అధార్మికాభివృద్ధి ....

అధార్మికాభివృద్ధి ....

"లోకంలో ధార్మికులకంటే అధార్మికులే సుఖంగా బ్రతుకుతున్నారు" అనే మాట తరచూ వింటూ ఉంటాం. వ్యక్తిగతజీవితంలో ఎదురయ్యే సమస్యలు, సమాజంలో ఉత్పన్నమౌతున్న భయంకరమైన అనుభవాలు మనను ధర్మాచరణవిషయికంగా విచికిత్సకు గురిచేస్తాయి.
"న్యాయానికి రోజులు కావండీ"
"మడికట్టుకు కూర్చుంటే మట్టే మిగులుతుంది"
"ఎలా సంపాదించావనేది కాదు – ఎంత సంపాదించావనేది ముఖ్యం"
"నిజాయితీ కూడూ గుడ్డా పెడుతుందా ?"
"చాదస్తాలు పెట్టుకోక నాలుగురాళ్ళు వెనకేసుకో"
ఇలాంటి మాటలు బలహీన మనస్కులను ప్రలోభపెడతాయి. ఇవి నిజమేనేమో అనిపిస్తాయి. తాము పాటిస్తున్న నైతికవిలువలు ఆదరణీయాలా –కాదా? అనే సంశయాన్నీ కలిగిస్తాయి. అసలు ఏ విలువలూ పట్టించుకోకుండా , నిస్సంకోచంగా అధర్మవర్తనానికే అలవాటుపడినవాడికి ఈ ఊగిసలాటే ఉండదు.

"ధర్మశీలురకు కష్టాలేమిటి ? అధర్మవర్తనులకు సుఖాలేమిటి ?" అనే ఆలోచన సాక్షాత్తూ ధర్మరాజుకే వచ్చింది. ఒకప్పుడు అరణ్యవాస సమయంలో ఆయన రోమశమహర్షిని –
ధరణిన ధార్మికులగు – కా
పురుషుల కభివర్ధనంబుఁ బుణ్యచరిత్రం
బరగెడు ధార్మికులకు –దు
ర్ధరమగు నవివర్ధనంబుఁదగునె మహాత్మా ?
అని ప్రశ్నించాడు.

తమ విషయంలో జరిగినదదే. తాము ధర్మానికి కట్టుబడి ఉన్నా కష్టాలు తప్పటంలేదు. అధర్మవర్తనులైన కౌరవులు హాయిగా సుఖాలు అనుభవిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది ? అనే శంక సకలధర్మవేదియైన ధర్మరాజుకే వస్తే , సామాన్యులకు రావటంలో ఆశ్చర్యమేముంటుంది?

ఈప్రశ్నకు సమాధానంగా రోమశుడు - "ధర్మనందనా ! ప్రపంచంలో అధర్మవర్తనుల అభివృద్ధి ఏనాడూ సమంజసం కాదు. అది నిలిచేదీ కాదు. త్వరలోనే నశిస్తుంది. దుర్మార్గులకు దక్కేది కుహనాభివృద్ధిమాత్రమే. ఇలా అధార్మికాభివృద్ధితో విర్రవీగిన దుర్మార్గులెందరో వేల సంఖ్యలో నశించిపోవటం మాకు తెలుసు" అన్నాడు.
బలాన్నీ, ధనాన్నీ, అధికారాన్నీ దుర్వినియోగం చేస్తూ తమంతటివారు లేరని అహంకరించేవారు కొంత కాలం గడ్డిమంట వెలుగులా వెలిగిపోతారు. ఆ తరువాత దుర్గతులు సంభవించి, చరిత్రహీను లౌతారనటానికి అనేకానేక నిదర్శనాలు – పురాణాల్లో, చరిత్రలో, సమకాలీనసమాజంలో మనం గమనించగలం.
పరస్యపీడయాలబ్ధం , ధర్మస్యోల్లంఘనేన చ
ఆత్మావమాన సంప్రాప్తం న ధనం తత్సుఖాయ వై
- అనేది ఒకసూక్తి.

పరపీడనం ద్వారా, ధర్మాన్ని ఉల్లంఘించటం ద్వారా, తనను తాను అవమానించుకోవటంద్వారా సంప్రాప్తించిన ధనం ఏకోశానా సుఖాన్ని ఇవ్వజాలదని దీని భావం.

దీనిని ఒక ఆదర్శంగా స్వీకరించి జీవించే సన్మార్గులను కొందరు హేళనచేస్తూ ఉంటారు. అపార ధనరాసులే జీవిత సర్వస్వమనీ, ఆ రాసులను సంపాదించటానికి – మంచి, చెడులతో నిమిత్తం లేకుండా ప్రయత్నించాలనీ, చేతకానివారే "నీతి, నియమం" అంటూ వ్రేలాడి అన్ని సుఖాలకూ దూరమౌతారనీ వీరి వాదన. మహోత్కృష్ట మానవజన్మను అధర్మాంకితం చేయటమంటే సువర్ణపాత్రికలో కల్లుపోయటమే ! జీవితం సుఖ, దుఃఖాల సంకలనం. ధర్మవీరులుగా మానవులు దానిని ఎదుర్కోవాలి. తమ అడుగుజాడలను భావితరాలకు ఆదర్శ నిధులుగా ఇవ్వగలవారి ధార్మికాభివృద్ధియే ఆదరణీయం.

అంతిమంగా మనం నమ్మి తీరవలసినదేమిటో ఈ సూక్తి సుస్పష్టంగా చెప్తోంది –
ధర్మో జయతి నాధర్మః, సత్యం జయతి నానృతం
క్షమా జయతి న క్రోధో , విష్ణుర్జయతి నాసురః

ధర్మమే జయిస్తుంది , అధర్మంకాదు !
సత్యమే జయిస్తుంది, అసత్యం కాదు !
క్షమయే జయిస్తుంది, క్రోధం కాదు !
విష్ణువే జయిస్తాడు, రాక్షసుడు కాదు !
అని దీని అర్థం.

Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!