వివేకచూడామణి (17వ భాగము ) !.

వివేకచూడామణి (17వ భాగము ) !.

-

శ్రీ ఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.

-

17.బంధం – మోక్షం :

జీవుడు స్వయంగా బ్రహమతత్త్వమే అయినా, మాయకు లోబడి, తన నిజతత్వాన్ని మరచిపోయి, తన ఉపాధిమాత్రాలైన శరీర మనోబుద్దులే తాను అనే భావంతో వాటికి కష్టం కలుగకుండా చూసుకోవటం తన కర్తవ్యమని భావిస్తాడు. ఇంద్రియాలకు కనిపించే ఈ బాహ్యప్రపంచం తన కర్తవ్యం కోసమే ఉన్నదని భావించి, అందులోనుంచి వీలైనంత సౌఖ్యాన్ని, సౌఖ్యాన్నిచ్చే వస్తువులను తన సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నంలో సఫలీకృతుడైతే సంతోషిస్తూ, విఫలుడైతే దుఃఖిస్తుంటాడు. తన ప్రయత్నానికి అడ్డుతగిలే వారిని ద్వేషిస్తుంటాడు. తన సౌఖ్యం కోసం భార్యాపుత్రులను,బంధుమిత్రులను సమకూర్చుకుని, వారి పోషణకు నిరంతరం శ్రమిస్తూ ధనం కూడబెడుతుంటాడు. దానిని నిలబెట్టటం కోసం శ్రమ పడుతుంటాడు. అవి కారణాంతరంవల్ల పొతే అమితంగా దుఃఖిస్తాడు. తన దారాపుత్రులలో ఎవరైనా చనిపోతే, మహాదుఃఖసముద్రంలో మునిగిపోతాడు. ఈ జన్మలో చేసిన కర్మఫలాలు వాసనారూపంలో తన వెంట వస్తే, తిరిగి జన్మ పొంది, ఈ ప్రపంచంలో ప్రవర్తించటం మొదలుపెడతాడు. ఇదే సంసారం. ఇదే జననమరణ చక్రం. ఇదే బంధం. దీని నుంచి బయటపడటం అంత సులభమైనది కాదు.

అసలు ఈ బంధం ఎప్పుడు కలిగింది? ఎందుకు కలిగింది? ఇది ఎంతో కాలం క్రింద, జీవుడు తన నిజస్వరూపాన్ని (తాను ఆనంద స్వరూపుడైన బ్రహ్మం అనే సత్యము), మరచి పోవటంవల్ల కలిగింది.

దీనికొక చక్కని ఉదాహరణ చెప్తారు, ఒక ఇల్లాలు, తన బంగారు కంఠాభరణం పోయిందని ఎంతో వ్యాకులత చెంది, ఇల్లంతా వెతకటం మొదలుపెట్టింది. అందరినీ అడుగుతూ, వెతికిన చోటనే వెతుకుతూ, తిరిగిన చోటనే తిరుగుతూ, బంగారు నగ పోయిందని తన భర్త, అత్తగారు ఏమని దూషిస్తారో ఊహించుకుంటూ, వారికి ఏమని జవాబు చెప్పాలో ఆలోచిస్తూ, తన దౌర్భాగ్యానికి తననే తిట్టుకుంటూ, నిద్రాహారాలు మాని, ఆ నగకోసం పరితపించసాగింది. ఇంతలో ఆమె ఎందుకో అద్దం ముందు నిల్చుని, తన నిజరూపాన్ని చూసుకుంటున్నప్పుడు, ఆ బంగారు నగ తన కంఠానికే ఉండటం చూసింది. ఆమె వెంటనే అమితానందభరితమై, ‘నా ఆభరణం దొరికింది, నా ఆభరణం దొరికింది’ అని ఆనందోత్సాహాలతో చిందులు వేస్తూ, అందరికి చెప్పసాగింది.

నిజంగా ఆలోచిస్తే ఆమె నగ పోవటం అసత్యమే, అది దొరకటం అబద్ధమే. నగపోతే కదా దొరికే ప్రసక్తి వచ్చేది? మరి నగ పోయిందని ఆమె పడిన ఆ వేదన, నగ దొరికిందని ఆమె అనుభవించిన ఆనందం, అవి కూడ అబద్ధమేనా? కాదు, అవి నిజమైన అనుభూతులే. కాని అవి నగ పోవటం వల్ల గాని, తిరిగి దొరకటం వల్ల గాని కలిగిన అనుభూతులు కావు. ఆమె అనుభవించిన ఆవేదన అంతా, ‘నగ ఉన్నది’ అనే నిజం మరిచిపోయి, భ్రమవల్ల ‘నగ పోయింది’ అనే అసత్యభావన వల్ల గాని కలిగింది. ఆ విధంగానే, ఆమె ఆనందమంతా భ్రమ తొలగిపోయి ‘నగ ఉన్నది’ అనే సత్యం గ్రహించటం వల్ల కలిగింది.

సూక్ష్మంగా చెప్పాలంటే, కంఠాభరణం మొదటినుంచి చివరివరకు యథాస్థానంలోనే ఉన్నా, పోయిందనే భ్రమవల్ల దుఃఖం, ఉన్నదన్న నిజం తెలుసుకోవటం వల్ల ఆనందం కలిగాయి.

ఆ విధంగనే జీవుడి వస్తుతత్త్వం – సత్-చిత్-ఆనందమైన బ్రహ్మతత్వమే అయినా, మాయ వల్ల తన నిజతత్త్వం మరచిపోయి, ఆ ఆనందాన్ని తన ఉపాధుల ద్వారా, బాహ్యప్రపంచంలో వెదకటం మొదలువెడతాడు. ఆ ఉపాధులు మాయాకల్పితాలే – ఈ ప్రపంచం కూడ మాయాకల్పితమే. మాయామోహితుడైన జీవుడు, మాయవల్ల కల్పించబడ్డ శరీర మనోబుద్ధులతో, మాయాకల్పిత బాహ్యప్రపంచంలో, లేని ఆనందాన్ని వెతకటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. నిజం తెలిస్తే, తానే ఆనందమయుడు. ఆ ఆనందం కోసం వేరే చోట్ల వెతకనక్కరలేదు. తన నిజతత్త్వం తెలుసుకుంటే చాలు.

తన నిజతత్త్వం మరిచిపోయి, జీవుడిగా ఈ సంసారంలో కొట్టుకుపోవటం బంధం. తన నిజతత్త్వం తెలుసుకుని, ఈ సంసారం నుంచి బయటపడి, బ్రహ్మస్వరూపుడిగా (బ్రహ్మభూతుడిగా) జీవించటం మోక్షం.

ఈ బంధం నుంచి బయటపడటానికి మార్గం ఏంటి? ఈ బంధం కలిగించే ప్రధానకారణం తొలగిస్తే బంధం పోతుంది. అలాంటి ప్రధానకారణం ఏది? జీవుడి నిజతత్వమైన బ్రహ్మభావాన్ని మరగుపరచి, తాను ఈ దేహం, మనసు, బుద్ధి అనే భ్రమలో పడిపోవటం. ఆ భ్రమ నుంచి జీవుడు బయటపడ్డప్పుడే బంధముక్తుడవుతున్నాడు.

ఈ భ్రమ నుంచి బయటపడి, తన నిజతత్వాన్ని తెలుసుకోవటానికి ప్రగాఢమైన మోక్షేచ్ఛ (ముముక్షుత్వం) ఉండాలి. ఎంతో విచక్షణాజ్ఞానం ఉండాలి. ‘నేను ఎవరు?’ (‘నా నిజతత్త్వం ఏంటి?’) ఈ విధంగా తననుతాను ప్రశ్నించుకుంటూ, దేనిలోనైనా, ‘ఇది నేను కాదు’ అనే భావం కలిగిన వెంటనే, దానిని ఇంద్రియనిగ్రహం, మనోనిగ్రహం, నిశ్చలత్వం, శ్రద్ధ, ఎటువంటి కష్టాలు కలిగినా నిర్వికారంగా ఉండగలగటం, గురువులపై, దేవుడిపై భక్తిభావం ఉండాలి. వీటన్నిటికి తోడు, సకలశాస్త్ర పారంగతుడు, బ్రహ్మజ్ఞాని అయిన గురువుల ఆశ్రయం దొరకటం ఎంతో శ్రేయస్కరం.

ఈ విధంగా సాధన సంపత్తిని సమకూర్చుకుని, వేదాంత గ్రంథాలను (ఉపనిషత్తులు మొదలైన వాటిని) చదవటం, వాటిలోని గూడార్థాలను గురువు చెప్పగా వినటం (శ్రవణం), చదివిన వాటిలో, విన్నవాటిలో, అంతరార్థం మనసులో తార్కికంగా ఆలోచించి అవగాహన చేసుకోవటం (మననం), తను గ్రహించిన సత్యాన్ని మనసులో నిలుపుకోవటం, అనన్యబుద్ధితో సంతత – ధ్యానం, అటు తరువాత సమాధిస్థితిలో (బాహ్యాంతరాలను మరిచి), బాహ్యతత్వాన్ని స్వానుభవపూర్వకంగా తెలుసుకోవటం – ఇవి మోక్షసాధనకు సాధకుడు అవలంబించవలసిన మార్గాలు. ఇందులో స్వప్రయత్నం ఎంతో ముఖ్యం. ఇది అద్వైతవేదాంత సిద్ధాంతం ప్రకారం మోక్ష సాధనకు సూచించిన మార్గం. దీనిని జ్ఞాన మార్గం అంటారు.

మిగిలిన ద్వైతమతాలలో, ఈశ్వరుడే సృష్టికర్త, ప్రభువు, నియామకుడు. అతనికి మించినది ఏదీ మరొకటి లేదు. జగత్తులో జరిగే అన్ని పనులు అతని ఆజ్ఞానుసారం జరుగుతుంటాయి. జీవుడు అతనిని మరచి ఉన్నంతకాలం జననమరణ చక్రంలో తిరుగుతూ, ఈ సంసారంలో కొట్టుకుపోతుంటాడు. ఇదే బంధం. జీవుడు తన తప్పును గ్రహించి, ఈశ్వరుడిలో ప్రగాఢమైన భక్తిభావంతో, అతని కోసమే అన్ని పనులను చేస్తూ, అతనినే శరణుజొచ్చితే, ఈశ్వరుడు కరుణాసాగరుడు కావటం వల్ల, ఆ భక్తుడిపై దయ చూపి, అతనిని తన వద్దకు చేర్చుకుంటాడు. అదే మోక్షం. ఇందులో భక్తి ప్రధానం కాబట్టి, ఇది భక్తి మార్గం.

ఈ రెండు మార్గాలలో, ఈ సంసారబంధం నుంచి విడిఅవటం మోక్షమని, అందుకు వైరాగ్యం, వివేకం, భక్తి, ముముక్షత్వం, శదమాది షట్సంపత్తి, ముఖ్యాంగాలుగా అంగీకరించబడ్డాయి. రెండిటిలో స్వార్థరహిత సేవ సహాయకారిగా అంగీకరించబడింది. కాని భక్తిమార్గంలో భక్తికి ప్రాధాన్యం ఇవ్వగా, జ్ఞానమార్గంలో వివేకానికి ప్రాధాన్యత ఇవ్వబడింది.

పరమభక్తుడికి, బ్రహ్మజ్ఞానికి, అంతిమ అనుభవం ఒక్కలాగనే ఉంటుంది. భక్తుడికి భక్త్యాతిరేకంలో అంతా మధురాతి మధురమే – జ్ఞానికి బ్రహ్మజ్ఞాన రసానుభూతిలో అంతా ఆనందమే. ఒకరికి సర్వం భగవంతుడు తప్ప వేరొక ప్రపంచం లేదు. వేరొకరికి అంతా బ్రహ్మే తప్ప వేరొకటి లేదు. ఇద్దరికీ ఈ ప్రపంచంతో సంబంధం లేదు. ఈ ప్రపంచంలోని

కీచులాటలతో ప్రమేయం లేదు. భగవద్గీతలో పరమభక్తుడి లక్షణాలు, బ్రహ్మజ్ఞాని లక్షణాలు ఒక్కవిధంగానే చెప్పబడ్డాయి. ఇద్దరు చేరుకునే స్థానం కూడా ఒక్కటే అని చెప్పబడింది.

-

-ఇంకా వుంది-

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!