ఇందీవర శ్యామ సుందరగాత్రుండు,

కౌసల్య గర్భవాసమున జన్మించిన శ్రీమహావిష్ణువు, 

ఆమెకు తన నిజరూపమును చూపుట !

(శ్రీ Satyanarayana Piska. గారి విశ్లేషణ )

ఇందీవర శ్యామ సుందరగాత్రుండు,

దరహాసపూర్ణ వక్త్రంబువాడు,

పురుషార్థముల దెల్పు భుజచతుష్కమువాడు,

పట్టుచేలములతో బరగువాడు,

కరుణామృతము జిల్కు కన్నుదమ్ములవాడు,

వనమాల గళసీమ దనరువాడు,

నవరత్నమయ భూషణమ్ములు గలవాడు,

చిన్మయతేజంబు చెలగువాడు,

వేలుపులకు నెల్ల పెన్నిధియగువాడు,

సాధుబృందములకు సద్గురుండు,

నెల్లలోకములకు నేలిక యగువాడు,

పుత్రుడగుచు గనులముందు నొప్పె!

(శ్రీమదధ్యాత్మ రామాయణము, బాలకాండ - పండిత నేమాని రామజోగి సన్యాసిరావు)

అర్థములు: ఇందీవరము = నల్లకలువపూవు; సుందరగాత్రుడు = అందమైన దేహము కలవాడు; దరహాసపూర్ణ = నిండైన చిఱునవ్వుతో; వక్త్రంబువాడు = మోము కలవాడు; పురుషార్థములు = ధర్మార్థకామమోక్షములు; భుజచతుష్కము = నాలుగుచేతులు; చేలములు = వస్త్రములు; కరుణామృతము = చల్లని కరుణాదృక్కులు; కన్నుదమ్ములు = కళ్ళు; వనమాల = తులసీదళముల హారము; గళసీమ = కంఠసీమ; తనరువాడు = ఒప్పువాడు; భూషణమ్ములు = ఆభరణములు; చిన్మయతేజము = దివ్యమైన తేజస్సు; వేలుపులు = దేవతలు; పెన్నిధి = పెద్దనిధి; సాధుబృందములు = సజ్జన సమూహములు; సద్గురుండు = ఉత్తమ గురువు; ఏలిక = ప్రభువు.

,

భావము: నల్లకలువ వంటి అందమైన శరీరఛాయ కలవాడు, నిండైన చిఱునవ్వుతో వెలుగుతున్న మోమువాడు, ధర్మార్థకామమోక్షములు అనెడు 4 పురుషార్థములకు ప్రతీకలుగా ప్రకాశిస్తున్న చతుర్భుజములవాడు, పట్టువస్త్రములను ధరించినవాడు, చల్లని అమృతమువంటి కరుణాదృక్కులు ప్రసరించే కన్నులవాడు, తులసీదళములమాల కంఠసీమలో వ్రేలాడుతున్నవాడు, నవరత్నమయమైన నగలను ధరించినవాడు, దివ్యతేజముతో ప్రకాశిస్తున్నవాడు, దేవతలందరికీ పెన్నిధి, సాధుసత్తములకు ఉత్తమగురువు, సకల భువనములకు నాథుడైన శ్రీమన్నారాయణమూర్తి, 

కౌసల్యాదేవి భాగ్యవశమున ఆమెకు సుతుడై కనులవిందు చేశాడు..... ఆ

హా! ఆ మహాతల్లి ఎంతటి పుణ్యము చేసుకున్నదో కదా!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!