కల్పవృక్షంలో కైక –రచన : భైరవభట్ల కామేశ్వరరావు. .
కల్పవృక్షంలో కైక –రచన : భైరవభట్ల కామేశ్వరరావు. . రామాయణ కథని మలుపు తిప్పిన స్త్రీ పాత్రలలో కైకది ఒక కీలకమైన పాత్ర అని అందరికీ తెలిసిన విషయమే. దశరథుని ఆకాంక్ష మేరకు రాముని పట్టాభిషేకం జరిగిపోయుంటే, రామాయణం అక్కడితో ఆగిపోయేది. అది కాకుండా మలుపు తిప్పినది కైక. అయితే, వాల్మీకి రామాయణంలో కైక పాత్ర కీలకమైనదే కాని, చాలా పరిమితమైనది. కేవలం రామపట్టాభిషేక సందర్భంలో, అలుక పూని, వరాలడిగి, పట్టాభిషేకం చెడగొట్టి, రాముడిని అడవులకి పంపించడం వరకే ఆమె పాత్ర మనకి ప్రముఖంగా కనిపిస్తుంది వాల్మీకంలో. ఆ తర్వాత కథని ముందుకి నడిపించేది సీత. రాముని సర్వ ప్రయత్నమూ సీత కోసమే. ముందుగా లంకలోకి ప్రవేశించి, లంకని సర్వనాశనం చేసి, చివరకి రావణునితో పాటు సర్వ రాక్షస సంహారానికీ కారణమైనది సీతే. అందుకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని గురించి “సీతాయాశ్చరితం మహత్” అన్నది. అంతటి సీత పాత్రకి సరిజోడుగా, అంతటి ప్రాధాన్యమున్న పాత్రగా కల్పవృక్షంలో కైకని తీర్చిదిద్దారు విశ్వనాథ. రావణసంహారం చేసి వనవాసం ముగించుకొని సీతారామలక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చిన్నప్పుడు కైకేయి సీతని కౌగిట చేర్చుకొని యిలా అంటుంది: కైకెయి సీత గౌగిటికి ...