పాండవ ఉద్యోగ విజయాలు


పాండవ ఉద్యోగ విజయాలు

అర్జునుడు, దుర్యోధనుడు కృష్ణుని సహాయమర్ధించుటకు వచ్చుట
అర్జునుడు:

దృపదుని పంపునన్ జనె పురోహితు డా ధృతరాష్ట్ర సూతి బల్
కపటి; వినండు; సంధి జెడగా గమకించెడు గాని; తప్పదా-
లపు బని; సర్వమున్ గడప లావు గలండు యశోద పట్టి; యా
రిపు జన కాలు తోడుత వహించెద, సర్వము నిర్వహించెదన్

అదిగో, ద్వారక! యాలమంద లవిగో! నందందు దోరాడు, న
య్యదియే కోట, యదే యగడ్త, యవెరథ్యల్, వారలే యాదవుల్
యదుసింహుండు వసించు మేడ యదిగో! నాలానదంతావళా
భ్యుదయంబై వర మందిరాంతర తురంగోచ్చండమై పర్వెడున్.

జలజాతాసన ముఖ్య దైవత శిరస్సంలగ్న కోటీర పం
క్తుల కెవ్వాని పదాబ్జ పీఠి కడు నిగ్గుల్ గూర్చు దత్సన్నిధి
స్థలి గూర్చుండి భవంబు పావనముగా దైవార గావించి నా
తొలి జన్మంబున గూడు పాపముల నాందోళింపగా జేసెదన్.
కృష్ణుడు (అర్జునునితో):

ఎక్కడనుండి రాక యిట? కెల్లరునున్ సుఖులే కదా! యశో
భాక్కులు నీదు నన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములున్
జక్కగ నున్నవారె? భుజశాలి వృకోదరు డగ్రజాజ్ఞకున్
దక్కక నిల్చి శాంతుగతి దాను జరించునె తెల్పు మర్జునా!
కృష్ణుడు (దుర్యోధనునితో):

బావా! ఎప్పుడు వచ్చితీవు ? సుఖులే, భ్రాతల్-సుతుల్-చుట్టముల్?
నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?
నీ వంశోన్నతి గోరు భీష్ముడును, నీ మేల్గోరు ద్రోణాది భూ
దేవుల్ సేమముమై నెసంగుదురె? నీ తేజంబు హెచ్చించుచున్


కౌరవ పాండవుల్ పెనగు కాలము చేరువ యయ్యె, మాకు న
వ్వారికి గూడ నెక్కుడగు బంధు సముద్రుడ వీవు గాన, నీ
చేరిక మాకు నిర్వురకు సేమము గూర్చెడిదౌట, సాయమున్
గోరగ నేగుదెంచితిమి గోపకులైక-శిరో విభూషణా !
కృష్ణుడు (దుర్యోధనునితో):

ముందుగ వచ్చి తీవు, మునుముందుగ నర్జును నేను జూచితిన్,
బందుగులన్న యంశ మది పాయక నిల్చె సహాయ మిర్వురన్
జెందుట పాడి, మీకు నయి చేసెద సైన్య విభాగ మందు మీ
కున్ దగు దాని గైకొనుడు, కోరుట బాలుని కొప్పు మున్నుగన్.

అన్ని యెడలను నాకు దీటైన వారు
గోపకులు పదివేవు రకుంఠ బలులు
గలరు నారాయణాఖ్య జెన్నలరువారు,
వార లొకవైపు నేనొక్క వైపు మరియు.

యుద్ధ మొనరింత్రు వార ల
బద్ధ మ్మెందులకు ? నేను బరమాప్తుడనై
యుద్ధమ్ము త్రోవ బోవక
బుద్ధికి దోచిన సహాయమును బొనరింతున్.
దుర్యోధనుడు (స్వగతం):

ఆయుధము పట్టడట! యని
సేయండట! "కంచి గరుడ సేవ" యితనిచే
నేయుపకృతి యుద్ధార్థికి
నేయెడ నగు! నిట్టి వాని నెవ్వండు గొనున్.
కృష్ణుడు (అర్జునునితో):

ఆయుధమున్ ధరింప నని కగ్గముగా నొకపట్ల నూరకే
సాయము సేయువాడ, బెలుచన్ నను బిమ్మట నెగ్గు లాడినన్
దోయిలి యొగ్గుదున్, నిజము, తొల్త వచించితి గోరికొమ్ము నీ
కేయది యిష్టమో, కడమ యీతని పాలగు బాండునందనా.
అర్జునుడు (కృష్ణునితో):

నంద కుమార, యుద్ధమున నా రథమందు వసింపుమయ్య, మ-
ధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి జేసి నా
స్యందన మొప్పుగాక, రిపు సంతతి తేజము దప్పు గాక, నీ
వెందును నాయుధమ్ము దరి కేగమి కొప్పుదు గాక, కేశవా !

రథము నందెన్ని చిత్రంపు బ్రతిమ లుండ
వందు శివుడును విష్ణువు నజుడు నెల్ల
దేవతలు నుండవచ్చు, నా ఠీవి గృష్ణు
డర్జున స్యందన విభూష యగును గాక !
కృష్ణుడు (అర్జునునితో):

"ఆలము సేయ నే" నని యదార్థము బల్కితి జుమ్మి, యిట్టి గో
పాలుని నన్ను గోరితివి, భండన పండితులగ్నితేజు లు-
త్తాల ధనుర్ధరుల్, బహుశతప్రమితుల్ యదుసింహు లందఱిన్
బాలుగ గైకొనెన్ గురునృపాలుడు, బాలుడవైతి వక్కటా !
అర్జునుడు (కృష్ణునితో):

"ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ! యాల జాతికిన్
దిన్నది పుష్టి" నీ వరుగుదెంచి రథంబున నున్న జాలు, నే
సున్నము జేసెదన్ రిపుల చూపఱు లద్భుత మంద, సర్వ లో-
కోన్నత! నాకు బేరొసగు, మూరక చూచుచునుండు మచ్యుతా !
కృష్ణుడు (అర్జునునితో):

ఊరక చూచుచుండు మను టొప్పితి గాని భవద్ రథస్థు నన్
బారగ జూచి నీ రిపులు పక్కున నవ్వి యనాదరింతు రా
శూరకులంబు మెచ్చ రిపుసూదనతాభర మూను నీకు నే
సారధినై, యికన్ విజయసారధి నామమునన్ జరించెదన్
అర్జునుడు (కృష్ణునితో):

సారధి యంట! వేదముల సారము శౌరి, తదంఘ్రి భక్తి చె
న్నారెడు క్రీడి తా రధికుడౌనట! చిందము విల్లు దేరునున్
వారువముల్ మొదల్ దివిజవర్గ మొసంగిన వంట ! యస్త్ర వి-
స్తార గురుల్ శివాదులట, సంగరమం దెవడాగ జాలెడిన్.
కృష్ణుడు (అర్జునునితో):

వచ్చెడి వాడు గాడతడు వారికి మీకును గూడ దోడు, వి-
వ్వచ్చుడ, యమ్మహామహుని భావము మున్నె యెఱింగినాడ, నా
సచ్చరితుండు మీకు దగ సంధి పొసంగిన సంతసించు, నా
యిచ్చయు నట్టిదే, మన నరేంద్రుని యిచ్చయు గూడ నట్టిదే.
రాయబారనునకు ముందు కృష్ణుడు పాండవులతో సంభాషించుట
ధర్మరాజు (కృష్ణునితో):

ఆలును బిడ్డలేడ్వ నృపులాలములో గడతేఱ కెల్ల చు-
ట్టాలును రూపుమాయ కకటా ! యిల దక్కునె ! దక్క నిత్తురే ?
చాలును రాజ్యభాగము, ప్రజల్ సుఖియించిన నాకు జాలు, నే
జాలక  కాదు సూవె ! తిన జాలను నెత్తురు కూడు మాధవా !
కృష్ణుడు (ధర్మరాజుతో):

మాయదురోదరంబున నమాయికునిన్ నిను గెల్చి కాంతకున్
జేయగ రాని యంత పని జేసి యరణ్యములోని కంపియున్
హాయిగ నుండనీక బలులై పలునెగ్గులు పన్నుచున్న యా
దాయలు చత్తు రంచు దయ దాల్చెద వెంతటి ధర్మరాజవో ?
భీముడు:

అనుపమ విక్రమ క్రమ సహాయుల కంతటి పాండు రాజనం
దనులకు నొక్క కూళ భరణం బిడు చాడ్పున నూళులైదు ని
చ్చునట ! కటా ! యటుల్ బ్రదుక జూచుట రాచ కొలంబు వారికిన్
ఘనతయె ? మంత్ర రుద్ధ భుజగంబ నిసీ ! యిపుడేమి చేయుదున్
కృష్ణుడు (భీమునితో):

నిదుర వోచుంటివో ! లేక బెదరి పల్కు
చుంటివో ? కాక నీవు తొల్లింటి భీమ
సేనుడవె కావొ ! యెన్న డీ చెవులు వినని,
కనులు చూడని శాంతంబు గానవచ్చె.

"కురుపతి పెందొడల్ విఱుగ గొట్టెద ఱొమ్ము పగిల్చి వెచ్చ నె-
త్తురు కడుపార గ్రోలి యని దున్మెద దుష్టుని దుస్ససేను భీ
కర గదచేత" నంచును బ్రగల్భము లాడితి-వల్ల కొల్వులో
మరల నిదేల యీ పిఱికి మానిసి పల్కులు మృష్ట భోజనా !
భీముడు (కృష్ణునితో):

బకునిం జంపితి, రూపు మాపితి హిడింబా సోదరున్, దుష్ట కీ-
చకులం దున్మితి మొన్న నూర్గుర, జరాసంధుం్ దురాసంధు నే
నొకడం జంపితి నాకు భీమునకు వేఱొక్కండు తోడేల ! యె
న్నక నన్నీగతి బోరికిం బెదరు చున్నాడం చనం బాడియే ?
ధర్మరాజు (భీమునితో):

తాతయు నొజ్జయున్ గురులు దక్కిన జోదులు చూచుచుండగా
బాతకు లీడ బోక మన భార్యను బట్టి పరాభవింప నా
నాతికి మానరక్షణ మొనర్చిన యట్టి మహోపకారి ని
న్నీతడు శౌర్యహీనుడని యీరసిమాడిన లోపమున్నదే.

జూదరియై కళత్రమును శోకము పాలొనరించి తల్లి దా
యాదుల యింట నుండగ మహాటవి వాలయి తమ్ము-గుఱ్ఱలం
గాదిలి పెండ్లమున్ వెతల గ్రాంచిన యీబరి యుండ మాని యిం-
దేదియు లేని భీముపయి కేగెద వేల గదా ప్రహారమా !
కృష్ణుడు (భీమునితో):

భీకరమై యగాధమయి భీష్మ గురు ప్రముఖోపలా-కులం
బౌ కురురాట్చమూజలధి కడ్డముగా జనగా భవచ్చమూ
నౌకను ద్రిప్పగా దగిన నావికు డెవ్వడు ! నీవు లేక యీ
శోకము తీఱునే ద్రుపద సూతికి నిక్కము వాయునందనా !
ద్రౌపది (కృష్ణునితో):
(థెసె థ్రీ ఫ్రొం భారతము)

***  వరమున బుట్టితిన్ భరత వంశము జొచ్చితి నందు బాండు భూ
వరునకు గోడలైతి జనవంద్యుల బొందితి నీతి విక్రమ
స్థిరులగు పుత్రులం బడసితిన్ సహజన్ముల ప్రాపు గాంచితిన్
సరసిజనాభ ! యిన్నిట బ్రశస్తికి నెక్కిన దాన నెంతయున్.

***  నీవు సుభద్ర కంటె గడు నెయ్యము గారవముందలిర్ప సం-
భావన-సేయుదిట్టినను బంకజనాభ ! యొకండు రాజసూ
యావబృధంబు నందు శుచియై పెనుపొందిన వేణివట్టి యీ
యేవురు జూడగా సభకు నీడ్చె-గులాంగన నిట్లొనర్తురే .

***  ఇవి దుస్ససేను వ్రేళ్ళం
దవిలి సగము ద్రెవ్వి పోయి దక్కినయవి కౌ
రవులకడ దీరు మాటల
యవసరమున దలప వలయు నచ్యుత వీనిన్
భీముడు (ధృతరాష్ట్రునికి చెప్పమని):

దొర యొక్కండన నేటి మాట ? బలవంతుం డెవ్వడో వాని దీ
ధర, పోరన్ జయమో పరాజయమొ రాదా ? గెల్చి రాజన్యులం
దరు మెచ్చన్ ధర యేలు కొంద మటు కాదా ? చచ్చి స్వర్గంబునం
దిరుగన్ వచ్చును మంచి క్షత్రియుల కింతే యొండు లే దెచ్చటన్

ఆలములోన నీ సుతుల నందఱి నొక్క గదా భుజంగికిన్
బాలొనరించి వచ్చిన నృపాలురు చూడగ నిచ్చువాడ నే
నూళులు తిండికిన్ బ్రతికి యుండిన మీకును "దాసి" వంచు బాం-
చాలిని నవ్వినట్టి దొరసానికి భానుమతీ వధూతికిన్ .
కృష్ణుడు (ధర్మరాజుతో):

నాల్గు పయోధులో యనగ నాలుగు దిక్కరులో యనంగ నీ
నల్గురు తమ్ములున్ బ్రమథ నాథ సమానులు, యుద్ధ రంగ మం-
దల్గిన నెవ్వడోప-గలడయ్య ! భవత్పరిభావ వహ్నికిన్
గల్గిన వృద్ధి యింక రిపు కాంతల బాష్పము లార్ప జూడుమా .

ఐనను బోయి రావలయు హస్తిన, కచ్చటి సంధిమాట యె
ట్లైనను శత్రురాజుల బలాబల సంపద చూడవచ్చు నీ
మానసమందు గల్గు ననుమానము దీర్పగ వచ్చు దత్సమా-
ధానము మీ విధానమును తాతయు నొజ్జయు విందురెల్లరున్ .
ధర్మరాజు (కృష్ణునితో):

సంధి యొనర్చి మా భరత సంతతి నిల్పుము, లేద యేని గ
ర్వాంధుల ధార్త రాష్ట్రుల సహాయులతో దునిపింపు మో జగ
ద్బాంధవ ! రెండు కర్జముల భారము బెట్టితిమయ్య ! నీ భుజ
స్కంధమునందు, దారసిలు గావుత మాకు యశంబొ, రాజ్యమో .
కృష్ణుడు కౌరవ సభలో చేసిన రాయబారం
కృష్ణుడు:

తమ్ముని కొడుకులు సగపా-
లిమ్మనిరటు లిష్ట పడవదేనియు నైదూ
ళ్ళిమ్మని రైదుగురకు ధ-
ర్మమ్ముగ నీ తోచినట్లు మనుపుము వారిన్

తనయుల వినిచెదవో నీ
తనయులతో నేమి యని స్వతంత్రించెదవో
చనుమొక రీతిని లేదే-
నని యగు వంశ క్షయంబు నగు కురునాధా

పతితులు కారు నీ ఎడల భక్తులు శుంఠలు కారు విద్యలన్
చతురులు మంచివారు నృప సంతతికిన్ తల లోని నాల్కల-
చ్యుతునికి గూర్చువారు రణ సూరులు పాండవులట్టివారలీ
గతి నతి దీనులై యడుగగా నిక నేటికి సంశయింపగన్?

జండాపై కపి రాజు ముందు సిత వాజి శ్రేణినిం గూర్చి నే
దండంబున్ గొని దోలు స్యందనము మీదన్ నారి సారించుచున్
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండుచున్నప్పుడొ
క్కండున్ నీ మొర నాలకింపడు కురు క్ష్మానాథ సంధింపగాన్ !!

చెల్లియొ చెల్లకో తమకు చేసిన యెగ్గులు సైచి రందరున్
తొల్లి గతించె నేడు నను దూతగ వంపిరి సంధి సేయ నీ
పిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపగ సంధి సేసెదో
యెల్లి రణంబు గూర్చెదవొ ఏర్పడ జెప్పుము కౌరవేశ్వరా !!

అలుగుటయే యెరుంగని మహా మహితాత్ముడజాత శత్రుడే
యలిగిన నాడు సాగరము లన్నియునేకము కాక పోవు క
ర్ణులు పది వేవురైన అని నొత్తురు చత్తురు రాజ రాజ నా
పలుకుల విశ్వసింపుము విపన్నుల నార్తుల గావుమెల్లెడన్

సంతోషంబున సంధి సేయుదురె వస్త్రంబూడ్చుచొ ద్రౌపదీ-
కాంతన్ జూసిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ
పొంతన్ నీ సహ జన్ము రొమ్ము రుధిరంబుం ద్రావు నాడేని ని-
శ్చింతన్ తద్గదయున్ త్వదూరు యుగమున్ ఛేదించు నాడేనియున్

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!