వివేకచూడామణి (10)

వివేకచూడామణి (10)

-

శ్రీ ఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.

-

10. జీవాత్మ లేక జీవుడు :

ప్రతి మానవుడు ఈ ప్రపంచంలో వ్యవహరించేటప్పుడు, తనలోతాను ఆలోచించుకుంటున్నప్పుడు ‘నేను’, ‘నాది’ అనే మాటలను వాడుతుంటాడు. ‘నేను’ అనే పదం కర్తను, భోక్తను, ద్రష్టను అనే భావంలో వాడుతారు. ‘నాది’ అనే పదం ‘నేను’ అనే పదానికి భిన్నంగా వాడుతుంటాం.

‘నేను సుబ్బారావును’ అనే చెప్పినప్పుడు సుబ్బారావు అన్న పేరే తాను అనే భావం కలుగుతుంది. కాని ‘నుబ్బరావు అనే పేరు నాది’ అన్నప్పుడు ‘నేను’ వేరు, సుబ్బారావు అనే పేరు వేరని చెప్పగలం. ఒకటి ఆత్మపరమైన (Subjective) పదం. ఇంకొకటి అన్యపరమైన (Objective) పదం. ‘నాది’ అన్నప్పుడు ‘అది నేను కాను’ అని చెప్తున్నట్లే భావించవచ్చు.

‘ఈ దేహాన్ని నేను’ అన్నప్పుడు ఆ వ్యక్తి దేహమే తానుగా వ్యవహరిస్తున్నాడన్న మాట, కాని, ‘ఈ దేహం నాది’ అన్నప్పుడు ‘నేను వేరు’ ‘ఈ దేహం వేరు’అనే భావం కలుగుతుంది. ‘నేను’, ‘నాది’ అనే భావాలలో ‘నాది’ ‘నాది’ అని చెప్పుకోగలిగినవన్నీ ‘నేను’ కాదు అని చెప్పవచ్చు.


పైన చెప్పిన వివరణ ఆధారాన్ని తీసుకుని, మనలో ‘నేను’ ‘నేను’ అనేది ఎవరు అనేది నిర్ధారించవచ్చు.

ఈ శరీరం ‘నాది’ కాబట్టి నేను శరీరాన్ని కాను.

ఈ మనసు ‘నాది’ కాబట్టి నేను మనసును కాను.

ఈ బుద్ది ‘నాది’ కాబట్టి నేను బుద్ధిని కాదు.

ఈ విధంగా ఒక్కొక్కదానిని తిరస్కరించుకుంటూ పొతే, ‘నేను’ అన్నది ఏమైనా చేతికి అందుతుందా? లేక శూన్యమే మిగులుతుందా? మనం వేటిని ‘నేను’ ‘నేను’ అని భావించుకుంటూ వచ్చామో, అవన్నీ ‘నావి’, ‘నావి’ అనే భావంలోకి పోతుంటాయి. అందువల్ల ఆ ‘నాది’ అనే భావం ఎక్కడ ఏ విధంగా కలుగుతున్నదో ఆలోచిద్దాం.

ఇంతకు ముందు మనం ‘అహంకారం’ గురించి చెప్పుకున్నాం. ‘నేను చూస్తున్నాను’, ‘నేను చేస్తున్నాను’, ‘నేను అనుభవిస్తున్నాను’ (ద్రష్ట, కర్త, భోక్త) అనే భావన వెనుక ‘నేను’ అనేది ఏదో ఉన్నది. అదేమిటో ఆ భావానికి కూడ తెలియదు. అన్ని మనోవృత్తులలాగ అది కూడ ఒక మనోవృత్తే. అప్పటి వరకు, స్థూలశరీరంతో సహా, సూక్ష్మశరీరంలో కలిగే అన్ని మనోవృత్తులను, ‘నావి’, ‘నావి’ (ఈ శరీరం నాది, ఈ కోపం నాది, ఈ ఆలోచన నాది) అని అంటున్న వ్యక్తి ‘అహంకారం’ వద్దకు వచ్చేసరికి ‘అది నాది’ అని అనలేకపోతున్నాడు. అక్కడకు వచ్చేసరికి ‘ఇదే నేను’ అనే భావం స్ఫురిస్తుంటుంది. ఈ ‘అహంకార’ భావన కూడ ఒక మనోవృత్తే అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే, గాఢనిద్రలో ఈ భావన కూడా ఉండదు. కాని ఈ మనోవృత్తిని కలిగించే శక్తి ఎటువంటిదో ఎవ్వరూ చెప్పలేకపోవటంవల్ల, ఆ మనోవృత్తే, ఆ భావనే, ‘నేను’గా వ్యవహరిస్తుంది. గాఢనిద్రలో లేని ఈ ‘నేను’ అనే భావన ఈ అహంకారం మెలుకువ రాగానే, ఒక్కసారి, ‘నేను ఉన్నాను’ అనే భావంతో లేచి, జాగ్రత్ స్వప్నావస్థలలో తానే కర్తగా, ద్రష్టగా, భోక్తగా వ్యవహరించటం మొదలుపెడుతుంది. కాని, ఈ ‘అహంకారం’, ఈ భావన నిజమైన ‘నేను’ కాదు.


ప్రతీ పెద్ద వ్యాపారసంస్థకు, ఒక ముఖ్యవ్యవహర్త – ప్రధానాధికారి (Managing Director) ఉంటాడు. అతను ఆ సంస్థ వ్యవహారాలను సక్రమంగా నిర్వహించటానికి కావలసిన అధికారం (General Power of Attorney) పొంది, అన్ని వ్యవహారాలు తానే చూస్తుంటాడు, కాని, కొంత కాలానికి, తాను ఒక అధికారి మాత్రమే అన్న విషయం మరిచిపోయి, ‘నేను సంస్థను’ అన్నట్లు వ్యవహరించటం మొదలుపెడతాడు. ఆ విధంగానే ఈ ‘అహంకార భావన’ కూడా తన వెనుక ఉన్న ‘శక్తి’ ని గ్రహించలేక, తానే ‘నేను’ గా వ్యవహరిస్తాడు. అందువల్ల ఆ ‘అహంకార’ భావనే ‘జీవుడు’, ‘జీవాత్మ’ అని పిలవటం మొదలుపెట్టారు.

ప్రధాన కార్యకర్త వెనుక, అతనికి సర్వాధికారాలను ఇచ్చే ‘సంస్థ’ లేకపొతే ఆ ప్రధానాధికారికి ఎటువంటి విలువలేదు. ఎట్లాంటి అస్తిత్వం లేదు. ఆ విధంగానే ‘నేను’గా వ్యవహరిస్తున్న ఈ ‘అహంకార భావన’ వెనుక ఆధారభూతమైన ఒక నిత్యపదార్థం, సత్ పదార్థం లేకపోతే ఆ ‘అహంకారా’నికి కూడ అస్తిత్వం ఉండదు. ఆ సత్ పదార్థమే ‘ఆత్మ’తత్త్వం.

జ్ఞానరూపకమైన ‘ఆత్మ’తత్త్వజ్ఞాన ప్రకాశం చిత్తంలో ప్రతిబింబితమై, ‘నేను’ అనే భావనను కలుగచేస్తుంది.

సూర్యకాంతి ప్రవేశించలేని గదిలో చీకటి నిండి ఉంటుంది. కాని గది బయట ఉన్న సూర్యకాంతిలో ఒక అద్దం పెట్టి, ఆ కాంతిని గదిలోకి పంపించవచ్చు. అప్పుడు గది అంతా కాంతితో నిండిపోతుంది. ఆ కాంతి సూర్యుడివల్ల కలిగినది అయినా, అదే శుద్ధమైన సూర్యరశ్మి కాదు. అద్దం ద్వారా పరావర్తనం అయిన కాంతి. అద్దం ఎర్రరంగులో ఉంటే, గదిలోకి ప్రవేశించే కాంతి కూడ ఎర్రగా ఉంటుంది. ఆ గదిలో వస్తువులు కూడ ఎర్రగా కనపడతాయి. అద్దం మలినంగా ఉంటే, వస్తువులు కూడ అస్పష్టంగా కనపడతాయి.

ఆ విధంగనే ఆత్మజ్ఞానప్రకాశం చిత్తం (బుద్ధి) అనే అద్దంలో ప్రతిబింబితమై, ఆ చిత్తాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఆ పరావర్తిత జ్ఞానప్రకాశంలో, చిత్తంలో కలిగే మనోవృత్తులన్నీ ప్రకాశితమవుతాయి. ‘అహంకారం’ అనే మనోవృత్తి కూడ ప్రకాశితమై (జ్ఞానవంతమై), ‘నేను’ అనేభావంలో మెలుగుతుంది. కాని, ఈ ‘అహంకారం’, తాను పరావర్తితకాంతితో తేజోవంతమైనదనే విషయాన్ని తెలుసుకోక, తానే స్వయం ప్రకాశుడినని అనుకుని, తానే ద్రష్టగా, కర్తగా, భోక్తగా భావించి వ్యవహరిస్తుంటుంది. శరీర మనోబుద్ధులలో జరిగే అన్ని పనులకు తానే బాధ్యుడనని భావిస్తుంది. మంచి జరిగితే సంతోషిస్తుంది, చెడు జరిగితే దుఃఖిస్తుంది, కష్టాలు ఎదురైతే ఆందోళన చెందుతుంది, సుఖాలను కావాలనుకుంటుంది, కష్టాలను ద్వేషిస్తుంది, ఆలోచిస్తుంది, విచారిస్తుంది, కోపం తెచ్చుకుంటుంది, భయం చెందుతుంది.


తన నిజతత్త్వమేమిటో తెలుసుకోలేక, ఈ ‘జీవుడు’ ఒక అసహాయస్థితిలో ఉంటాడు. తన స్థితి తనకు అవగతం అవుతుంటుంది, దానిని అధిగమించటం ఎలానో తెలుసుకోడు. ఈ ప్రపంచం ఎందుకు ఉన్నదో తెలియదు. అందులో తన కర్తవ్యమేమిటో తెలియదు, తన వాంఛల ప్రోద్బలంవల్ల ఈ ప్రపంచంలో ప్రవర్తిస్తూ, వాటి వల్ల కలిగిన సుఖదుఃఖాలను అనుభవిస్తుంటాడు. కాని ఆ జీవభావం వెనుక ఉన్న ఆత్మతత్త్వానికి మాత్రం ‘జీవుడు’ అనుభవించే సుఖదుఃఖాలలోగాని, అతను చేసే పనులతో గాని, ఎటువంటి సంబంధం లేక నిర్వికారంగా, నిశ్చలంగా, నిర్వికల్పంగా ఉంటుంది.


(ఇంకా వుంది )

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!