నన్నయ కవితలో తరుగని పరువము !

నన్నయ కవితలో తరుగని పరువము !

.

నన్నయ నిత్యసత్యవచనుడూ, విజ్ఞాననిరతుడూ, అవదాతచరితుడునూ. ఆయన త్రికరణశుద్ధి నిండుగా పండిన మనీషి, అంచేత ఆయన్ని ఋషి అనడానికి సందేహం వుండదు.

నన్నయ భారతం రచించి దాదాపు వెయ్యేండ్లు కావస్తున్నా, ఈనాటికీ అది కొత్తదనం కోలుపోలేదు. భారతకథా వస్తువే అలాంటిది అనే సమాధానం ఒకటి ఉండనే ఉంది. కానీ నన్నయ కవిత్వంలో అలాంటి ఒకానొక నిత్యనూతనత్వం పొందుకొని ఉండడం గమనింపవలసిన విశేషం.

విశేషమేమిటంటే శబ్దార్థ సౌందర్యాలు రెండూ అవినాభావంతో ఆయన రచనలో కానవస్తాయి. అందుకే ఆయన భారతం అందరి ఆదరాన్ని అందుకున్నది; అందుకుంటున్నది. ఆ అంశాన్ని ఇక్కడ కొద్దిగా పరిశీలిద్దాం. 

.

మ|| కురువృద్ధుల్ గురువృద్ధబాంధవు లనేకుల్ సూచుచుండన్ మదో 

ద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ 

కరలీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైలరక్తౌఘనిర్ఝర 

ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్"

.

తాత్పర్యం: వృద్ధులైన కురువంశీయులు, ద్రోణాచార్యాది గురువులు, పెద్దలనేకులు చూస్తుండగా మదముచే నిరంకుశుడై ద్రౌపది నీ విధంగా చేసిన క్రూరదుశ్శాసనుని లోకమునకు భయం కల్గించే విధంగా యుద్ధమున చంపి రాజైన దుర్యోధనుడు చూస్తుండగా వాని వెడల్పైన రొమ్మనెడి పర్వతం నుంచి సెలయేరు వలె ప్రవహించు రక్తాన్ని భయంకరాకారంతో రుచి చూస్తాను. 

.

ఉ|| "ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణజూచి, రం

భోరు నిజోరుదేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ముదు

ర్వార మదీయబాహుపరివర్తిత చండ గదాభిఘాత భ

గ్నోరుతరోరు జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్"

.

తాత్పర్యం: భూమి మీద తన రాచరికం చెల్లుతున్నదనే గర్వంతో దుర్యోధనుడు ద్రౌపదిని చూచి తన తొడల మీద కూర్చొన రమ్మని పిల్చినాడు. ఆ దుర్మార్గున్ని యుద్ధంలో నా చేతులతో గదను తిప్పుతూ దాంతో వాడి తొడలు నుగ్గు చేస్తాను. 

.

ఈ పద్యాలు రెండూ ఆంధ్రమహాభారత ద్రౌపదీవస్త్రాపహరణఘట్టం లోనివి. 

ఇవి నన్నయ గారు రంగస్థలానికని ఉద్దేశించి రాసినవి కావు.

ఆ సందర్భంలో భీమసేనుడి కోపతీవ్రతనూ, అతని ప్రతిజ్ఞలోని భయంకరత్వాన్నీ పాఠకుల మనస్సుకు అందించడానికని రాసినవి. 

కాని, నాటి నుంచి నేటిదాకా ఈ పద్యాలు రంగస్థలం మీద, సినిమాల్లోనూ వినవస్తున్నాయి.

అప్పటి భీమసేనుడి కోపావేశం ప్రేక్షకులకు తెలుసు. ఎందుకంటే వారి హృదయాల్లో కూడా అలాంటి పరిస్పందన వుంటుంది. 

కనుక దాన్ని భీముడెట్లా వెల్లడిస్తాడో చూడాలనేదే ప్రేక్షకుల ప్రతీక్ష.

ఆ సందర్భంలో భీముడు "కురువృద్ధుల్" అన్న పద్యంతో తన కోపోద్రేకాన్ని ప్రకటిస్తాడు. 

ఆ తర్వాత దుర్యోధనుడు ద్రౌపదిని జూచి తొడమీద కూర్చుందువు రమ్మని సైగ చేస్తాడు. అది చూచిన భీముడు, అగ్గిమీద గుగ్గిలంలా మండిపడతాడు. వెంటనే తన మనసులోని ఉడుకునంతా వెళ్లగక్కుతాడు. 

.

ఈ పద్యాలు చెవిలో పడగానే ప్రేక్షకులు ఇంతకుముందు తమకు అందీ అందకుండా వుండిన ఏదో అనుభూతి హృదయమంతా పరుచుకున్నట్లు భావించి తన్మయత్వం చెందుతారు. అంటే భీముని నోటి నుండి వెలువడిన ఆ మాటలు, అందులోని విన్యాసాలు అంత సందర్భోచితంగా ఉన్నాయన్నమాట!

ఈ పద్యాలు చదువుతున్నప్పుడు వీటిలోని మాటలకన్నింటికీ అర్థాలు తెలియకున్నా అందులోని భావం హృదయాన్ని తాకుతున్నట్లు తోచడం, శబ్దాలు చెవిలో పడుతున్నప్పుడు ఏదో మాధుర్యం హృదయానికి ఆప్యాయంగా వుండడం, అందులోని ధ్వనుల విన్యాసం ఆ సన్నివేశానికి సముచితంగా ఉన్నట్లు అనిపించడం, ఇవన్నీ ప్రేక్షకులు తమకు తెలియకుండానే అనుభవిస్తారు. అందులోనే లీనమౌతున్నారు.

నన్నయగారి పద్యాలు చదువురాని వాళ్లని సైతం ఆకర్షించడానికి మరొక కారణం కూడా ఉంది. .

నన్నయ గారి రచన ఇలా ఉంటుంది. కవిత్వంలో ఇదోరకమైన విద్య. 

అందులో నన్నయ విశారదుడు. అందుకే తిక్కన ఆయనను గురించి "ఆంధ్రకవిత్వవిశారదుడు" అన్నాడు. 

నన్నయ కవిత్వం పండితులనే ఉద్దేశించి వ్రాసింది కాదు. 

సామాన్యులు, పామరులు కూడా విని ఆనందించడానికి వ్రాసింది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!