బాల కృష్ణుని లీలలు! ( పోతన భాగవతం -దశమ స్కంధము)

బాల  కృష్ణుని  లీలలు!

( పోతన భాగవతం -దశమ స్కంధము)



శ్రీకృష్ణుడు మాయా శైశవ లీలలలో క్రీడిస్తుంటే, 

గోకులంలోని గోపికలు ఓపికలు లేక, తల్లి యశోదాదేవి దగ్గరకు వచ్చి కృష్ణుని అల్లరి చెప్పుకోసాగారు .


-క.




“బాలురకుఁ బాలు లే వని

బాలింతలు మొఱలుపెట్టఁ బకపక నగి యీ

బాలుం డాలము చేయుచు

నాలకుఁ గ్రేపులను విడిచె నంభోజాక్షీ!


భావము:

కలువలవంటి కన్నులున్న తల్లీ! అసలే పిల్లలకి తాగటానికి పాలు సరిపోవటం లే దని పసిపిల్లల తల్లులు గోలపెడుతుంటే, నీ కొడుకు పకపక నవ్వుతూ, వెక్కిరిస్తూ లేగదూడనుల తాళ్ళువిప్పి ఆవులకు వదిలేస్తున్నాడు చూడవమ్మ.


-క.


పడఁతీ! నీ బిడ్డడు మా

కడవలలో నున్న మంచి కాఁగిన పా లా

పడుచులకుఁ బోసి చిక్కిన

కడవలఁ బో నడిచె నాజ్ఞ కలదో లేదో?


భావము:

ఓ యశోదమ్మా! నువ్వు గొప్ప పడచుదానివే కాని, నీ పిల్లాడు చూడు; మా కుండలలో చక్కగా కాగిన పాలు ఉంటే, ఆ పాలను తోటిపిల్లలకు పోసేశాడు, ఆ పైన మిగిలిన కడవలను పగలగొట్టేశాడు. మీ వాడికి భయభక్తులు చెప్తున్నారో, లేదో మరి.


-క.


మీ పాపఁడు మా గృహముల

నా పోవఁగఁ బాలు ద్రావ నగపడ కున్నన్

గోపింపఁ బిన్నపడుచుల

వాపోవఁగఁ జిమ్ముకొనుచు వచ్చెం దల్లీ!


భావము:

ఓ యమ్మా! మీ అబ్బాయికి మా యింట్లో తాగటానికి సరిపడగ పాలు కనబడలేదు. దానితో కోపించి పసిపిల్లలను పడదోసుకుంటూ బయటకు వస్తున్నాడు. పసిపిల్లలేమో గుక్కపెట్టి ఏడుస్తున్నారు. మరి నువ్వు ఓ బిడ్డకు తల్లివే కదా ఇదేమైనా బాగుందా చెప్పు.


-మత్త.


పుట్టి పుట్టఁడు నేడు దొంగిలఁ బోయి మా యిలు జొచ్చి తా

నుట్టి యందక ఱోలు పీఁటలు నొక్క ప్రోవిడి యెక్కి చై

పెట్టఁ జాలక కుండ క్రిం దొక పెద్ద తూఁ టొనరించి మీ

పట్టి మీఁగడపాలు చేరలఁ బట్టి త్రావెఁ దలోదరీ!


భావము:

ఓ సన్నకడుపు సుందరీ! యశోదా! మీ వాడు మొన్నే కదా పుట్టాడు. అప్పుడే చూడు దొంగతనాలు మొదలు పెట్టేసాడు. మా యింట్లో దూరాడు. ఉట్టిమీది పాలు పెరుగు అందలేదట. రోళ్ళు, పీటలు ఒకదానిమీద ఇంకోటి ఎక్కించాడు. వాటిమీదకి ఎక్కినా చెయ్యి పెడదామంటే అందలేదట. అందుకని కుండ కింద పెద్ద చిల్లు పెట్టాడు. కారుతున్న మీగడపాలు దోసిళ్ళతో పట్టుకొని కడుపు నిండా తాగేసాడు.


-క.


ఆడం జని వీరల పెరు

గోడక నీ సుతుఁడు ద్రావి యొక యించుక తాఁ

గోడలి మూఁతిం జరిమినఁ

గోడలు మ్రుచ్చనుచు నత్త గొట్టె లతాంగీ!


భావము:

లత వలె సున్నితమైన దేహం గల సుందంరాంగీ యశోదా! నీ కొడుకు అలా వెళ్ళి, వీళ్ళ ఇంట్లోని పెరుగు శుభ్రంగా తాగాడు. పోతూపోతూ నిద్రపోతున్న వాళ్ళ కోడలి మూతికి కొద్దిగా పెరుగు పులిమాడు. లేచాక అత్తగారు చూసి దొంగతిండి తిందని కోడలిని కొట్టింది.


-క.


వా రిల్లు చొచ్చి కడవలఁ

దోరంబగు నెయ్యిఁ ద్రావి తుది నా కడవల్

వీరింట నీ సుతుం డిడ

వారికి వీరికిని దొడ్డ వా దయ్యె సతీ!


భావము:

ఓ యిల్లాలా! మీ సుపుత్రుడు వాళ్ళింట్లోకి దూరి ఘమఘమలాడే నె య్యంతా తాగేసి, చివరకి ఆ కుండలు వీళ్ళింట్లో పడేసి పోయాడు. దాంతో వాళ్ళకీ వీళ్ళకీ పెద్ద గొడవ అయిపోయింది తెలుసా?


-క.


"వేలుపులఁటె; నా కంటెను

వేలుపు మఱి యెవ్వ" రనుచు వికవిక నగి మా

వేలుపుల గోడపై నో

హేలావతి! నీ తనూజుఁ డెంగిలిఁ జేసెన్.


భావము:

ఓ యమ్మ! యశోదమ్మ! గొప్పగా నవ్వేవు గాని దీనికేమంటావు. మా యింట్లో దేవతలను చిత్రించిన గోడను చూసి, “వీళ్ళా దేవతలు? నాకంటె వేరె దేవతలు ఎవరున్నారు?” అంటు పకపక నవ్వుతూ నీ కొడుకు గోడమీద ఎంగిలి చేసాడు.


-క.


వెన్నఁ దినఁగఁ బొడగని మా

పిన్నది యడ్డంబు వచ్చి పిఱిఁదికిఁ దివియన్

జన్నొడిసి పట్టి చీఱెనుఁ

జిన్ని కుమారుండె యితఁడు? శీతాంశుముఖీ!


భావము:

చంద్రముఖీ! యశోదమ్మా! మా ఇంట్లోకి చొరబడి నీ కొడుకు వెన్న తింటున్నాడు. అది చూసి మా చిన్నమ్మాయి అడ్డంవెళ్ళి ఇవతలకి లాగింది. మీ వాడు మా పడచుపిల్ల రొమ్ముమీద గోళ్ళతో గీరేసి పారిపోయాడు. చంద్రుళ్ళా వెలిగిపోతున్న ముఖం పెట్టుకొని మరీ చూస్తున్నావు గాని చెప్పవమ్మా! ఇవి పసిపిల్లలు చేసే పనులా.


-క.


ఇమ్మగువ దన్ను వాకిటఁ 

గ్రుమ్మరుచోఁ జీరి నిలిపికొని పే రడుగం

గెమ్మోవిఁ గఱచి వడిఁ జనె

నమ్మా! యీ ముద్దుగుఱ్ఱఁ డల్పుఁడె? చెపుమా.


భావము:

ఈ ఇల్లాలు వాకిట్లోంచి వెళ్తున్న నీ పిల్లాడ్ని పిలిచి నిలబెట్టి పేరు అడిగింది. మీ వాడు చటుక్కున ఆమె పెదవి కొరికి పారిపోయాడు. ఓ యమ్మో! మీ ముద్దుల కొడుకు తక్కువ వాడేం కాదు తెలుసా.


-క.


చేబంతి దప్పి పడెనని 

ప్రాబల్యముతోడ వచ్చి భవనము వెనుకన్

మా బిడ్డ జలక మాడఁగ

నీ బిడ్డఁడు వలువఁ దెచ్చె నెలఁతుక! తగునే?


భావము:

ఓ యింతి! తన చేతి ఆట బంతి ఎగిరివచ్చి పడిందని దబాయింపుగా మా పెరట్లోకి వచ్చేసాడు. అప్పుడు మా అమ్మాయి స్నానం చేస్తోంది. మీ అబ్బాయి చీర తీసుకొని పారిపోయాడు, ఇదేమైనా బావుందా చెప్పమ్మా యశోదా!


-క.


ఇచ్చెలువఁ జూచి "మ్రుచ్చిలి

యచ్చుగ నుఱికించుకొనుచు నరిగెద; నాతో

వచ్చెదవా?" యని యనినాఁ

డిచ్చిఱుతఁడు; సుదతి! చిత్ర మిట్టిది గలదే?


భావము:

ఈ చక్కటామెను “దొంగతనంగా లేవదీసుకుపోతాను, నాతో వచ్చేస్తావా” అని అడిగాడట మీ చిన్నాడు. విన్నావా యశోదమ్మ తల్లీ! ఇలాంటి విచిత్రం ఎక్కడైనా చూసామా చెప్పు.


-క.


కొడుకులు లేరని యొక సతి

కడు వగవఁగఁ దన్ను మగనిఁగాఁ గైకొనినం

గొడుకులు గలిగెద రని పైఁ

బడినాఁ డిది వినుము శిశువు పనులే? తల్లీ!


భావము:

ఓ యమ్మా యశోదా! ఈ విచిత్రం విను. ఓ యిల్లాలు తనకు కొడుకులు లేరే “అపుత్రస్య గతిర్నాస్తిః” అని శాస్త్రం కదా మరి మా గతేంటి అని బాధపడుతుంటే, “నన్ను మొగుడుగా చేసుకో కొడుకులు పుడతారు” అని మీదమీదకి వచ్చాడుట మీ వాడు. ఇవేమైనా పసివాడి పనులా చెప్పు.

అవును అతనేమైనా పసివాడా కాదు సాక్షాత్తు శ్రీమహావిష్ణువే కదా. పరబ్రహ్మస్వరూపు డైన తన్ను భర్తగా స్వీకరించ మని సద్గతులు కలుగుతాయి అని నొక్కి చెప్పే, ఆ కపట శైశవ కృష్ణమూర్తి దొంగజాడల బాల్యచేష్టలను చేస్తున్నాడు


-క.


"తలఁగినదానం దల" మనఁ

దలఁగక యా చెలికి నాన తలయెత్తఁగ "నీ

తలఁగిన చోటెయ్యది" యని

తల యూఁచెన్ నీ సుతుండు తగవె? మృగాక్షీ!


భావము:

చక్కని లేడికన్నులవంటి కళ్ళు నీ కున్నాయిలే కాని ఓ యశోదమ్మ! ఇటు చూడు. ఈ అమ్మాయి “బహిష్ఠు అయ్యాను దూరంగా ఉండు” అంటే, నీ పుత్రుడు తప్పుకోడు. పైగా తలూపుతూ “బహిష్ఠు అయిన చోటేది” అని అడిగాడుట. ఈ అమ్మాయేమో పాపం సిగ్గుతో చితికిపోయింది. ఇదేమైనా బావుందా చెప్పు.


-క.


వ్రాలఁగ వచ్చిన నీ సతి

"చూలాలం దలఁగు" మనుడు "జూ లగుటకు నే

మూలంబు జెప్పు" మనె నీ 

బాలుఁడు; జెప్పుదురె సతులు? పర్వేందుముఖీ!


భావము:

ఓ యశోదమ్మా! నీ కొడుకు ఈ ఇల్లాలు ఒళ్ళో కూర్చోడానికి వచ్చేడు. ఈమె “గర్భవతిని దూరంగా ఉండు అంది”. “ గర్భవతివి కావటానికి కారణం ఏమిటి చెప్పు” అని అడుగుతున్నాడు నీ కొడుకు. సుందరి! 

ఈ తెలివితేటలకు నిండుపున్నమి నాటి చందమామలా నీ మోము వికసించిందిలే. కాని, అలా అడిగితే ఆడవాళ్ళు ఎవరైనా చెప్తారుటమ్మా.


-క.


మగువా! నీ కొమరుఁడు మా

మగవా రటు పోవఁ జూచి మంతనమునకుం

దగఁ జీరి పొందు నడిగెను

జగముల మున్నిట్టి శిశువు చదువంబడెనే?


భావము:

ఓ ఇల్లాలా! మా మగవాళ్ళు బైటకు వెళ్ళటం చూసి రహస్యం చెప్పాలి దగ్గరకి రా అని పిలిచి, నీ కొడుకు క్రీడిద్దాం వస్తావా అని అడిగాడు. ఇలా అడిగే పసిపిల్లాడు ఉన్నా డని ఇంతకు ముందెప్పుడైనా విన్నామా?

గోపికలు యశోదకి చెప్పిన బాలకృష్ణుని అల్లరి ఇది. ఇక్కడ పాలపర్తి నాగేశ్వర శాస్త్రి గారు చెప్పిన విశేషార్థం చూడండి. అసంభవ నాదుల చేత బ్రహ్మైక్యం భంగపరచే దుర్వృత్తులు లే నప్పుడు, రహస్యమున నా యం దైక్యము గమ్మని పిలిచేడు. (ఉపనిషత్ ప్రమాణం – చిదేవాహం చిదేవత్వం సర్వ మే త చ్చిదేవహి.)


-క.


నమ్మి నిదురబోవ నా పట్టిచుంచు మా

లేఁగతోఁకతోడ లీలఁ గట్టి

వీథులందుఁ దోలె వెలది! నీ కొమరుండు; 

రాచబిడ్డఁ డైన ఱవ్వ మేలె?


భావము:

ఓ ఉత్తమురాలా! యశోదమ్మా! నా కొడుకు ఆడి ఆడి అలసి నిద్రపోయాడు. నీ సుపుత్రుడు వచ్చి నా కొడుకు జుట్టును మా లేగదూడ తోకకు కట్టి, దాన్ని వీథు లమ్మట తోలాడు. ఎంత గొప్ప నాయకుడి పిల్లా డైతే మాత్రం ఇంతగా అల్లరి పెట్టవచ్చా.


-క.


నా పట్టి పొట్ట నిండఁగఁ

బై పడి నీ పట్టి వెన్న బానెం డిడినాఁ; 

డూపిరి వెడలదు; వానిం

జూపెద నేమైన నీవ సుమ్ము లతాంగీ!


భావము:

పూతీగెలాంటి చక్కదనాల సుందరాంగీ ఓ యశోదమ్మా! నీ కొడుకు నా కొడుకును పట్టుకొని వాడి పొట్ట నిండిపోయినా వదలకుండా బలవంతంగా బానెడు వెన్న పట్టించేసాడు. వాడికి ఊపిరి ఆడటం లేదు. మా వాడిని తీసుకు వచ్చి చూపిస్తా. ఇదిగో వాడి కేమైనా అయిందంటే నీదే బాధ్యత సుమా.


-క.


తెఱవ యొకతె నిద్రింపఁగ

నెఱిఁ గట్టిన వలువ వీడ్చి నే టగు తేలుం

గఱపించి నీ కుమారుఁడు

వెఱచుచు నది పఱవ నగియె విహితమె? సాధ్వీ!


భావము:

ఒకామె నిద్రపోతుంటే బట్టలు విప్పేసి, నీ కొడుకు ఇంత పెద్ద తేలు తెచ్చి కరిపించాడు. ఆమె బెదిరిపోయి పెద్ద నోరు పెట్టుకొని అరుస్తూ గంతులు వేస్తుంటే మీ అబ్బాయి పకపక నవ్వాడు. ఇదేమైనా బాగుందా తల్లీ! ఎంతో సాధు స్వభావివి కదా నువ్వు చెప్పు మరి.


-క.


నా కొడుకును నా కోడలు

నేకతమునఁ బెనఁగ బాము నీతఁడు వైవం

గోక లెఱుంగక పాఱినఁ

గూఁక లిడెన్ నీ సుతుండు గుణమె? గుణాఢ్యా!


భావము:

నా కొడుకు కోడలు ఏకాంతంలో ఉంటే, నీ కొడుకు వెళ్ళి పాము నొకదానిని వారిమీద పడేసాడు. వంటిమీద బట్టలు లేవని తెలియనంతగా భయపడిపోయి, వాళ్ళు పరుగులు పెడుతుంటే, చూసి హేళనగా కేకలు పెట్టాడు. ఓ యశోదమ్మా! నీవేమో సుగుణాల రాశివి కదా. మరి మీ వాడి గుణ మేమైనా బావుందా చెప్పు.


-ఆ.


తరుణి యొకతె పెరుగుఁ ద్రచ్చుచోఁ దుది వంగి

వెన్నదీయ నొదిఁగి వెనుకఁ గదిసి

మగువ! నీ సుతుండు మగపోఁడుములు చేయ

సాఁగినాఁడు తగదె? జక్కఁజేయ.


భావము:

ఓ యమ్మా! ఒక యువతి పెరుగు చిలుకుతోంది. చివరకి వెన్న తీయడానికి వంగింది. నీ కొడుకు వెనక చేరి పోకిరీ పనులు చేయసాగాడు. కొంచం బుద్ధి చెప్పరాదా?

స్త్రీ బాలాంధజడోపమా అంటారు కదా అలా ఉండి, పెరుగు అనే జ్ఞానం పేరుకున్న వేదాలు చిలికిచిలికి, వెన్న అనే సారం తీయడానికి ప్రయత్నిస్తే సరిపోదు అని. ఏకాంతిక భక్తి లేనిచో వ్యర్థమని పరమాత్మ వెనుతగిలి మగపోడుమ లనే సరైన పురుషయత్నం చూపుతున్నాడట.


-సీ.


కలకంఠి! మా వాడ గరితల మెల్ల నీ; 

పట్టి రాఁగల డని పాలు పెరుగు

లిండ్లలోపల నిడి యే మెల్లఁ దన త్రోవఁ; 

జూచుచో నెప్పుడు చొచ్చినాఁడొ? 

తలుపుల ముద్రల తాళంబులును బెట్టి; 

యున్న చందంబున నున్న వరయ; 

నొక యింటిలోఁ బాడు నొక యింటిలో నాడు; 

నొక యింటిలో నవ్వు నొకటఁ దిట్టు;


-ఆ.


నొకట వెక్కిరించు నొక్కొకచో మృగ

పక్షి ఘోషణములు పరఁగఁ జేయు

నిట్లు చేసి వెనుక నెక్కడఁ బోవునో

కాన రాఁడు రిత్త కడవ లుండు.


భావము:

ఓ యశోదమ్మా! మంజులవాణి! మీ వాడు వస్తాడని ఊహించాము. మా వీథిలోని గొల్ల భామలము అందరము తలుపులు అన్ని వేసేసి, గడియలకు తాళాలు బిగించాము. అతను వచ్చే దారిని కాపాలాగా చూస్తునే ఉన్నాం. తలుపులకు వేసిన గొళ్లేలు తాళాలు వేసినవి వేసినట్టే ఉన్నాయి. కాని ఇలా చూసేసరికి ఎలా వచ్చాడో ఎలా దూరాడో మరి ఒకరి ఇంట్లో పాటలు పాడుతున్నాడు. ఇంకొక ఇంటిలో గెంతుతున్నాడు. ఇంకో ఇంట్లో నవ్వుతున్నాడు. మరింకొక ఇంట్లోనేమో తిడుతున్నాడు. ఇంకొక చోటేమో ఎక్కిరిస్తున్నాడు. కొన్ని ఇళ్ళల్లో అయితే పక్షులలా కూతలు జంతువులలా కూతలు కూస్తున్నాడు.. ఇంతట్లోనే ఎలా వెళ్ళిపోతాడో చటుక్కున వెళ్ళిపొతాడు. చూస్తే ఖాళీ కడవలు ఉంటాయి తల్లీ.


-క.


కడు లచ్చి గలిగె నేనిం

గుడుతురు గట్టుదురు గాక కొడుకుల నగుచున్

బడుగుల వాడలపైఁ బడ

విడుతురె రాకాంత లెందు? విమలేందుముఖీ!


భావము:

నిర్మలమైన మోము గల ఓ యశోదాదేవి! ఎంత భాగ్యవంతులు అయితే మాత్రం. గొప్ప తిండి తింటారు, గొప్ప బట్టలు కట్టుకుంటారు. అంతేకాని రాజవంశపు స్త్రీలు ఎక్కడ అయినా ఇలా పిల్లలను ఊళ్ళోని పేదల మీద పడి పేదలను వేపుకు తిన మని చిరునవ్వులు నవ్వుతూ పంపుతారా? చెప్పు.


-క.


ఓ యమ్మ! నీ కుమారుఁడు

మా యిండ్లను బాలు పెరుగు మననీ డమ్మా! 

పోయెద మెక్కడి కైనను

మా యన్నల సురభులాన మంజులవాణీ!” 


భావము:

ఓ యశోదమ్మ తల్లీ! నీ సుపుత్రుడు మా ఇళ్ళల్లో బాలుపెరుగు బతకనీయ డమ్మా. మెత్తని మాటల మామంచి దానివే కాని. సర్దిపుచ్చాలని చూడకు. మేం వినం. మా అన్న నందుల వారి గోవుల మీద ఒట్టు. ఈ వాడలో మేం ఉండలేం. ఊరు విడిచి పోతాం. మాకు మరో గతి లేదు."


మరికా ఆ కపట శైశవమూర్తి కొంటె కృష్ణమూర్తి దొంగజాడల ఇలా రకరకాల బాల్యచేష్టలను లీలలుగా ప్రదర్శిస్తూ క్రీడిస్తుంటే. తమకు అందిస్తున్న ఆ మహాప్రసాదాలను తెలుసుకోలేక, ఓపికలు నశించిన గోపికలు తిడుతుంటే. యశోదాదేవి వారికి ఇలా చెప్పుతున్నారు.


-క.


"చన్ను విడిచి చనఁ డిట్టటు

నెన్నఁడుఁ బొరుగిండ్ల త్రోవ లెఱుఁగఁడు నేడుం

గన్నులు దెఱవని మా యీ

చిన్ని కుమారకుని ఱవ్వ చేయం దగునే?


భావము:

"మా కన్నయ్య చంటాడు నా ఒళ్ళో కూర్చుండి పాలు తాగుతుండటమే తప్ప నన్ను వదలి ఈ పక్కకి ఆ పక్కకి పోడు. పక్కింటికి కూడ దారి తెలియదు. అలాంటి ఈ నాటికి సరిగా కళ్ళు తెరవడంరాని పసిగుడ్డును ఇలా అల్లరి పెట్టడం మీకు తగినపని కాదు.


- తే.


అన్య మెఱుఁగఁడు; తన యంత నాడుచుండు; 

మంచివాఁ డీత; డెగ్గులు మానరమ్మ! 

రామలార! త్రిలోకాభిరామలార! 

తల్లులార! గుణవతీమతల్లులార!


భావము:

తల్లులల్లారా! మనోజ్ఞమైన మగువల్లారా! ముల్లోకాలకు మోదం కలిగించే ముదితల్లారా! నామాట వినండి. ఇతను ఇతరమైనదేది ఎరుగడు. తనంతట తనే క్రీడిస్తు ఉంటాడు. మా కన్నయ్య ఎంతో మంచివాడు అమ్మలార! సకల సద్గుణవతీ లలామల్లారా! ఇతనిపై అపనిందలు వేయకండమ్మా." తల్లి యశోదాదేవి తన వద్దకు వచ్చి బాలకృష్ణుని అల్లరి చెప్పే గోపికలను సమాధాన పరుస్తోంది.


-వ.


ఇలా ఆ కపట శైశవ కృష్ణమూర్తి దొంగజాడల జేయు బాల్యచేష్టలను చెప్పుకుంటున్న ఓపికలు లేని గోపికలకు యశోదాదేవి నచ్చచెప్పి పంపిది, కాని కొడుకుమీద ఉన్న ప్రేమ వలన కోప్పడలేకపోయింది.


-ఉ.


కాంతలు దల్లితోఁ దన వికారము లెల్ల గణింప భీతుఁ డై

శాంతుని సొంపునం బరమ సాధుని పెంపున గోలమాడ్కి వి

భ్రాంతుని కైవడిన్ జడుని భంగిఁ గుమారకుఁ డూరకుండె నే

వింతయు లేక దల్లి కుచవేదికపైఁ దల మోపి యాడుచున్. 



-

ఇలా గోపికలు తన తల్లి యశోదకు తను చేసే అల్లరిల పనులు అన్ని ఎంచి మరీ చెప్తుంటే, ఈ కొంటె కృష్ణుడు ఏం మాట్లాడకుండా ఎంతో భయపడిపోయిన వాడిలాగ, ఎంతో నెమ్మదైన వానిలాగ, పరమ సాధు బుద్ధి వానిలాగ, అమాయకపు పిల్లవానిలాగ, నివ్వెరపోయినవానిలాగ, మందుడి లాగ ఊరికే ఉన్నాడు. అసలు ఏమి జరగనట్లు తల్లి ఒడిలో చేరి తల్లి రొమ్ములపై తలాన్చి ఆడుకుంటున్నాడు.


  

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!