పురీ జగన్నాథ రథ యాత్ర.....
పురీ జగన్నాథ రథ యాత్ర.....:
ఇంద్రద్యుమ్న మహారాజు గొప్ప దైవ భక్తుడు. నీలాచలం అనే పర్వతం మీద జగన్నాథ స్వామి సుభద్రా బలరాముల తోడి వెలసి యున్నాడని బ్రాహ్మణుల ద్వారా తెలుసుకున్న ఆయన వారిని దర్శించడానికి అక్కడికి వెళతాడు. జగన్నాథుడు ఆయన భక్తిని పరీక్షించాలని అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. రాజు నిరాశతో అక్కడి నుంచి వెనుదిరిగి స్వామి దర్శనం కోసం పరితపిస్తుంటాడు. ఒక రోజు కలలో రాజుకు జగన్నాథుడు కనిపించి సముద్రపు అలల్లో రెండు కొయ్య దుంగలు ఒడ్డుకు కొట్టుకు వస్తాయనీ వాటి నుంచి తమ విగ్రహాలను చెక్కించమని కోరాడు.
అలా కొట్టుకువచ్చిన కొయ్యలను రాజు వెలికితీసి రాజ్యం లోకి తీసుకెళ్ళగానే సాక్షాత్తూ విశ్వకర్మ యే శిల్పి రూపమున వచ్చి తాను ఆ దారువులలో దేవతా మూర్తులను చెక్కెదనని అభయమిచ్చాడు. కానీ ఆయన ఒక నియమం పెట్టాడు. ఆయన చెప్పేవరకూ ఎవరూ ద్వారములు తెరువ కూడదని కోరాడు.దాని ప్రకారం ఆయన ఒక గదిలో చేరి తలుపులు బిగించి శిల్పాలు చెక్కుతాడు. పని ప్రారంభించి పది రోజులైంది.
ఒక రోజు రాజమాత లోపల యున్న శిల్పి పది రోజులుగా భోజనం లేకుండా ఉంటాడని భావించి తలుపులు తెరవమన్నది. తల్లి మాట కాదనలేని రాజు అలాగే తలుపులు తెరిపించాడు. కానీ అక్కడి శిల్పి అదృశ్యమయ్యాడు. అప్పటికే చేతులూ, కాళ్ళు తప్ప మిగతా భాగాలన్నీ పూర్తయ్యాయి. అసంపూర్తిగా ఉన్న విగ్రహాలను ఏమిచేయాలో రాజుకు తోచలేదు. వాటిని అలాగే ప్రతిష్టించాలను దైవవాణి ఆజ్ఞాపించడంతో విగ్రహాలను అలాగే ప్రతిష్టించారు.
అంతా జగన్నాథ మయం. ఇది ఈ తొమ్మిది రోజులు పురీలో పరిస్థితి. ఆషాఢ శుద్ధ విదియ మొదలు శుద్ధ ఏకాదశి వరకు బలభద్ర, సుభధ్ర, జగన్నాథుల ఉత్సవాలు పురీలో కన్నుల పండువగా జరుగుతాయి.
పురీలో వెలసిన శ్రీకృష్ణావతరము జగన్నాథుడు. సువిశాలమైన ప్రాంగణములో కళింగ శిల్పకళాశైలిలో కట్టబడిన మనోహరమైన మందిరములో సర్వదేవతా సమూహము మధ్య ఈ జగన్నాథుడు బలరామ, సుభధ్రా సమేతుడై శోభిల్లుతున్నాడు. సామాన్య జనుల పాపహరణమునకై, దుఃఖభంజనమునకై ఆ నారాయణుడు ప్రతిఏటా ఈ సమయములో రథారూఢుడై పురీ నగరవీథుల ఊరేగుతూ గుండిచా ఉద్యానవనమందిరాన్ని చేరుకుంటాడు. అక్కడ తొమ్మిది రోజులపాటు భక్తులకు దర్శనమిస్తూ వారి పాపసంచయమును పటాపంచలు చేస్తుంటాడు. ఈ యాత్రనే గుండిచా యాత్రగా కూడా పిలుస్తారు.
రథయాత్రలో ముగ్గురి దేవతలకూ మూడు విడి రథాలు ఉంటాయి. పీతాంబరధరుడైన జగన్నాథునికి ఎరుపుపై పసుపు వన్నెతో శోభితమైన రథము, అగ్రజుడైన బలభద్రునికి ఎరుపుపై నీలం రంగుతో మెరిసే రథము, చెల్లెలు సుభద్రకు ఎరుపుపై నలుపు వర్ణంతో భాసిల్లే రథము తయారు చేస్తారు. ప్రతి సంవత్సరము పాత రథాలను భిన్నంచేసి, కొత్తగా రథాలను తయారు చేస్తారు. ఈ ప్రక్రియ ఒడిషా వాసులకు అత్యంత శుభకరమైన రోజుగా భావించే అక్షయ తృతీయనాడు కొత్త రథాల తయారు పురీ మహారాజు ఇంటి ముంగిట మొదలు పెడతారు. ఇదే రోజు 3 వారాలపాటు జరిగే చందన యాత్ర కూడా మొదలవుతుంది.
జగన్నాథుని రథము పేరు నందిఘోష, బలభద్రుని రథము పేరు తలధ్వజ (ధ్వజముపై ఈత చెట్టు ఉంటుంది), సుభద్ర రథము పేరు దర్పదళన (గర్వాన్ని భంగము చేసేది). రథాలకు వాడే చెక్కలను దసపల్లా నుండి దుంగల్లా మహానది నీటిలో పురీకి తీసుకువస్తారు. తరతరాలుగా వంశపారంపర్యంగా ఈ రథాలను తయారుచేసే వడ్రంగుల వంశానికి చెందినవారే ఈ రథాలను తయారు చేస్తారు. జగన్నాథుని రథం నలభై ఐదు అడుగులు, బలభద్రుని రథం నలభై నాలుగు అడుగులు, సుభధ్ర రథం నలభై మూడు అడుగుల పొడుగు ఉంటాయి. నందిఘోషకు 16 చక్రాలు, తలధ్వజకు 14 చక్రాలు, దర్పదళనకు 12 చక్రాలుంటాయి. ప్రతిరథము చుట్టూ 9 పార్శ్వదేవతల మూర్తులు (చెక్కలపై చెక్కబడిన చిత్రాలు) ఉంటాయి. బలభద్రుని రథానికి తెల్లని గుర్రాలు, జగన్నాథుని రథానికి నల్లని గుర్రాలు, సుభద్ర రథానికి ఎర్రని గుర్రాలు నాలుగు చొప్పున ఉంటాయి. రథాలకు చోదకులుగా మాతలి, దారుక, అర్జునులు ఉంటారు.
ఈ యాత్రలో పురీ రాజావారు బంగారు చీపుర్లతో వీథులను ఊడుస్తారు. సుగంధ ద్రవ్యాలు, పరిమళ తైలాలతో వీధులను గజపతి రాజావారు స్వయంగా పునీతం చేస్తారు. అందంగా పూలతో అలంకరించబడిన రథాలు, మేళ తాళాలతో, ఆషాఢ శుద్ధ విదియనాడు, వేలాదిమంది తాళ్లతో హరినామ స్మరణ చేస్తూ, రథాలను లాగుతూ ఉండగా జగన్నాథ మందిరంనుండి బడా దండా అనబడే ముఖ్య వీధి ద్వారా దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఉద్యానవనానికి చేరుకుంటాయి. యాత్రలో ముందు బలభద్ర సుభద్రలు తరలి వెళ్లగా, వారి వెనుకు జగన్నాథుడు యాత్ర చేస్తాడు.ఈ దారి పొడుగునా లక్షలాది జనం రథాలను తాకుతూ, లాగుతూ తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. ఇలా చేయటం వలన తమ పాపాలన్నీ ఆ విశ్వంభరుడు తొలగిస్తాడని ప్రగాఢ నమ్మకం. రథయాత్రలో జగన్నాథ, బలభద్ర, సుభద్రలతో పాటు సుదర్శన చక్రాన్ని కూడా ఊరేగిస్తారు.
రథేతు వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే - రథములో జగన్నాథుని రూపమైన వామనుని చూసినంత పునర్జన్మ లేదని ప్రతీతి. పురీ పట్టణంలో జగన్నాథుని మహిమవలన యముని ప్రభావం చాలా తక్కువ ఉంటుందని, దాని వలన ఈ క్షేత్రానికి యమనిక తీర్థంగా పేరు వచ్చింది. ఈ రథయాత్ర సమయంలో యాత్రలో ఉండే ప్రతి వస్తువును (రథము, తాళ్లు, గుర్రాలు మొదలైనవి) జగన్నాథునిగానే భావిస్తారు. రథయాత్ర తిరుగు ప్రయాణంలో మేనత్త మౌసీ మా గుడి వద్ద ప్రత్యేక ఫలహారాన్ని దేవతలకు నివేదిస్తారు. ఏడు రోజులు గుండిచా మందిరంలో ఉన్న తరువాత మూలమూర్తులు తిరిగి జగన్నాథ దేవాలయ గర్భగుడిలో స్వస్థానాలకు చేరుకుంటాయి. ప్రపంచంలో అతిపెద్ద మతయాత్రగా పేరుపొందిన ఈ రథయాత్ర భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు తలమానికం.
నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే
బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయతే నమః
జగదానంద కందాయ ప్రణతార్తిహరాయచ
నీలాచల నివాసాయ జగన్నాథాయతే నమః
( పురీ జగన్నాథుని ప్రార్థనా మంత్రములు)
నిత్యమైన వాడు, పరమాత్మ, బలరామ సుభద్రలతో నీలాచలమునందు నివసించి యున్న జగన్నాథునికి నమస్కారములు. జగత్తుకు ఆనందం కలిగించే వాడు, శరణు కోరిన వారు ఆర్తిని హరించే వాడు, నీలాచలమునందు నివసించి యున్న జగన్నాథునికి నమస్కారములు.
పూరీలో 12 రోజుల పాటు జరిగే జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్ర సమయంలో ఆ యాత్రలో పాల్గొనే భక్తులు గానీ, లేదా పూరీకి వెళ్లలేని భక్తులు తమ గృహమందే ప్రతి నిత్యం విష్ణుమూర్తినిపై మంత్రముతో కొలిస్తే ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం.
రథయాత్ర జరిగే 12 రోజులు, లేదా 7, 9 రోజుల పాటు ఒంటి పూట భోజనం చేసి, శుచిగా స్వామివారిని స్తుతిస్తే సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అలాగే రథయాత్ర జరిగే 12 రోజుల్లో మీకు అనుకూలించే 3, 5, 7, 9 రోజుల్లో.. ప్రతినిత్యం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సమీపంలోని నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించుకుని నేతితో రెండు దీపాలు వెలిగిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
ఇంకా నేతితో ప్రతిరోజూ దీపమెలిగించి చివరి రోజు స్వామివారికి అర్చన చేసి, ఐదుగురికి లేదా తొమ్మిది మందికి పసుపు, కుంకుమ, చక్కెర పొంగలిని దానం చేస్తే ఆర్థిక సమస్యలు, ఈతిబాధలు తొలగిపోయి, సుఖసంతోషాలు చేకూరుతాయి.
Comments
Post a Comment