పోతన గారి భాగవతం ! (బలిచక్రవర్తి ...వామనుడు శుక్రుడు.)

పోతన గారి భాగవతం !

(బలిచక్రవర్తి ...వామనుడు శుక్రుడు.)

శుక్రుడు!

"వారిజాక్షులందు వైవాహికములందుఁ

బ్రాణవిత్త మాన భంగమందుఁ

జకిత గోకు లాగ్రజన్మ రక్షణ మందు

బొంకవచ్చు నఘము పొందఁ దధిప!

.

ఓ బలిచక్రవర్తి! ఆడవారి విషయంలో కాని, పెళ్ళిళ్లకు కాని,ప్రాణానికి,ధనానికి,గౌరవానికి భగంకలిగే టప్పుడు కాని 

భీతిల్లిన గోవులను,విప్రులను కాపాడేటప్పుడు కాని 

అవసరమైతేఅబద్ధం చెప్పవచ్చు.దాని వల్ల పాపం రాదు.

బలిచక్రవర్తికి రాక్షస గురువు శుక్రుడు నీతి బోధిస్తున్నాడు.

ఇతగాడు సామాన్యుడు కాదు. వామన రూపంలో ఉన్న విష్ణువు.

మూడడుగులతో ముజ్జగాలుఆక్రమించేస్తాడు అని గ్రహించి

.నీ ప్రాణాలు,సంపదలు,మానం సమస్తం అపహరించేస్తాడు.

ఇలాంటప్పుడు అబద్దం చెప్పినా పాపం రాదు. 

అందుచేత నిర్భయంగా వామనుని కోరిక తిరస్కరించు అని చెప్తున్నాడు.

.

బలి చక్రవర్తి సమాధనం.!.

.

కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే? 

వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ

బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై

యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా!

.

భావము:

భర్గుని కమారుడైన శుక్రాచార్యా! 

పూర్వం కూడ ఎందరో రాజులు ఉన్నారు కదా. వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో విర్రవీగినవారే కదా. కాని వా రెవరు సంపదలు మూటగట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదు కదా. శిబి చక్రవర్తివంటి వారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈ నాటికీ లోకం మరువలేదు కదా.

.

ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనవుపై, నంసోత్తరీయంబుపై, 

బాదాబ్జంబులపైఁ, గపోలతటిపై, బాలిండ్లపై నూత్నమ

ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరంబుంట మేల్

గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?

.

భావము:

ఇతడు దానం కావాలని చాచినచేయి ఎంతో గొప్పది కదా!

మొదట లక్ష్మీదేవి యొక్క కొప్పు ముడి మీద, శరీరం మీద, పైట చెంగు మీద, పాదపద్మాల మీద, చెక్కిళ్ళ మీద, పాలిండ్ల మీద సరికొత్త మర్యాదలు పొందే దివ్యమైన హస్తం.

అంతటి చెయ్యి కిందది కావటం నాచెయ్యి పైది కావటం ఎంత అదృష్టం! 

ఎంత మేలు! దీని ముందు ఈ రాజ్యం ఏ పాటిది! 

ఇదేమైనా శాశ్వతంగా ఉండేదా! 

ఈ శరీరం ఏమైనా పడిపోకుండా ఉండిపోతుందా.

.

వామనుడు !

ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై

నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై

నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై

నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.

.

భావము:

బలిచక్రవర్తి మూడడుగుల మేర భూమి ధారపోయగానే గ్రహించిన వామనుడు చూస్తుండగానే ఇంత పొట్టి బ్రహ్మచారీ, కొంచం కొంచం ఎదగటం మొదలెట్టాడు; అంతట్లోనే అంత పొడుగు ఎదిగాడు; అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు; అదిగో మేఘాలకన్నా పైకి పెరిగిపోసాగాడు; పాలపుంత, చంద్రమండలం అన్నీ దాటేసాడు; అదిగదిగో ధ్రువ నక్షత్రం కూడ దాటేసాడు; మహర్లోకం మించిపోయాడు. సత్యలోకం కన్నా ఎత్తుకి ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు. చూడండి అప్పుడే మొత్తం బ్రహ్మాండభాడం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు; ఆహా ఎంతలో ఎంత త్రివిక్రమరూపం దాల్చేసాడో శ్రీమన్నారాయణ మహా ప్రభువు.

.

రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై

శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై

ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.

.

భావము:

వామనుడు బ్రహ్మాండ మంతా నిండిపోతుంటే, మింట నుండే సూర్యబింబం ఆ పరాత్పరునికి అలంకారంగా పోల్చి చెప్పడానికి తగి ఉన్నాడట. అది ఎలాగంటే ఆ సమయంలో క్రమక్రమంగా త్రివిక్రమునికి గొడుగులా, తర్వాత శిరోమణిలా, తర్వాత మకరకుండలంలా, పిమ్మట కంఠాభరణంలా, ఆ పిమ్మట బంగారు భుజకీర్తులులా, ఆ పిమ్మట కాంతులీనే కంకణంలా, అపైన మొలలోని గంటలా, అనంతరం మేలైన కాలిఅందెలా, చివరికి పాదపీఠంలా పోల్చడానికి తగి ఉన్నాడట. 

అందంగా కళ్ళకు కట్టినట్లు అలవోకగా చెప్పడంలో సిద్దహస్తుడు అయిన మన పోతనామాత్యుల వారి త్రివిక్రమావతరణ అత్యద్భుతం తెలుగు సాహిత్యానికే మకుటాయమానమైన పద్యాలుగా ఎన్నదగ్గవి. ఉపమానం అని చెప్తు ఉపమానానికి గొప్పదనం అబ్బేలా చేయటం సామాన్య విషయం కాదు.

.

సూనృతంబుఁ గాని నుడియదు నా జిహ్వ

బొంకఁజాల; నాకు బొంకు లేదు; 

నీ తృతీయపదము నిజము నా శిరమున

నెలవు జేసి పెట్టు నిర్మలాత్మ!

.

భావము:

ఓ పుణ్యాత్ముడా! నా నాలుక సత్యాన్ని తప్ప పలుకనే పలుకదు. అబద్దమన్నది చెప్పనే చెప్పలేను. నాలో అసత్య మన్నది లేదు. నీ మూడవ అడుగు శాశ్వతంగా నా తలమీద పెట్టు మహాత్మా!

మూడడుగులు దానంగా గ్రహించిన, వామనుడు త్రివిక్రమావతారం ధరించి రెండు అడుగులలో మొత్తం ముల్లోకాలు ఆక్రమించాడు. మూడో అడుగు ఎక్కడ పెట్టమన్నావు చూపించమన్నాడు. పరమ దానశీలుడు, సత్యసంధుడు అయిన బలిచక్రవర్తి ‘నీ పాదం నా తలమీద పెట్టు పరమేశా!’ అని సమాధానం చెప్తున్నాడు.

.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!