వివేకచూడామణి -(4 వ భాగం ) !

వివేకచూడామణి -(4 వ భాగం ) !

-

శ్రీ ఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.


-

4. ఆధారం – వస్తుతత్త్వం :

ఈ మారుతున్న జగత్తు వెనుక, మారని ఆధారం, మారని సత్యం మనం గ్రహించగలిగితే, అప్పుడే మనం నిజాన్ని గ్రహించామని చెప్పవచ్చు.


ఆ సత్యం తెలుసుకోనంతవరకు, మన జ్ఞానం నిజమైనది కాదని, భ్రమకు లోనైనదని చెప్పవచ్చు. అందువల్ల, ఈ మార్పుల వెనుక ఉన్న సత్యం ఎటువంటిది అన్నది తెలుసుకోవాలి.

ఒక వస్తువు ఒక చోట, ఒక కాలంలో ఒక రూపంలో ఒక పేరుతో ఉండి, వేరొక చోట మరొక కాలంలో ఇంకొక రూపంలో వేరొక పేరుతో ఉంటే అందులో మార్పు జరిగిందన్నమాట. కాని వస్తుతత్త్వంలో మార్పు లేదు. కేవలం నామ, రూపంలోనే మార్పు వచ్చింది. ఆ మార్పు దేశ, కాలాల పరిధిలో జరిగింది.

ఒక ఇల్లాలు తన పెళ్ళికి ముందు తన పుట్టింటివారు పెట్టిన రెండు జతల బంగారపు గాజులును పెళ్ళి అయిన రెండు సంవత్సరాల తరువాత, వాటిని చేరిపించి, పుస్తెల నానుగా చేయించుకుంది. ఆమె తిరిగి పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆమె తల్లి ‘నీ బంగారపు గాజులు ఏవి?’ అని అడిగినప్పుడు పుస్తెలనాను చూపించి ‘ఇవిగో, అవే ఇది’ అని చెప్తుంది. ‘అవి’ బహువచనం. ‘ఇది’ ఏకవచనం. గాజుల రూపం వేరు, పేరు వేరు. పుస్తెల నామరూపం వేరు, పేరు వేరు. అట్లాంటి సందర్భంలో ‘అవే ఇది’ అనటంలో ఔచిత్యం ఏమున్నది? ‘అవే ఇది’ అనే మాటలో గాజులలో ఉన్న వస్తుతత్వమే, వాటిలోని బంగారమే పుస్తెల నానులో కూడ ఉన్నదని భావం. నామరూపాలు మారినా వస్తుతత్త్వంలో మార్పు లేదు కాబట్టి విచారించ వలసిన పనిలేదు అని తల్లికి ధైర్యం చెప్పిందని భావం.

నగలు వేరువేరైనా బంగారం అంతా ఒకటే.

కుండలు, గోళాలు, వేరువేరైనా వాటిలో వస్తుతత్త్వం అయిన మట్టి అంతా ఒక్కటే.

కర్ర వస్తువులు (Furniture) వేరువేరైనా, వాటి అన్నిటిలో ఉన్నది కలప మాత్రమే.

మనం ప్రతి వస్తువులో దానికి నామ, రూపాలు సమకూర్చిన వస్తుతత్వాన్ని గురించి, తెలుసుకోవటం మొదలుపెడితే అప్పుడు కనిపిస్తున్నంత వివిధత్వం కనిపించదు, ఆ వస్తువులలో మనం ఏర్పరచుకున్న విలువలలో కొంత


మార్పు వస్తుంది. వాటిలో మనం ఏర్పరచుకున్న మమకారంలో కొంత మార్పు వస్తుంది. మనం మన వస్తువులలో (అవి విలువైనవి కాకపోయినా) మనం ఏర్పరచుకున్న గర్వం, పరులకున్న వస్తువులలో (అవి కూడ విలువలేనివే అయినా), మనం ఏర్పరచుకునే ఈర్ష్యాభావంలో, చాలావరకు తరుగుదల కనిపిస్తుంది.

ఈ మమకారాలు, ఈ గర్వాలు, ఈ ఈర్ష్యలు, ఈ వస్తువులు సమకూర్చుకోవటంలోని తాపత్రయం ఇవే కదా జీవితం. ఇవి లేకపోతే జీవితంలో ఆనందం (Thrill) ఎలా ఉంటుంది? అని కొందరు ప్రశ్నించవచ్చు. ఇదే ఆనందం అనుకోవటం ఒక భ్రమ. ఆ మిథ్యానందం కోసం నిజాన్ని కప్పిపుచ్చి భ్రమలో పడిపోనక్కరలేదు. నిజం గ్రహిస్తూనే ఆనందం పొందవచ్చు. అసలు నిజం తెలుసుకోవటంలో ఉన్న ఆనందం భ్రమలో ఉండదు. నిజాన్ని మరిచిపోనంతవరకు, భ్రమలో ఉన్నట్లు నటించినా తప్పులేదు. కాని నిజాన్ని మరచిపోరాదు.

చిన్నపిల్లలు గల ఇంట్లో, పెద్దవారు కూడ చిన్నపిల్లలతో కలిసి ఆడుకుంటూ చిన్నపిల్లలలాగనే పాలకోసం ఏడుస్తూ, అన్నం పెట్టమని అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. ఆ దుఃఖములో, ఆ మారాం చేయటంలో వారికి ఆనందమే కలుగుతుంది. ఎట్లా అంటే, అది వట్టి ఆట మాత్రమే అని, ఆ పెద్దవారికి తెలుసు, పిల్లలకి కూడ తెలుసు. అది వట్టి భ్రమ. అందులోనే ఆనందం. కాని ఆ ఆనందం కోసం తమ నిజతత్త్వం మరిచిపోనక్కరలేదు. అట్లాకాక, ఆట అయిపోయిన తరువాత కూడా, పెద్దవారు చిన్న పిల్లలుగా ప్రవర్తిస్తే, వారికి మతి స్థిమితం పోయిందని మనం చెప్పవచ్చు.

-

(ఇంకా వుంది )-


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!