శ్రీ హనుమత్కుండం దక్షిణ మహా సముద్రం తీరం లో రామేశ్వర మహా క్షేత్రం లో ని ‘’హనుమత్కుండం ‘’గురించి పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి వివ రించి చెప్పాడు . స్కంద పురాణం లో బ్రహ్మ ఖండం లో రామేశ్వర క్షేత్రం లో24 తీర్ధాలు ఉన్నట్లు వర్ణించ బడింది .అవి చక్ర తీర్ధం ,భేతాళ వరద తీర్ధం ,పాప వినాశనం ,సీతా సరస్సు ,మంగళ తీర్ధం ,అమృత వాపిక ,బ్రహ్మ కుండము ,హనుమత్కుండం ,అగస్త్య తీర్ధం ,రామ తీర్ధం ,లక్ష్మణ తీర్ధం ,జటా తీర్ధం ,లక్ష్మీ తీర్ధం ,అగ్ని తీర్ధం ,శివ తీర్ధం ,శంఖ తీర్ధం ,యమునా తీర్ధం ,గంగా తీర్ధం ,గయా తీర్ధం ,కోటి తీర్ధం ,స్వాధ్యామ్రుత తీర్ధం ,సర్వ తీర్ధం ,ధనుష్కోటి తీర్ధం ,మానస తీర్ధం . రావణాసురుని చంపిన బ్రహ్మ హత్యా దోషం నుండి విముక్తుడు అవటానికి శ్రీ రాముడు శివ లింగ ప్రతిష్టాపన ను రామేశ్వరం లో చేయ సంకల్పించాడు .సముద్రానికి ఇవతలి ఒడ్డు అయిన ‘’పుల్ల ‘’గ్రామానికి దగ్గరలో ,సేతువు కు సమీపం లో ,గంధ మాదన పర్వత పాదం వద్ద ఈ లింగాన్ని ప్రతిష్టించాలని రామ సంకల్పం .హను మంతుని కైలాసం వెళ్లి శివుని అనుగ్రహం తో లింగాన్ని తెమ్మని రాముడు పంపాడు .ముహూర్త విషయాన్ని కూడా తెలిపి ,ఆ సమయం లోపలే తీసుకొని రమ్మని ఆ...