వివేకవతి రంభ By - Satyanarayana Piska
వివేకవతి రంభ By - Satyanarayana Piska
రంభను గురించి తెలియనివారు ఎవరూ ఉండరు. ఆమె అందానికి మారుపేరు! సౌందర్యానికి ప్రతీక! దేవలోకంలోని దేవేంద్రుని ఆస్థానములోనున్న అప్సరసభామినులలో అగ్రగణ్య! అప్సరసల జాబితా చెప్పవలసివచ్చినపుడు ' రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ' అంటూ రంభనే ప్రథమస్థానంలో పేర్కొనడం పరిపాటి. చాలా అందమైన యువతి కనబడితే "రంభలా ఉంది" అంటారు. ' మరి, ఇటువంటి చరిత్ర కలిగిన రంభను "విలాసవతి" అంటే బాగుంటుంది కాని, "వివేకవతి" అంటున్నారేమిటి?! ' అని పాఠకమిత్రులకు సందేహం కలగవచ్చు. ఐతే, ఇది నామాట కాదు. రంభ యొక్క వివేకం గురించి శ్రీనాథ కవిసార్వభౌములు తమ రసవత్ప్రబంధమైన "శృంగార నైషదము" లోని ఒక పద్యములో ఉల్లేఖించారు. ఆ పద్య వివరాల్లోకి వెళ్ళేముందు, రెండు మాటలు.
ఒకసారి పుష్పకవిమానంపై గగనవీధిలో విహరిస్తున్న రావణాసురునికి, ఇంద్రుని నందనవనములో నుండి నడిచివెళ్తున్న రంభ కనిపిస్తుంది. సర్వాభరణభూషితయైన ఆమె సౌందర్యాన్ని చూసి మోహించిన దశకంఠుడు తమకంతో రంభను సమీపిస్తాడు.
అప్పుడు రంభ "నేను మీ అన్నగారైన కుబేరులవారి కోడలిని; నలకూబరుని పత్నిని. మామగారి స్థానములో ఉన్న మీరు నాకు పితృతుల్యులు. కాబట్టి, కామవాంఛతో నా దరికి రావడం మీవంటి పెద్దలకు భావ్యం కాదు" అని ప్రార్థిస్తుంది. ఆ మాటలను పెడచెవిని పెట్టిన రావణుడు, బలాత్కారంగా ఆమెను లొంగదీసుకుని అనుభవిస్తాడు. ఆ తర్వాత రంభ విలపిస్తూ వెళ్ళి, తనకు జరిగిన పరాభవాన్ని నలకూబరునితో చెప్పుకుంటుంది.
అందుకు ఆగ్రహించిన నలకూబరుడు "ఇకపై నీమీద ఇష్టంలేని స్త్రీని బలవంతంగా పొందడానికి ప్రయత్నిస్తే నీ శిరసు వేయి వ్రక్కలవుతుంది" అని రావణుణ్ణి శపిస్తాడు. ఆ శాపభయ కారణంగానే రావణుడు సీతాదేవిని చెరబట్టినపుడు అశోకవనములో ఉంచాడేగాని, ఆమెను సమీపించడానికి, స్పర్శించడానికి సాహసించలేదు.
ఇప్పుడు మనం శ్రీనాథులవారు రంభ గురించి ఏమని చెప్పారో చూద్దాం. "శృంగార నైషధము" లోని ఈ పద్యాన్ని చిత్తగించండి.
వినుకలిఁ గూర్మి జిక్కి, పృథివీభువనంబునకుం డిగంగ నే
యనువును లేక, రంభయను నచ్చరలేమ, నలున్ వరింపఁ బూ
నిన దన కోర్కి నొక్కమెయి నిండగఁ జేయుటకై భజించెఁ దాఁ
గొనకొని వేల్పులందు నలకూబరుఁ దచ్చుభనామ వాసనన్.
దివిజలోకంలోని దిక్పాలురనూ, హేమాహేమీలైన సురప్రముఖులనూ వదిలిపెట్టి, కుబేరసుతుడైన నలకూబరుణ్ణే రంభ ఎందుకు వరించి చెట్టబట్టింది?!... ఈ ప్రశ్నకు జవాబుగా కవీశ్వరులు మనకొక మనోహరమైన కథ చెప్తున్నారు. భూలోకంలోని నిషధరాజ్యాన్ని పరిపాలిస్తున్న నలమహారాజు యొక్క గుణగణాల గురించి, సౌందర్య పరాక్రమాల గురించి ఆనోటా ఆనోటా కర్ణాకర్ణిగా విన్న రంభ మనస్సులో ఆ రాజు పట్ల రాగోదయం కలిగింది. ఎలాగైనా అతణ్ణి తనవాడిగా చేసుకోవాలని ఆమె పరిపరి విధాల పర్యాలోచన చేసింది. కాని, అదేమీ సాధ్యమయ్యే వ్యవహారంలాగా కనబడలేదు. తానేమో అప్సరాంగన! ఆ మహీపతేమో మానవమాత్రుడు! తామిద్దరికీ పొత్తు ఎలా పొసగుతుంది?............. పోనీ, తానే సాహసించి మనుజలోకానికి వెళ్ళి కార్యం సానుకూలపరచుకుందామనుకుంటే, చండశాసనుడైన మహేంద్రుని క్రోధం తనకు తెలియనిది కాదు. తనను శాశ్వతంగా మానవకాంతగా మార్చివేయగల సమర్థుడు అతడు! ------------ బాగా ఆలోచించిన మీదట, వివేకవతియైన రంభ ఆ రాజేంద్రునితో సంయోగం తన యోగంలో లేదని గ్రహించింది. ఐనా, నలునిపై తనకు గల మమకారాన్ని చంపుకోలేక, దేవలోకవాసుల్లో నలునితో 'నామసామ్యం' గల నలకూబరుణ్ణి వరించింది. అతడు నలుడు - ఇతడు ' నల 'కూబరుడు. ఆ విధంగా నలుని నామధేయాన్ని తన పేరుకు జోడించుకున్నానని సంతృప్తి పడింది. ఇదంతా నిజమేనని చెప్పేటందుకు పురాణాల్లో మనకేమీ ఆధారాలు లేవుకాని, కమనీయమైన ఈ కథను కల్పించడంలో కవిగారి ఊహాపటిమ అత్యంత రమణీయమని ఒప్పుకోక తప్పదు.

Comments
Post a Comment