కోనసీమ కథలు: న్యాయవాదం! (రచన: సాయి బ్రహ్మానందం గొర్తి.....సేకరణ )

కోనసీమ కథలు: న్యాయవాదం!

(రచన: సాయి బ్రహ్మానందం గొర్తి.....సేకరణ ).

ఉదయం పెందరాళే భోజనం చేసి కోర్టుకి వెళదామనుకుంటూండగా ‘ఒక్కసారి పెరట్లోకి రండీ’ అంది నా భార్య సులోచన. ఎందుకని ప్రశ్నించకుండానే వెళ్ళాను. కోర్టుకి టైమవుతోంది.

పెరట్లోకి వెళ్ళగానే అక్కడ కారునలుపులో ఉన్న ఒక ముసలావిడ కనిపించింది. బాగా ఏడిచినట్టుందేమో కళ్ళన్నీ ఉబ్బినట్లున్నాయి. ముడతలుపడ్డ మొహంలో కంటికింద చారికలూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకుముందెక్కడో చూసినట్లుగా వుంది. వేంటనే గుర్తుకు రాలేదు.

నన్ను చూడగానే ఏడవడం మొదలుపెట్టింది. నాకేం అర్థం కాలేదు. ఇది చూసి సులోచనే చెప్పింది. “ఈవిడ మన మన రైతు పనసయ్య అక్కట. సత్తిరాజు గారి కేసు విషయమై మాట్లాడాలని వచ్చింది.” విషయం ఏమిటని అడిగాను.

“అయ్యా సత్తిరాజుగారన్యాయంగా మా మీద కేసు బనాయించారయ్యా. సత్తె పెమాణంగా ఆ పొలం మాదేనయ్యా. మేమెవరిదీ కబ్జా చెయ్య లేదయ్యా. ఎలాగయినా మీరే చూడాల. ఈ పొలం కూడా పొతే కుటుంబం రోడ్డెక్కుతుందయ్యా.” ఆమె ఏడుస్తూ చెప్పింది.

ఆమె ఎందుకొచ్చిందో అర్థమయ్యింది.

ఇవాళ రవణం సత్తిరాజు కేసుంది. ఈరోజే ఫైనల్ జడ్జిమెంటు. ఇప్పటికే రెండు మూడు వాయిదాలు పడింది. సాధారణంగా చిన్న చిన్న సివిల్ కేసులు నేను తీసుకోను. నా దగ్గరున్న అప్రెంటిస్ లాయర్లు చూసుకుంటారు.

“సూర్యం! ఈ కేసు మీ పిల్లాళ్ళ చేతిలో పెట్టకుండా నువ్వే వాదించు. ఇప్పటికే నాలుగేళ్ళగా నలిగిపోతోంది. ఇది మాట్లాడదామనే వచ్చాను.” అంటూ వారం క్రితం బార్ అసోషియేషన్ క్లబ్బుకి సత్తిరాజొచ్చి ప్రాధేయపడ్డాడు.

సత్తిరాజుకి పాలగుమ్మి దగ్గర అక్షరాలా నలభై ఎనిమిది ఎకరాల పొలముంది. ఆ పొలాల పక్కనే ఆ ముసలావిడ పొలం కూడా వుంది. ఆ రెండెకరాలూ జత చేస్తే ఏభైకి చేర్చచ్చనీ సత్తిరాజు ఆశ. వీళ్ళ ముత్తాతలు ఈ పొలం కౌలు చేసారు తప్ప, ఈ పొలం వీళ్ళది కాదనీ, దాన్ని ఆక్రమించుకున్నారనీ సత్తిరాజు కోర్టులో కేసుపెట్టాడు. ముందు మధ్యవర్తుల చేత అమ్మమని చెప్పించాడు. అది ఫలించక కోర్టుకెక్కాడు. ఈ ముసలావిడ తరపున ఈ కేసుని లాయరు ప్రకాశరావు చేపట్టాడు. సత్తిరాజు ప్రకాశరావునీ కొనేసాడు. ఎలాగయినా గెలవాలనీ పంతం కొద్దీ నన్నే రంగంలోకి దింపాడు.

సత్తిరాజు కోనసీమలో పెద్ద పేరుమోసిన వ్యక్తి. అయినా ఎందుకు ఈ రెండెకరాల మీద ఇంత పంతంగా ఉన్నాడో అర్థం కాలేదు. విరివిగా పెరిగిన సంపద ధిక్కారాన్ని సహించదు, అదెంత చిన్నదయినా! సత్తిరాజూ, నేనూ ఒకే బళ్ళో కలిసి చదువుకున్నాం. వాడు బి.ఏ అయిదుసార్లు దండయాత్ర చేస్తే, ఈలోగా నేను బీ.ఎల్లూ, ఎం.ఎల్లూ పూర్తి చేసాను. వాడు రాజకీయాలకి అంకితమయితే, నేను అమలాపురం కోర్టులో సివిల్ ప్లీడరుగా సెటిలయ్యాను.

సత్తిరాజు కేసని చెప్పగానే ఈవిణ్ణి ఎక్కడ చూసానో గుర్తొచ్చింది. ఏడాది క్రితం కేసు విచారణ సమయంలో ఎలాగయినా సత్తిరాజుకి నచ్చచెప్పమని, కాళ్ళట్టుకుని అమలాపురం కోర్టులో నన్ను ప్రాధేయపడడం చటుక్కున మెదిలింది. అప్పుడు నేనే నిర్దాక్షిణ్యంగా పట్టించుకోలేదు. నాకు సత్తిరాజుతో స్నేహం ముఖ్యం. అతను చెల్లించే ఫీజు మరీ ముఖ్యం.

“చూడమ్మా! నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు. పైగా ఈ కేసులో సత్తిరాజు వైపు బలమయిన సాక్ష్యాధారాలున్నాయి. ఇప్పుడు నేను చేసేదేమీ లేదు. నీకు వ్యతిరేకంగా నేను వాదిస్తున్నాను. కాబట్టి నా క్లయింటు తరపునే నేను వాదించాలి.” నా అశక్తత చెప్పాను.

నా మాట విని ఆమెలో దుఃఖం పెల్లుబికింది. మాట లేదు. నా కేసి దీనంగా చూసింది.

“మీరే ఏదోకటి చేసి ఆమెకు సాయం చెయ్యండి. పాపం గంపెడు సంసారమట. అందరూ వీధిన పడిపోతారని ఏడుస్తోంది. ప్లీజ్! మీరు తలుచుకుంటే చెయ్యగలరు.” ఈసారి సులోచన బ్రతిమాలింది.

గతంలో ఎన్నో క్లిష్టమయిన కేసులు నేను గెలిచానని సులోచనకి తెలుసు. సులోచన ఎవర్నీ నాకు సిఫార్సు చెయ్యదు. ఎందుకింతగా చెబుతోందంటే ఆమె చెప్పింది నమ్మే ఉంటుంది. అయినా ఆ ముసలామె కొడుకు వద్ద ఆధారాలేమీ లేవు. నిన్ననే ఆ పొలం తాలూకు దస్తావేజులన్నీ సత్తిరాజు నాకు పంపించాడు. అవి చూసాకే సత్తిరాజు ఈ కేసు గెలవడం ఖాయం అని చెప్పాను.

“పోనీ నీ దగ్గర పొలం తాలూకు దస్తావేజులేమయినా వున్నాయా?” అని అడిగాను. అవన్నీ వాళ్ళ లాయరు ప్రకాశరావుకి చాలా ఏళ్ళ క్రితమే ఇచ్చారనీ చెప్పిందామె. ప్రకాశరావు దగ్గర అసలు కాయితాలు సత్తిరాజు డబ్బుకి కొనేసాడని అర్థమయ్యింది. అసలు దస్తావేజులు తన దగ్గరుంచుకొని, రెవెన్యూ ఆఫీసరుకి లంచమిచ్చి నకీలివి పుట్టించాడని ఇప్పుడు మరింతగా అర్థమయ్యింది.

“చెప్పాను కదమ్మా! నేనేమీ చెయ్యలేను. నీకో విషయం తెలుసా! మీ లాయరు పైకి నీ వైపున్నాడు కానీ, ఆయనా నీకు వ్యతిరేకంగానే పనిజేస్తున్నాడు. ఇప్పుడు చాలా కష్టం.” నా మాటలు విని ఆమె లోలోపలే కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. చూసి నాకూ పాపం అనిపించింది. నే చెప్పాల్సింది చెప్పి లోపలకెళుతూండగా సులోచన నా దగ్గర కొచ్చింది.

“ప్లీజ్! ఆమెకు న్యాయం దక్కేలా చూడండి… ఈ ఒక్కసారికీ!”

జాలితోనూ, దయతోనూ కోర్టు తీర్పులు నడవ్వు. తెల్ల కాయితమ్మీద నల్ల సాక్ష్యాలే దానికి ప్రమాణం.

సులోచనకి వెళ్ళొస్తానని చెప్పి గబ గబా బయటకొచ్చేసాను. నాకోసం నా అసిస్టెంట్లు ఎదురుచూస్తున్నారు. వెనక సీట్లో నేనూ మా గుమాస్తా కూరుచున్నాం. నాదగ్గరున్న అసిస్టెంటు లాయరు ముందు కూర్చున్నాడు. పొలం తాలూకు ఒరిజినల్ దస్తావేజులు చూపించమనీ అడిగాను. నా అసిస్టెంటు చేతికిచ్చాడు. అవన్నీ పరిశీలనగా చూస్తూండగా మధ్య పేజీల్లో సంతకాల వద్ద నిలిచి పోయింది దృష్టి.

ఇవాళ ఈ కేసు హేండిల్ చేసే జడ్జెవరనీ అడిగాను. జడ్జి కుటుంబరావని చెప్పాడు మా అసిస్టెంటు. గతంలో ఈ కుటుంబరావునీ కొనేద్దామని సత్తిరాజు ప్రయత్నించాడు. సదరు జడ్జిగారు సత్తెకాలపు వ్యవహారం. ఛీ పొమ్మన్నాడు. దాంతో సత్తిరాజుకి ముసలమ్మ మీద కన్నా ఈ జడ్జిగారినెలాగయినా ఓడించాలనీ కసీ, పట్టుదల పెరిగాయి. అది మా ఇనప్పెట్టెలో డబ్బు జల్లింది.

కోర్టులో కేసు ఉన్న ఆధారాలు తీసుకొని వాదించాను నేను. మా దగ్గరున్న సాక్ష్యాలూ జడ్జి ముందుంచాను. ప్రకాశరావు ఏ మాత్రం ప్రతివాదన చెయ్యలేదు. నేను వాదిస్తున్నంత సేపూ దూరంగా బల్లమీద కూర్చుని ముసలమ్మ కుటుంబం భయంగా చూస్తున్నారు. వాదిస్తున్నంత సేపూ ఆ ముసలమ్మ మొహంలోకి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూళ్ళేకపోయాను. జడ్జి మా వాదనలన్నీ విని తీర్పిచ్చాడు. రవణం సత్తిరాజు కేసు ఓడిపోయాడు. సత్తిరాజు నోట మాటలేదు. ఆ ముసలమ్మదే పొలమనీ తీర్పిచ్చాడు జడ్జి. అది విని ఆ ముసలమ్మ కళ్ళల్లో కాంతిని మాత్రం స్పష్టంగా చూడగలిగాను.

బయటకొచ్చాక సత్తిరాజు నెత్తీ నోరూ బాదుకుంటూ “ఏంది సూర్యం! ఈ కేసిలా చచ్చింది. ఆధారాలిచ్చాను కదరా! ఆఖరికా ప్రకాశరావుకీ పాతికవేలిచ్చాను. పరువు పోయింది కదయ్యా!” అంటూ ఏడ్చాడు.

“నన్నేం చెయ్యమంటావు? నువ్విచ్చిన సాక్ష్యాలే చూపించాను. అయినా దస్తావేజులు కొత్తవి చేయించేటప్పుడు కాస్త చూసుకోవద్దా? ఎవడయ్యా ఆ గుమాస్తా నీకీ పత్రాలిచ్చిందీ? అన్నీ తప్పులూ తడకలతో రాసి చచ్చాడు. పొలం దస్తావేజుల మధ్య సంతకాల పక్కన బుద్ధున్న వాడెవడూ క్రితం ఏడాది డేటెయ్యాడు. పాతికేళ్ళ క్రితం పొలానికి ఏడాది క్రిందట డేటేసిచ్చాడు. ఆ ఆధారంగానే ఆ జడ్జి వాళ్ళ వైపు తీర్పిచ్చాడు.” నాకేమీ తెలియనట్లే అన్నాను.

“ఇవాళ కేసు ఓడిపోయారట కదా? గుమాస్తా గారు చెప్పారు. ఎంత ఆనందం వేసిందో? నా మాట విని మీరా ముసలమ్మని గెలిపించారా?” ఆ సాయంత్రం ఇంటికొచ్చాక సులోచన సంతోషంతో అంది.

సాధారణంగా నేను కేసు చేపడితే గెలవకపోవడం అంటూ వుండదు. తిమ్మిని బమ్మి చేసయినా గెలుస్తాను. న్యాయవాదం నాకు వృత్తి కాదు. వ్యాపారం. ఓడినందుకు మా అసిస్టెంట్లు ఏడ్చినంత పని చేసారు. ఇదంతా మామూలేనని వాళ్ళని సముదాయించాను.

“నేను గెలిపించడమేవిటి? ఎవరైనా వింటే పీకట్టుకుంటారు. ఆధారాలు బట్టే జడ్జిమెంటుంటుంది.”

“కోర్టుకెళుతూ ఆమె వైపు ఒక్క ఆధారమూ లేవన్నారు. ఎలా గెలిచిందట మరి?” సులోచనకి నా మాట నమ్మబుద్ధి కాలేదు.

సత్తిరాజు నకిలీ దస్తావేజులు పుట్టించాడానీ, పాతికేళ్ళ క్రితం నాటి వాటిలో పొరపాటున ఏడాది క్రితం డేటు వేసారనీ, అదే ఆధారంగా అవి నకిలీ పత్రాలనీ జడ్జి నిర్ధారించారనీ చెప్పాను. పాతిక పేజీల దస్తావేజులో ఆ జడ్జెలా కనిపెట్టాడన్న ధర్మసందేహమొచ్చింది సులోచనకి.

“ఆధారాలు ఇచ్చేటప్పుడు నేనే కావాలని ఆ పేజీ మడత పెట్టి ఆ తేదీ చూసేలా ఇచ్చాను. కారులో కోర్టుకెళుతూండగా దార్లోనే గమనించానది. అయినా నువ్వు ఆర్డరు వేసావు కదా. తప్పుతుందా మరి.” నా మేధస్సుకి తెగ సంబరపడిపోయింది సులోచన.

“తెలీకడుగుతాను. ఇన్నేళ్ళూ నే గెలిచిన కేసులన్నీ న్యాయంగానే గెలిచానంటావా?”

“ఆ! మీరలాగే అంటారు. మీరు న్యాయంగానే వాదిస్తారు లెండి. ఏదో నన్ను మభ్య పెట్టడానికిలా అంటారంతే!” సులోచనకి నా మీద కంటే నా నడవడిక మీదే నమ్మకమెక్కువ.

“పిచ్చిదానా! ఈ న్యాయాలూ, ధర్మాలూ ఇవన్నీ మనకు మనం రాసుకున్నాం. ఇన్నేళ్ళుగా చూసి చూసి వాటినెలా మనకనుగుణంగా మార్చుకోవాలో తెలుసుకున్నాను. నీకు తెలుసో తెలీదో సగానికిపైగా కేసులు న్యాయశాస్త్రంలో లొసుగులు ఆధారంగానే గెలుస్తాము తప్ప, న్యాయంగా కాదు.”

“వాదనకేం తక్కువలేదు. మీరెన్ని చెప్పండి. ఆ ముసలమ్మ వైపు ధర్మమూ, న్యాయమూ ఉంది కాబట్టే ఆమె గెలిచింది. మీరేం చెప్పినా నేను వినను.” అంటూ నన్నూ, నా మాటల్నీ కొట్టి పారేసింది. మమకారం కళ్ళకి తప్పులన్నీ ఒప్పులుగానే కనిపిస్తాయి. సులోచన ఆనందంగా ఉంది కదాని నేనూ రెట్టించలేదు.

నెల్లాళ్ళ తరువాత సులోచన ఓ దుర్వార్త మోసుకొచ్చింది.

“ఏవండీ! ఇది విన్నారా? రావులపాలెం పెళ్ళికి వెళ్ళొస్తూ, ట్రాక్టరు బోల్తా కొట్టి ఆ ముసలమ్మ కుటుంబం మొత్తం చనిపోయారట. వాళ్ళు చచ్చి పోలేదండీ. ఆ సత్తిరాజే చంపించాడనీ అందరూ అనుకుంటున్నారు. నాకూ సత్తిరాజు మీదే అనుమానంగా వుంది. వాడు ఎంతకయినా తెగిస్తాడని అందరూ అంటారు. వాడో రాక్షసుడు. ఈ ఉసురు వాడికీ, వాడి కుటుంబానికీ తగలక మానదు.” ఆవేశంగా అంది.

“గట్టిగా శపించకు. ఆ పాపంలో నీకూ, నాకూ భాగముంది.” అర్థం కానట్లు నాకేసి చూసింది.

“నేను ఆ కేసులో లొసుగు జడ్జీకి చూపించకపోతే సత్తిరాజు కేసు గెలిచుండేవాడు. వీళ్ళూ కష్టమో, నష్టమో బ్రతికుండేవారు. నువ్వు మరీ మరీ చెప్పావనీ ఆ ముసలమ్మని గెలిపించాను. చూసావా ఏమయ్యిందో? సత్తిరాజు ఓడి బ్రతికాడు. ఆ ముసలమ్మ కుటుంబం గెలిచి సమాధయ్యింది.”

నేనిలా అంటానని సులోచన ఊహించలేదు. ముసలమ్మ కుటుంబం మరణించిందన్న విషయంకన్నా, తనకీ ఉసురు తగులుతుందన్న భయం వల్లనేమో తెలీదు – వెక్కి వెక్కి ఏడ్చింది.

కళ్ళు మూసుకుంటే కేసు గెలిచాక కోర్టు బెంచీ మీద కళ్ళల్లో కృతజ్ఞత నింపుకున్న ఆ ముసలమ్మే మెదిలింది – పాపం!

(పంతొమ్మిదివందల డెబ్భై కాలంలో కోనసీమలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా – ఈ కోనసీమ కథలు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!