హరి నరకాసురవధకేగుట! (పోతన భాగవతం -దశమ స్కంధము)

హరి నరకాసురవధకేగుట!

(పోతన భాగవతం -దశమ స్కంధము)

-శా.


"దేవా! నీవు నిశాటసంఘముల నుద్దీపించి చెండాడ నీ

ప్రావీణ్యంబులు సూడఁ గోరుదుఁ గదా! ప్రాణేశ! మన్నించి న

న్నీ వెంటం గొనిపొమ్ము నేఁడు కరుణన్; నేఁ జూచి యేతెంచి నీ

దేవీ సంహతికెల్లఁ జెప్పుదు భవద్దీప్తప్రతాపోన్నతుల్‌, "


భావము:

“ప్రభూ! ప్రాణనాథ! నీవు విజృంభించి రాక్షసుల సమూహాలను చెండాడుతుంటే, నీ యుద్ధనైణ్యం చూడాలని కోరికగా ఉంది నామాట మన్నించి దయతో నన్ను నీ వెంట తీసుకువెళ్ళు. నేను అక్కడ రణరంగంలో నీ ప్రతాపాన్ని కనులారా చూసివచ్చి, ఇక్కడ రాణులు అందరికీ వివరంగా చెప్తాను.”


ఈవిధంగా తన ప్రాణసఖి సత్యభామ అడుగగా, శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.


-సీ.


"సమద పుష్పంధయ ఝంకారములు గావు; 

భీషణకుంభీంద్ర బృంహితములు

వాయునిర్గత పద్మవనరేణువులు గావు; 

తురగ రింఖాముఖోద్ధూతరజము

లాకీర్ణజలతరం గాసారములు గావు; 

శత్రుధనుర్ముక్త సాయకములు

గలహంస సారస కాసారములు గావు; 

దనుజేంద్రసైన్య కదంబకములు


-తే.


కమల కహ్లార కుసుమ సంఘములు గావు; 

చటుల రిపు శూల ఖడ్గాది సాధనములు

కన్య! నీ వేడ? రణరంగ గమన మేడ? 

వత్తు వేగమ; నిలువుము; వలదు వలదు. "


భావము:

“అబలవైన నీ వెక్కడ? రణరంగ మెక్కడ? అక్కడ వినిపించేవి మదించిన తుమ్మెదల ఝంకారాలు కావు, భయంకరమైన ఏనుగుల ఘీంకారాలు; అక్కడ కనిపించేవి తామరపూల నుండి గాలికి రేగి వచ్చిన పరాగరేణువులు కావు, గుఱ్ఱపుడెక్కల చివరల నుండి లేచిన ధూళిదుమారాలు; అవి నీటికెరటాల తుంపరలు కావు, శత్రువుల ధనుస్సుల నుండి వెడలిన శరపరంపరలు; రాజహంసలతో నిండిన సరోవరాలు కావు, రాక్షససైన్య సమూహాలు; కమలాలు కలువలు కనిపించవు, అక్కడ కనపడేవి భయంకరమైన శత్రుల శూలాలు ఖడ్గాలు ఆయుధాలు; ఇటువంటి యుద్ధరంగానికి నీ వెందుకు రావడం. నేను త్వరగా తిరిగి వచ్చేస్తాలే. నీవు రావద్దు వద్దు; వద్దు; రావద్దు.”


-

అని అంటున్న ప్రాణప్రియుడి దగ్గరకి వచ్చి ప్రియురాలు ప్రియం కలిగేలా ఇలా అన్నది.


-ఉ.


"దానవులైన నేమి? మఱి దైత్యసమూహములైన నేమి? నీ

మానితబాహు దుర్గముల మాటున నుండగఁ నేమి శంక? నీ

తో నరుదెంతు" నంచుఁ గరతోయజముల్‌ ముకుళించి మ్రొక్కె న

మ్మానిని దన్ను భర్త బహుమాన పురస్సరదృష్టిఁ జూడఁగన్.


భావము:

“నాథా! నీ బాహువులు అనే దుర్గాల అండ నాకు ఉండగా, వారు రాక్షస సమూహాలైతే మాత్రం నాకేం భయం. నేను నీతో వస్తాను.” అని అభిమానవతి అయిన సత్యభామ పద్మాల వంటి తన చేతులు జోడించి మరీ బ్రతిమాలింది. శ్రీకృష్ణుడు సంతోషించి, సత్యభామ వంక మెచ్చుకోలుగా చూసాడు.


-

ఈలాగున తనను బ్రతిమాలిన సత్యభామను తన కలువల వంటి చేతులతో గరుత్ముంతునిపై ఎక్కించుకుని, ఆమెతోపాటు ఆకాశమార్గాన మురాసురుని పట్టణం ప్రాగ్జ్యోతిషాన్ని చేరాడు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!