విష్ణు సహస్రనామ స్తోత్రము ! (ఫలశ్రుతి-ఉపదేశాలు.)
విష్ణు సహస్రనామ స్తోత్రము ! (ఫలశ్రుతి-ఉపదేశాలు.) విశ్వం అనే నామంతో మొదలైన సహస్ర నామ జపం సర్వ ప్రహరణాయుధ అనే వెయ్యవ నామంతో ముగుస్తుంది. ఈ ప్రధాన స్తోత్ర భాగంలో 108 శ్లోకాలలో వేయి నామములు పొందుపరచబడి ఉన్నాయి. పరమాత్ముని వివిధ లక్షణ గుణ స్వభావ రూపములు వివిధనామములలో కీర్తించబడ్డాయి. అనంత గుణ సంపన్నుడైన భగవానుని వేయి ముఖ్యగుణములను కీర్తించే పుణ్యశబ్దాలుగా ఈ వేయి నామాలను సాంప్రదాయికులు విశ్వసిస్తారు. విష్ణు సహస్రనామాల గురించి పెక్కుభాష్యాలు వెలువడినాయి. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు రచించిన భాష్యము వీటిలో ప్రథమము. అద్వైత సిద్ధాంతము ననుసరించే ఈ భాష్యంలో భగవంతుని పరబ్రహ్మ తత్వమునకు, షడ్గుణైశ్వర్యమునకు ఎక్కువ ప్రాదాన్యతనిచ్చి వ్యాఖ్యానించారు. 12వ శతాబ్దంలో పరాశర భట్టు రచించిన భాష్యము విశిష్టాద్వైతం సిద్ధాంతాలకు అనుగుణంగా సాగుతూ, భక్తుల పట్ల భగవానుని సౌలభ్యాన్నీ, సౌశీల్యాన్నీ, కరుణనూ మరింతగా విపులీకరించింది. తరువాత అనేకులు రచించిన వ్యాఖ్యలకు ఈ రెండు భాష్యాలే మార్గదర్శకాలు. వివిధ భాష్యకర్తలు వ్యాఖ్యానించిన నామముల జాబితా పరిశీలించినట్లయితే వారు పేర్కొన్న నామములల...