “మీరేం ఇదవకండీ. అంతా అదే బాగు పడుతుంది” అని స్వాంతన వచనాలు పలుకుతోంది.

“నాకు అర్థం కానిదేంటంటే, నేను ఫేసు బుక్కు లో పెట్టిన అప్‌డేట్ హాస్యం చదువుకుని అందరూ నవ్వుకుని నవ్వుకుని పడీ పడీ చస్తారనుకున్నా. కానీ కేవలం ఒక్కడంటే ఒక్కడైనా కనీసం లైక్ బటను నైనా నొక్కలేదే అని”

“ఎప్పుడు పెట్టేరు?”

“10.50 కి”

“ఇప్పుడింకా 10. 55 ఏ కదా అయ్యింది? అప్పుడే అంత తొందరెందుకూ?”

“నేను పెట్టి అయిదు గంటలు గడిచినట్టు అనిపిస్తుంటేనూ”

ఇంతలో “వ్యసనపల్లి సుబ్బాయమ్మా” అని పిలిచేరు. సుబ్బాయమ్మ లోపలికి వెళ్ళింది.

ఆమెకి సలహా (counseling) ఇచ్చే ఆయన అమెరికా నించి వచ్చేడట.

“ ఐ ఆమ్ ఆల్ఫా జీటా. గ్లాడ్ టు మీట్ యూ సుబ్బాయమ్మా. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? కూర్చోండి బామ్మగారూ. మీకీ వ్యసనం ఎలా మొదలైంది?”

“ అంతా నా మనవడు వి.వి.పల్లి దే తప్పంతా. వెనకటికి వాణ్ణి వెంకటి అని పిలిచే వాళ్ళం. వాడు అమెరికాకి వెళ్ళేక వి.వి.పల్లి అయ్యేడు. అంటే వెంకట్ వ్యసన పల్లి అన్నమాట.

ఒక సుప్రభాత వేళ నా మనవడు FB లో చేరమని ఇన్విటేషన్ పంపేడు. నేను ఎప్పుడూ నా ఫేస్ ని బుక్కులో దూర్చి చదువుతాను కాబట్టి (అక్షరాలు సరిగా కనబడక) ఈ FB ఏదో నాకు బాగానే ఉపయోగపడుతుందనుకున్నా. అంత దాకా నేను ఈ FB పేరైనా వినలేదు.”

“సరే. ఆ తర్వాత ఇది ఎంత తొందరగా మీకు వ్యసనంగా మారింది?”

“క్రియేట్ ఎ ప్రొఫైల్ అన్న బటన్ నొక్కినప్పట్నించి. ముఖ్యంగా మనం FB లో మన స్నేహితులతో ముఖతః మాట్లాడ వలసిన పనిలేదు కదా. వాళ్ళ గోడతో (wall) మన గోడు వెళ్ళబోసుకుంటే చాలు. ఎందుకంటే వాళ్ళకి చెప్పినా ఒక్కటే గోడకి చెప్పినా ఒక్కటే.

నేను రోజుకి కనీసం ఐదారు సార్లయినా FB చూసుకుంటాను. ఒక్కొక్కప్పుడు అర్ధరాత్రి లేచి చూస్తాను, ఎందుకంటే ఒకవేళ అమెరికాలో వున్న స్నేహితులెవరైనా అప్‌డేట్ చేసివుండవచ్చు కదా?”

“FB లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటీ?”

“ నా నిజ జీవితంలో నాకు ఐదారుగురు కంటే ఎక్కువ స్నేహితులు లేరు, కానీ FB లో 786 మంది స్నేహితులు వున్నారు. వారిలో ఒకాయన మిట్టా రమణి అట.” “ఎవరతను?” “ఎవరో తెలీదు. కానీ అతనికి 3000 మంది స్నేహితులున్నారట. అంటే బాగా ప్రసిద్ధి చెందిన వాడై వుంటాడని స్నేహం చేసేను.” “ ఓహో! అతనా? అతను మిట్ రోమ్నీ అని అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో వున్నాడు లెండి.” “నా భర్త అస్తమానం పోరుతూనే వుండేవారు. స్నేహం అనేది ఒక అమూల్యమైన వరం. దాన్ని FB ద్వారా అవుట్ సోర్సింగ్ చేయడమేంటీ? అని”

“అందుకే ప్రభుత్వం ఇప్పుడు సోపా పీపా (SOPA, PIPA ) అనే చట్టాలు చేయాలనుకుంటోంది.

సరే! ఇప్పుడు మీ స్నేహితుల ప్రొఫైల్ గురించి చెప్పండి”

“ఒకావిడ ముగ్గులు బాగా పెడుతుంది. ఆవిడ పేరు రాణీ రంగవల్లి. ఇంకొకావిడ లడ్డుండలు బాగా చుడుతుంది. ఆవిడ పేరు రాణీ ఉండవల్లి. ఇంకో....”

“సరే! సరే! FB లో ఇంకా ఏమేం చేస్తారు?”

“ మా స్నేహితులతో గేమ్స్ కూడా ఆడుతుంటాం.”

“ఆగండాగండి. నేను చెపుతాను. మీరు ఆడే గేమ్ ఫారం విల్లే కదూ?”

“కాదు. మాఫియా వార్స్.”

“అయితే ఇక మీ ప్రొఫైల్ గురించి చెప్పండి”

“నేను నా ప్రొఫైల్ పెట్టడానికి ముందు అందాల భరిణె అనే బ్యూటీ పార్లరుకి వెళ్ళి ...”

“మేకప్ చేయించుకున్నారు కదూ?”

“కాదు. అక్కడికొచ్చిన అందగత్తెల్లో ఒకావిడ ఫోటో తీసుకుని నా ప్రొఫైల్ లో పెట్టేను.”

“ఆ ఫోటో మీది కాదని మీ స్నేహితులు కనిపెట్టి వుంటారే?”

“కొందరు తగుదునమ్మా అని కనిపెట్టేరు కూడా. వాళ్ళకి నేనేం సమాధానం చెప్పేనంటే, శిబి చక్రబొర్తి యోగా శిబిర అని బెంగాలి ఆయన స్థాపించిన యోగా శిబిరంలో శిక్షణ తీసుకుని ఇలా మారిపోయేనని.”

“ ఈ FB వ్యసనం వల్ల నష్టం వాటిల్లుతోందని ఎప్పుడనిపించింది?”

“ నా మనవడు తన అప్‌డేట్ లో తన జీతం పెరిగిందని పెడ్తే, అతను అద్దెకుండే ఇంటి యజమాని లైక్ అని నొక్కేడట.”

“ ఈ FB వల్ల మీ కొంప మునుగుతోందని ఎప్పుడు కనిపెట్టేరు?”

“మొన్న నా వాల్ లో మా ఆయన ఒక మెసేజ్ పెట్టేడు, ఇలాగని : నేను వారం రోజుల క్రితమే ఇంటి నుంచి వెళ్ళిపోయేను. కనబడుట లేదు అని నువ్వు పత్రికా ప్రకటన ఇస్తావని ఎదురు చూసేను. నాకు నిరాశే మిగిలింది. నన్ను కనిపెట్టడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే నేను సన్యాసుల్లో కలిసిపోయేను కనుక. FB లో మునిగిపోయిన నువ్వు నేను ఇంట్లో లేననే విషయం కనిపెడితే అంతే చాలు నాకు. "

“దానికి మీరెలా స్పందించేరు?”

“ అతన్ని అన్ ఫ్రెండ్ చేసీసేను, తిక్క వదిలిపోతుందని.”

“ఎవరి తిక్క? మీదా అతనిదా? సర్లెండి. ఎవరిదయితేనేం గానీ, ఇప్పుడు నేనిచ్చే సలహా జాగ్రత్తగా వినండి. ఇదిగో ఇది జయదేవ్ గారి...”

“ఎమిటీ? భక్త జయదేవ్ గారి అష్టపదుల్ని అప్‌లోడ్ చేస్తే ఆయన మహిమ వల్ల ఈ వ్యసనం తగ్గిపోతుందా?”

“కాదమ్మా! మన ప్రముఖ కార్టూనిస్టు జయదేవ్ గారు గీసిన ఈ కార్టూను అప్‌లోడ్ చేస్తే, మీకు ఈ వ్యసనం నించి విముక్తి లభిస్తుంది.” అని అంటూ, ఈ కార్టూనుని సుబ్బాయమ్మ చేతికందించి, ఇలా అన్నాడు ఆల్ఫా జీటా గారు “ ఈ సలహా నేను మీకు ఉచితంగా ఇస్తున్నాను. ఎందుకంటే ఈ సలహా నాకు ఉపయోగపడదు కనుక, దీనికి మీకు చార్జ్ చేయం.” అంటూ తన ఫేస్ బుక్కు లోకి లాగిన్ అయ్యేడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!