రాజనందన రాజ రాజాత్మజుల సాటి


.శ్రీనాథుడు అనగానే తెనుగు ఛందస్సు సీసము మనకు 

తటిల్లతవలె మెరుస్తుంది.

ఈ పద్యాన్ని అవధరించండి.

.

.

సీ: రాజనందన రాజ రాజాత్మజుల సాటి

తలప నల్లయ వేమ ధరణి పతికి

రాజనందన రాజ రాజాత్మజుల సాటి

తలప నల్లయ వేమ ధరణి పతికి

రాజనందన రాజ రాజాత్మజుల సాటి

తలప నల్లయ వేమ ధరణి పతికి

రాజనందన రాజ రాజాత్మజుల సాటి

తలప నల్లయ వేమ ధరణి పతికి

గీ: భావభవ భోగ సత్కళా భావములను

భావభవ భోగ సత్కళా భావములను

భావభవ భోగ సత్కళా భావములను

భావభవ భోగ సత్కళా భావములను.


దీనికి పేరడీఅయిన “మేకతోకకు మేక” పద్యానికి అర్థం ఉన్నా లేకపోయినా, ఈ పద్యానికి, దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు ఈ విధం గా అర్థం చెప్పారు.

సీస పద్యంలో మొదటి చరణం, గీతపద్యంలో మొదటి చరణం తో క్రమంగా అన్వయించుకోవాలి. అల్లగే, రెండవ చరణం, రెండవదానితో, మూడవ చరణం మూడవదానితో, సీసపద్యం ఆఖరి చరణం గీతపద్యం ఆఖరి చరణం తో, వరసగా అన్వయించుకోవాలి.

మొదటి చరణద్వయాల అర్థం, అన్వయం:

రాజ నందన = చంద్రుని కొడుకైన బుధుడు,

ర = సమర్థుడైన, అజ= ఈశ్వరుడు

రాజ = దేవేంద్రుడు

ఆత్మజులు = బ్రహ్మదేవుడును

తలపన్ = ఆలోచించగా

అల్లయ వేమ ధరణిపతికి = అల్లయ వేమారెడ్డి అనే రాజుకు

సాటి = సమానులు

భావ = బుద్ధియందు

భవ = ఐశ్వర్యమునందును

భోగ = వైభవంలోనూ

సత్కళా = శ్రేష్టమైన విద్యలయొక్క

భావములను = అతిశయమందును

బుద్ధియందు, ఐశ్వర్యమందు, వైభవంలోను, శ్రేష్టమైన విద్యల యొక్క అతిశయములందూ, చంద్రుని కుమారుడైన బుధుడు, సమర్థుడైన ఈశ్వరుడు, దేవేంద్రుడు, బ్రహ్మదేవుడును, ఆలోచించగా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు సమానులు.

రెండవ చరణద్వయాల అర్థం, అన్వయం:

ర + అజ + నందన = మనోహరుడైన శివునికి కుమారుడైన కుమారస్వామి

రాజ = కుబేరుడు

ర + అజ = శ్రేష్ఠుడైన , రఘువు కుమారుడైన యజుడు

ఆత్మజులు = చంద్రుడును

తలప అల్లయ వేమ ధరణిపతికి సాటి = ఆలోచించగా అల్లయ వేమా రెడ్డి అనే రాజుకు సమానులు.

భావ = క్రియ యందు

భవ = ధనమునందు

భోగ = పరిపాలనలో

సత్కళా = శ్రేష్ఠమైన కాంతి యొక్క

భావములను = సమూహమునందును

క్రియయందు, ధనమునందు, పరిపాలనలో శ్రేష్ఠమైన కాంతి సమూహమునందును, మనోహరుడైన శివుని కుమారుడైన కుమార స్వామి , కుబేరుడు, శ్రేష్ఠుడైన రఘువుకు కొడుకైన అజుడు, చంద్రుడును, ఆలోచించగా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు సమానులు.

మూడవ చరణద్వయాల అర్థం, అన్వయం:

ర + అజ + నందన = బంగారం వంటి కాంతిగల బ్రహ్మకు పుట్టిన సనత్కుమారుడు

ర + అజ = శ్రేష్ఠుడైన బ్రహ్మకు పుట్టిన వశిష్ఠుడు

రాజ = క్షత్రియుడైన

ఆత్మ + జ = బృహస్పతియందు పుట్టిన కచుడును

తలప అల్లయ వేమ ధరణిపతికి సాటి = ఆలోచించగా అల్లయ వేమా రెడ్డి అనే రాజుకు సమానులు.

భావ = ఆత్మ జ్ఞానమునందు

భవ = పుట్టుకయందు

భోగ = అనుభవమునందు

సత్కళా = అభివృద్ధియొక్క

భావములను = పద్ధతులందును

ఆత్మ జ్ఞానమునందు, పుట్టుకయందు, అనుభవమునందు, అభివృద్ధియొక్క పద్ధతులందును బంగారువంటి కాంతి కలిగిన బ్రహ్మకు కుమారుడైన సనత్కుమారుడు, శ్రేష్ఠుడైన బ్రహ్మకుపుట్టిన వశిష్ఠుడు, క్షత్రియుడై బృహస్పతి వలన పుట్టిన కచుడునూ, ఆలోచించగా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు సమానులు.

నాలగవ చరణద్వయాల అర్థం, అన్వయం :

ర + అజ + నందన = శ్రేష్ఠుడైన మన్మధుని కుమారుడైన అనిరుద్ధుడును

ర + అజ = సర్వ వ్యాపకుడైన విష్ణువు

రాజ = యక్షుడును (నలకూబరుడు ?)

ఆత్మజ = మన్మధుడును

తలప అల్లయ వేమ ధరణిపతికి సాటి = ఆలోచించగా అల్లయ వేమా రెడ్డి అనే రాజుకు సమానులు ( అన్ని పాదాలకీ ఒకే అర్థం)

భావ = ఆకారమునందును

భవ = సంసారమందును

భోగ = సుఖానుభవమునందును

సత్కళా = సౌందర్యము యొక్క

భావములను = రీతియందును

ఆకారమునందు, సంసారమందు, సుఖానుభవమునందు, సౌందర్యముయొక్క రీతియందును, శ్రేస్ఠుడైన మన్మధునికుమారుడైన అనిరుద్ధునికి, సర్వ వ్యాపకుడైన విష్ణువు, యక్షుడైన నలకూబరుడు, మన్మధుడును, ఆలోచించగా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు సమానులు.

గీత పద్య పాదానికి, సీసపద్యపాదానికీ మధ్య ఉన్న క్రమాలంకారం గమనించదగ్గది.

ఉదాహరణకి, మొదటి చరణాలద్వయం తీసుకోండి.

బుద్ధియందు చంద్రుని కుమారుడైన బుధుడు, ఐశ్వర్యమునందు సమర్థుడైన ఈశ్వరుడు, వైభవములో దేవేంద్రుడు, మంచివిద్యలయొక్క అతిశయములందు బ్రహ్మదేవుడును, ఆలోచింపగా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు సమానులు. మిగిలిన వాక్యాలూ ఇల్లాగే క్రమాన్వితం చేసుకోవాలి.

ప్రొఫెసర్ జి. లలిత గారి “తెలుగులో చాటు కవిత్వం” (1981, క్వాలిటీ పబ్లిషర్స్, రామ మందిరం వీథి, విజయవాడ-2) అన్న పుస్తకంలో, ఈ చాటువుని క్రమాలంకారప్రాణితమైన చతుష్పాద యమకం, అని చెప్పారు. అర్థాలు మాత్రం పిచ్చయ శాస్త్రి గారి పుస్తకంనుంచే పుచ్చుకున్నారు. ఆ పుస్తకంలో అచ్చుతప్పులు సాధ్యమైనంతవరకూ సవరించి, రాశాను.

ఇక పోతే, మేకతోక పద్యం అర్థం ఏమిటి?

ఒక మేక, దానివెనక తోక, తోక ముందు మరోమేక, మరోమేక వెనక తోక, ఈ తోకముందు మరోమేక … వగైరా, వగైరా, “శిష్యా, ఇది అనంతం.” అన్నట్టు, మేకలు వరసగా (క్రమాలంకారం లాగా!) లైనులో పోతున్నట్టు, కనిపించడం లేదూ!!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!