సినీమా(ట)ల తూటాలు ! (లేక ఆఫీస్ లో లంచ్ టైం పాస్ )

సినీమా(ట)ల తూటాలు !
(లేక ఆఫీస్ లో లంచ్ టైం పాస్ )
ఆఫీస్ లో లంచ్ అవర్ లో కొలీగ్స్ అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ లంచ్ చేస్తున్నారు.
ఆ రిపోర్ట్ పంపమని బ్రాంచ్ ఆఫీస్ కి ఫోన్ చేసి చెప్పావా? అడిగాడు సురేష్. “చెప్పాను, నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు”, రేపటికల్లా ఆ రిపోర్ట్ ఇక్కడ ఉంటుంది అన్నాడు రమేష్.
వాళ్ల కంత “సీన్” లేదు, పంపారో లేదో మళ్ళీ కనుక్కో రిటార్ట్ ఇచ్చాడు సురేష్..“ఓ ఫైవ్ ఉంటే ఇస్తావా”?, (ఫైవ్ అంటే ఇక్కడ అయిదు వందలు, అయిదు రూపాయలు కాదు), అడిగాడు అప్పారావు ఈ లోపల (అతని అసలు పేరు ఏదైనా, అందరూ అలాగే పిలుస్తారు). అతని బారి నుంచి తప్పించుకోడానికి టాపిక్ మారుస్తూ, అవునూ “తీ తా” (తీసేసిన తాసిల్దారు) సంగతి ఎంతవరకు వచ్చింది? అని ఆ మధ్య సస్పెండ్ అయిన కొలీగ్ గురించి అడిగాడు రమేష్. “అమ్యామ్యా” కేసులు అంత తొందరగా తేలుతాయా? గడ్డి తినే ముందే బుద్ధి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా అని జవాబు..“హింస రాజు” (బాస్) అర్జెంటు గా నిన్ను టూర్ వెళ్ళమన్నాడుట?, నువ్వు నీ గోవా ట్రిప్ మానుకుని వెళుతున్న్నావుట?, నిజమేనా? ఇంకో కొలీగ్ ప్రశ్న. “అతిగా హింసించే బాస్, ఇతరుల విషయాలలో అతిగా తల దూర్చే కొలీగ్ బాగు పడినట్టు చరిత్రలో లేదు”, కోపంగా సమాధానం..రోజూ బుద్ధిగా డబ్బా తెచ్చుకునే మహేష్, ఆ రోజు ఉప్మా తెస్తే – “ఫామిలీ, ఫామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తోంది” అని కోరస్. రోజూ తినలేక చస్తున్నా, ఈ బాక్స్ తీసుకుని ఆ చపాతీలు ఇటు ఇవ్వండి అంటూ తన జవాబు.“ముందు నువ్వు ప్రేమించావా, లేక తను నిన్ను ప్రేమించిందా”, అడిగారు జస్ట్ మారీడ్ నరేష్ ని. ముందు తను ప్రేమించింది, తరువాత నేను “ప్రేమించాల్సి వచ్చింది”, నవ్వు ఆపుకుంటూ గంభీరంగా చెప్పాడు నరేష్. ఘోల్లున నవ్వులు అక్కడ..ఆదివారం దినపత్రిక లో వచ్చిన “అల్ కూర చంచం” వెరైటీ డిష్ చేసి తెచ్చాను, అందరూ తినండి అంటూ వచ్చింది సుజాత. అందరూ బిక్క మొహం వేసినట్టు నటించి, “ఇంట్లో చెప్పి రాలేదు” అని ఒకరు, “ఇన్సూరెన్స్ తీసుకోలేదు” అని ఒకరు, ఉండండి “నా బ్యాంకు బాలన్స్ వివరాలు అన్నీ మా ఆవిడకి ఫోన్ చేసి చెప్పి” తింటాను అని ఒకరు అంటూ, మొత్తానికి ఆ డిష్ మొత్తం లాగించేశారు..““బెస్ట్ ఎంప్లాయి” అవార్డు గెలుచుకున్న కవిత గారికి వేయండి ఒక “వీరతాడు”, అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. పార్టీ ఇవ్వాలి అంటే తప్పకుండా అన్న కవితతో, ఒట్టు? అడిగింది సుజాత.
నేను “ఒట్టేసి ఒక మాట, ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పను” అని తెలుసుగా సుజాత? గంభీరంగా ఆవిడ జవాబు.
మళ్ళీ నవ్వులు.
పార్టీ అనగానే “ఇంగ్లీష్లో మాట్టాడుకుని” చాలా రోజులయ్యింది
అంటూ ఇద్దరు ముగ్గురు ఈ లోపల వేరే ప్రణాళికలు వేసుకోవడం మొదలెట్టారు.
ఒక్క అరగంట లోనే ఇన్ని కబుర్లు, వాటిలో పేలిన జోక్స్.x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!