స్త్రీ స్వేచ్ఛకు నిజమైన అర్థమిదేః

స్త్రీ స్వేచ్ఛకు నిజమైన అర్థమిదేః

బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణను ఎరుగని తెలుగు లోగిలి లేదనడం అతిశయోక్తి కాదు. నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో యజమానురాలు, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు, గృహిణి... ఇలా నిజ జీవితంలో విభిన్న పాత్రలను పోషించి ఆయా రంగాల ప్రముఖులచే భేష్ అనిపించుకున్న ఘటికురాలు.

స్త్రీ స్వేచ్ఛపై తన అభిప్రాయాలను సుస్పష్టంగా చెప్పారామె. మహిళా స్వేచ్ఛ అంటూ చాలామంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారని డాక్టర్ భానుమతి పేర్కొంటూ, ఎవరినీ లెక్కచేయక విచ్చలవిడిగా తిరుగుతూ నిర్లక్ష్య ధోరణి గలవారు ఒకరైతే...

పురుషాధిక్యానికి గురై అమాయకత్వంతో కూడిన అజ్ఞానంతో కష్టాలు పడే మహిళలకు విముక్తినివ్వాలని సీరియస్‌గా వాదించేవారు ఇలా రెండు రకాల మహిళా స్వేచ్ఛావాదులు ఉన్నారంటారు. అయితే "మట్టిలో మాణిక్యం" చిత్రంలో తాను రూపొందించిన లలిత పాత్ర. స్త్రీ స్వేచ్ఛకు నిజమైన అర్ధం అంటారు డాక్టర్ భానుమతి.

మహిళ తనకంటూ స్వంత వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకొని, తన పరిమితులను తానెరిగి, జీవిత భాగస్వానిగా, అమ్మగా, పరిపూర్ణ స్త్రీగా బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆత్మాభిమానాన్ని కోల్పోకుండా ముందడుగు వేయాలని, తీవ్ర పరిస్థితులు ఎదురైనప్పటికీ తల ఒగ్గక సమాజంలోని దుష్టశక్తులను దునుమాడే ఆదిశక్తిలా ఉండాలనేది తన ఆకాంక్షగా భానుమతి స్పష్టం చేశారు.

అయితే, మహిళలందరికీ ఇలాంటి ఆదర్శ లక్షణాలు ఉండవని తనకూ తెలుసనీ, కొందరికి పుట్టుకతోనే భయం, పిరికితనం ఉన్నా అడుగడుగునా జీవితం నేర్పే పాఠాలు, పరిస్థితుల ఒత్తిడితో ఆత్మస్థైర్యం, ధైర్యం అలవడతాయని ఆమె అన్నారు.

డాక్టర్ భానుమతి జీవితాన్ని పరికిస్తే పై విషయాలు ఆమె స్వానుభవంతో చెప్పినవేనని అనిపిస్తుంది. ఈ కోణంలోనే "మట్టిలో మాణిక్యం"లో లలిత పాత్రను రూపొందించి, తరువాత అదే ప్రేరణతో "అంతా మన మంచికే" చిత్రంలోని సావిత్రి పాత్రకు ఊపిరి పోసినట్లు భానుమతి చెప్పారు.

ఈ సినిమాలు రెండూ ఎంతో ప్రజాదరణ పొందాయి. అదే రీతిలో తాను "అసాధ్యురాలు"లో భారతి పాత్రను ఒకింత ఎక్కువ స్థాయిలోనే మలిచానని వివరించారు.

అసాధ్యురాలు సినిమాలో హీరోకు పెద్దమ్మ అయిన భారతి ఐశ్వర్యవంతులమనే అహంకారంతో పేదలను నీచంగా చూసే వ్యక్తులను దారికి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్రేమకు ఆటంకాలు కల్పించే శక్తులను ఎదుర్కొంటూ, చేయూతను ఆశించిన వారిని అండగా నిలిచి, ఒక్కో సన్నివేశలోనూ సమయస్పూర్తితో సమర్థవంతంగా వ్యవహరించేలా ఈ పాత్రను రూపొందించానన్నారు.

మొన్న లలిత, నిన్న సావిత్రి, తర్వాత భారతి పాత్రల ద్వారా స్త్రీ స్వేచ్ఛకు నిజమైన అర్థాన్నిచ్చిన డాక్టర్ భానుమతి నిజజీవితంలోనూ అదే వ్యక్తిత్వంతో స్త్రీ లోకానికి ఆదర్శప్రాయంగా నిలిచారు.

ఈ ఆర్టికల్ రాసినవారు - యిమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు

వెబ్ దునియా ఉండి సంగ్రహించడమైనది

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!