శతకవాఙ్మయంలో పాము !

శతకవాఙ్మయంలో పాము !

-

సుమతి శతకకారుడు బద్దెన

కూర్చిన సర్పసంబంధమైన పద్యాలను చూద్దాం-

-


ఉడుముండదె నూరేండ్లును

బడియుండదె పేర్మి బాము బదినూరేండ్లున్

మడువున కొక్కెర యుండదె

కడునిల పురుషార్థపరుడు కావలె సుమతీ!


ఉడుము నూరేండ్లుంటుంది. పాము వేయేండ్లుంటుది.

మడుగున కొంగ కలకాలం వుంటుంది. వాటివాటి

వయసులను బట్టి ఉదహరిస్తున్నాడు కాని వాటివలన

ప్రయోజనం ఏమిటి - మానవజన్మ ఎత్తినందుకు ఫలంగా

పురుషుడు ధర్మార్థకామమోక్షాలను సాధించాలిగాని-

అంటున్నాడు కవి.

-


ఎప్పుడూ తప్పులే వెదికే వానిదగ్గర చేసే నౌకరీ ఎలాంటిదంటే

పాము పడగ నీడన నివసించే కప్పవంటిదని పోల్చాడు కవి

ఇక్కడ పామును దొరగానూ, కప్పను నౌకరుగానూ పోల్చాడు.

ఆ పద్యంలో-


ఎప్పుడు తప్పులు వెదకెడు 

నప్పురుషుని కొల్వకూడదది యెట్లన్నన్

సప్పంబు పడగనీడన

కప్పవసించిన విధంబు గదరా సుమతీ!

-


జీవితంలో తప్పించుకోవటానికి వీలులేని

దుఃఖకరమైన అంశాలను కొన్నింటిని వివరిస్తూ

చెప్పిన పద్యం-


కప్పకు నొరగాలైనను

సప్పమునకు రోగమైన, సతి తులువైనన్

ముప్పున దరిద్రుడైనను

దప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతీ!

-


కప్పకు కాలు విరిగినా, పాముకు రోగమైనా,

భార్యగయ్యాళయినా, ముసలితనంలో దరిద్రం

వచ్చినా - దుఃఖము తప్పదట -

నిజమేకదా!

-


ఇదొక యదార్థపద్యం -


కరణము సాదైయున్నను

కరి మదముడిగినను బాము కరవకయున్నన్

ధర తేలు మీటకున్నను

గరమరుదుగ లెక్కగొనరు గదరా సుమతీ!

.


బాధకలిగింరలేని కరణాన్ని, మదములేని ఏనుగును,

కరవకుండా ఉన్న పామును, కుట్టని తేలును

లోకంలో ఎవర లక్ష్యపెడతారు - అంటే

లెక్కచేయరనిభావం.

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!