శ్రీ రుద్రదేవతా రూపం - శ్రీ రుద్ర పంచముఖ ధ్యాన శ్లోకాలు!

శ్రీ రుద్రదేవతా రూపం - శ్రీ రుద్ర పంచముఖ ధ్యాన శ్లోకాలు!

.

రుద్రాభిషేకంలో పంచముఖ ధ్యానంలోని శ్లోకాలు న్యాసంలో ప్రస్తావించబడ్డాయి. తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశానముఖ రూపాలలో ఉండే పరమేశ్వరుని ఐదు ధ్యాన శ్లోకాల రూపంలో బోధాయనులు రచించారు. ఈ మహాన్యాస వివేచనము రావణ ప్రోక్త న్యాస ప్రక్రియలోనిది. ఆ శ్లోకాలు, తాత్పర్యము క్రింద. దీనినే శివ పంచానన స్తోత్రం అని కూడా అంటారు. 


తత్పురుష ముఖ ధ్యానమ్


సంవర్తాగ్ని తటిప్రదీప్త కనక - ప్రస్పర్ధితేజోమయం


గంభీర ధ్వని మిశ్రితోగ్ర దహన - ప్రోద్భాసితామ్రాధరం


అర్ధేందుద్యుతిలోలపింగలజటా  - భారప్రబద్ధోరగం


వందే సిద్ధ సురాసురేంద్రనమితం - పూర్వం ముఖం శూలినః


తాత్పర్యము: ప్రళయ కాలము నందలి అగ్ని తేజము తోనూ, మెరపుల తేజముతోను, బాగా కరిగిన బంగారు కాంతితోను పోటీ పదే తేజములే తన రూపముగా కలది, గంభీరధ్వనితో మిశ్రితము అగుతతో పాటు భయంకరమైన అగ్ని వలె ప్రకాశించు ఎర్రని పెదవి కలదియు, చంద్ర ఖండ కాంతితో చక చక మెరయు పింగళ వర్ణపు జడల గుంపును, దాని చుట్టూ గట్టిగా చుట్టిన సర్పములు కలదియు, సిద్ధులు, సురాసురుల చేత నమస్కరించబడుతున్న, శూలికి సంబంధించిన తూర్పున ఉన్న ముఖమును నమస్కరించుచున్నాను. (రజో గుణ ప్రధానమైన సృష్టి తత్వమును ఈ శ్లోకములో స్తుతి చేయబడినది)

.

అఘోర ముఖ ధ్యానమ్


కాలాభ్రభ్రమరాంజనద్యుతినిభం - వ్యావృత్తపింగేక్షణం


కర్ణోద్భాసితభోగిమస్తకమణి - ప్రోద్భిన్న దంష్ట్రాంకురం


సర్పప్రోత కపాలశుక్తి శకల - వ్యాకీర్ణ సంచారగం


వందే దక్షిణమీశ్వరస్య కుటిల - భ్రూభంగ రౌద్రం ముఖం


తాత్పర్యము: నల్లని మేఘములు, తుమ్మెదల కాటుక - వీటి కాంతిని పోలిన కాంతితో ప్రకాశించునదియు, మిక్కిలి మిట్టగా తిరుగుచుండు పింగా వర్ణపు కన్నులు కలదియు, చెవుల యందు మిక్కిలి ప్రకాశించుచుండు సర్ప శిరోరత్నములతో బాగా కలిసిపోవుచున్న కోరల మొలకలు కలదియు, సర్పములతో పాటు (హారముగా) కూర్చబడిన కపాలములతో, ముత్యపు చిప్పల ముక్కలతోను, ఎగుడు దిగుదగుచున్న నడకను పొందినదియు, వంకరలుగా నున్న కను బొమ్మల ముడులతో భయంకరముగా నున్న ఈశ్వరుని దక్షిణ ముఖమును నమస్కరించు చున్నాను. (తమో గుణ ప్రధాన లయ కర్త తత్వము ఇక్కడ స్తుతి చేయబడింది)

.


సద్యోజాత ముఖ ధ్యానమ్


ప్రాలేయాచల చంద్రకుంద ధవళం - గోక్షీరఫేన ప్రభం


భస్మాభ్యక్తమనంగదేహ దహన - జ్వాలావళీలోచనం


బ్రహ్మేంద్రాది మరుద్గణైః స్తుతి పరై - రభ్యర్చితం యోగిభిః


వందేహం సకలం కళంకరహితం - స్థాణోర్ముఖం పశ్చిమం


తాత్పర్యము:  హిమవత్పర్వతము, చంద్రుడు, మొల్ల పూవు - వీని వలె తెల్లనిదియు, ఆవుపాల మీద నురుగు వలె తెల్లని కాంతి కలదియు, విభూతి పూయబదినదియు, మన్మథుని శరీరమును దహించు జ్వాలల పంక్తితో నిండిన కన్ను కలదియు, స్తోత్రము చేయుచున్న బ్రహ్మేన్ద్రాది దేవ సమూహముల చేతను, యోగుల చేతను శ్రద్ధతో అర్చించ బడుచున్నదియు, నిర్మలమైన నిండు వాదనముతో కనబడుచున్నదియును అగు శివుని పశ్చిమ నమస్కరించు చున్నాను. (సత్వ గుణ ప్రధాన రక్షణ కర్త తత్వమును ఈ శ్లోకములో స్తుతించ బడినది)


 .

వామదేవ ముఖ ధ్యానమ్


గౌరం కుంకుమ పంకిలం సుతిలకం - వ్యాపాండు గండ స్థలం


భ్రూ విక్షేప కటాక్ష వీక్షణలసత్ - సంసక్త కర్ణోత్పలం


స్నిగ్ధం బింబ ఫలాధర ప్రహసితం - నీలాల కాలం కృతం


వందే పూర్ణ శశాంకమండల నిభం - వక్త్రం హరస్యోత్తరం


తాత్పర్యము:  గౌర (ఎరుపుతో కలిపిన తెలుపు) వర్ణము కలదియు, కుంకుమ పూ పూతతో నిన్దినదియు, అందమగు తిలకము కలదియు, విశేషముగా తెల్లదనము కళ చెక్కిళ్ళు కలదియు, కనుబొమ్మల కదలికతో ఒప్పుచుండు కడగంటి చూపుతో ప్రకాశించుటతో పాటు, చెవికి అలంకారముగా నున్న తెల్ల కలువ పూవు కలదియు, నున్నని దొండపండు పోలు ఎర్రని క్రింద పెదవిపై స్పష్టమగు నవ్వు కలదియు, నల్లని మున్గుతులచే అలంకరించబడిన, నిండు చంద్రుని మండలమును పోలుచు ప్రకాశించునదియు అగు శివుని ఉత్తరాముఖమును నమస్కరించు చున్నాను. (గుణ త్రయ మిశ్రమమగు ఈశ్వర తత్త్వము ఇక్కడ స్తుతించ బడినది)

.


ఈశాన ముఖ ధ్యానమ్


వ్యక్తావ్యక్త గుణేతరం సువిమలం - శట్త్రింశతత్వాత్మకం


తస్మాదుత్తర తత్త్వమక్షరమితి - ధ్యేయం సదా యోగిభిః


వందే తామస వర్జితం త్రినయనం - సూక్ష్మాతి సూక్ష్మాత్పరం


శాంతం పంచమమీశ్వరస్య వదనం - ఖవ్యాపి తేజోమయం


తాత్పర్యము: వ్యక్తము, అవ్యక్తము (స్పష్ట రూపము కలది, స్పష్ట రూపము లేనిది) అణు రెండు రెండు లక్షణముల కంటెను ఇతరమగు లక్షణము కలదియు, ముప్ఫై ఆరు తత్వముల రూపమున పరిణమించు నదియు,  సకల తత్వముల కంటెను ఉన్నతమైనదియు అగు అనుత్తరము అను అక్షర (అకార) తత్వమును ఎల్లప్పుడును యోగులచే ధ్యానించబడ దగినదియు,  తమో గుణ రహితంను, మూడు కన్నులు కలదియు, సూక్ష్మాతిసూక్ష్మమగు దాని కంటే గోప్పదియు, శాస్తమును, ఆకాశము నందంటను వ్యాపించు తేజమే తన రూపముగా కలదియు అగు ఈశ్వరుని ముఖమును నమస్కరింతును (గుణాతీత బ్రహ్మ తత్వమును ఇక్కడ స్తుతించబడినది)


 .

శ్రీరుద్రధ్యానమ్


బ్రహ్మాండ వ్యాప్త దేహ భసితహిమరుచో - భాసమానా భుజంగైః


కంఠేకాలాః కపర్దాకలిత శశికలా - శ్చండకోదండ హస్తాః


త్ర్యక్షా రుద్రాక్ష భూషాః ప్రణత భయహరాః - శాంభవా మూర్తిభేదాః


రుద్రాః శ్రీ రుద్రసూక్తప్రకటిత విభవా - నః ప్రయచ్ఛంతు సౌఖ్యం


తాత్పర్యము: బ్రహ్మాండము నందంతటను వ్యాపించిన దేహము కలవారును, భస్మము చేత మంచుకాంతి వంటి దేహకాంతి కలవారును, సర్పములతో ప్రకాశించువారును, తమ కంఠములందు నలుపు వన్నె కలవారును, జటా ఝూటము నందు చంద్ర కళలు కలవారును, భయము గొలుపు ధనుస్సులు తమ హస్తములందు కలవారును, మూడు కన్నులు కలవారును, రుద్రాక్షలు తమ అలంకారములుగా కలవారును, తమ విషయమున ప్రణమిల్లిన వారి భయమును పోగొట్టువారును, పూజ్యమగు రుద్రసూక్త మంత్రములచే ప్రకాశింప జేయబడిన వైభవము కలవారును అగుచు శంభుని మూర్తి భేదములే అగు రుద్రులు మాకు సౌఖ్యమును కలిగింతురు గాక!

 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!