నీకు తెలియదు కదూ!

నీకు తెలియదు కదూ!

(శారద శివపురపు గారి కవిత )

వెచ్చని దుప్పట్లోంచి లేవంగానే

పేపర్రాలేదని విసుక్కుంటావు కానీ

పేపరేసే కుర్రాడికి రాత్రంతా జ్వరమున్నా

పొద్దున్నే చల్లో లేచాడని తెలియదు కదూ....

పాల పేకెట్ నీ కాఫీ టైంకి

అందట్లేదని చిందులేస్తావు కానీ

పాలు పంచే కుర్రాడికి అన్నంలో

మజ్జిగ నీళ్ళు కరువని నీకు తెలియదు కదూ....

ఎంత డబ్బు పోసినా బాత్రూం టైల్స్

మెరవట్లేదని చిర్రు బుర్రులాడతావు కానీ

నువు ఖరాబు చేసిన కమోడ్ కడిగే అమ్మాయి

తెల్లవారుఝామున ఆరుబయట చీకటిలో పడే

అవస్థ తెలియదు కదూ...

నీ డ్రైనేజీ బ్లాక్ అయితే పూడిక తీసే చేతులు

రెండుపూట్లా నోట్లోకెళ్తాయో లేదో కూడా

నీకు తెలియదు కదూ...

మానవత్వం అంటే ఎక్కడో దూరంగా ఉన్న

సిరియా శరణార్ధుల మీదో

నేపాల్ భూకంప బాధితుల మేదో

ఇజ్రాయిల్ సైన్యం హతమార్చే పాలస్థీనుల మీదో

చూపించే జాలేనా..........?

రెండు పూటలా ఒళ్ళు శుభ్రం చేస్కున్నా

మనసులోని కుళ్ళు కడగాలంటే

ముప్పైమునకలేసినా

పుష్కర గోదారికి మాత్రం సాధ్యమా?????????

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!