వివేకచూడామణి (11 వ, 12వ భాగాలు ) !.

వివేకచూడామణి (11 వ, 12వ భాగాలు ) !.

-

శ్రీ ఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.

-

11. నిరీశ్వర – ఈశ్వర వాదాలు :


కొందరు (చాలామంది), ఈ జీవుడే నిజమైన వ్యక్తి తత్వమని ___, అంతకు మించి ఆశించవలసింది, తెలుసుకోవలసినది, చేయవలసినది మరొకటి లేదని అనుకుని, జీవితం విభిన్న సంఘటనల పరంపర అని, దీనికి మృత్యువే అంతమని, అంతకు మించింది మరొకటి లేదని, అందువల్ల, ఈ జీవితాన్ని సుఖవంతం చేసుకోటానికి తగిన మార్గాలను చేపట్టాలని అనుకుని, మహాప్రవాహంలో కొట్టుకుపోయే కర్రముక్కలలాగ, అస్వాధీనంగ కాల ప్రవాహంలో కొట్టుకునిపోతుంటారు.


కాని కొందరు ఇదే నిజమని నమ్మలేక, దీని వెనుక ఏదో ఒక నిజం ఉండాలని, ఒక అజ్ఞాతశక్తి ఉండాలని, లేకపోతే ఈ అనిత్య ప్రపంచములో, ఈ విధంగ దుఃఖాలను అనుభవిస్తూ జీవించటంలో పరమార్థం ఏమీ లేదని ఊహించి, ఆ అజ్ఞాతశక్తి తత్త్వాన్ని తెలుసుకోటానికి ప్రయత్నించారు


కొందరు ఆ శక్తిని ఈశ్వరుడని, అతడు శాశ్వతుడని, సర్వజ్ఞుడని, సర్వవ్యాపకుడని, అతడే ఈ ప్రకృతిని స్వాధీనపరచుకుని సృష్టి కార్యాన్ని చేస్తాడని, అతని కృప ఉంటే ‘జీవుడు’ ఈ జనన మరణ చక్రం నుంచి ముక్తుడై, ఈశ్వరుడితో సాయుజ్యం పొందుతాడని, అందువల్ల ఆ ఈశ్వరుడినే సర్వదా ఆరాధించాలని చెప్తారు.


వివిధ మతానుసారంగా, ఆ ఈశ్వరుడు విష్ణువని, శివుడని, పరమాత్మ అని, శక్తి అని – ఈ విధంగ కొన్ని నామాలతో వ్యవహరిస్తుంటారు. ఈ సృష్టి కార్యమంతా ఆయన వల్లనే జరిగింది, ఈ జగత్తులో జరిగే ప్రతి పనీ అతని సాక్షిత్వంలోనే జరుగుతుంది. ఈ జగత్తు ఆయన ‘ఇష్టం’ ఉండేవరకు ఉంటుంది. ఆ తరువాత అది ఈశ్వరుడిలోనే కలిసిపోతుంది. లేక అవ్యక్తంగా మిగిలిపోతుంది, ఈశ్వరుడు ఒక్కడే ప్రళయం తరువాత కూడ ఉంటాడు. మళ్ళీ అతనికి ‘ఇష్టం’ కలిగినప్పుడు ఈ జగత్తును సృష్టిస్తాడు, ఈ సృష్టి, స్థితి, లయాలు ఆయనకు ఒక ‘లీల’వంటివని చెప్తారు.


అన్ని ద్వైతమతాలకు మౌలికమైన సిద్ధాంతం ఇది. సృష్టిక్రమంలో సృష్టికి ముందు ఉండే ఈశ్వరుడు ప్రధానలక్షణాలలో, అతనికి, జీవుడికి ఉన్న సంబంధంలో విభిన్న మతాలు విభిన్న సర్వాధికారాలు గల ప్రభువు. జీవుడు ఎటువంటి అధికారాలు లేని, పరాధీనుడైన భృత్యుడు.


12.అద్వైత సిద్ధాంతాలు :


అద్వైతసిద్ధాంతాలు, ద్వైతసిద్ధాంతానికి భిన్నమైనవి. అద్వైతసిద్ధాంతం ప్రకారం ఈ జగత్తంతటికి (జీవుడితో సహా), మూలపదార్థం ఒక్కటే. దానిని ‘శివ శక్తి’ అని తంత్రశాస్త్రం, ‘బ్రహ్మం’ అని వేదాంత శాస్త్రం అంటున్నాయి.


‘శివ శక్తి’ ప్రధానంగా బీజ రూపంలో ఉన్న ‘సృజన శక్తి’. అది అర్ధనారీశ్వర తత్త్వంగా, శివుడి అంశ, శక్తి అంశ కలసిన ఒక అవ్యక్త, అనావిర్భావస్థితి. సృష్టికి ముందు ఆ ‘శివశక్తి’ లో ఒక (వాంఛా రూపకమైన) సంచలనం కలిగి ఆ శివశక్తి శివుడిగా, శక్తిగా విడిపోతాయి. శివుడు ప్రధానంగాజ్ఞానరూపుడు అయిన పురుషుడు, శక్తి ప్రధానంగా ఈ పాంచభౌతిక ప్రపంచానికి చిత్తానికి కారణం. ఈ విశ్వంలోని సమస్తం (అందరు దేవతలతోకూడ), ఈ రెండిటివల్లనే కలుగుతుంది. మళ్ళీ కల్పాంతంలో, శక్తి తిరిగి శివుడితో కలిసి ‘శివ శక్తి’ గా అద్వైతభావంతో బీజరూపంలో ఉంటుంది.


కాని వేదాంతశాస్త్రం ప్రకారం, అద్వైతమైన పరబ్రహ్మతత్త్వం ఎప్పుడూ అద్వైతంగనే ఉంటుంది. అందులో మనకు కనపడే విభిన్నత్వం లేదు. దీని గురించి ముందు పరిశీలిద్దాం.

-


_ఇంకా వుంది -


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!