కీచక వధ- రెండవ భాగం -

కీచక వధ- రెండవ భాగం -


ద్రౌపది కీచకునితో " మాదేవి తృష్ణ తీరటానికి మధిర తీసుకు రమ్మంది. 

త్వరగా మధిరను ఇవ్వండి " అన్నది. 

కీచకుడు " మీ దేవి తృష్ణ తీర్చినట్లే నా తృష్ణ తీర్చవా " అన్నాడు.

ద్రౌపది " ఆలస్యం అయితే మా దేవి కోపిస్తుంది. త్వరగా మధిరను ఇవ్వండి " అన్నది. కీచకుడు " మధ్యం వేరే వాళ్ళతో పంపుతాను. 

నీవు ఈ మధ్యంత్రాగి నా తాపాన్ని పోగొట్టు. నిన్ను నా రాణిని చేసుకుంటాను. 

అపారమైన మణిభూషణాలు, విలాస గృహాలు నీకు సమర్పిస్తాను. నా భార్యలను నీకు దాసిని చేస్తాను. నేను నీ కనుసన్నలలో మెలుగుతాను " అంటూ కీచకుడు ద్రౌపదిని పట్టుకోబోయాడు. 

అంతలో ద్రౌపదికి రక్షగా ఉన్న రాక్షసుడు ఆమెలో ప్రవేశించాడు.

అంత బలాడ్యుడైన కీచకుని ఆమె విదిలించి కొట్టి బయటకు వచ్చింది.

కీచకుడు ఆ మెను వెంబడించాడు.

ద్రౌపది విరాటుని కొలువులో ప్రవేశించుట!


ద్రౌపది పరుగెత్తి విరాటుని కొలువులో ప్రవేశించింది.

కీచకుడు ఆమె వెంట కొలువులో ప్రవేశించి ఆమె జుట్టు పట్టుకుని లాగి కింద పడేసాడు. 

ఆ సమయంలో ఆమెలో ఉన్న రాక్షసుడు కీచకున్ని కొట్టి లాగి కింద పడవేసాడు. 

కీచకుడు ఆ బదెబ్బకు అవమానంతో కుంగి పోయాడు. 

ఆసమయంలో అన్నగారితో పాటు కొలువు కూటంలో ఉన్న భీముడు ఆగ్రహంతో ఊగి పోయాడు. ఒక్క క్షణం తమ అజ్ఞాత వాస విషయం మరిచాడు. 

కీచకుని పైన పట్టరాని కోపంతో వెంటనే పక్కన ఉన్న వృక్షాన్ని చూసి 

అలాగే అన్నగారి వైపు చూసాడు. ధర్మజుడు భీముని కను సైగతో వారించాడు. 

ధర్మరాజు విరాటునితో " మహారాజా! మన వంటల వాడు వలలుడు ఎక్కడ 

చూసాడో కాని వంట చెరకు కొరకు వేరు వృక్షాలు లేవా? 

ఫలపుష్పాదులతో ఉండినలుగురికి నీడ నిచ్చే వృక్షాన్ని వంట చెరకు కొరకు 

ఖండించడం తగునా " అన్నాడు.

భీముని కోపం ధర్మరాజు వారింపు ద్రౌపది చూసి విరాటునితో 

" అయ్యా! ధర్మాధర్మాలు తెలిసిన వారు, శత్రువులను అవలీలగా 

చంపగలిహిన వారు, గంధర్వులు అయిన నా భర్తలు అయిదుగురు నన్ను 

ఈ కీచకుడు అవమానిస్తుంటే చూస్తూ ఊరకున్నారు. 

ఇక సామాన్యమైన స్త్రీలకు రక్షణ ఏది. 

ఈ విరాటరాజు కొలువులో స్త్రీకి అవమానం జరుగుతుంటే ఎవరూ పలకరేమి? 

ఎవరికీ కరుణ లేదా? 

ధర్మరక్షణ చేయవలసిన రాజు ఇలా మిన్నకుండటం భావ్యమా? " 

అని సూటిగా ప్రశ్నించింది. 

అది చూసిన విరాటరాజు కీచకుని మందలించడానికి ధైర్యం లేక

ద్రౌపదిని అనునయించాడు. 

అది చూసి కీచకుడు తన మందిరానికి వెళ్ళాడు. 

కలత చెందిన మనసుతో ధర్మరాజు ద్రౌపదిని చూసి 

" సైరంధ్రీ! నీకు న్యాయం జరుగుతుంది. నువ్వు అంతఃపురానికి వెళ్ళు. 

నీకు జరిగిన అవమానానికి నీ భర్తలు మాత్రం కోపించరా? 

ఇది సమయం కాదని ఊరకుండి ఉంటారు. నీ భర్తలను నిందించడం తగదు.

కులస్త్రీ నిండు సభలో ఇలా మాట్లాడటం భావ్యమా " అన్నాడు. 

కాని ద్రౌపది అక్కడి నుండి కదలక ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే 

ధర్మరాజు " ఓ సైరంధ్రీ! ఏమిటిది పదిమందిలో నాట్యకత్తెలా నిలబడ్డావు.

కులస్త్రీలకు ఇది తగదు " అన్నాడు. ద్రౌపది రోషంగా తల ఎత్తి ధర్మరాజును చూసి 

" ఓ కంకు భట్టా! నా భర్త ఒక నటుడు ఇది సత్యము. పెద్దల ప్రవర్తన చూసి పిన్నలు ప్రవర్తిస్తారు. నా భర్త నటుడు కనుక నేను నర్తకినే. 

నా భర్త నటుడే కాదు జూదరి కూడా. ఒక జూదరి భార్యకు 

గౌరవ మర్యాదలు ఎలా లభిస్తాయి ? " అంటూ ద్రౌపది సభ నుండి వెళ్ళి పోయింది.

---

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!