మన ఇతిహాసాలు - తెలుగు సినిమాలు! భారతము:

శ్రీ జాజి శర్మ..గారి కి కృతజ్ఞతలతో...

.

మన ఇతిహాసాలు - తెలుగు సినిమాలు!

భారతము:

"మాయాబజార్" సినిమా:

మన తెలుగు దృశ్యకావ్యము "మాయాబజార్" (విజయావారిది) సినిమా పూర్తిగా కల్పితము.

ఈ కధావృత్తాంతము అంతా శ్రీపింగళి గారి అపూర్వ సృష్టి. వ్యాసభారతములో దీని ప్రస్తావనలేదు. వ్యాసభారతము ప్రకారము అసలు బలరామునికి శశిరేఖ అనే కూతురు లేనేలేదు. ఆ లేని శశిరేఖను సృష్టించి కధ మొత్తము పాండవులు లేకుండా నడిపించారు విజయావారు.

శ్రీకృష్ణపాండవీయము:

శ్రీకృష్ణపాండవీయము లో శకుని పాత్ర కొండవీటివెంకటకవి (సినిమా టైటిల్స్ లో కధ శ్రీరామారావుగారని ఉంది) మరో రకంగా చిత్రీకరించారు.

చిత్రకధప్రకారము: భీముడు సుయోధనుడి సమక్షములో కౌరవులను "గోళకులు" అని సంభోధిస్తాడు. గోళకులు అంటే "భర్త పోయిన స్త్రీకి జన్మించిన వారు" అని అర్ధము. దీనికి సుయోధనుడు, వ్యాసుని నిజం అడుగుతాడు. అది నిజమేనని వ్యాసుడు చెప్పినట్లుగా మరో అసందర్భమైన కధ ఆ చిత్రములో చొప్పించారు. ఈ కధ వ్యాస భారతములో లేదు. ఇది ఎక్కడ నుండి సేకరించారో కనీసం నిర్మాతలు "టైటిల్స్" లో చూపించలేదు. వారి కధ ఇలా వుంది. 

ఆ కల్పిత కధ ప్రకారము "గాంధారి జాతకములో వైధ్యవ్యం ఉన్నదని, దానిని తప్పించుటకు, గాంధారి తండ్రి "ఓ మేకపోతుకిచ్చి గాంధారి వివాహం జరిపించి, ఆ మేకపోతును వెంటనే వధించి, గాంధారికున్న వైధవ్యమును అనుభవింపచేసి, తరువాత ధృతరాష్ట్రునికిచ్చి వివాహం చేశారని అందువలన కౌరవులు "గోళకులే" నని వ్యాసుడు అన్నట్లు చిత్రకధ చెపుతుంది. తరువాత తాతగారు కౌరవ వంశాన్ని మోసం చేసి అప్రదిష్ట పాలు చేశారని సుయోధనుడు గాంధారి తండ్రిని, వాని నూరుగురు పుత్రులను బంధించి కారాగారములో నుంచి,రోజు తిండిగా నూరు మెతుకులు వేస్తుండేవాడని, ఆ నూరు మెతుకులు చిన్నవాడైన శకునికి పెట్టి, అతనిని అందరు కలిసి బతికించి కౌరవ వంశము నాశనం చేయటానికి అతని దగ్గరనుండి వాగ్దానము తీసుకున్నారని,తండ్రి వెన్నెముకనుండి శకునికి మాయా పాచికలు వచ్చాయని, తరువాత కారాగారాములో జీవించి ఉన్న శకునిని , ఒక్కడే కదా అని జాలి తలచి సుయోధనుడు అంత:పురములో ఉండనిచ్చాడని, శకుని తరువాత కౌరవ వంశమును తన దుర్భోదలచే నాశనము చేసాడని ఆ చిత్రరాజము చెపుతుంది.

వ్యాసభారతము ఏం చెపుతోంది :

వ్యాసభారతము ప్రకారము శకుని గాంధారి వివాహసమయములోనే సోదరికి అండగా ఉండటానికి గాంధారమునుండి హస్తినపురము వచ్చేస్తాడు. మేనల్లుడు సుయోధనుడు అంటే శకునికి వల్లమాలిన ప్రేమ, అభిమానము. ఈ వల్లమాలిన ప్రేమాభిమానము చేతనే, సుయోధనునికి కౌరవసామ్రాజ్యము కట్టబెట్టాలని మాయోపాయాలు ఎన్నో చేశాడు. 

గాంధార రాజు సుబలుని ధర్మరాజు స్వయముగా తమ్ములలో ఒకరిని గాంధారము పంపి "రాజసూయ యాగమునకు" రావలసినదిగా అహ్వానిస్తాడు. ఈ అహ్వానమును మన్నించి గాంధార రాజు "రాజసూయము" నకు వచ్చి అతిధి మర్యాదలన్నీ స్వీకరించి వెడతాడు. కాబట్టి ఆయనను ఆయన నూర్గురు కుమారులను సుయోధనుడు బంధించి, అంతమోందించినది అవాస్తవము. అసంబద్ధము. 

ఈ విషయము "పురాణబ్రహ్మ," బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు తమ మహా భారత ప్రవచనముములో ప్రస్తావించారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!