సంగీత ‘శ్రీ’ సత్యనారయణ గారు.

కంచి పరమాచార్య నూకల గాత్రాన్ని విని ‘మీ సంగీతం దైవదత్తం’ అన్నారు. పచ్చపొదిగిన ఉంగరాన్నిస్తూ సత్యసాయిబాబా ‘మీ సంగీతం డివోషనల్, ఓషనల్’ అన్నారు. ద్వారం వెంకటస్వామి నాయుడు ‘మీ మేధస్సు పాదరసం’ అన్నారు.

‘మహామహోపాధ్యాయ’ బిరుదు సంగీతప్రపంచంలో సెంచరీ లాంటిది. నూరుమంది విద్యార్ధులకు సంగీతం నేర్పితే ఆ బిరుదుతో గౌరవిస్తారు. ‘గురు’వారం సికింద్రాబాద్, పద్మారావునగర్‌లో భౌతికకాయాన్ని వీడిన నూకల చిన సత్యనారాయణ వద్ద శిష్యరికం చేసిన వారి సంఖ్య అనేక శతాలు! ఐదేళ్ల వయ సు నుంచి 75 ఏళ్ల వయసు దాకా స్వరాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో, దాదాపు అన్ని దేశాల్లో ఆయనకు శిష్యులున్నారు.

90 ఏళ్ల జీవితంలో ఆయన బోధనా జీవితానికి అరవయ్యేళ్లు. కర్నాటక సంగీ తంలో క్షుణ్ణత, హిందుస్తానీ సంగీతంపై పట్టు సాధించిన నూకలను సమన్వయ సంగీతకారుడిగా భారతీయ సంగీత ప్రపంచం గుర్తిస్తోంది.

సంగీత ‘శ్రీ’

నూకల చిన సత్యనారాయణ శ్రీవిద్యా ఉపాసకుల పరంపరకు చెందినవారు. శ్రీవిద్యా ఉపాసకులు అన్నపూర్ణేశ్వర శర్మ - యాజ్ఞసేనమ్మ దంపతులకు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో 1927 ఆగస్టు 4న జన్మించారు. తల్లి సంగీతం నేర్పితే, తండ్రి ప్రోత్సహించారు. అయల సోమయాజుల కామేశ్వరరావు-అన్నపూర్ణల కుమార్తె శేషమ్మను మనువాడారు.

నటులే పాటలు పాడే రోజుల్లో నూకల స్టేజీ మీద పాటలతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. క్రమేణా శాస్త్రీయ సంగీతం వైపు మనసు మళ్లింది. కంభంపాటి అక్కాజీరావు వద్ద వయొలిన్ నేర్చుకోవడం ప్రారంభించి విజయవాడలో మంగళంపల్లి పట్టాభిరామయ్యగారి వద్ద మరో మూడేళ్లు కృషి చేశారు. తన ప్రతిభను మెరుగుపెట్టుకునేం దుకు విజయనగరం వెళ్లి ద్వారం వెంకట స్వామి నాయుడి శిష్యరికం చేశారు. నాయుడిగారితో దేశవ్యాప్త కచేరీలు చేశారు. అనంతరం నాయుడుగారు నూకలను శ్రీపాద పినాకపాణికి పరిచయం చేశారు.

సానదేరిన వజ్రం!

డాక్టర్లలో సంగీతవేత్త, సంగీతవేత్తలలో డాక్టర్ అయిన శ్రీపాద పినాకపాణి నూకల చిన సత్యనారాయణను మెరుగుపెట్టారు. సాహిత్యంలోని ప్రతి అక్షరం-పదం-వాక్యాన్ని అవగాహన చేసుకుని రాగరంజితంగా పాడే ‘శాస్త్రీయ కళ’ను నూకల ఉపాసించారు. ఎందరో గురువుల వద్ద నూకల శిష్యరికం చేసినా వారిలా పాడేవాడుగా నూకల పరిణమించలేదు. కృతులకు తనదైన ‘కృతి’ని సమర్పిం చారు.

అధ్యాపక జీవితం

విజయనగరం మహారాజా కళాశాల, తెలుగు విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా, విజయవాడ-తిరుపతి-సికింద్రాబాద్-హైదరాబాద్ ప్రభుత్వ సంగీతకళాశాలల ప్రిన్సిపల్‌గా పని చేశారు. ఆంధ్ర-శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాల యాల్లో, మెడ్రాస్ మ్యూజిక్ అకాడెమీ-ఆలిండియా రేడియోల్లో సంగీత సరస్వతికి సేవలు చేశారు.

పురస్కారాల పరంపర

భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ బహూకరించింది. సంగీతనాటక అకాడెమీ అవార్డు, కేంద్రప్రభుత్వం సాంస్కృతికశాఖ అవార్డు, ఫెలోషిప్‌లు ఆయనను వరించాయి. తిరుమల-తిరుపతి, పిట్స్‌బర్గ్ దేవస్థానాలు, కంచి కామకోటి- శృంగేరీ-పుష్పగిరి పీఠాలు, గణపతి సచ్చిదానంద ఆశ్రమాలు ఆయనను ఆస్థాన సంగీతవిద్వాంసుడిగా గౌరవించాయి.

పరమాచార్యుల ప్రశంశ!

కంచి పరమాచార్య నూకల గాత్రాన్ని విని ‘మీ సంగీతం దైవదత్తం’ అన్నారు. పచ్చపొదిగిన ఉంగరాన్నిస్తూ సత్యసాయిబాబా ‘మీ సంగీ తం డివోషనల్, ఓషనల్’ అన్నారు. ద్వారం వెంకటస్వామి నాయుడు ‘మీ మేధస్సు పాదరసం’ అన్నారు. ‘మీరు బుద్ధిశాలి’ అన్నారు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్. ఆయన సంగీతాన్ని విని పులకించిన వారిలో ప్రథమ భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, పూర్వ రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి, లండన్, చికాగో తదితర నగరాల మేయర్లున్నారు. చివరి వరకూ ఆయన సంగీ తాన్నే శ్వాసించారు.

బోధనలో నూతనత్వం

గానం చేస్తూ- సంగీతం గురించి రచనలు చేస్తూ-సంగీతం నేర్పుతూ... ఇలా చెబితే వెంటనే అర్ధం చేసుకోవడం లేదు, ఇట్టే అర్ధమయ్యేలా ఎలా చెప్పాలి? అని తపించి కొత్త పద్ధతులను కనిపెడుతూ మరో సంగతిని పట్టించుకోకుండా సంగీతార్చనలో ఆయన జీవితాన్ని గడిపారు.

సరస్వతి నిలయంగా...

సంగీతంపై అభిమానం కలిగిన ఏడుగురు సంతానంతో, వారి సంతానంతో, సందర్శిం చేందుకు వచ్చే కళాకారులు, కళాభిమానులతో వారి ఇల్లు సంగీత సరస్వతి వేదికగా విలసిల్లింది. రచనలు, రికార్డులు, సంగీత ప్రపంచంలో ఆయనను సజీవంగా ఉంచుతాయి! ‘వాన ఆగినా చెట్టు కురుస్తుంది’ కదా!
Poona Krishna murthy From Sakshi.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!