దిగంబరా ! శంకరా ! శ్రీ కాళహస్తీశ్వరా !

శ్రీ కాళహస్తీశ్వరా !

మహాకవి హృదయం లో ఏ సమయం లో ఎటువంటి భావతరంగాలు ఎగసి పడి, ఎటువంటి భావాలను పండిస్తాయో విశ్లేషించడం సామాన్యులకు కసాధ్యమైన విషయం . 

విశ్వకవి రవీంద్రుడు , కవిసమ్రాట్ విశ్వనాథ లు కూడ దీని కతీతులు కారనేది 

విద్వల్లోక విదితం.

.

"కాలద్వార కవాటబంధనము దుష్కాల ప్రమాణ క్రియా

లీలాచాలక చిత్రగుప్త ముఖ వల్మీకోగ్ర జిహ్వాద్భుత

వ్యాళవ్యాళ విరోధి మృత్యుముఖ దంష్ట్రా నాహార్య వజ్రంబు ది

క్చేలాలంకృత! నీదు నామ మరయన్; శ్రీ కాళహస్తీశ్వరా !

.

దిక్కులనే వస్త్రములుగా ధరించిన వాడా ! దిగంబరా ! శంకరా ! నీ నామము యమధర్మరాజు లోకమున ప్రవేశించుటకు గల తలుపు నకు గడియ వంటిది.యముని విజృంఙణలను లీలగా అడ్డుకో గల్గినది. చిత్రగుప్తుని నోరు అనెడి పుట్టయందు కదలాడెడి నాలుక యనెడి మహాసర్పమునకు గరుత్మంతుని వంటిది . మృత్యుదేవత నోటియందలి కోరలనెడి పర్వతాలకు వజ్రాయుధము వంటిది. నీ నామమును స్మరించి నంతనే మృత్యువు దూరంగా తొలగి మోక్షము లభించును కదా !

“దిక్చేలాలంకృత “ ఎంత అందమైన సంబోధన . మహాకవి ఏకేశ్వరోపాసకుడై మహాశివుని మాత్రమే పరదైవతం గా భావించి ,పూజించాడు . తాను వ్రాసిన రెండు కావ్యాలను ఆ మహాదేవునికే సమర్పించిన పరమభక్తుడు. “ నమశ్శివాయ “ అంటేనే పాపాలు పటాపంచలౌతాయి. “నమశ్శివయ్య” అంటే ఆ స్వామి అక్కున చేర్చుకుంటాడు .

మహాకవి ధూర్జటి సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీ కృష్ణదేవరాయల వారి ఆస్థానకవి గా మన్నన లందినా తన కావ్యాలను మాత్రం శ్రీకాళహస్తీశ్వరునకే అంకితం చేశాడు. వైష్ణవ మతాన్ని స్వీకరించి , ఆముక్తమాల్యద వంటి ఆళ్వారు వృత్తాంతాన్ని కావ్యంగా వ్రాసిన శ్రీ కృష్ణ దేవరాయలు వీరశైవుడైన ధూర్జటిని తన ఆస్థానం లో పోషించడం శ్రీ రాయల వారి పరమత సహనాననికి ప్రతీక యని కొందరు వ్రాశారు.

విమర్శకులు భావిస్తున్నట్లుగా శ్రీ రాయల వారి మరణానంతరం కూడ ధూర్జటి జీవించి యుండవచ్చు. జీవనాన్ని కొనసాగించడానికి రాజులను ఆశ్రయించి , వారి అభిరుచుల కనుగుణం గా తానుండలేక ఇడుముల పాలయినట్లు గాను మనం భావించవచ్చు. కవి వ్రాసిన కవిత్వాన్ని తనకు అంకితం చేయకుండా ఉన్నా అతన్ని పోషించడానికి రాజులు అందరూ శ్రీ రాయలవారి అంత ఉదారులు ఉండరు కదా . అదే మహాకవి కి ఇబ్బందిని కల్గించి ఉంటుంది. మహాకవి తీసుకున్న నిర్ణయం కూడ మహాదేవునికి కాక తన కవిత్వం మరొకరిపై చెప్పననే మహాకవి తీసుకున్న నిర్ణయం కూడ రాజులకు కంటకమై , కవికి జీవనవ్యయానికి ఇబ్బంది కల్గించి ఉండవచ్చు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!