చెలియలేదు...చెలిమి లేదు ! .

చెలియలేదు...చెలిమి లేదు !

.

ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా దేవదాసును మించిన

ప్రేమైక తాత్వికుడు మరొకరు కనిపించడు. 

విఫలమైన ప్రేమకు పేటెంటు ఎప్పుడూ దేవదాసుదే!

ప్రేమ వైఫల్యం అనగానే మనసున మెదిలే మొదటి మాట దేవదాసు. 

ఇక్కడే దేవదాసు నోట సముద్రాల మాట బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్ అని జీవిత సత్యాన్ని, ఓదార్పు సూత్రాన్నీ ఒకే ఒక్క వాక్యంలో చెప్పించారు.

అలాగే చెలియ లేదు, చెలిమి లేదు వెలుతురే లేదూ... అనే పాట లేని చీకటిని మన మనసుల్లో నింపి మరింత చీకట్లోకి తోసి బాధనే ఔషధంగా ఇస్తారు.

మరపురాని బాధకన్నా మధురమే లేదు...గతము తలచి వగచేకన్నా సౌఖ్యమే లేదూ...అందరాని పొందుకన్నా ఆందమే లేదూ... ఆనందమే లేదూ... అని విషాద వ్యసనాన్నీ పంచుతాడు.

బాధలోని ఆనందాన్ని ఎంతగానో అనుభవిస్తాడు. మరింత ముందుకెళ్లీ... దారిలేని బాధతో నేనారి పోయేనా... కథ తీరిపోయేనా... అని తనతో పాటుగా ప్రేక్షకుల్నీ కన్నీళ్లు పెట్టిస్తాడు. అతడి బాధలో లీనమై మన బాధను తగ్గించుకోవడం ఉందన్నదే తాజా అధ్యయనం.


ప్రేమ లేదనీ ప్రేమించ రాదనీ: ఇలా విఫలమైన ప్రేమను, అందులోని బాధను ఆ రోజుల్లో దేవదాసు అనుభవించి లోకానికి అనుభవైక వేద్యం చేస్తే తర్వాత కాలంలో 80ల చివరి సంవత్సరాల్లో వచ్చిన అభినందన మళ్లీ అంత బాధనూ పంచింది... పెంచింది... బాధలో సేద తీర్చింది.

ఆ రోజుల్లో ప్రేమలో పడని వారు కూడా ఆ పాటల్లోని సంగీత సాహిత్యాల్లో దాగిన విషాద మాధుర్యాన్ని అనుభవించారు. అసలు తమకు లేని ప్రేయసిని కూడా చాలా ఇష్టంగా ప్రేమ ఎంత మధురం - ప్రియురాలు అంత కఠినం అని తిట్టుకున్నారు. ఈ సినిమాలో పాటలన్ని కూడా మనసు కవి ఆత్రేయ అందించినవే. ఇళయరాజా వీటికి తన సంగీతంతో బాధా ప్రతిష్ట చేశారు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!