మధ్యాహ్నం మాణిక్యం!

మధ్యాహ్నం మాణిక్యం!

(ప్రఖ్యాత కథకులు నందివాడ భీమారావు గారు, వారి అర్థాంగి శ్రీమతి శ్యామల గారు కలిసి వారి జ్ఞాపకాల్నీ కలబోసి రాసిన కథ )

.

మా తాత గారిది పెద్ద ఉమ్మడి కుటుంబం. ఆయన తమ్ముళ్ళూ, మేనల్లుళ్ళూ, బావ మరిదీ, మొత్తం పిల్లా పెద్దా కలిసి ఎప్పుడు చూసినా పెళ్ళి ఇల్లులా ఉండేది. ఎప్పుడూ ఏవో నోములూ పేరంటాలూ పురుళ్ళూ తద్దినాలూ సమారాధనలూ చాలా సందడిగా ఉండేది. పక్కన అతిథి కూచుని భోంచేస్తేనే మా తాతగారు తినే వారు. ఆస్థి ఉండి అట్టహాసముండి సరదాలూ సంబరాలూ వేడుకలతో నిండి, బొత్తిగా ముందు చూపూ జాగ్రత్తా లేని ఆ కాలపు పెద్ద కుటుంబం మా తాతగారిది.

పెద్ద మండువా ఇల్లూ నాలుగు వేపులా పెద్ద పెద్ద వసారాలూ, పెద్ద భోజనాల సావిడీ, నాలుగు పెద్ద పడక గదులూ, కొన్ని చిన్న గదులూ, పాల మజ్జిగలకి ప్రత్యేకం గదీ, వంటకి వేరే, పిండి వంటకి వేరే గదులూ ఉండేవి. మా బామ్మ కూర్చుని పిండి వంటలు చేస్తూ ఉంటే మేవంతా చుట్టూ కూర్చుని ఖాళీ చేసేవాళ్ళం.

“చేసినంతసేపు పట్టదర్రా, ఖాళీ అయిపోవడానికి” అనేదావిడ.

మా నాన్న కన్నతల్లి చంటితనంలోనే పోతే తాతగారి రెండో భార్య దగ్గిరే ఆయన పెరిగారు. “అమ్మా” అనే పిలిచే వారు. చాలా కాలం దాకా ఆవిడే మా అసలు బామ్మని అనుకునే వాళ్ళం.

దేవుడి గుళ్ళో ఏ వేడుక జరిగినా మా ఇంటికే పెద్ద పీటగా ఉండేది. దేవుడి కళ్యాణానికి బామ్మా తాత గారూ, తరవాత కాలంలో అమ్మా నాన్నా, పీటలమీద కూర్చునే వారు. ఆ అయిదు రోజులూ, ఏ రోజుకారోజు కొత్త బట్టలు మడత నలగకుండా కట్టుకునే వారు.

మా అమ్మకి సినీమాలంటే చాలా ఇష్టం. నాన్న మమ్మల్నందరినీ కాకినాడ తీసికెళ్ళి అక్కడ ఉన్న చుట్టాలతో సహా సినీమాకి తీసుకెళ్ళేవారు. అమ్మ స్థిమితంగా సినీమా చూసేందుకు వీలుగా పిల్లల్ని పక్కకి తీసుకెళ్ళీ ఆడిస్తూ ఏవో కొనిపెడుతూ, కథలు చెబుతూ కాలక్షేపం చేసేవారు.

కథలంటే ఆయనకి మహా సరదా. ఆయన చెప్పే కథలు ఇంటిల్లిపాదీ ఆసక్తిగా వినేవారు.

దీపావళొస్తే మా ఇంట్లో సంబరం చూడవలిసిందే. సూరేకారం, పటాసూ పేక ముక్కలూ, పాత పోస్టు కార్డులూ పెట్టి మతాబాలు, చిచ్చుబుడ్లు, టపాకాయలూ చెయ్యడంలో నాన్న నేర్పు గురించి ఊరంతా చెప్పుకునే వారు. గది నిండేలా బాణసంచా పేర్చి, బాగా ఆరనిచ్చి, దీపావళికి ముందూ తరవాతా వారం రోజులు ఊరందరికీ పండగలా నడిపించే వారు. ఊరి పిల్లలందరికీ ఆయన పెద్దన్నయ్య.

అంత మందిలోనూ మాకేలోటూ రాకుండా చూస్తూనే, అందరితో కలిసి మెలిసి ఉండేలా, అందరితో మంచీ చెడ్డా పంచుకునేలా అలవాటు చేశారు.

ఆ రోజుల్లో గ్రామఫోను తప్పనిసరి సౌకర్యంగా ఇంట్లో ఉండేది. ఎవరికి తోచిన రికార్డు వాళ్ళు పెట్టుకుని వినే వాళ్ళు. నాన్న సైగల్‌ పాడిన “దునియా రంగ్‌ రంగేళీ బాబా, దునియా రంగ్‌ రంగేళీ” చాలా మాట్లు వింటూ ఉండేవారు. ఆ మాటలకి పూర్తి అర్థం ఆయనకి తెలుసునోలేదోగానీ, నాకు అర్థం కాకుండానే ఆ పాట వింటూంటే రంగు రంగుల దారాల కలనేత కళ్ళకి కట్టినట్లుండేది. ఎందుకో, నాన్నా ఆ పాటా ఒకటే అనిపించేది.

ఇన్నేళ్ళకి మా అబ్బాయి CD player లో ఆ పాట మళ్ళీ విన్నాను. ఎందుకో కలిమిలో నాన్న, కష్టాల్లో నాన్న, కలగలుపుగా ఒకే పిక్చరు మనసులో మెదిలింది.

“పొద్దున్న వేళలా పొడిచేటి భానుడు పొన్న పువ్వూ ఛాయ, మధ్యాహ్న వేళల పొడిచేటి భానుడూ మంకెన్న పూఛాయ”.

“ఏవిటీ ఎప్పుడూ లేనిది కూని రాగాలొస్తున్నాయి, పూర్తిగా పాడరాదా” అన్నారు మా వారు.

“ఆ, నా మొహం నాకొకటి ఒస్తే కదా! నా చిన్నప్పుడు మా దొడ్డ పాడే పాటలు గుర్తొచ్చాయి, ఈ ఆకుల వైభవం చూస్తుంటే. మా వూళ్ళో నా వానా కాలం చదువుకి వొంటి పూటి శలవులప్పుడు బడి నించి ఇంటికి వస్తూంటే దారిలో రెండు పక్కలా దుబ్బులమీద తీగలకి పూసిన ఎర్రని మధ్యాహ్నం మాణిక్యాలు, వాటి తొడిమలు తుంపి నోటిలో పెట్టుకుంటే కొద్దిగా మకరందం రుచీ, తీరీ తీరని దాహం, ఏవేవో జ్ఞాపకాలొస్తున్నాయి” అన్నాను.

“మధ్యాహ్నం మాణిక్యాలేమిటీ, నేనెప్పుడూ చూడలేదూ, వినలేదూ?”

“ఏమో, మా దొడ్డా మంకెన్న పువ్వుల్నే మధ్యాహ్నం మాణిక్యాలంటారని చెప్పేది”

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!