కీచక వధ- మూడవ వ భాగం -




కీచక వధ- మూడవ వ భాగం -


ద్రౌపది సుధేష్ణ వద్ద విలపించుట!

-


ద్రౌపది తనను ఒక దూర్తుని ఇంటికి మదిరకు పంపిన సుధేష్ణకు తన బాధ చెప్పుకోటానికి ఆమె మందిరానికి వెళ్ళింది. సుధేష్ణ ద్రౌపదిని చూసి కంగారు నటిస్తూ " మాలినీ ! ఏందుకు ఇలా ఉన్నావు. నిన్ను ఎవరేమి అన్నారు. ఏమి జరిగిందో చెప్పు వారి అంతు చూస్తాను " అన్నది. ద్రౌపది నిర్వేదంగా నవ్వి " అమ్మా ! అన్నియు తెలిసి కూడా ఇలా అడిగితే ఏమి చెప్ప గలను. నీవు కీచకుని ఇంటికి మధిర కోసం నన్ను పంపావు. అతను నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. నేను పరుగెత్తాను. అతడు నన్ను వెంబడించి నా జుట్టు పట్టుకుని కొట్టాడు. ఇంతకంటే ఏమి చెప్పేది " అన్నది. సుధేష్ణ ద్రౌపదితో " ద్రౌపదీ! విచారించకు నేను ఆ కీచకుని దండిస్తాను " అని అనునయంగా అన్నది. ద్రౌపది సుధేష్ణతో " అమ్మా! తమరు అంతగా చింతించ పనిలేదు. నా భర్తలైన అయిదుగురు గంధర్వులు కీచకునిపై పగతీర్చుకుంటారు " అని పలికింది. ఆ మాటలు విన్న సుధేష్ణ భయభ్రాంతురాలయ్యింది. ద్రౌపదిని ఎన్ని విధాలుగానో ఓదార్చింది. ద్రౌపది కోపం తగ్గలేదు. అన్న పానీయాలు విసర్జించి తన నివాసమునకు పోయి రోదిస్తూ ఉంది.

-


ద్రౌపది భీముని సహాయం అర్ధించుట!


ద్రౌపది మనసులో " కీచకుడు మహాబలవంతుడు. అతనిని చంపగలిగిన సామర్థ్యం భీమునికి మాత్రమే ఉంది " అని తలచింది. ఆ రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో భీముని వద్దకు వెళ్ళింది. హాయిగా నిద్రపోతున్న భీముని చూసి " ఆహా ! నన్ను అవమానించిన కీచకుడు హాయిగా నిద్రపోతున్నాడు. కాని అది చూసిన మీరు నిశ్చింతగా ఎలా నిద్రపోతున్నారు. అన్నగారు ఇది తగిన సమయం కాదని చెప్పాడనా " అనుకుంటూ అతడిని తట్టి లేపింది. భీముడు ఉలిక్కిపడుతూ నిద్రలేచి " ఎవరు? " అని అడిగాడు. ద్రౌపది " నేను మాలినిని " అన్నది. భీముడికు ద్రౌపది ఎందుకు వచ్చిందో అర్ధమైనా ఆమె నోట వినాలని " ఏమిటి ఇంత పొద్దుపోయి వచ్చావు?. ఎవరు చూడకుండా వచ్చావా? " అని అడిగాడు. ద్రౌపది " అన్ని తెలిసి నన్ను అడుగుతారేమి. నా నోట వినాలనుందా! విరాటుని బావమరిది కీచకుడు సుధేష్ణ ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూసాడు. అతడు నన్ను మోహించి అనరాని మాటలాడి నన్ను అవమానించాడు. నేను అతనితో నా భర్తలైన గంధర్వులు నిన్ను హతమార్చగలరు జాగ్రత్త " అన్నాను. సుధేష్ణ పంపగా మధిర కోసం కీచకుని ఇంటికి వెళ్ళాను. అతను నన్ను పట్టుకోవాలనుకున్నాడు నేను అతనిని విదిలించి పరుగెత్తుతూ సభా మండపానికి వచ్చాను. అతడు నన్ను వెన్నంటి తరుముతూ వచ్చాడు. అలనాడు కురుసభలో దుశ్శాసనుడు నన్ను అవమానించాడు. అడవిలో సైంధవుడు అవమానించాడు. ఈ నాడు విరాటుని కొలువులో కీచకునిచే అవమానించబడ్డాను. ఈ అవమానాలు నాకు కొత్తగాదు. స్త్రీ ఆర్తనాదం విన్నా, గోమాత అరుపు విన్నా రక్షించడం వీరుల ధర్మం. నేను ఇలా విలపిస్తుంటే ధర్మరాజు చూస్తూ ఎలా ఉన్నాడు? " అన్నది. భీముడు " ద్రౌపదీ! కీచకుడు నిన్ను అవమానించడం చూసిన నన్ను ధర్మరాజు అడ్డుకోకపోతే విరాటునితో సహా కీచకుని అతని సైన్యాన్ని హతమార్చే వాడినే. కాని అజ్ఞాతవాసం భగం అయితే మరలా అరణ్యవాసం అజ్ఞాతవాసం ప్రాప్తించేవి. దీనికంతా కారణం నీవు నేను అని అందరూ మనలను నిందించరా. కనుక నన్ను నివారించిన ధర్మరాజును నిందించ వలదు. సమయం మించి పోలేదు. కీచకుని చంపి నీకు ఆనందం కలిగిస్తాను అదెంత పని. కాని అది బహిరంగంగా జరగరాదు. రహస్యంగా చేయాలి కదా " అన్నాడు. ద్రౌపది " నేను ఎవరికి భయపడ లేదు. అత్తగారు కుంతిని చూసి కాని భర్తలైన మిమ్మల్ని చూసి కాని భయపడ లేదు. కాని సుధేష్ణను చూసి భయం కలుగుతుంది. మూర్కుడైన కీచకుని వలన జరిగిన అవమాన భారంతో అన్నాను కాని విషయం తెలియక కాదు. ధర్మరాజుని నిందించడం నా అభిమతం కాదు " అన్నది.

-

కీచక వధ- నాలుగవ భాగం -

-

ద్రౌపది భర్తల అవస్థలను తలచుకుని దుఃఖించుట!


ఇంకా ధర్మరాజును గురించి ద్రౌపది ఇలా చెప్పింది. " భీమసేనా! రాజసూయ యాగ కర్త, అజాతశత్రువు, ధర్మనిరతుడనే పేరు ధర్మరాజుకే చెల్లింది కాని వెరెవరికి తగదు. అతని గంభీర్యం, కరుణ, నిత్య సత్యవ్రతం మరెవరికి ఉంటాయి. అతడు సామాన్య మానవుడు కాదు. అట్టి మహాత్ముడు ఒకరి కింద ఊడిగం చేస్తుంటే బాధగా ఉంది. బకాసురుడు, కిమ్మీరుడు (జరాసంధుడు) మొదలైన రాక్షసులను చంపిన నీ లాంటి వీరుడు కట్టెలు కొట్టడం, వంటలు చేయడం ఎంత బాధాకరం. పరమేశ్వరుని మెప్పించి పాశుపతాన్ని సంపాదించిన అర్జునుడు పేడి రూపంలో అంత॰పుర కాంతలకు నాట్యం నేర్పుతుంటే చూడటానికి కూడా మనసు ఒప్ప లేదు. అత్యంత సుందరాంగుడు అరివీర భయంకరుడు అయిన నకులుడు ఒకరి కింద ఊడిగం చేస్తుంటే కన్నుల నీరు ఆగడం లేదు. అత్యంత సుకుమారుడైన సహదేవుడు పశువులను మేపుతుంటే దుఃఖభారం ఆగలేదు. తల్లి తండ్రుల ప్రేమాభిమానాలు పొంది, రాజసూయ యాగంతో పునీతనై కుంతీదేవి లాంటి మహానుభావురాలి మన్ననలందిన నేను నేడు సైరంధ్రిగా సామాన్యురాలిగా సేవిస్తున్నాను. భీమసేనా! కీచకుని వధించక పోతే నాకు మనశ్శాంతి లేదు " అని దుఃఖించింది. భీముడు " ద్రౌపదీ! నీవు ఇంతగా చెప్ప పని లేదు. రేపటి రోజున కీచకునికి నా చేతిలో చావు మూడింది. నీవు నిశ్చింతగా ఉండు. మన అజ్ఞాతవాసం ముగియనున్నది. రేపు నువ్వు కీచకుని కోర్కె అంగీకరించినట్లు నటించి అతనిని నర్తనశాలకు ఒంటరిగా రమ్మని చెప్పు. నేను అతనిని చంపుతాను. తెల్లవారబోతుంది ఇక వెళ్ళు " అన్నాడు.


ద్రౌపది కీచకుని నర్తన శాలకు ఆహ్వానించుట!

-

మరునాడు ఉదయం కీచకుడు నిద్రలేచాడు. కాలకృత్యాలు నిర్వర్తించాడు. ద్రౌపది మీది కోరిక కలిగింది. చక్కగా అలఖరించుకున్నాడు. ద్రౌపది కోసం సుధేష్ణ అంత॰పురానికి వెళ్ళాడు. సైరంధ్రిని చూడగానే అతని మనసు చలించింది. ధైర్యాన్ని, వివేకాన్ని కోల్పోయి ఆమె దగ్గరగా పోయాడు. భీముడు చెప్పిన మాటలు మననం చేసుకుంది ద్రౌపది. అతనిని చూసీ చూడనట్లు నటించింది. కీచకుడు ద్రౌపదితో " మాలినీ ఈ తిరస్కారం ఏమిటి? నేనంటే ఇష్టం లేదా? అసలు మగాళ్ళంటేనే ఇష్టం లేదా? నా సంపదలకు నీవే రాణివి. ఈ రాజ్యాన్నేలే విరాటరాజు పేరుకు మాత్రమే రాజు. నేనే అతనికి కూడు పెడుతున్నాను. ఈ రాజ్యంలో ప్రజలందరూ నన్నే రాజుగా ఆరాధిస్తారు. ఈ రాజ్యంలో ప్రజలెవరికీ నా మాట కాదనే ధైర్యం ఎవరికీ లేదు " అన్నాడు. ద్రౌపది కొంచం మెత్తబడినట్లు నటించి " కీచకా! ఎంత కాదన్నా వినకుండా నా మీద మనసు పారేసుకున్నావు. నీలాగే ఎదుటి వారూ మనసు పారేసుకుంటారు కదా. మీరు పురుషులు కనుక బయట పడతారు కాని మగువలు అలా కాదు కనుక కీచకా రహస్యంగా కలుసుకుంటే నీ కోరిక తీరగలదు " అంటూ నమ్మబలికింది ద్రౌపది. కీచకుడు ఆనందపరవశుడై " మాలినీ నీ మనసు తెలిసింది కదా మరి నా కోరిక ఎప్పుడు ఎలా తీరుస్తావో చెప్పు " అని అడిగాడు. ద్రౌపది " ఈ రోజు ఒంటరిగా నర్తనశాలకురా " అన్నది. కీచకుడు " మాలినీ! నీ అనుమతి ప్రకారం ఒంటరిగా నర్తనశాలకు వస్తాను. మాట మీద ఉండు " అన్నాడు. ద్రౌపది " నీవు ఒక్కడివే రావాలి. లేకుంటే నేను వెడలి పోవుట నిశ్చయం. ఇక మనమిరువురము ఇక్కడ ఉండుట భావ్యం కాదు వెళ్ళి పొండి " అన్నది.

-

-కీచక వధ- ఐదవ భాగం -

-










కీచకుడు వెళ్ళగానే ద్రౌపది వంటశాలకు వెళ్ళింది. అక్కడ భీమునితో " నేను నాపని పూర్తి చేసాను. ఇక మీ పని మీరు పూర్తి చెయ్యండి. ఈ రాత్రికి కీచకుని చంపాలి ఎలా చంపుతారో చెప్పండి " అన్నది. భీముడు ద్రౌపదితో " ద్రౌపదీ! నీవు కీచకుడు ఏమి మాట్లాడుకున్నారో చెప్పు" అని అడిగాడు. ద్రౌపది జరిగినది చెప్పగానే అది విన్న భీముడు ఆహ్లాదం పొందాడు. భీముడు " ద్రౌపదీ ! ఇక చాలు ఆ కీచకుని మీద పగ తీర్చుకుంటాను కాని అతడు చెప్పినట్లు ఒంటరిగా వస్తాడా! లేక బుద్ధిహీనుడై అందరికి చెప్తాడా? అయినా ఎందుకు చెబుతాడులే. వాడు నర్తనశాలకు తప్పక వస్తాడు. నిశ్చలంగా పడుకున్న నన్ను తడిమి చూస్తాడు. నీవు కాదని తెలిసుకుంటాడు. నేను ఒడిసి పట్టుకుని వాడి అంతు చూస్తాను. వాడు నా చేతిలో హతం కావడం నిశ్చయం ద్రౌపదీ! ఇక నీవు నిశ్చింతగా ఉండు " అన్నాడు. భీముని ఆవేశం చూసి ద్రౌపది భయపడింది. కోపావేశంలో గుట్టు బయటపడి అజ్ఞాతవాస భంగం ఔతుందేమో అనుకున్నది. ద్రౌపది " భీమసేనా! కోపావేశంలో గుట్టు రట్టు చేయకు ధర్మరాజాదులు అజ్ఞాతవాస భంగానికి మనమే కారణమని నిందిస్తారు. కార్యాన్ని అతి గుప్తంగా పూర్తి చేయాలి " అన్నది. భీమసేనుడు " ద్రౌపదీ !వాడు ఎదిరించి నిలబడితే ఇది రహస్యంగా చేయాలని గుర్తుంటుందా. అయినా నీవు చెప్పినట్లు రహస్యంగా చంపడానికి ప్రయత్నిస్తాను " అన్నాడు. ద్రౌపది " సుధేష్ణ నా కొరకు వెతుకుతుంటుంది నేను పోయి వస్తాను " అని వెళ్ళి పోయింది.


కీచకుడు, ద్రౌపది, భీమసేనుడు రాత్రి కొరకు ఎదురుచూచుట

కీచకుడు మనసు పరి పరి వధాల తపిస్తుంది అతడు మనసులో " అయ్యో ! ఎంతకీ రాత్రి కాదేమి. మాలిని వస్తుందో రాదో, వచ్చినా ఏమంటుందో, రాత్రిలోగా మనసు మారుతుందేమో, ఆమెకు అయిదుగురు గంధర్వులు భర్తలుగా ఉన్న మాట నిజమేనా, మాలిని వచ్చే వేళకు సుధేష్ణ ఏదైనా పని చెప్తుందేమో అనుకున్నాడు. మరలా మాలిని ఎందుకు రాదులే అంత కఠినాత్మురాలా . ఆమె వచ్చే ముందు నేనే ఆమెను తీసుకు రావచ్చు కదా " అనుకున్నాడు. కీచకుడు ఉద్యానవనంలో విహరిస్తూ అస్తమించనందుకు సూర్యుని నిందించాడు. తన కోసం బ్రహ్మ రాత్రి రాకుండా పగలే ఉంచాడని అనుమాన పడ్డాడు. ఎట్టకేలకు సూర్యుడు అస్తమించాడు. చంద్రోదయం అయింది ద్రౌపది కూడా సమయం కోసం ఎదురుచూస్తూ ఉంది. చంద్రుడు కూడా అస్తమించాడు. బాగా పొద్దు పోగానే ద్రౌపది వంటశాలకు వెళ్ళి సమయం ఆసన్నమయినదని భీమసేనుని తొందర పెట్టింది. భీముడు ఒక చీరని తలపాగాలా చుట్టుకుని నర్తనశాలకు బయలుదేరాడు. ద్రౌపది అతనిని అనుసరించింది.


నర్తనశాల!

-

ఇద్దరూ నర్తనశాలను చేరుకున్నారు. నర్తనశాలలో ఒక పక్కగా ఉత్తర పడుకునే పాన్పు మీద భీముడు పడుకున్నాడు. ద్రౌపది పక్కనే కనపడకుండా దాక్కున్నది. ఇంతలో కీచకుడు మధ్యం సేవించి మత్తుగా అక్కడకు వచ్చాడు. మాలిని అప్పటికే అక్కడికి వచ్చి ఉంటుందని అనుకున్నాడు. మంచంలో పడుకున్న భీముని చూసి పిచ్చివాడై తన చేతిని ఆ శయ్య పై వేసాడు. భీమునికి పట్టరాని కోపం వచ్చింది. కీచకుడు భీమునిపై చేయి వేసి " మాలినీ! నీ కోసం ఎన్నో కానుకలు తెచ్చాను. ఇంత వరకు నా కోసం వచ్చే స్త్రీలు నాకు కానుకలు సమర్పించే వారు. నన్ను చూసిన స్త్రీలు మరొకరిని కన్నెత్తి చూడరు. నా కోసమే తపిస్తారు. అలాంటిది నేను నీకోసం తపిస్తున్నాను " అన్నాడు కీచకుడు. భీముడు కూడా స్త్రీ సహజమైన గొంతుతో " మిమ్మల్ని మీరు పొగుడు కుంటున్నారు కాని అసలు నా వంటి స్త్రీ మీకు దొరుకునా. నా శరీరానికి నీశరీరం తగిలినప్పుడు కలిగే అనుభూతి తెలుసుకుంటావులే. నన్ను తాకిన నీకు మరొకరిని తాకే పని ఉండదులే . నన్ను తాకిన ఫలితం అనుభవిస్తావులే " అని తటాలున పైకి లేచాడు. కీచకుని తల పట్టుకుని వంచాడు. కీచకుడు మాలిని భర్త గంధర్వుడు వచ్చాడు అనుకున్నాడు. భీముని పట్టు విడిపించుకుని కింద పడవేసి మోకాళ్ళతో అదిమాడు.


కీచక భీములపోరాటం!

-







ఇరువురి మధ్య భయంకర యుద్ధం సాగింది. ఒకరిని మించి ఒకరు పోరాడుతున్నారు. ఇరువురిలో కొంత భయం ఉంది పరువు పోతుందని కీచకుడు అజ్ఞాతవాస భంగం ఔతుందేమోనని భీముడు మౌనంగా యుద్ధం చేస్తున్నారు. క్రమంగా కీచకుని బలంతగ్గి పోయింది భీన్మసేనుని బలం ద్విగుణీకృతం అయింది. ఆ విషయం గ్రహించిన భీముడు కీచకుని ఉదరభాగంలో భయంకరంగా పొడిచాడు. ఆ దెబ్బకు కీచకుడు విలవిలా తన్నుకున్నాడు. కీచకుని దారుణంగా చంపాలనుకున్న భీముడు కీచకుని తలని, కాళ్ళాను, చేతులను మొండెంలోకి జొనిపి నేల మీద వేసి పొర్లించి నలిపి మాంసం ముద్దగా చేసాడు. కీచకుడు మరణించాడు. భీముడు ద్రౌపదిని పిలిచి కీచకుని శవాన్ని చూపించాడు. ద్రౌపది ఆనందంగా చూసింది. ఆమె మనసులో " కీచకా! ఇందుకా ఈ సుఖం పొందటానికా ఇంతగా ఆరాట పడ్డావు " అనుకున్నది. భీముడు " ద్రౌపదీ! నీ మాట నెరవేర్చాను ఆనందమేగా. నిన్ను ఎవరైనా దుర్బుద్ధితో చూస్తే వారికి నా బుజబలంతో ఇలాంటి మరణాన్ని ప్రసాదిస్తానని తెలుసుకున్నావా. నీ మనసు శాంతించింది కదా " అన్నాడు. ద్రౌపది ఆనందంతో " నిన్న కొలువులో కీచకుడు నన్ను అవమానించినప్పుడు నీవు చూపిన నిగ్రహం మెచ్చతగినది. ఈ నాడు ఇలా మరొకరి సాయం లేక కీచకుని వధించిన నీ శౌర్యం కొనియాడ నా తరమా భీమసేనా " అన్నది. ద్రౌపది మాటలకు భీముడు పొంగి పోయాడు. అతనిలో వివేకం మేలుకొంది. ద్రౌపదీ " ఇక నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు వెళుతున్నాను" అని చెప్పి వడివడిగా వంటశాలవైపు వెళ్ళాడు.

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!